civil rights leaders
-
ఎట్టకేలకు కెనెడీ ఫైల్స్ డీ క్లాసిఫై
వాషింగ్టన్: అప్పట్లో ప్రపంచమంతటా సంచలనం సృష్టించిన అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెనెడీ, ఆయన సోదరుడు, సెనేటర్ రాబర్ట్ ఎఫ్.కెనెడీ, పౌర హక్కుల నాయకుడు మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్ హత్యలకు సంబంధించి త్వరలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. వారి హత్యోదంతాలకు సంబంధించిన రహస్య ఫైళ్లన్నింటినీ బహిర్గతం చేయాల్సిందిగా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై ఆయన గురువారం సంతకం చేశారు. ‘‘ఈ హత్యల వెనక నిజానిజాలను అమెరికా ప్రజలు తెలుసుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఇందుకోసం వారు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. కనుక అన్ని విషయాలనూ బయట పెట్టబోతున్నాం’’ అని విలేకరులకు స్పష్టం చేశారు. సంబధిత ఫైళ్లను డీక్లాసిఫై చేయడానికి 15 రోజుల్లోగా ప్రణాళిక సిద్ధం చేయాల్సిందిగా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్‌ను ఆదేశించారు. అనంతరం 45 రోజుల్లోగా ఫైళ్లన్నింటినీ ప్రజల ముందు పెట్టాలని పేర్కొన్నారు. సంబంధిత ఉత్వర్వులపై సంతకం చేసిన పెన్నును రాబర్ట్ ఎఫ్.కెనెడీ కుమారుడు, కాబోయే ఆరోగ్య మంత్రి రాబర్ట్ ఎఫ్.కెనెడీ జూనియర్‌కు ఇవ్వాల్సిందిగా అధికారులకు ట్రంప్ సూచించారు. కెనెడీల హత్యపై అధికారిక కథనాలపై కెనెడీ జూనియర్ చాలాకాలంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆదేశాలు ఏమేరకు కార్య రూపం దాలుస్తాయన్నది అనుమానంగా మారింది. ..నేటికీ మిస్టరీయే 1963లో కెనెడీ డాలస్‌లో ఓపెన్ టాప్ కారులో వెళ్తుండగా లీ హార్వే ఓస్వాల్డ్ అనే మాజీ సైనికుడు కాల్చి చంపడం సంచలనంగా మారింది. ఐదేళ్ల అనంతరం స్థానంలో అధ్యక్ష ఎన్నికల బరిలో దిగిన ఆయన సోదరుడు రాబర్ట్ కూడా కాలిఫోరి్నయాలో హత్యకు గురయ్యారు. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతుపై ఆగ్రహంతో సిర్హాన్ అనే ఓ పాలస్తీనియన్ ఆయన్ను కాల్చి చంపాడు. అందుకు రెండు నెలల క్రితం లూథర్‌కింగ్‌ను కూడా టెనెసీలో జాతి విద్వేషానికి బలయ్యారు. జేమ్స్ ఎర్ల్ రే అనే జాత్యహంకారి ఆయన్ను కాల్చి చంపాడు. ఈ హత్యలకు సంబంధించి పలు డాక్యుమెంట్లు అడపాదడపా వెలుగు చూశాయి. కానీ వేలాది డాక్యుమెంట్లు గోప్యంగానే ఉండిపోయాయి. వాటి విచారణ ఫైళ్లన్నింటినీ బయట పెట్టాలంటూ 1992లో అమెరికా కాంగ్రెస్ చట్టం కూడా చేసింది. ఆ మేరకు కెనెడీ హత్యకు సంబంధించి చాలా డాక్యుమెంట్లను గత పదేళ్లలో ప్రభుత్వాలు బయటపెట్టినా లక్షలాది డాక్యుమెంట్లు ఇంకా గోప్యంగానే ఉండిపోయాయి. ట్రంప్ తన తొలి హయాంలోనే వాటన్నింటినీ బయట పెడతానని హామీ ఇచ్చినా సీఐఏ, ఎఫ్‌బీఐ ఒత్తిళ్ల కారణంగా మిన్నకుండిపోయారని చెబుతారు. ఓస్వాల్డ్ వ్యక్తిగత కక్షతోనే కెనెడీని పొట్టన పెట్టుకున్నట్టు విచారణ కమిషన్ తేలి్చనా అది నిజం కాదని అమెరికన్లలో అత్యధికులు నేటికీ చెబుతారు. హత్య వెనక కుట్ర కోణముందంటూ జోరుగా విశ్లేషణలు సాగాయి. ప్రభుత్వ ఏజెంట్లు, మాఫియా, తెర వెనక శక్తుల హస్తముందని ఏళ్ల తరబడి కథనాలు వెలువడ్డాయి. -
