Social activists
-
4 రోజుల నిరసనకు 4ఏళ్ల శిక్ష
భూమిపై వాతావరణ మార్పులు, కాలుష్యానికి కారణమవుతున్న శిలాజ ఇంధనాల తవ్వకానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నాలుగు రోజులపాటు శాంతియుతంగా నిరసన తెలిపిన నలుగురు సామాజిక కార్యకర్తలకు నాలుగేళ్ల చొప్పున జైలుశిక్ష పడింది. మరో కార్యకర్తకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. పురాతన ప్రజాస్వామ్య దేశమని చెప్పుకొనే యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. కోర్టు తీర్పును ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు తప్పుపడుతున్నారు. యూకేలోని ఉత్తర సముద్రంలో చమురు తవ్వకాలకు 2022లో అప్పటి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. లైసెన్స్‌లు ఇచ్చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2022 నవంబర్‌లో ‘జస్ట్ స్టాప్ ఆయిల్’అనే నినాదంతో సామాజిక కార్యకర్తలు నిరసన బాటపట్టారు. అనుమతులు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమాలను 22 ఏళ్ల గ్రెస్సీ గెథిన్ అనే యువతి ముందుండి నడిపించింది. ఈ ఉద్యమం పలువురిని ఆకర్శించడంతో వారు ఇందులో భాగస్వాములయ్యారు. భూగోళాన్ని కలుషితం చేసే చమురు తవ్వకాలు వద్దంటూ నినదించారు. లండన్ చుట్టూ ఉన్న మేజర్ రింగ్ రోడ్డుపై నాలుగు రోజులపాటు నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శించారు. చెట్లు, భవనాలపైకి ఎక్కి బిగ్గరగా నినాదాలు చేశారు. ఇదంతా పూర్తిగా శాంతియుతంగానే సాగింది. హింస అనే మాటే లేదు. ఆస్తులకు గానీ, ప్రజలకు గానీ ఎలాంటి నష్టం వాటిల్లలేదు.లక్షల డాలర్ల నష్టం వాటిల్లిందట! రింగ్ రోడ్డుపై బైఠాయింపులు, నిరసనలతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపిస్తూ గ్రెస్సీ గెథిన్తోపాటు పలువురు సామాజిక కార్యకర్తలపై పోలీసులు అభియోగాలు మోపారు. దాదాపు రెండేళ్లపాటు లండన్ కోర్టులో విచారణ జరిగింది. ‘జస్ట్ స్టాప్ ఆయిల్’నిరసనల వల్ల నాలుగు రోజులపాటు రింగ్ రోడ్డుపై 7 లక్షలకుపైగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిందని పోలీసుల తరఫున ప్రాసిక్యూటర్లు వాదించారు. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు 9.80 లక్షల డాలర్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. రోడ్డుపై పరిస్థితిని చక్కదిద్దడానికి పోలీసులు 1.3 మిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి వచి్చందని తెలిపారు. నిరసనకారులు కుట్రపూరితంగానే ప్రజలకు ఇక్కట్లు కలుగజేశారని ఆరోపించారు. ప్రాసిక్యూటర్ల వాదనతో లండన్ కోర్టు ఏకీభవించింది. గ్రెస్సీ గెథిన్తోపాటు లూయిసీ లాంకాస్టర్, డేనియల్ షా, లూసియాకు నాలుగేళ్ల చొప్పున జైలుశిక్ష విధిస్తూ ఈ ఏడాది జూలైలో తీర్పు వెలువరించింది. ‘జస్ట్ స్టాప్ ఆయిల్’సహా వ్యవస్థాపకుడు రోజర్ హల్లామ్ ఐదేళ్లపాటు జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం దోషులంతా జైలులో ఉన్నారు. వారి విడుదల కోసం సామాజిక కార్యకర్తలు పోరాడుతున్నారు. న్యాయం పోరాటం కొనసాగిస్తున్నారు. అహింసాయుతంగా జరిగిన నిరసనలకు నాలుగేళ్ల చొప్పున జైలుశిక్ష విధించడం యూకే చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. శాంతియుత నిరసనలకు సైతం జైలుశిక్ష విధించేలా యూకేలో రెండు వివాదాస్పద చట్టాలు అమల్లో ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎట్టకేలకు గొన్సాల్వేజ్, ఫెరీరా విడుదల
ముంబై: ఎల్గార్ పరిషత్–మావోయిస్టులతో సంబంధాల కేసులో అరెస్టయి విచారణ ఖైదీగా సంవత్సరాల తరబడి జైలు జీవితం గడిపిన సామాజిక కార్యకర్తలు వెర్నాన్ గొన్సాల్వేజ్, అరుణ్ ఫెరీరాలు ఎట్టకేలకు జైలు నుంచి బెయిలుపై బయటికొచ్చారు. గత వారం వారికి బెయిల్ ఇస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పునివ్వడం తెల్సిందే. శనివారం ప్రత్యేక కోర్టు సంబంధిత విడుదల పత్రాలను నవీ ముంబైలోని తలోజ కారాగారం అధికారులకు పంపడంతో వారం తర్వాత ఎట్టకేలకు వారు బయటికొచ్చారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తూ ప్రత్యేక కోర్టు పరిశీలనలో ఉన్న ఈ కేసుకు సంబంధించి ఇప్పటిదాకా 16 మంది అరెస్టయ్యారు. గొన్సాల్వేజ్, అరుణ్‌తో కలిపి ఇప్పటిదాకా ఐదుగురు బెయిల్‌పై బయటికొచ్చారు. ఒక్కో నిందితుడు ఒక మొబైల్ వాడుకోవచ్చని, వారు ఉండే అడ్రస్ ఎన్ఐఏకు ఇవ్వాలని, సంబంధిత నిబంధనలు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు అవుతుందని ధర్మాసనం స్పష్టంచేసింది. విద్యావేత్త, కార్యకర్త ఆనంద్ తేల్తుంబ్డే, న్యాయవాది సుధా భరద్వాజ్‌లకు గతంలో సాధారణ బెయిల్ రాగా, అనారోగ్య కారణాలతో విప్లవ కవి వరవరరావు బెయిల్ సాధించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో జైలు నుంచి బయటికొచ్చిన కార్యకర్త గౌతమ్ నవ్లఖా ప్రస్తుతం గృహనిర్బంధంలో ఉన్నారు. -
రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫొటోషూట్‌పై రాజుకున్న వివాదం..
