ప్రజల ముందు ఉంచండి
మార్టిన్ లూథర్ హత్య ఫైల్స్ కూడా
ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు
వాషింగ్టన్: అప్పట్లో ప్రపంచమంతటా సంచలనం సృష్టించిన అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెనెడీ, ఆయన సోదరుడు, సెనేటర్ రాబర్ట్ ఎఫ్.కెనెడీ, పౌర హక్కుల నాయకుడు మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్ హత్యలకు సంబంధించి త్వరలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. వారి హత్యోదంతాలకు సంబంధించిన రహస్య ఫైళ్లన్నింటినీ బహిర్గతం చేయాల్సిందిగా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు.
ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై ఆయన గురువారం సంతకం చేశారు. ‘‘ఈ హత్యల వెనక నిజానిజాలను అమెరికా ప్రజలు తెలుసుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఇందుకోసం వారు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. కనుక అన్ని విషయాలనూ బయట పెట్టబోతున్నాం’’ అని విలేకరులకు స్పష్టం చేశారు. సంబధిత ఫైళ్లను డీక్లాసిఫై చేయడానికి 15 రోజుల్లోగా ప్రణాళిక సిద్ధం చేయాల్సిందిగా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్‌ను ఆదేశించారు.
అనంతరం 45 రోజుల్లోగా ఫైళ్లన్నింటినీ ప్రజల ముందు పెట్టాలని పేర్కొన్నారు. సంబంధిత ఉత్వర్వులపై సంతకం చేసిన పెన్నును రాబర్ట్ ఎఫ్.కెనెడీ కుమారుడు, కాబోయే ఆరోగ్య మంత్రి రాబర్ట్ ఎఫ్.కెనెడీ జూనియర్‌కు ఇవ్వాల్సిందిగా అధికారులకు ట్రంప్ సూచించారు. కెనెడీల హత్యపై అధికారిక కథనాలపై కెనెడీ జూనియర్ చాలాకాలంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆదేశాలు ఏమేరకు కార్య రూపం దాలుస్తాయన్నది అనుమానంగా మారింది.
..నేటికీ మిస్టరీయే
1963లో కెనెడీ డాలస్‌లో ఓపెన్ టాప్ కారులో వెళ్తుండగా లీ హార్వే ఓస్వాల్డ్ అనే మాజీ సైనికుడు కాల్చి చంపడం సంచలనంగా మారింది. ఐదేళ్ల అనంతరం స్థానంలో అధ్యక్ష ఎన్నికల బరిలో దిగిన ఆయన సోదరుడు రాబర్ట్ కూడా కాలిఫోరి్నయాలో హత్యకు గురయ్యారు. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతుపై ఆగ్రహంతో సిర్హాన్ అనే ఓ పాలస్తీనియన్ ఆయన్ను కాల్చి చంపాడు. అందుకు రెండు నెలల క్రితం లూథర్‌కింగ్‌ను కూడా టెనెసీలో జాతి విద్వేషానికి బలయ్యారు.
జేమ్స్ ఎర్ల్ రే అనే జాత్యహంకారి ఆయన్ను కాల్చి చంపాడు. ఈ హత్యలకు సంబంధించి పలు డాక్యుమెంట్లు అడపాదడపా వెలుగు చూశాయి. కానీ వేలాది డాక్యుమెంట్లు గోప్యంగానే ఉండిపోయాయి. వాటి విచారణ ఫైళ్లన్నింటినీ బయట పెట్టాలంటూ 1992లో అమెరికా కాంగ్రెస్ చట్టం కూడా చేసింది. ఆ మేరకు కెనెడీ హత్యకు సంబంధించి చాలా డాక్యుమెంట్లను గత పదేళ్లలో ప్రభుత్వాలు బయటపెట్టినా లక్షలాది డాక్యుమెంట్లు ఇంకా గోప్యంగానే ఉండిపోయాయి.
ట్రంప్ తన తొలి హయాంలోనే వాటన్నింటినీ బయట పెడతానని హామీ ఇచ్చినా సీఐఏ, ఎఫ్‌బీఐ ఒత్తిళ్ల కారణంగా మిన్నకుండిపోయారని చెబుతారు. ఓస్వాల్డ్ వ్యక్తిగత కక్షతోనే కెనెడీని పొట్టన పెట్టుకున్నట్టు విచారణ కమిషన్ తేలి్చనా అది నిజం కాదని అమెరికన్లలో అత్యధికులు నేటికీ చెబుతారు. హత్య వెనక కుట్ర కోణముందంటూ జోరుగా విశ్లేషణలు సాగాయి. ప్రభుత్వ ఏజెంట్లు, మాఫియా, తెర వెనక శక్తుల హస్తముందని ఏళ్ల తరబడి కథనాలు వెలువడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment