ఎన్‌ఏపీఎం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్.. రైతుల్లో అవగాహన పెంపొందించాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: భూ సమీకరణ ప్రక్రియ యావత్తూ అపసవ్యంగా కొనసాగిస్తూ రైతుల్ని ‘ఫూలింగ్’ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ సర్కారుపై న్యాయపోరాటం చేస్తామని, రైతుల ప్రయోజనాల్ని పూర్తిగా పరిరక్షిస్తామని పలు రాష్ట్రాలకు చెందిన సామాజిక కార్యకర్తలు, పౌరహక్కుల నేతలు స్పష్టం చేశారు. పదివేల మంది సిబ్బందితో పోలీస్ పికెట్‌లు ఏర్పాటు చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ భూ సమీకరణ చేపట్టడంపై వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
నూతన రాజధాని నిర్మాణానికి తాము ఎంత మాత్రం వ్యతిరేకం కాదని, ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలపైనే తమ పోరాటమని పేర్కొన్నారు. దేశంలో ఎందరో మేధావులు ఉండగా రాజధాని నిర్మాణంలో వారి సేవలు వినియోగించుకోకుండా సింగపూర్‌ను ఆశ్రయించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఫ్యాప్సీ భవనంలో ఏపీ గ్రీన్‌ఫీల్డ్ రాజధానిపై ‘నేషనల్ అలయెన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్‌మెంట్’ (ఎన్‌ఏపీఎం) సంస్థ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సామాజిక కార్యకర్త భూపతిరాజు రామకృష్ణరాజు అధ్యక్షత వహించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చి సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయాలని సమావేశంలో పలువురు వక్తలు సూచించారు. ఇది ఒక్క తుళ్లూరు ప్రాంతానికి సంబంధించిన అంశంగా చూడకుండా 13 జిల్లాల్లోనూ ప్రచార, కళాజాతల ద్వారా సర్కారు అనుసరిస్తున్న విధానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు.
జూబ్లీహిల్స్ ఇంటి రేటు ఎంత పెరిగిందో చెప్పాలి
ప్రస్తుతం తుళ్ళూరు ప్రాంతంలో ఎకరా రూ.2.5 కోట్లుందని, పదేళ్ళ తర్వాత రూ.10 కోట్లకు చేరుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడాన్ని ప్రస్తావిస్తూ.. భూముల రేట్లు అప్పుడు అంత పలుకుతాయని ప్రభుత్వం నుంచి రైతులు లిఖిత పూర్వకంగా అఫిడవిట్లు కోరాలన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు జూబ్లీహిల్స్‌లో తన ఇల్లు రేటు పదేళ్ళలో ఎంత పెరిగిందో రైతులకు చెప్పాలన్నారు.
చంద్రబాబు ఆస్తుల ప్రకటన సమయంలో జూబ్లీహిల్స్‌లో తన స్థలం రేటు ప్రకటించినప్పుడు అంత అసహజమైన పెరుగుదల కనిపించకపోవడాన్ని పౌరహక్కుల నేతలు గుర్తు చేశారు. ప్రభుత్వం రూపొందించిన సీఆర్‌డీఏ చట్టాన్ని ప్రభుత్వమే అతిక్రమిస్తోందని రిటైర్డ్ ఐఏఎస్, ఉద్యమకారుడు ఎంజీ దేవసహాయం తెలిపారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణానికి సింగపూర్ దేశం మాస్టర్ ప్లాన్‌ను రూపొందించడం తెలుగు జాతిని అవమానించడమేనన్నారు. రాజధాని నిర్మాణానికి ఇంత విస్తీర్ణంలో భూములు తీసుకోవడం వెనుక ఉన్న ఆంతర్యం బయటపెట్టాలన్నారు.
మరో మూసీగా కృష్ణా: విశ్రాంత న్యాయమూర్తి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో రైతుల సంక్షేమానికి వ్యతిరేకంగా రెండు పత్రికలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయని, వాస్తవాలు వెలుగులోకొచ్చే పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. నది పక్కనే రాజధాని నిర్మాణంతో కృష్ణా మరో మూసీలా మారనుందన్నారు. సింగపూర్ తరహాలో రాజధాని నిర్ణయమంటున్నారంటే అందులో సామాన్యులకు అవకాశం లేనట్టేనని మాజీ సీఈసీ జేఎం లింగ్డో చెప్పారు. 2013 లో ఆమోదం పొందిన చట్టం ద్వారా భూముల సేకరణ సాధ్యం కాదన్న ఉద్దేశంతోనే ఏపీ ప్రభుత్వం భూ సమీకరణకు దిగిందని విమర్శించారు. యుద్ధ ప్రాతిపదికన కోర్టులను ఆశ్రయించాలని మాజీ డీజీపీ సి.ఆంజనేయరెడ్డి అన్నారు. రిటైర్డ్ ఐఏఎస్‌లు కేబీ సక్సేనా, హర్షమందర్, తమిళనాడుకు చెందిన పౌరహక్కుల నేత సురేష్, ఆర్కిటెక్ట్ శేఖర్, పర్యావరణ వేత్త సాగర్‌ధారా, మాజీ ఐజీ, న్యాయవాది హనుమంతరెడ్డి, హైకోర్టు న్యాయవాది జగన్‌మోహన్‌రెడ్డిలు మాట్లాడారు.
రాజధాని ప్రాంతానికి చెందిన శేషగిరిరావు, అనుమోలు గాంధీలు తమ అనుభవాలు వివరించారు. సమావేశానంతరం వక్తలు మీడియాతో మాట్లాడారు. భూ సమీకరణకు ఇష్టపడని రైతులకు మద్దతుగా త్వరలో పాదయాత్ర చేయడానికి నిర్ణయించినట్టు తెలిపారు. ఆయా గ్రామాల్లో పలుచోట్ల న్యాయ సలహా కేంద్రాల ఏర్పాటును ప్రతిపాదించారు. రాజధాని గ్రామాల రైతులతో ఒక కమిటీ, కౌలుదారులు, కూలీలతో మరొక కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వ అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానించారు. రైతుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో లక్ష బుక్‌లెట్ల పంపిణీ చేస్తామని వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి ప్రకటించారు.
‘ఫూలింగ్’ ప్రభుత్వంపై పోరు
Published Tue, Jan 6 2015 3:18 AM | Last Updated on Sat, Aug 11 2018 7:46 PM
Advertisement