బాలీవుడ్ యంగ్ హీరో రణ్వీర్ సింగ్ (Ranveer Singh) సినిమాల మాట ఎలా ఉన్నా తన డ్రెస్సింగ్ స్టైల్‌తో నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. ఇప్పటికే అతను వేసుకున్న డ్రెస్‌లపై నెటిజన్లు ఘోరమైన కామెంట్లు మీమ్స్ చేశారు. 'దీపికా నువ్ అయినా నీ భర్తకు చెప్పొచ్చుగా' అంటూ ట్రోల్ చేశారు. ఇక తాజాగా రణ్వీర్ సింగ్ చేసిన న్యూడ్ ఫొటో షూట్ పెద్ద దుమారమే రేపుతోంది. మీమర్స్ అయితే మీమ్స్‌తో ఫన్నీగా, సీరియస్‌గా విరుచుకుపడుతున్నారు. పలువురు సెలబ్రిటీలు పొగడ్తుంటే నెటిజన్లు, ప్రేక్షకులు మాత్రం చీల్చి చెండాడుతున్నారు. తాజాగా రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫొటోషూట్‌పై సామాజిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రణ్వీర్ సింగ్ ఒక మానసిక రోగి అంటూ బ్యానర్లు కట్టారు. నూలు పోగు కూడా లేకుండా ఉన్న రణ్వీర్ సింగ్‌ను చూసిన వారు దుస్తులు సేకరించి అతనికి పంపారు. చూస్తుంటే ఈ వివాదం ఇంకా కొనసాగేలా ఉందని తెలుస్తోంది. కాగా పేపర్ మ్యాగజైన్ కోసం రణ్వీర్ నగ్నంగా ఫోజులిచ్చిన విషయం తెలిసిందే. 1972లో కాస్మొపాలిటన్ మ్యాగజైన్ కోసం ప్ ఐకాన్ బర్ట్ రెనాల్డ్స్‌కు నివాళిగా ఈ ఫొటోషూట్ చేశారు. చదవండి: శ్రీదేవి చెప్పిన బ్యూటీ టిప్.. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్న జాన్వీ .@papermagazine pic.twitter.com/RU2tzGNUOi — Ranveer Singh (@RanveerOfficial) July 22, 2022 చదవండి: 'గాడ్ ఫాదర్' షూటింగ్.. చిరంజీవి, సల్మాన్ ఫొటో లీక్ -
నాడు మోదీ సర్కార్‌ను కూల్చే కుట్ర
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: 2002లో గుజరాత్లో మత కలహాల తర్వాత రాష్ట్రంలో అప్పటి బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు పెద్ద కుట్ర జరిగిందని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తేల్చింది. సర్కారును కూల్చడానికి కాంగ్రెస్ దివంగత నేత అహ్మద్ పటేల్ ఆదేశాలతో సాగించిన కుట్రలో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ సైతం భాగస్వామిగా మారారని వెల్లడించింది. సెతల్వాద్ బెయిల్ దరఖాస్తును వ్యతిరేకిస్తూ తాజాగా అహ్మదాబాద్ సెషన్స్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. గుజరాత్ అల్లర్ల కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆమె సమర్పించిన దరఖాస్తును ‘సిట్’ తిరస్కరించింది. సెతల్వాద్‌కు బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. బెయిల్ దరఖాస్తుపై తదుపరి విచారణను అదనపు సెషన్స్ జడ్జి డి.డి.ఠక్కర్ సోమవారానికి వాయిదా వేశారు. గుజరాత్ మత కలహాల కేసులో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీతోపాటు అమాయకులను ఇరికించేలా తప్పుడు సాక్ష్యాధారాలను సృష్టించారన్న ఆరోపణలతో తీస్తా సెతల్వాద్‌తోపాటు గుజరాత్ మాజీ డీజీపీ ఆర్.బి.శ్రీకుమార్, మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌ను గుజరాత్ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. రాజకీయ కారణాలతోనే.. ‘‘ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోయడానికి లేదా అస్థిరపర్చడానికి తీస్తా సెతల్వాద్ ప్రయత్నించారు. రాజకీయ కారణాలతో కుట్ర సాగించారు. అల్లర్ల కేసులో అమాయకులను ఇరికించాలని చూశారు. ఇందుకోసం తప్పుడు సాక్ష్యాలు సృష్టించారు. ప్రతిఫలంగా ప్రతిపక్షం (కాంగ్రెస్) నుంచి చట్టవిరుద్ధంగా ఆర్థిక సాయం, ఇతర ప్రయోజనాలు, బహుమతులు పొందారు’’ అని సిట్ తన అఫిడవిట్లో ఆరోపించింది. సాక్షుల స్టేట్మెంట్లను ఉటంకించింది. అహ్మద్ పటేల్ ఆజ్ఞతోనే కుట్ర జరిగిందని, గోద్రా అల్లర్ల తర్వాత ఆయన నుంచి సెతల్వాద్, ఆర్.బి.శ్రీకుమార్, సంజీవ్ భట్ రూ.30 లక్షలు స్వీకరించారని తెలిపింది. గుజరాత్ అల్లర్ల కేసులో బీజేపీ సీనియర్ నాయకుల పేర్లను చేర్చాలంటూ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ(కాంగ్రెస్) నాయకులను సెతల్వాద్ తరచూ కలుస్తూ ఉండేవారని గుర్తుచేసింది. మరో సాక్షి చెప్పిన విషయాలను సిట్ ప్రస్తావించింది. కేవలం షబానా అజ్మీ, జావెద్ అక్తర్‌ను ఎందుకు రాజ్యసభకు పంపిస్తున్నారు? తనకెందుకు అవకాశం ఇవ్వడం లేదంటూ 2006లో ఓ కాంగ్రెస్ నాయకుడిని సెతల్వాద్ నిలదీశారని పేర్కొంది. మోదీకి క్లీన్చిట్.. సమర్థించిన సుప్రీంకోర్టు గుజరాత్ అల్లర్ల కేసులో నరేంద్ర మోదీతో సహా 62 మందికి ‘సిట్’ క్లీన్చిట్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు గత నెలలో సమర్థించింది. ‘సిట్’ ఇచ్చిన క్లీన్‌చిట్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. మరుసటి రోజే సెతల్వాద్‌ను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతోపాటు శ్రీకుమార్, సంజీవ్ భట్‌పై ఐపీసీ సెక్షన్ 468(ఫోర్జరీ), సెక్షన్194 (దురుద్దేశంతో తప్పుడు సాక్ష్యాలు సృష్టించడం)తోపాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గుజరాత్ అల్లర్ల వ్యవహారానికి సంబంధించి కల్పిత సాక్ష్యాలు, తప్పుడు సమాచారం సృష్టించారన్న ఆరోపణలపై రాష్ట్ర పోలీసు శాఖకు చెందిన ‘సిట్’ దర్యాప్తు కొనసాగిస్తోంది. సెతల్వాద్, శ్రీకుమార్‌ను 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ అహ్మదాబాద్‌లోని మెట్రోపాలిటన్ కోర్టు జూలై 2న ఆదేశాలిచ్చింది. అహ్మద్ పటేల్ కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీకి రాజకీయ సలహాదారుగా సేవలందించిన సంగతి తెలిసిందే. 2002 ఫిబ్రవరి 27న గుజరాత్‌లోని గోద్రా రైల్వే స్టేషన్లో సబర్మతీ ఎక్స్‌ప్రెస్‌కు దుండగులు నిప్పుపెట్టారు. అయోధ్య నుంచి రైలులో వస్తున్న 58 మంది భక్తులు ఆహూతయ్యారు. -
రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించొద్దు!
అనంతపురం సప్తగిరి సర్కిల్: రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించొద్దని ముస్లింలు, సామాజిక కార్యకర్తలు, మానవతావాదులు నినదించారు. హిజాబ్ విషయంలో అనవసర రాద్ధాంతం తగదని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల నుంచి సప్తగిరి సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముస్లిం మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. హిజాబ్ ధారణ తమ హక్కు అని నినదించారు. ఈ సందర్భంగా నగర మేయర్ వసీం సలీం, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, ఐద్వా నాయకురాలు సావిత్రి, డాక్టర్ నఫీసా, పీజీ స్టూడెంట్ ఆఖిల పర్వీన్ తదితరులు మాట్లాడారు. హిజాబ్ విషయంలో కర్ణాటక ప్రభుత్వ వైఖరి సరికాదన్నారు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ మౌలిక లక్షణమని, దీన్ని దెబ్బతీయడం తగదని అన్నారు. అన్ని మతాలు, జాతులు వారి సంస్కృతీ సంప్రదాయాలను అనుసరించే స్వేచ్ఛను రాజ్యాంగంకల్పించిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో యునైటెడ్ జేఏసీ నాయకులు కాగజ్‌ఘర్ రిజ్వాన్, సాలార్‌బాషా, జాఫర్, గౌస్‌బేగ్, సైఫుల్లాబేగ్, ఖాజా, దాదు, ముష్కిన్, తాజ్, రఫీ రసూల్ తదితరులు పాల్గొన్నారు. -
టైమ్స్ జాబితాలో ఇండో అమెరికన్ !
