వేతన సవరణ సశేషం!
- మార్గదర్శకాలపై సాగదీస్తున్న సర్కారు
- వేతన స్థిరీకరణకు విధివిధానాలతో తాజాగా ఉత్తర్వులు
- మరిన్ని జీవోల కోసం ఉద్యోగుల ఎదురుచూపు
- బకాయిల చెల్లింపుపై ఇంకా నిర్ణయించని వైనం
- పెన్షనర్ల వేతన సవరణపైనా స్పష్టత కరువు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ర్ట ప్రభుత్వం విడుదల చేసింది. గత నెల 18న పదో పీఆర్‌సీకి సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి. వీటి ప్రకారం పెరిగిన జీతాలను మార్చి నుంచే చెల్లించాల్సి ఉంది. అంటే ఏప్రిల్ ఒకటో తేదీన రాష్ర్ట ప్రభుత్వోద్యోగులు కొత్త వేతనాలు అందుకోవాల్సి ఉంది. కానీ మార్గదర్శకాల జారీలో జాప్యం వల్ల ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఎట్టకేలకు పీఆర్‌సీ మార్గదర్శకాలను సోమవారం రాష్ట్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. వేతన స్థిరీకరణకు సంబంధించి డ్రాయింగ్ అండ్ డిస్బర్స్‌మెంట్ ఆఫీసర్లు(డీడీవో) పాటించాల్సిన నిబంధనలను అందులో పేర్కొన్నారు.
అలాగే ఉద్యోగులు, బకాయిల వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేక నమూనాలను పొందుపరిచారు. తాజా మార్గదర్శకాల ప్రకారం.. వేతన స్థిరీకరణ కోసం డీడీవోలు మూడు భాగాలుగా ప్రొసీడింగ్స్ రూపొందించాలి. 2013 జూలై 1 నుంచి 2014 జూన్ 1వరకు వేతన స్థిరీకరణ బకాయిలను నోషనల్‌గా చూపాలి. ఆ తర్వాతి నుంచి 2015 ఫిబ్రవరి 28 వరకు బకాయిలను ప్రత్యేకంగా ప్రస్తావించాలి.
బకాయిలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాకే వీటిని పంపించాలి. మార్చి నుంచి నగదు బిల్లులు తయారు చేయాలి. ఈ సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులతోపాటు సెలవుపై, సస్పెన్షన్‌పై, శిక్షణకు, డిప్యుటేషన్‌పై, ఫారిన్ సర్వీస్‌లో వెళ్లిన వారు, అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యే వారు, విధుల నుంచి తప్పించుకు తిరుగుతున్న వారి జాబితాలను కూడా పొందుపరచాలి.
టీ ఇంక్రిమెంట్ యథాతథం
గత ఏడాది ఆగస్టులో ఉద్యోగులకు ప్రకటించిన తెలంగాణ ఇంక్రిమెంట్‌ను యథాతథంగా కొనసాగించాలని తాజా మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. 2015 పీఆర్‌సీ స్కేళ్లకు అనుగుణంగా తెలంగాణ ఇంక్రిమెంట్ మొత్తాన్ని సవరించకూడదని డీడీవోలు, వెరిఫికేషన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 2013 జూలై నుంచి పీఆర్‌సీని అమలు చేస్తున్నప్పటికీ 2014 జూన్ నుంచి నగదు ప్రయోజనాలను కల్పిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ తర్వాత ప్రకటించిన తెలంగాణ ఇంక్రిమెంట్.. కొత్త ఉత్తర్వుల ప్రకారం దాదాపు రెండింతలు అవుతుందని ఉద్యోగులు ఆశపడ్డారు. తాజా నిబంధనతో నిరాశకు గురయ్యారు. తెలంగాణ ఇంక్రిమెంట్‌ను మూల వేతనంలోనే కలిపి ఇస్తారని ఉద్యోగులు భావించినప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు.
ఇప్పటికీ అసమగ్రమే
కాగా, గత నెలలో జారీ చేసిన ఉత్తర్వులతోపాటు, తాజా మార్గదర్శకాలు కూడా అసమగ్రంగా ఉండటం గందరగోళానికి దారి తీస్తోంది. ఇప్పటికీ పెన్షనర్లకు సంబంధించిన వేతన సవరణ ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేయలేదు. శాఖల వారీగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు వర్తించే సమగ్ర స్కేళ్ల వివరాల జీవో కూడా జారీ కాలేదు. ప్రధానమైన ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కేల్స్ జీవో, ప్రత్యేక అలవెన్సులకు సంబంధించిన ఉత్తర్వులూ విడుదలకాలేదు. వీటితో పాటు బకాయిల జీవోతో ఇంక్రిమెంట్లు ముడిపడి ఉంటాయని... ఇవన్నీ విడుదలైతే తప్ప వేతన స్థిరీకరణ ప్రక్రియ ప్రారంభంకాదని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. ఇక తాజా మార్గదర్శకాల్లోని తొమ్మిదో పేజీలో 12 (సి) కాలమ్‌లో ‘ఆంధ్రప్రదేశ్ రివె జ్డ్ స్కేల్స్ ఆఫ్ పే’ అని తప్పు దొర్లింది. దీన్ని ‘తెలంగాణ రాష్ట్ర రివైజ్డ్ స్కేల్స్ ఆఫ్ పే’ అని సవరించాల్సి ఉంది.
బకాయిలపై మళ్లీ దాటవేత
ఉద్యోగుల పీఆర్‌సీ బకాయిలను చెల్లించే విధానంపై ప్రభుత్వానికి ఇప్పటికీ స్పష్టత రాలేదు. 2014 జూన్ 2 నుంచి 2015 ఫిబ్రవరి వరకు ఉన్న బకాయిలకు సంబంధించి తదుపరి ప్రత్యేక ఉత్తర్వులు విడుదలవుతాయని మరోసారి దాటవేసింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల మొత్తం దాదాపు రూ. 5 వేల కోట్లకు చేరుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. వీటిని బాండ్ల రూపంలో ఇవ్వడమా లేక జీపీఎఫ్‌లో జమ చేయాలా లేదంటే విడతలవారీగా నగదు రూపంలో ఇవ్వాలా అనేది ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది.
ఆర్థికంగా చిక్కుల్లేకుండా బాండ్లు జారీ చేయడమే శ్రేయస్కరమని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు నివేదించారు. కానీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ బాండ్ల జారీని తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. దీంతో ఆర్థిక శాఖ తలపట్టుకుంది. ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితి పరిధిలోకి రాకుండా జీపీఎఫ్‌లో జమ చేసే మార్గాలేమైనా ఉన్నాయా.. ప్రజా పద్దులను ఎక్కువ చూపించి రుణ పరిమితి ఆంక్షలు తప్పించుకునే అవకాశాలేమైనా ఉన్నాయా అని అధికారులు ప్రత్యామ్నాయాలపై కసరత్తు చేస్తున్నారు.