ప్రతి కుటుంబానికి ఏటా రూ.72వేలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మౌలిక సదుపాయాల కింద ప్రతి కుటుంబానికి ఏటా రూ.72వేలు సాయమందేలా ఎన్‌వైఏవై కింద కార్యాచరణ రూపొందిస్తామని రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లిలో మధ్యాహ్న విడిది శిబిరంలో రాహుల్ గాంధీ.. పౌరహక్కుల నేతలు, సామాజిక కార్యకర్తలతో ఆదివారం భేటీ అయ్యారు. దేశ చరిత్ర, పునర్నిర్మాణం, రాజ్యాంగ పరిరక్షణ, నిరుద్యోగం, కార్మికులు, యువత తదితర అంశాలపై చర్చించారు. అనంతరం రాహుల్ మాట్లాడుతూ.. బీజేపీ విధానాలతో దేశం అన్ని రంగాల్లో తిరోగమిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే సామాన్యులకు రాజ్యాంగ హక్కులు అందుతాయన్నారు. రాహుల్‌ను కలిసినవారిలో ప్రొఫెసర్ శాంతా సిన్హా, మహిళా జేఏసీ నాయకురాలు సజయ, గీతా రామస్వామి, జశ్విన్, మృదుల దేశాయి, రమా మేల్కొటే, ఉస్మానియా రిటైర్డ్ ప్రొఫెసర్ లిసి జోసఫ్, సుశీ, సభా, బీఆర్ వర్గీస్, శరత్ విమల, మీరా సంఘమిత్ర, దిడ్డి ప్రవీణ్ కుమార్, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, మాజీ ఐఏఎస్ రమేష్‌బాబు తదితరులు ఉన్నారు. ఇది రాజకీయ యాత్ర కాదు: కన్హయ్య కుమార్ దేశంలో పేదలు పేదలుగానే ఉంటున్నారని.. సంపన్నులు ఇంకా సంపన్నులుగా మారుతున్నారని భారత్ జోడో యాత్రీ కన్హయ్యకుమార్ అన్నారు. జోడో యాత్ర మధ్యా హ్నభోజన శిబిరంలో ఏఐసీసీ కార్యదర్శి జైరాం రమేష్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఉన్నత చదువులు చదివిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభించక ఆందోళనలో ఉన్నారన్నారు. ఇది రాజకీయ యాత్ర కాదని, యాత్రలో కాంగ్రెస్ కార్యకర్తలు లేరని.. కులమతాలకతీతంగా అందరూ పాల్గొంటున్నారని తెలిపారు. -
పోలీసుల నిర్లక్ష్యమే బాలికల హత్యలకు కారణం
బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్‌లో చోటు చేసుకున్న బాలికల హత్యలకు కారణం పోలీసుల నిర్లక్ష్యమేనని హైదరాబాద్ నగరశాఖ పౌర హక్కుల సంఘం నేతలు అన్నారు. మండలంలోని హాజీపూర్, మైసిరెడిపల్లి గ్రామాల్లో ఆదివారం వారు పర్యటించారు. బాధిత కుటుంబాలను కలసి వివరాలను తెలుసుకున్నారు. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, ఇంటికొకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు రఘునా«థ్, ప్రధాన కార్యదర్శి ఎండీ ఇస్మాయిల్ పాల్గొన్నారు. -
దోపిడీలను అడ్డుకున్నందుకే బూటకపు ఎన్కౌంటర్లు
సీలేరు(పాడేరు): దోపిడీలపై ఉద్యమిస్తున్నందునే ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల పాలకులు బూటకపు ఎన్కౌంటర్లు, అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల పౌరహక్కుల సంఘం నేతలు తెలిపారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు చిత్రకొండ బ్లాక్‌లోని ఆండ్రపల్లి వద్ద అక్టోబర్ 12న జరిగిన ఎన్‌కౌంటర్‌పై వాస్తవాలు తెలుసుకునేందుకు రెండు రాష్ట్రాలకు చెందిన ఆరుగురు పౌరహక్కుల నేతలు ఆండ్రపల్లి, పరిసర గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వారు ఆదివారం సీలేరులో విలేకరులతో మాట్లాడారు. అక్టోబర్ 12న జరిగిన ఎన్కౌంటర్ పచ్చి బూటకమని, పోలీసు బలగాలు ఆమెను పట్టుకుని కాల్చి చంపాయని తెలిపారు. ఆండ్రపల్లిలో ప్రజలతో కలసి వివరాలు సేకరించామని చెప్పారు. చిత్రకొండ బ్లాక్‌లో అనారోగ్యంతో ఉన్న మీనా, తోటి సభ్యులను అక్టోబర్ 10న సాయుధ పోలీసు బలగాలు గుర్తించి వెంబడించాయని చెప్పారు. వారు నుంచి తప్పించుకుని ఆండ్రపల్లి అటవీ ప్రాంతానికి చేరుకున్నారని తెలిపారు. అక్టోబర్ 11వ తేదీ సాయంత్రం మీనా, సహచరులు షెల్టర్ ఏర్పాటు చేసుకున్నారని, ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు 12వ తేదీ ఉదయం 5.30 గంటల ప్రాంతంలో చుట్టుముట్టి కాల్పులు జరిపారని తెలిపారు. ఈ సంఘటనలో గాయపడిన మీనాను చిత్రహింసలకు గురి చేసి, చంపేశారని తమ విచారణలో తేలిందన్నారు. ఆంధ్రా సీఎం చంద్రబాబు నాయుడు, ఒడిశాలో నవీన్ పట్నాయక్ కనుసన్నల్లో బాక్సైట్ అక్రమ మైనింగ్ జరుగుతోందని తెలిపారు. ఆంధ్రా, ఒడిశా, ఛతీస్‌గఢ్, తెలంగాణా, జార్ఖండ్ రాష్ట్రాల్లో అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసాన్ని, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, దోపిడీ విధానాలపై ఆదివాసీలు ఉద్యమిస్తున్నారని, వారిని అణిచివేయడానికే అక్రమ అరెస్టులు, బూటకపు ఎన్కౌంటర్లను నిరంతరం కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ పర్యటనలో ఏపీ పౌరహక్కుల సంఘ అధ్యక్షుడు చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్, సహాయ కార్యదర్శి శ్రీమన్నారాయణ, ఏపీఈసీ సభ్యుడు బాలాజీరావు, తెలంగాణ నుంచి నారాయణరావు, మదన కుమారస్వామి పాల్గొన్నారు. -
పౌర హక్కుల నేతల నిర్బంధం పొడిగింపు
న్యూఢిల్లీ: భీమా కోరెగావ్ అల్లర్ల కేసుకు సంబంధించి ఐదుగురు పౌర హక్కుల నేతలకు విధించిన గృహ నిర్బంధాన్ని సుప్రీంకోర్టు మరో ఐదు రోజులు పొడిగించింది. నిర్బంధ గడువు సెప్టెంబర్ 12తో ముగిసిన నేపథ్యంలో సెప్టెంబర్ 17 వరకు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చరిత్రకారులు రొమిల్లా థాపర్‌తో పాటు ఐదుగురు మేధావులు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎమ్ కన్వీల్కర్, డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పౌరహక్కుల నేతలు వరవరరావు, సుధా భరద్వాజ్, గౌతమ్ నవ్లఖా, వెర్నాన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరాలకు మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ పుణే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
‘ఫూలింగ్’ ప్రభుత్వంపై పోరు
ఎన్ఏపీఎం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్.. రైతుల్లో అవగాహన పెంపొందించాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: భూ సమీకరణ ప్రక్రియ యావత్తూ అపసవ్యంగా కొనసాగిస్తూ రైతుల్ని ‘ఫూలింగ్’ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ సర్కారుపై న్యాయపోరాటం చేస్తామని, రైతుల ప్రయోజనాల్ని పూర్తిగా పరిరక్షిస్తామని పలు రాష్ట్రాలకు చెందిన సామాజిక కార్యకర్తలు, పౌరహక్కుల నేతలు స్పష్టం చేశారు. పదివేల మంది సిబ్బందితో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ భూ సమీకరణ చేపట్టడంపై వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నూతన రాజధాని నిర్మాణానికి తాము ఎంత మాత్రం వ్యతిరేకం కాదని, ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలపైనే తమ పోరాటమని పేర్కొన్నారు. దేశంలో ఎందరో మేధావులు ఉండగా రాజధాని నిర్మాణంలో వారి సేవలు వినియోగించుకోకుండా సింగపూర్‌ను ఆశ్రయించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఫ్యాప్సీ భవనంలో ఏపీ గ్రీన్‌ఫీల్డ్ రాజధానిపై ‘నేషనల్ అలయెన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్’ (ఎన్ఏపీఎం) సంస్థ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సామాజిక కార్యకర్త భూపతిరాజు రామకృష్ణరాజు అధ్యక్షత వహించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చి సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయాలని సమావేశంలో పలువురు వక్తలు సూచించారు. ఇది ఒక్క తుళ్లూరు ప్రాంతానికి సంబంధించిన అంశంగా చూడకుండా 13 జిల్లాల్లోనూ ప్రచార, కళాజాతల ద్వారా సర్కారు అనుసరిస్తున్న విధానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. జూబ్లీహిల్స్ ఇంటి రేటు ఎంత పెరిగిందో చెప్పాలి ప్రస్తుతం తుళ్ళూరు ప్రాంతంలో ఎకరా రూ.2.5 కోట్లుందని, పదేళ్ళ తర్వాత రూ.10 కోట్లకు చేరుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడాన్ని ప్రస్తావిస్తూ.. భూముల రేట్లు అప్పుడు అంత పలుకుతాయని ప్రభుత్వం నుంచి రైతులు లిఖిత పూర్వకంగా అఫిడవిట్లు కోరాలన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు జూబ్లీహిల్స్‌లో తన ఇల్లు రేటు పదేళ్ళలో ఎంత పెరిగిందో రైతులకు చెప్పాలన్నారు. చంద్రబాబు ఆస్తుల ప్రకటన సమయంలో జూబ్లీహిల్స్‌లో తన స్థలం రేటు ప్రకటించినప్పుడు అంత అసహజమైన పెరుగుదల కనిపించకపోవడాన్ని పౌరహక్కుల నేతలు గుర్తు చేశారు. ప్రభుత్వం రూపొందించిన సీఆర్డీఏ చట్టాన్ని ప్రభుత్వమే అతిక్రమిస్తోందని రిటైర్డ్ ఐఏఎస్, ఉద్యమకారుడు ఎంజీ దేవసహాయం తెలిపారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణానికి సింగపూర్ దేశం మాస్టర్ ప్లాన్‌ను రూపొందించడం తెలుగు జాతిని అవమానించడమేనన్నారు. రాజధాని నిర్మాణానికి ఇంత విస్తీర్ణంలో భూములు తీసుకోవడం వెనుక ఉన్న ఆంతర్యం బయటపెట్టాలన్నారు. మరో మూసీగా కృష్ణా: విశ్రాంత న్యాయమూర్తి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో రైతుల సంక్షేమానికి వ్యతిరేకంగా రెండు పత్రికలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయని, వాస్తవాలు వెలుగులోకొచ్చే పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. నది పక్కనే రాజధాని నిర్మాణంతో కృష్ణా మరో మూసీలా మారనుందన్నారు. సింగపూర్ తరహాలో రాజధాని నిర్ణయమంటున్నారంటే అందులో సామాన్యులకు అవకాశం లేనట్టేనని మాజీ సీఈసీ జేఎం లింగ్డో చెప్పారు. 2013 లో ఆమోదం పొందిన చట్టం ద్వారా భూముల సేకరణ సాధ్యం కాదన్న ఉద్దేశంతోనే ఏపీ ప్రభుత్వం భూ సమీకరణకు దిగిందని విమర్శించారు. యుద్ధ ప్రాతిపదికన కోర్టులను ఆశ్రయించాలని మాజీ డీజీపీ సి.ఆంజనేయరెడ్డి అన్నారు. రిటైర్డ్ ఐఏఎస్‌లు కేబీ సక్సేనా, హర్షమందర్, తమిళనాడుకు చెందిన పౌరహక్కుల నేత సురేష్, ఆర్కిటెక్ట్ శేఖర్, పర్యావరణ వేత్త సాగర్ధారా, మాజీ ఐజీ, న్యాయవాది హనుమంతరెడ్డి, హైకోర్టు న్యాయవాది జగన్మోహన్రెడ్డిలు మాట్లాడారు. రాజధాని ప్రాంతానికి చెందిన శేషగిరిరావు, అనుమోలు గాంధీలు తమ అనుభవాలు వివరించారు. సమావేశానంతరం వక్తలు మీడియాతో మాట్లాడారు. భూ సమీకరణకు ఇష్టపడని రైతులకు మద్దతుగా త్వరలో పాదయాత్ర చేయడానికి నిర్ణయించినట్టు తెలిపారు. ఆయా గ్రామాల్లో పలుచోట్ల న్యాయ సలహా కేంద్రాల ఏర్పాటును ప్రతిపాదించారు. రాజధాని గ్రామాల రైతులతో ఒక కమిటీ, కౌలుదారులు, కూలీలతో మరొక కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వ అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానించారు. రైతుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో లక్ష బుక్లెట్ల పంపిణీ చేస్తామని వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి ప్రకటించారు.