వివిధ రంగాల్లో తమదైన ముద్రవేస్తూ ఎంతో మందికి ప్రేరణగా నిలిచే వందమంది జాబితాను టైమ్స్ మ్యాగజీన్ ఇటీవల విడుదల చేసింది. ‘అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితా–2021’లో అమెరికా అధ్యక్షుడు జో బైడన్ , ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, మాజీ అధ్యక్షుడు ట్రంప్‌లతోపాటు మన దేశానికి చెందిన నలుగురు ప్రముఖులు చోటుదక్కించుకున్నారు. వీరిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, సీరమ్ ఇన్ స్టిట్యూట్ సీఈవో అడర్ పూనావాల, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఏ3పీసీఓఎన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మంజుషా పి కులకర్ణిలు ఉన్నారు. మంజుషా ఏషియన్ పసిఫిక్ పాలసీ అండ్ ప్లానింగ్ కౌన్సిల్(ఏ3పీసీఓఎన్)కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తూ లక్షలమంది జాత్యహంకారానికి గురైన బాధితులకు సాయం చేస్తున్నారు. నలభైకి పైగా కమ్యూనిటీ సంస్థలను ఏకతాటిపైకి తీసుకువచ్చి పదిహేను లక్షలమంది ఆసియన్ అమెరికన్స్, పసిఫిక్ ఐలాండ్ పౌరుల హక్కుల కోసం పోరాడుతున్నారు. అంతేగాక కోవిడ్–19 తర్వాత జాత్యహంకార దాడులకు వ్యతిరేకంగా పోరాడేందుకు స్టాప్ ఏఏపీఐ(ఏషియన్ అమెరికన్స్ అండ్ పసిఫిక్ ఐలాండర్స్–ఏఏపీఐ) స్థాపించి దాని ద్వారా పోరాడుతున్నారు. మంజుషా ఇండియాలో పుట్టింది. కొన్నాళ్లల్లోనే తల్లిదండ్రులు వృత్తిరీత్యా అమెరికాకు వెళ్లడంతో ఆమె బాల్యం అంతా అక్కడే గడిచింది. అలబామాలోని మోంట్‌గోమెరీలో ఇండియన్ కుటుంబాలు ఎక్కువగా ఉండడంతో వాళ్లతో కలిసి పెరుగుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొంటూ పెరిగింది. తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లు కావడంతో తను కూడా ముందుగా డాక్టర్ అవ్వాలనుకుంది. కానీ తనకు లా అంటే అమితాసక్తి ఉండడంతో మెడిసిన్ కాకుండా లా చదువుతానని తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్లు వద్దని వారించినప్పటికీ తనే నిర్ణయం తీసుకుని లా చదివింది. లా తోపాటు పౌరుల హక్కుల గురించి విపులంగా తెలుసుకున్న మంజుషా అవి సక్రమంగా అమలు కావాలని కోరుకునేది. స్కూల్లో చదివేప్పటి నుంచి తన తోటి విద్యార్థులు శరీర రంగు కారణంగా వివక్షకు గురికావడం, తన కుటుంబంతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు జాత్యహంకారంతో చిన్నచూపు చూసిన సందర్భాలు అనేకం ఎదుర్కొంది. ఇవి నచ్చని మంజుషా వాటికి వ్యతిరేకంగా పోరాడాలనుకునేది. లా అయ్యాక.. బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి జ్యూరీస్ డాక్టర్ లా డిగ్రీ అయ్యాక సదరన్ పావర్టీ లా సెంటర్లో ఇంటర్న్‌షిప్ చేసింది. ఈ సమయంలో పౌరుల హక్కుల గురించి మరింత అధ్యయనం చేసింది. జాత్యహంకారానికి గురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలి? న్యాయపరమైన హక్కులు ఏమి ఉన్నాయో మరింత లోతుగా తెలుసుకుంది. ఈ క్రమంలోనే నేషనల్ హెల్త్ లా ప్రోగ్రామ్(ఎన్హెచ్ఈఎల్పీ)లో చేరి.. శాసన, పరిపాలన, న్యాయపరమైన శిక్షణా కార్యక్రమాలు, సాంకేతిక సహాయం, నిరుపేదలకు న్యాయపరమైన సలహాలు, సూచనలు, వారి సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించేది. తరువాత ఎన్హెచ్ఈఎల్పీ నుంచి తప్పుకుని సౌత్ ఏషియన్ నెట్వర్క్(సాన్)కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలను చేపట్టి మరికొంతమంది పౌరులకు ఆరోగ్య, పౌరుల హక్కుల గురించి పనిచేసింది. ఇదే క్రమంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వర్ణ వివక్షపై పోరాడుతూ ఉండేది. తరువాత మరో ఇద్దరితో కలిసి ఏషియన్ పసిఫిక్ పాలసీ అండ్ ప్లానింగ్ కౌన్సిల్ (ఏ3పీసీఓఎన్) ను స్థాపించి దానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ జాత్యహంకార దాడులకు బలవుతున్న బాధితులకు అండగా నిలబడి పోరాడుతోంది. ఏఏపీఐ.. గతేడాది కోవిడ్–19 ప్రపంచం మీద విరుచుకు పడడంతో..కోవిడ్ వైరస్ చైనాలో పుట్టిందని, చైనా వైరస్, వూహాన్ వైరస్ అని దూషిస్తూ అమెరికాలో ఉన్న చైనీయులపై దాడులు చేయడం, జాత్యహంకార దాడులు పెరగడం, అప్పటి అధ్యక్షుడు ఏషియన్ దేశాలకు వ్యతిరేక విధానాలు అమలు చేయడంతో.. దీనిని ఎలాగైనా అడ్డుకోవాలన్న ఉద్దేశంతో... ఏషియన్ అమెరికన్స్ అండ్ పసిఫిక్ ఐలాండర్స్ (ఏఏపీఐ)ను ఏర్పాటు చేసి బాధితులకు అండగా నిలబడి, కావాల్సిన సాయం చేస్తోంది. అంతేగాక గత రెండు దశాబ్దాలుగా జాతి సమానత్వం కోసం పోరాడుతుండడంతో ఆమెను టైమ్స్ మ్యాగజీన్ 2021 గాను వందమంది అత్యంత ప్రభావవంతమైన జాబితాలో చేర్చింది. 2014లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా హయాంలో వైట్ హౌస్ నుంచి ‘చాంపియన్ ఆఫ్ చేంజ్ అవార్డును అందుకుంది. ఒకపక్క తన కుటుంబాన్ని చూసుకుంటూనే మరో పక్క సమాజ సేవచేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నందున మంజుషా కులకర్ణికి టైమ్స్ వందమంది ప్రభావవంతుల జాబితాలో చోటు లభించింది. -
ఇండో అమెరికన్ మహిళకు అరుదైన గౌరవం..!
వాషింగ్టన్: టెక్సాస్ లోని ఓ స్కూలుకు భారత సంతతికి చెందిన మహిళ పేరును పెట్టనున్నారు. టెక్సాస్‌లో ఏర్పాటు చేయనున్న ఎలిమేంట్రీ స్కూల్ 53 కు ఇండో అమెరికన్, సామాజిక కార్యకర్త అయిన సోనాల్ భూచర్ పేరు పెట్టాలని ''ద ఫోర్ట్ బెండ్ ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్'' ( ఎఫ్‌బీఐఎస్‌డీ) బోర్డ్ ఏక గ్రీవంగా తీర్మానం చేసింది. కాగా ఈ స్కూలును జనవరి 2023లో రివర్ స్టోన్ కమ్యూనిటీలో ఏర్పాటు చేయనున్నారు. 2019లో సోనాల్ భూచర్(58) కాన్సర్‌తో మరణించింది. సోనాల్ భూచర్ ముంబై ప్రాంతానికి చెందినవారు. బొంబాయి యూనివర్శిటీలో ఫిజియో థెరపీలో గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. 1984లో స్వస్థలం వదిలి , ఆమె తన భర్తతో కలిసి హ్యూస్టన్ లో స్దిరపడ్డారు. సామాజిక కార్యకర్తగా మంచి పేరును గడించారు. అంతేకాకుండా విద్యార్ధుల కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు.సోనాల్ భూచర్ ఎఫ్‌బీఐఎస్‌డీ బోర్డులో కొద్ది కాలం పనిచేశారు. ఆ సమయంలో సోనాల్ స్టూడెంట్ లీడర్షిప్ ప్రోగ్రాం, లెజిస్లేటివ్ అడ్వకేసీ ప్రోగ్రామ్, ఫోర్ట్ బెండ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అన్యువల్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్, వాచ్ ఎ లైఫ్ స్టైల్ ప్రోగ్రాం, స్కాలర్షిప్ ప్రోగ్రాంతో సహా పలు కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. అమెరికాకు వలస వచ్చిన వారికి ఈ విధంగా గౌరవం తెలపడం ఎంతో విశేషమని సోనాల్ మిత్రురాలు ఉష గంజు తెలిపింది. చదవండి: భారత సంతతి సాధికారతకు శుభరూపం -
జైల్లో స్టాన్ స్వామికి సిప్పర్
ముంబై : ఎల్గార్‌పరిషత్ కేసులో తలోజా జైలులో ఉన్న స్టాన్‌స్వామి(83)కి సిప్పర్‌తో పాటు ఇద్దరు సహాయకులను ఏర్పాటు చేసినట్లు జైలు అధికారులు తెలిపారు. పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతోన్న ఆదివాసీ హక్కుల నేత స్టాన్‌స్వామిని మావోయిస్టులతో సంబంధం ఉందన్న ఆరోపణలతో అక్టోబర్ 8న అరెస్టు చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), స్టాన్ స్వామి పట్ల అమానవీయం గా ప్రవర్తించడాన్ని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వచ్చాయి. అరెస్టు సందర్భంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న సిప్పర్‌ని తిరిగి అందజేయాల్సిందిగా కోరుతూ స్టాన్‌స్వామి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పార్కిన్సన్స్ వ్యాధి కారణంగా చేతులు వణుకుతున్నందున సిప్పర్ ద్వారా ఆహారపదార్థాలను సేవించేందుకు అనుమతి నివ్వాలంటూ ఆయన ప్రత్యేక ఎన్ఐఏ కోర్టుకి విన్నవించారు. శనివారం తలోజా జైలుని సందర్శించిన జైళ్ల శాఖ ఐజీపీ చేరింగ్ దోర్జే, స్టాన్‌స్వామి అవసరాలను గురించి అడిగి తెలుసుకున్నారు. అనం తరం జైలు అధికారులు స్టాన్ స్వామికి సిప్పర్, స్ట్రా, వీల్ ఛైర్, వాకింగ్ స్టిక్, వాకర్తోపాటు ఇద్దరు సహాయకులను ఏర్పాటు చేశారు. -
ఇంతకీ తన్మే నివేదిత, కళ్యాణీ ఎవరు?
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్‌లో అరారియా ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువతి ఇద్దరు సామాజిక కార్యకర్తల సహకారంతో జూలై 7న పోలీసు స్టేషన్‌కు వెళ్లి, కొన్ని రోజుల క్రితం నలుగురు యువకులు తనపై అత్యాచారం జరిపారని ఫిర్యాదు చేశారు. దానిపై పోలీసుల నుంచి ఎలాంటి స్పందన కనిపించక పోవడంతో ఆ యువతి, సామాజిక కార్యకర్తలు తన్మే నివేదిత, కల్యాణిలతో కలిసి దిగువ కోర్టును జూలై పదవ తేదీన ఆశ్రయించారు. తనకు జరిగిన అన్యాయం గురించి కోర్టులో ఆమె, జడ్జీకి వివరించారు. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న కోర్టు ఉద్యోగి ఆమె వద్దకు వచ్చి, ఆ వాంగ్మూలంపై సంతకం చేయాల్సిందిగా కోరారు. తనకు చదువు రాదని, ఆ వాంగ్మూలాన్ని చదివి వినిపించాల్సిందిగా ఆమె నేరుగా జడ్జీనే కోరారు. అందుకు ఆగ్రహించిన ఆ జడ్జీ ఆమెను దూషించినట్లు ఆమె మీడియా ముఖంగా ఆరోపించారు. ఇదంతా జరిగిన అరగంటకు కోర్టు ఆదేశం మేరకు మూకుమ్మడి అత్యాచారం బాధితురాలిని, ఆమెకు అండగా నిలిచిన ఇద్దరు సామాజిక కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి, అరారియాకు 240 కిలోమీటర్ల దూరంలోని సమస్థిపూర్ జైలుకు తరలించారు. వారిపై కోర్టు కార్యకలాపాలకు ఆటంకం కలిగించారని, ప్రభుత్వాధికారుల విధుల నిర్వహణకు అడ్డు తగిలారంటూ వారిపై నాన్ బెయిలబుల్ కింద కేసులు నమోదు చేశారు. ఆ యువతిపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ నలుగురు యువకులను అరెస్ట్ చేసేందుకుగానీ, కనీసం వారెవరో గుర్తించేందుకుగానీ పోలీసులు నేటి వరకు ప్రయత్నించలేదు. దానికి సంబంధించి కోర్టు కూడా ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. ఈ యువతి ఉదంతంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో జూలై 18వ తేదీన మరో దిగువ కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. తన్మే నివేదిత, కల్యాణిలు మాత్రం నేటి వరకు కూడా విడుదల కాలేదు. వారి ప్రాణాలకు ప్రమాదం ఉందని వారి మిత్రులు మీడియా ముఖంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇంతకు వారెవరు ? తన్మే నివేదిత, కళ్యాణీ ఈ యువతీ యువకులు ‘జన్ జాగారణ్ శక్తి సంఘటన్’కు చెందిన సామాజిక కార్యకర్తలు. వారివురు మరో ముగ్గురితో కలిసి అరారియా ప్రాంతంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. జన్ జాగారణ్ శక్తి సంఘటన్ ఉత్తర బీహార్‌లో కార్మికుల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం కషి చేస్తోంది. నిమ్న వర్గాల అభ్యున్నతి, వారికి మెరుగైన వైద్య సదుపాయంతోపాటు మహిళా సాధికారికత కోసం కృషి చేస్తోన్న వారిగా తన్మే, కల్యాణీలకు మంచి గుర్తింపు ఉంది. 30 ఏళ్ల తన్మే కేరళలో పుట్టి పెరిగారు. ఆయన అమెరికాలో ‘ఎకాలోజీ అండ్ సోసియాలోజీ’లో పట్టభద్రలు. ఆయన భారత్‌కు వచ్చి గత పదేళ్లుగా వివిధ సామాజిక రంగాల్లో పనిచేశారు. ఆయన ‘క్రాంతి’ సంఘంలో చేరి ముంబైలోని వేశ్య పిల్లల సాధికారికత కోసం పాటుపడ్డారు. 2014లో ఢిల్లీ వెళ్లి అక్కడి అంబేడ్కర్ యూనివర్శిటీలో ‘డెవలప్మెంట్ స్టడీస్’లో పీజీలో చేరారు. ఆయన ఎమ్మే చదువుతోనే కొంత మంది యువతీ, యువకులతో బిహార్‌లోని అరారియాకు వచ్చి గ్రామీణ మహిళల అభ్యున్నతి కోసం వర్క్‌షాపులు నిర్వహించారు. 2016లో ఆయనకు జన్ జాగారణ్ శక్తి సంఘటన్‌తో సానిహిత్యం ఏర్పడి అందులో చేరారు. సంగీతం, సాహిత్యం, చిత్రకళలో మంచి ప్రావీణ్యం ఉన్న తన్మే తన పాటలతో జనాన్ని ఆకట్టుకుంటారు. కళ్యాణీ పరిచయం ఢిల్లీ యూనివర్శిటీలో ‘మ్యాథ్స్, అంతర్జాతీయ సంబంధాలు’లో డిగ్రీ చదివిన కల్యాణి రెండేళ్ల క్రితం జన్ జాగారణ్లో చేరారు. ఆరోగ్య కార్యక్రమాల్లో ఆమెకు అమితాసక్తి పేదలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుంటారు. ఆమె తన్మేతో పాటు మరో ముగ్గురితో కలిసి ఒకే ఇంటిలో ఉంటున్నారు. వారి ఇద్దరి ప్రాణాలకు ముప్పుందని, వారి విడుదల కోసం పట్నా హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశామని జన్ జాగారణ్ వ్యవస్థాపకుల్లో ఒకరైన కామయాని స్వామి మీడియాకు తెలిపారు. రేపటి వరకు పట్నా హైకోర్టుకు సెలవులు అవడం వల్ల అప్పీలు ఎప్పుడు విచారనకు వస్తుందో తెలియడం లేదని ఆయన చెప్పారు. -
రాజ ద్రోహమా? రాజ్యాంగ ద్రోహమా?
మాకు జీతాలు పెంచండి అని అడిగారు ఇద్దరు కర్ణాటక పోలీసులు. కర్నాటక రాష్ట్రంలో అఖిల కర్ణాటక పోలీసు మహాసంఘ నాయకుడు శశిధర్ గోపాల్ పైన, కోలార్ కానిస్టేబుల్ బసవరాజ్ పైన 124ఎ కింద జూన్ 4, 2016న రాజద్రోహం కేసులను నమోదు చేశారు. ఉద్యమాన్ని ప్రభుత్వం అణచివేసింది. ఇటువంటి పాలకులుంటే భారత్ ముక్కలవుతుంది అని నినాదాలు చేసినందుకు కన్హయ్యా కుమార్ మీద రాజద్రోహం కేసు పెట్టారు. క్రికెట్ మ్యాచ్ నడుస్తూ ఉంటే పాకి స్తాన్ జట్టుకు మద్దతుగా మాట్లాడినందుకు రాజద్రోహం కేసును వాడారు. పాకిస్తాన్ క్రికెట్ క్రీడాకారుడిని పెళ్లాడిన భారతీయ మహిళపై రాజద్రోహం కేసు పెట్టనందుకు సంతోషించాలి. 2020 ఫిబ్రవరి 6న ఉత్తరప్రదేశ్‌లోని అజం ఘర్‌లో పౌరసత్వ చట్టం సవరణ సీఏఏను విమర్శించినందుకు 135 మంది మీద రాజద్రోహం కేసులుపెట్టారు. 20 మందిని అరెస్టు చేశారు. ఫిర్యా దులో పేర్కొన్న 35 మంది మీద, ఎవరో తెలియని 100 మంది మీద ఈ క్రిమినల్ కేసులుపెట్టడం విచిత్రం. రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు అనుసరించడం, భారత రాజ్యాంగ విలువలను తిలోదకాలిచ్చే చట్టాలు చేయడం, భారత ప్రజాస్వామ్య మౌలిక లక్షణాలను భంగపరిచే చట్టాలు తేవడాన్ని విమ ర్శిస్తే రాజ్య ద్రోహమంటున్నారు. రాజ్యాంగానికి ద్రోహం చేయడం రాజ ద్రోహం అవుతుంది కాని పాలకులను విమర్శిస్తే రాజ ద్రోహమా? వేలాది మందిపై కుప్పలుతెప్పలుగా కేసులు పెట్టేస్తున్నారు. ఈ చట్టంలో లోపాలను, అన్యాయాలను ఎండగట్టే వారిని జాతి వ్యతిరేకులంటున్నారు. దేశ ద్రోహులంటున్నారు. ఆర్టికల్ 19(1)(ఎ)లో చెప్పిన వాక్ స్వాతంత్య్రం కీలకమైనది. అది దేశద్రోహమా? రాజ్యాంగ వ్యతిరేక చట్టాలను నిరసించకపోవడమే దేశద్రోహం. అసలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టాలు చేసేవారే రాజ్యాంగ ద్రోహులు. అదీ రాజకీయం కోసం, ఓట్ల కోసం చేసేవారు స్వచ్ఛమైన రాజకీయాలకు కూడా ద్రోహం చేసినట్టే. జార్ఖండ్‌లో పదివేలమంది మీద ఒకసారి, మరో సారి 3వేల మందిపై రాజ ద్రోహం కేసులు పెట్టారు. ప్రభుత్వం మారడం మంచిదైంది. లేకపోతే వేలమంది ప్రజలు దేశ ద్రోహనేర నిందితులుగా కోర్టుల చుట్టూతిరుగుతూ అన్యాయమైపోయేవారు. బీదర్ పాఠశాలలో సీఏఏకు వ్యతిరేకంగా నాటకం ప్రదర్శించారు. ఏబీవీపీ కార్యకర్త పోలీసు స్టేషన్లో రాజ ద్రోహం కేసు పెట్టారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి విచారణ మొదలుపె ట్టారు. హెడ్ మిసెస్‌ను అరెస్టు చేశారు. చిన్న పిల్ల లను గంటలకొద్దీ విచారించారు. తొమ్మిదేళ్ల అమ్మాయి తల్లిని అరెస్టు చేశారు. ఆ కూతురు పక్కింటి వారి దగ్గర తలదాచుకుంటున్నది. కోర్టు బెయిల్ ఇవ్వలేదు. పదిహేనురోజుల పైబడి వారికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. పౌరసత్వం వివరాలు అడిగితే చెప్పు చూపండి, అని ఆ నాటకంలో ఒక డైలాగ్ ఉందట. ప్రధాని చిత్రాన్ని చెప్పుతో కొట్టారనీ ఆరోపించారు. ఒకవేళ ఆవిధంగా జరిగితే ఖండించవలసిందే. కానీ మూడేళ్ల జైలు నుంచి యావజ్జీవ కారాగార శిక్ష విధించేంత ఘోరమైన రాజ ద్రోహ నేరమా? బాలలను అయిదారుగంటలపాటు పోలీసులు తమ ఖాకీ యూనిఫాంలో విచా రించడం, బాలల విషయంలో బాలల సంక్షేమ కమిటీని సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకోవడం తీవ్ర మైన ఉల్లంఘనలని కర్ణాటక బాలల హక్కుల కమిషన్ విమర్శించింది. రెండు వందల ఏళ్ల కిందట దిష్టి బొమ్మను తగులబెట్టడం పెద్ద పరువునష్టంగా భావించి క్రిమినల్ కేసు పెట్టేవారు. ముర్దాబాద్ డౌన్ డౌన్ నినాదాలు చేస్తే క్రిమినల్ డిఫమేషన్ కేసులు పెట్టి జైలుకు పంపేవారు. ఆ కాలం మారింది. తీవ్రమైన అబద్ధపు విమర్శలు చేసినప్పుడే క్రిమినల్ కేసులు పెట్టాలని తరువాత తీర్పులు వివరిస్తున్నాయి. చీటికీమాటికీ వ్యతిరేకుల మీద, ఉద్యమకా రుల మీద రాజ ద్రోహం కేసులు పెట్టడం అన్యాయ మనీ, ఈ దుర్వినియోగాన్ని నిరోధించాలని ఎన్జీవో కామన్ కాజ్ పిల్ దాఖలు చేసింది. దీనిపై తీర్పు చెబుతూ ‘భారత రాజ్యాంగంలో ఉన్న ప్రతిపదం ఇప్పటికీ చెల్లుతుంది, ఏదీ మారలేదు, మారకూడద’ని ఆనాటి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా పేర్కొన్నారు. విమర్శకులమీద రాజకీయ వ్యతిరేకుల మీద ప్రభుత్వాలు రాజ ద్రోహం కేసు పెట్టకూడదని దీపక్ మిశ్రా 2016లో తీర్పుచెప్పారు. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
వరవరరావు కేసులో సుప్రీం తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: కోరేగావ్–భీమా అల్లర్ల కేసులో గృహ నిర్బంధంలో ఉన్న వరవరరావుతో పాటు మరో నలుగురు సామాజిక కార్యకర్తలను విడుదల చేయాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ప్రముఖ చరిత్రకారుడు రొమిల్లా థాపర్‌తో పాటు మరికొందరు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్, పోలీసుల తరఫు న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో జరుగుతున్న విచారణకు సంబంధించి వివరాలను 24 లోపు తమ ముందుంచాలని మహారాష్ట్ర పోలీసులను ఆదేశించింది. వరవరరావు, అరుణ్ ఫెర్రీరా, వెర్నాన్ గొన్సాల్వేస్, సుధా భరద్వాజ్, గౌతం నవ్‌లఖాలు ఆగస్టు 29 నుంచి గృహ నిర్బంధంలో ఉన్నారు. -
‘కోరెగావ్’ పై పోలీసుల భిన్న స్వరాలు
సాక్షి, న్యూఢిల్లీ : భీమా కోరెగావ్ కేసులో ‘అర్బన్ మావోయిస్టులు’ అంటూ ఐదుగురు సామాజిక కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ప్రముఖ చరిత్రకారులు రొమిల్లా థాపర్, మరో నలుగురు ప్రముఖులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు బుధవారం నాడు విచారణ ప్రారంభించింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పుణె పోలీసులు రెండు పరస్పర భిన్నంగా దాఖలు చేసిన అఫిడవిట్లపై కూడా సుప్రీం కోర్టు విచారణ కొనసాగనుంది. కోరెగావ్ కేసులో హైదరాబాద్‌లో వరవర రావుతోపాటు దేశవ్యాప్తంగా మరో నలుగురు సామాజిక కార్యకర్తలను ఆగస్టు 28వ తేదీన పుణె పోలీసులు అరెస్ట్ చేయడం, రొమిల్లా థాపర్ నాయకత్వాన ప్రజాహిత పిటిషన్‌ను దాఖలు చేయడం, దానికి స్పందించి సెప్టెంబర్ మూడవ తేదీన పుణె పోలీసులు రెండో అఫిడవిట్ దాఖలు చేయడం తదితర పరిణామాలు తెల్సినవే. ఆ అఫిడవిట్ ప్రకారం భీమా కోరెగావ్ గ్రామానికి సరిగ్గా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుణె నగరంలో ఎల్గార్ పరిషద్ పేరిట గతేడాది డిసెంబర్ 31వ తేదీన బహిరంగ సభ జరిగింది. ఆ సభను నిర్వహించిన నిషేధిత సీపీఐ (మావోయిస్టు) కార్యకర్తలు దళితులను రెచ్చగొట్టారు. ఫలితంగా ఆ మరుసటి రోజు అంటే జనవరి 1వ తేదీన భీమా కోరెగావ్ గ్రామంలో అల్లర్లు చెలరేగాయి. అందులో ఒకరు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. కోట్లాది రూపాయ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఆ నాడు దళితులను రెచ్చగొడుతూ ప్రసంగించారన్న కారణంగానే వరవర రావు సహా ఐదుగురు సామాజిక కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అదే రోజు ప్రజాహిత వ్యాజ్యం కారణంగా సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని నిందితులను అరెస్ట్ చేయడానికి వీల్లేదని, వారిని గృహ నిర్బంధానికి పరిమితం చేయాల్సిందిగా ఆదేశించింది. దేశంలోని దాదాపు 250 దళిత సంఘాలను ఏకతాటిపైకి తీసుకరావాలనే లక్ష్యంతో ఎల్గార్ పరిషద్ ఏర్పాటయింది. ఆ రోజు ఎల్గార్ పరిషద్ పేరిటనే బహిరంగ సభ జరిగినప్పటికీ సభ నిర్వహణలో కీలక పాత్ర వహించినదీ ఓ మాజీ సుప్రీం కోర్టు జడ్జీ, మరో మాజీ హైకోర్టు చీఫ్ జడ్జీలు. ఈ విషయాన్ని వారే (బీజీ కోస్లే–పాటిల్, పీబీ సావంత్‌లు) స్వయంగా చెప్పడంతోపాటు సభ నిర్వహణకు అరెస్టైన సమాజిక కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదని కూడా వారు చెప్పారు. పుణె పోలీసులు భీమా కోరెగావ్ కేసులో రెండో అఫిడవిట్ దాఖలు చేయడానికి ఆరు నెలల ముందు ఫిబ్రవరి 13వ తేదీన మొదటి అఫిడవిట్‌ను దాఖలు చేశారు. అందులో హిందూ అఘాది సంస్థ నాయకుడు మిలింద్ ఎక్బోటే అల్లర్లకు ప్రధాన కారకుడని ఆరోపించారు. ‘ఎక్బోటో అల్లర్లను సృష్టించేందుకు నేరపూరిత కుట్ర పన్నారని మా దర్యాప్తు సందర్భంగా వెలుగులోకి వచ్చింది. ఆయన కర పత్రాలను పంచడం ద్వారా కలసిమెలసి ఉంటున్న ప్రజల మధ్య చిచ్చు పెట్టారు. చట్టాన్ని ఉల్లంఘించి, అల్లర్లలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఫలితంగా కోట్లాది రూపాయల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి’ అని ఆ అఫిడవిట్లో పోలీసులు పేర్కొన్నారు. దళితులు నమ్ముతున్న భీమా కోరెగావ్ చరిత్రను వక్రీకరిస్తూ ఎక్బోటే కరపత్రాలను పంచారని, ఆయన అనుచరులు ఫేస్బుక్ ద్వారా అల్లర్లకు ఆజ్యం పోశారని పుణె డిప్యూటీ మేయర్ సిద్ధార్ట్ ధిండే కూడా ఆరోపించారు. మొదటి అఫిడవిట్లో మిలింద్ ఎక్బోటేనే అల్లర్లకు ముఖ్య కారకుడని పోలీసులు పేర్కొన్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సన్నిహితుడవడం వల్ల ఆయన్ని అరెస్ట్ చేయడానికి వారు సాహసించలేక పోయారు. ఆర్నెళ్లలో కథ పూర్తిగా మారిపోయింది. పోలీసులు రెండో అఫిడవిట్ దాఖలు చేశారు. మొదటి అఫిడవిట్లో నిందితులు హిందూ సంస్థ నాయకులు కాగా, రెండో అఫిడవిట్లో అర్బన్ మావోయిస్టులు నిందితులుగా మారారు. పరస్పర భిన్నమైన ఈ అఫిడవిట్లపై సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుందో, పోలీసులు ఎలా సమర్థించుకుంటారో చూడాలి. -
విరసం నేత వరవరరావు అరెస్ట్
పుణే, న్యూఢిల్లీ, ముంబై, రాంచీ, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రముఖ పౌర హక్కుల నేతలు, మావోయిస్టు సానుభూతిపరుల అరెస్టులు సంచలనం సృష్టించాయి. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానంతో ఏకకాలంలో వారి నివాసాలపై పుణే పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. గతేడాది డిసెంబర్లో మహారాష్ట్రలోని కోరెగావ్–భీమాలో చెలరేగిన హింసాత్మక ఘటనల కేసు విచారణలో భాగంగా ఈ దాడులు కొనసాగగా.. విరసం నేత వరవరరావు, హక్కుల కార్యకర్తలు సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, వెర్నన్ గొంజాల్వెజ్, గౌతం నవలఖాల్ని పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఈ అరెస్టుల్ని మానవ హక్కుల పరిరక్షణ కార్యకర్తలు, అభ్యుదయ రచయితలు, న్యాయవాదులు తీవ్రంగా తప్పుపట్టారు. ఈ చర్యలు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని, ప్రజామద్దతు కోల్పోతున్నామనే భయంతోనే అరెస్టులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. ఏకకాలంలో పలు నగరాల్లో సోదాలు గతేడాది డిసెంబర్ 31న పుణేకి సమీపంలోని కోరెగావ్–భీమా గ్రామంలో దళితులు, ఉన్నత వర్గమైన పీష్వాలకు మధ్య చోటుచేసుకున్న హింస కేసు దర్యాప్తులో భాగంగా పుణే పోలీసులు మంగళవారం ఉదయం నుంచి దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లో విరసం(విప్లవ రచయితల సంఘం)నేత వరవరరావు, ముంబైలో హక్కుల కార్యకర్తలు వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా, ఫరీదాబాద్‌లో ట్రేడ్ యూనియన్ కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్, ఢిల్లీలో పౌర హక్కుల కార్యకర్త గౌతం నవలఖా ఇళ్లలో ఏకకాలంలో దాడులు నిర్వహించినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అనంతరం హైదరాబాద్‌లో వరవరరావు, ఫరీదాబాద్‌లో సుధా భరద్వాజ్, ముంబైలో ఫెరీరా, గొంజాల్వెజ్, ఢిల్లీలో నవలఖాలపై ఐపీసీలోని 153(ఏ), ఇతర సెక్షన్లతో పాటు, మావోలతో సంబంధాల ఆరోపణల నేపథ్యంలో చట్టవ్యతిరేక కార్యకలాపాల (నియంత్రణ) చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే నవలఖాను బుధవారం ఉదయం వరకూ ఢిల్లీ నుంచి బయటకు తీసుకెళ్లద్దని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. నవలఖా తరఫున ఆయన న్యాయవాది వరిషా ఫరాసత్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను విచారించిన అనంతరం కోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే సుధా భరద్వాజ్ ట్రాన్సిట్ రిమాండ్‌పై కూడా పంజాబ్, హరియాణా హైకోర్టు స్టే విధించింది. మరోవైపు హైదరాబాద్‌లో క్రాంతి టేకుల, కూర్మనాథ్, రాంచీలో సుసాన్ అబ్రహం, ఫాదర్ స్టాన్ స్వామి, గోవాలో ఆనంద్ టెల్టుంబ్డే ఇళ్లపై కూడా సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. మావోలతో సంబంధాలున్నాయనే అరెస్టు చేశాం: పోలీసు వర్గాలు ‘ఈల్గర్ పరిషద్ ఆందోళనలతో సంబంధాలపై దర్యాప్తు చేయగా ... నిషేధిత సంస్థ సభ్యులకు సంబంధించి కొన్ని ఆధారాలు లభించాయి. దాని ఆధారంగా పోలీసులు చత్తీస్‌గఢ్, ముంబై, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు’అని పోలీసు వర్గాలు వెల్లడించాయి. మావోయిస్టులతో సంబంధాలున్న వ్యక్తుల ఇళ్లతో పాటు.. జూన్‌లో అరెస్టైన ఐదురుగు వ్యక్తులతో ప్రత్యక్షంగా, లేదా పరోక్షంగా సంబంధమున్న వారి ఇళ్లలోను సోదాలు జరిగాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. దాడుల్లో నిషేధిత సంస్థలతో సంబంధాలపై కొన్ని పత్రాల్ని స్వాధీనం చేసుకున్నామని, వారి ఆర్థిక లావాదేవీల్ని, ఫోన్ రికార్డుల్ని కూడా పరిశీలిస్తున్నామని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. కాగా కొద్ది నెలల క్రితం మహారాష్ట్ర పోలీసుల తనిఖీల్లో దొరికిన రెండు లేఖల్లో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హత్యకు మావోయిస్టుల కుట్ర పన్నారన్న సమాచారం నేపథ్యంలోను ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. కోరెగావ్–బీమా కేసు దర్యాప్తులో భాగంగానే.. కోరెగావ్–బీమా హింసతో సంబంధమున్న అనుమానంతో ఈల్గర్ పరిషద్‌కు చెందిన ఐదుగురు కార్యకర్తల్ని ఈ ఏడాది జూన్‌లో పోలీసులు అరెస్టు చేశారు. దళిత కార్యకర్త సుధీర్ ధావలేను ముంబైలోని తన ఇంట్లో అరెస్టు చేయగా.. న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, కార్యకర్తలు మహేశ్ రౌత్, షోమా సేన్లను నాగ్‌పూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఇక న్యాయవాది రోనా విల్సన్‌ను ఢిల్లీలోని తన ఇంట్లో అరెస్టు చేశారు. వారికి మావోలతో సన్నిహిత సంబంధాలున్నాయంటూ విశ్రాంబాగ్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విల్సన్ ఇంట్లో సోదాల్లో దొరికిన లేఖలో వరవరరావు పేరు ఉందని అప్పట్లో పుణే పోలీసులు ప్రకటించారు. రాజీవ్ గాంధీ హత్య తరహాలోనే రోడ్‌షోలను లక్ష్యంగా చేసుకుని ప్రధాని మోదీ హత్యకు మావోలు కుట్ర పన్నినట్లు ఆ లేఖలో ఉందని పోలీసులు చెప్పడం అప్పట్లో సంచలనమైంది. భయపెట్టేందుకే ఈ అరెస్టులు: హక్కుల కార్యకర్తలు ఈ అరెస్టుల్ని దేశవ్యాప్తంగా పలువురు హక్కుల కార్యకర్తలు, రచయితలు, న్యాయవాదులు ఖండించారు. ‘నియంతృత్వ శక్తుల కోరలు ఇప్పుడు విశాలంగా తెరచుకున్నాయి’అని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశారు. ఈ అరెస్టులు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని, హక్కులపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిని వేధిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ స్పందిస్తూ.. ఇది పూర్తిగా భయపెట్టే చర్య అని.. స్వేచ్ఛా గొంతుక వినిపించే వారిపై వేధింపుల్ని అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ‘ప్రజా మద్దతు కోల్పోతున్నామని ప్రభుత్వం భయపడుతోంది. ఆ భయానికి సంకేతాలే ఈ అరెస్టులు. అర్థంలేని ఆరోపణలతో న్యాయవాదులు, కవులు, రచయితలు, దళిత హక్కుల కార్యకర్తలు, మేథావుల్ని అరెస్టు చేస్తున్నారు’అని ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ విమర్శించారు. దళితులు వర్సెస్ పీష్వాలు దళిత సైనికుల సాయంతో జనవరి 1, 1818న పీష్వా పాలకుల్ని బ్రిటిష్ సైన్యం ఓడించింది. పీష్వా పాలకులపై విజయానికి చిహ్నంగా దళిత సంఘాలు ఏటా మహారాష్ట్రలోని భీమా కోరెగావ్‌లో విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తాయి. గతేడాది డిసెంబర్ 31న ఆ వేడుకల్లో హింస నెలకొంది. కొన్ని హిందూసంస్థలు ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో విధ్వంసం చోటుచేసుకుంది. ముంబయితో పాటు పలు ప్రాంతాలకు అల్లర్లు వ్యాపించడంతో మూడు రోజులు మహారాష్ట్ర స్తంభించింది. భయపెట్టేందుకే ఈ అరెస్టులు: హక్కుల కార్యకర్తలు ఈ అరెస్టుల్ని దేశవ్యాప్తంగా పలువురు హక్కుల కార్యకర్తలు, రచయితలు, న్యాయవాదులు ఖండించారు. ‘నియంతృత్వ శక్తుల కోరలు ఇప్పుడు విశాలంగా తెరచుకున్నాయి’అని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశారు. ఈ అరెస్టులు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని, హక్కులపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిని వేధిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ స్పందిస్తూ.. ఇది పూర్తిగా భయపెట్టే చర్య అని.. స్వేచ్ఛా గొంతుక వినిపించే వారిపై వేధింపుల్ని అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ‘ప్రజా మద్దతు కోల్పోతున్నామని ప్రభుత్వం భయపడుతోంది. ఆ భయానికి సంకేతాలే ఈ అరెస్టులు. అర్థంలేని ఆరోపణలతో న్యాయవాదులు, కవులు, రచయితలు, దళిత హక్కుల కార్యకర్తలు, మేథావుల్ని అరెస్టు చేస్తున్నారు’అని ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ విమర్శించారు. -
ఆత్మ విశ్వాసమే.. వారి గెలుపు గీతం
ఆత్మ విశ్వాసమే పెట్టుబడిగా ముందుకు సాగుతూ కళా, సాంకేతిక, వ్యాపారం వంటి వివిధ రంగాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకుని, మహిళా లోకానికి ఆదర్శంగా నిలుస్తోన్న మణిహారికలు ఈ అతివలు. సుధా మూర్తి, రచయిత్రి పొదుపు చేయటంలో మహిళలు దిట్ట అంటారు. అలా ఒకానొక నాడు సుధా మూర్తి పొదుపు చేసిన 10 వేల రూపాయలు ఆమె భర్త స్థాపించిన ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ పెట్టుబడిగా ఉపయోగపడ్డాయి. 1974లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి కంప్యూటర్ సైన్స్ విభాగంలో పట్టా పొందిన మొదటి మహిళా ఇంజనీర్గగా చరిత్రకెక్కారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ స్థాపించి ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాల పంపిణీ, పేద విద్యార్థుల విద్యకై నిధులు వెచ్చించడం వంటి పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. రచయిత్రిగా గుర్తింపు పొందారు. 13 పుస్తకాలు రచించారు. వాటిలో రెండు ఆంగ్ల రచనలు కూడా ఉన్నాయి. రోహిణి నీలేకని, సామాజిక కార్యకర్త భారత వ్యాపారవేత్త నందన్ నీలేకని భార్య. సామాజిక కార్యకర్త. జర్నలిస్టుగా కూడా పనిచేశారు. అక్షర ఫౌండేషన్ ద్వారా సుమారు లక్ష మంది పిల్లలకు సాయం అందిస్తున్నారు. నిరాండంబర జీవితాన్ని గడపడానికే ఇష్టపడతారు. ఫరాఖాన్, కొరియోగ్రాఫర్ బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఫరాఖాన్. కొరియోగ్రాఫర్‌గా, యాడ్ ఫిల్మ్ మేకర్‌గా, పలు టీవీ షోల నిర్వహణకర్తగా ప్రాచుర్యం పొందిన ఫరాఖాన్ తన అభిమాన హీరో షారూఖ్ ఖాన్ ‘మై హూ నా’ సినిమాతో దర్శకురాలిగా మారారు. ఓం శాంతి ఓం వంటి పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. లీలా శాంసన్, నృత్యకారిణి తొమ్మిదేళ్ల ప్రాయంలోనే కళాక్షేత్రంలో అడుగుపెట్టి, దివ్యఙ్ఞాన పాఠశాలలో చేరిన తర్వాత కళనే ఊపిరిగా భావించారు. భరతనాట్యం సాధన చేసి, కళాక్షేత్రంలో తన వంటి ఎందరో నృత్యకారులను తయారు చేసేందుకు నాట్య పాఠాలు నేర్పుతున్నారు. ఆశా భోస్లే, గాయని ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ సోదరిగానే కాకుండా మధురమైన గాత్రంతో అందరినీ అలరించే గాయనిగా అభిమానుల్ని సంపాదించుకున్నారు ఆశా భోస్లే. సుమారు ఆరు దశాబ్దాలుగా తన పాటల ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. సినిమా పాటలే కాకుండా, సంప్రదాయ సంగీతంతో పాటు గజల్స్, భజనలు, కవ్వాలీలు ఆలపిస్తారు. హిందీలోనే కాకుండా మరెన్నో ఇతర భాషల్లో పాటలు పాడారు. సంగీత ప్రపంచంలో అత్యధిక పాటలు రికార్డు చేయబడిన సింగర్‌గా ‘గిన్నిస్ బుక్ రికార్డు’ సాధించారు. మల్లికా శ్రీనివాసన్, వ్యాపారవేత్త భారతదేశంలో రెండో అతిపెద్ద ట్రాక్టర్ల తయారీ కంపెనీ ‘టాఫె’ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. టీవీఎస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ భార్యగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. టాఫెలో జనరల్ మేనేజర్‌గా చేరి 86 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీ బాధ్యతలు చేపట్టి 2600 కోట్లకు చేర్చారు. రూపా పురుషోత్తమన్, ఆర్థిక నిపుణురాలు ప్రతిష్టాత్మక ‘యేల్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్’ నుంచి పట్టా పొందారు. ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడి యాజమాన్య సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. బ్రిక్స్ దేశాల ఎకానమి ప్రశంసా పత్రాల సహరచయితగా వ్యవహరించారు. న్యూయార్క్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చి ప్రస్తుతం ముంబైలోని ఆర్థిక సంస్థ పాంటాలూన్ రీటైల్లో పనిచేస్తున్నారు. ఆమె భర్త న్యూయార్క్ సిటీ ఎడుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ఏక్తా కపూర్, ప్రొడ్యూసర్ సినీ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు ఏక్తా కపూర్. బాలాజీ టెలీఫిల్మ్స్ అధినేతగా, సినీ నిర్మాతగా ఎన్నో విజయవంతమైన సీరియళ్లు, సినిమాలు నిర్మించారు. బోల్డ్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ‘నేను ఇంట్లోనూ పని చేస్తాను.. పనిచేసే ప్రదేశం కూడా నాకు ఇల్లు వంటిదే’ అంటూ వృత్తి పట్ల తన నిబద్ధతను తెలియజేశారు. ప్రేమ ధన్‌రాజ్ ఎనిమిదేళ్ల ప్రాయంలో కాలిన గాయాలతో సీఎమ్సీ వెల్లూర్ ఆస్పత్రికి చేరారు ప్రేమ ధన్‌రాజ్. తల్లి కోరిక మేరకు వైద్య విద్యనభ్యసించి, నేడు అదే ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జరీ వైద్య విభాగానికి ప్రధాన అధికారిగా వ్యవహరిస్తున్నారు. బర్న్ విక్టిమ్స్(కాలిన గాయాలతో బాధపడేవారు ) కోసం పలు అంతర్జాతీయ సంస్థలు నిర్వహిస్తున్న అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆమె దేవున్ని నమ్ముతారు. ప్రతీ ఆదివారం చర్చ్‌కి వెళ్తారు. రోజుకు 18 గంటలు పనిచేస్తారు.‘ఒకరితో ఎప్పుడు పోల్చుకోకు. ఏ సత్యాన్రైనా ధైర్యంగా స్వీకరించి, జీవితంలో ముందుకు సాగు’అనేది ఆమె పాటించే జీవన సత్యం. షాయెస్తా అంబర్ అఖిల భారత ముస్లిం మహిళా వ్యక్తిగత లా బోర్డు స్థాపించి సంస్కరణలు తీసుకువచ్చేందుకు పాటుపడ్డారు. ఖురాన్ పేరిట ముస్లిం మహిళల పట్ల వివక్ష చూపిస్తున్న మౌల్వీల వ్యవహార శైలిని ప్రశ్నించారు. ఈ కారణంగా ఆమె మతపెద్దల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది. లక్నో యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందారు. ఉర్దూ- పర్షియన్ సాహిత్యంలో ఆమెకు ప్రావీణ్యం ఉంది. లక్నో పరిసర గ్రామాల్లో ‘గాడ్‌మదర్’గా పేరు పొందారు. ‘ఒక ముస్లిం మహిళగా నా భర్త ఆదేశాలు తప్పనిసరిగా ఆచరించాల్సిందే. కానీ నేను చేసే ప్రతీ పనికి ఆయన సహకారం ఉంటుందని’ పేర్కొన్నారు. సోనియా మన్చంద్ర, డిజైనర్ పాంటాలూన్, న్రిత్యగ్రామ్ వంటి ప్రముఖ కంపెనీలకు డిజైన్లు రూపొందిస్తున్నారు. 35 మందితో ప్రారంభమైన ఆమె ‘ఎ న్యూ ఇడియమ్’ నేడు 125 మందికి చేరి భారత్‌లో అతిపెద్ద డిజైనర్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. ‘కంపెనీ ప్రారంభించిన మొదట్లో డిజైన్లు చూపించేందుకు హోటల్‌కి రావాల్సిందిగా ఒక కస్టమర్ కోరారు. తీరా అక్కడికి వెళ్లాక నా పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ’ ఆమె ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని పంచుకున్నారు. లక్ష్మీ పురి, దౌత్యవేత్త జెనీవాలోని ఐక్యరాజ్య సమితి వాణిజ్యాభివృద్ధి సంస్థకు భారత దౌత్యవేత్తగా వ్యవహరించారు. వాణిజ్య రంగంలో భారత్ అభివృద్ధికై తన వంతు కృషి చేశారు. పరిపూర్ణమైన, శాంతయుతమైన, భద్రత కలిగిన ప్రపంచ రూపకల్పనకై కృషి చేసినందుకు ఐక్యరాజ్య సమితి అందించే ‘పవర్ ఆఫ్ వన్ అవార్డు’ అందుకున్నారు. మంజులా రావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ‘బెస్ట్ బేకరీ కేసు’ (2002లో వడోదరలో జరిగిన అల్లర్లలో 14 మంది మరణించారు) కోసం ప్రత్యేక న్యాయవాదిగా నియమితులైన సమయంలో కేసు గురించి పూర్తి అవగాహన పెంచుకునేందుకు గుజరాతీ నేర్చుకుని మరీ వాదించారు. వృత్తి పట్ల ఆమె నిబద్ధతకు ఇది నిదర్శనం. ప్రముఖ మాజీ క్రికెటర్ సీకె నాయుడు మనుమరాలు. బాంబే వాలీబాల్, బాడ్మింటన్ జట్లకు ప్రాతినిథ్యం వహించారు. మీనాక్షీ చౌదరి, ఊర్వశి గులాటి, కేశ్నీ ఆనంద్ అరోరా(ఐఏఎస్ అధికారిణిలు) ఈ ముగ్గురు సోదరీమణులే ఒకప్పుడు పరోక్షంగా హర్యానా ప్రభుత్వాన్ని నడిపించారు. ఎలాగంటే.. చౌదరి హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, గులాటి వైద్య, విద్య కార్యదర్శిగా, అరోరా హోం ప్రత్యేక కారదర్శిగా పనిచేశారు. పంజాబ్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కూతుళ్లైన వీరు ముగ్గురు పనిచేసే చోట తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. సిస్టర్ సుధా వర్గిస్, సామాజిక కార్యకర్త పేదరికం వల్ల ఎలుకలనే ఆహారంగా తీసుకునే ‘ముసహర్ల’(బీహార్‌లోని ఎస్సీ వర్గం) ఉద్ధరణకై కేరళ నుంచి బీహార్‌కు వెళ్లారు. వివిధ కేసుల నుంచి వారిని విముక్తి చేసేందుకు న్యాయ విద్యనభ్యసించారు. ఆమె సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. రష్మీ సింగ్, నేవీ అధికారిణి భారత్‌లో మొదటి మహిళా స్కైడైవింగ్ శిక్షకురాలు. 400 సార్లు ఆకాశంలో చక్కర్లు కొట్టిన ఆమె, యుద్ధ నౌక ఐఎన్ఎస్ విరాట్ సముద్రంలో ఉండగానే డైవింగ్ చేస్తూ డెక్‌పై ల్యాండ్ అయ్యారు. వైజాగ్‌లోని నౌకాదళ ఎయిర్‌బేస్‌లో ట్రాఫిక్ కంట్రోల్ ఆఫీసర్‌గా పనిచేశారు. రుత్ మనోరమ, హక్కుల పరిరక్షణకర్త జాతీయ మహిళా కూటమి అధ్యక్షురాలిగా పనిచేశారు. దళితుల సమస్యల పరిష్కారానికై పోరాడారు. దళితుల్లో దళితులుగా పరిగణింపబడుతున్న దళిత మహిళల హక్కులకై కృషి చేశారు. అషూ సూయశ్, ఆర్థిక నిపుణురాలు సిటీగ్రూప్ సంస్థలో చాలా ఏళ్లు సీఏగా పనిచేసిన తర్వాత, ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ మ్యూచ్‌వల్ ఫండ్ సంస్థను బోస్టన్‌లో ప్రారంభించారు. దేశీయంగా 3600 కోట్ల టర్నోవర్, అంతర్జాతీయంగా 250 బిలియన్ డాలర్ల టర్నోవర్‌తో కంపెనీని అభివృద్ధి పథంలో నడిస్తున్నారు. భారత పెట్టుబడి రంగంలోని మహిళలకు ఆదర్శంగా నిలిచారు. అనురాధా పాల్, తబలా వాయిద్యకారిణి పురుషులు మాత్రమే తబలా వాయిద్యకారులుగా ఉన్న సమయంలో మహిళా వాయిద్యకారిణిగా తనకంటూ ప్రత్యేక ఒరవడిని సృష్టించుకున్నారు. ఆంగ్ల సాహిత్యంలో పీజీ చేశారు. ఆల్ ఉమన్ పర్కుషన్ బ్యాండ్, స్త్రీ శక్తిని స్థాపించారు. అన్ని రకాల సంగీతాన్ని ప్రోత్సహించేందుకు కృషి చేశారు. లతికా ఖనేజా, స్పోర్ట్స్ మేనేజర్ ప్రముఖ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, ఒలంపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రాలకు స్పోర్ట్స్ మేనేజర్‌గా వ్యవహరించారు. ఐఐఎమ్ కలకత్తా నుంచి పట్టభద్రురాలైన లతిక వ్యాపార ఒప్పందాలు కుదర్చటంలో దిట్ట. అనితా నాయర్, రచయిత్రి కేరళకు చెందిన ప్రముఖ భారతీయ ఆంగ్ల రచయిత్రి. సాహిత్య రంగంలో ఆమె కృషికి గుర్తింపుగా 2012లో కేరళ సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. ఆమె రచనలు విదేశీ భాషల్లో కూడా ప్రచురితమయ్యాయి. ప్రియాదత్, రాజకీయ వేత్త బాలీవుడ్ దంపతులు సునీల్‌దత్, నర్గీస్‌ల కుమార్తెగా, సంజయ్‌దత్ సోదరిగా సుపరిచితమైన ప్రియాదత్ రాజకీయవేత్త కూడా. 2005లో తండ్రి మరణానంతరం ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు ముంబై నార్త్ వెస్ట్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేసి ఎంపీగా గెలుపొందారు. గర్భవతిగా ఉన్న సమయంలో కూడా ప్రచారం నిర్వహించి, కార్యక్షేత్రంలో మహిళలు ఎంతటి కష్టనష్టాలకైనా వెరవరని నిరూపించారు. పద్మా రవిచందర్, ఐటీ నిపుణురాలు భారత సాంకేతిక రంగంలో శక్తిమంతమైన మహిళగా పద్మా రవిచందర్ పేరు పొందారు. బహుళజాతి కంపెనీ ‘పెరోట్ సిస్టమ్’ను ఒంటిచేత్తో నడిపిస్తూ తన కౌశల్యాన్ని నిరూపించుకున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని టెక్నోట్రీ సంస్థకు సీఈఓగా ఉన్నారు. రూపా గంగూలీ, నటి మహాభారతం సీరియల్లో ద్రౌపదిగా నటించి ప్రేక్షకుల దృష్టిని తనవైపునకు మరల్చుకున్నారు ఈ బెంగాలీ నటి. తూర్పు భారతదేశంలో ఉన్న అతికొద్ది మంది మహిళా నిర్మాతల్లో ఒకరు. వృద్ధులు, అనాథలను చేరదీసే ఎన్జీవోకి మార్గదర్శకురాలిగా వ్యవహరిస్తున్నారు. బెలిందా రైట్, వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ కలకత్తాలో జన్మించిన బెలిందా నేషనల్ జియోగ్రఫిక్ ఫోటోగ్రాఫర్‌గా, ‘లాండ్ ఆఫ్ టైగర్’ సినిమాకు బెస్ట్ ఫిల్మ్ మేకర్‌గా ఎన్నో అవార్డులు పొందారు. పులుల సంరక్షణకై ఆమె ఎంతగానో కృషి చేశారు. ‘వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా’ను స్థాపించారు. వినీతా బాలి, వ్యాపారవేత్త భారతీయ మహిళా వ్యాపారవేత్త. ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్(బీవరేజెస్, ప్యాకేజ్డ్ ఫుడ్స్) వ్యాపారంలో ప్రవేశించి అనతికాలంలోనే విజయవంతమయ్యారు. బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. - సుష్మారెడ్డి యాళ్ళ -
‘లక్ష్మీబాంబ్’ కాల్చొద్దు.. ఇది మనకు అవమానం
సాక్షి, భోపాల్: హిందూ దేవుళ్ల చిత్రాలున్న పటాసులు కాల్చి మన దేవుళ్లను అవమానించవద్దని మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్తలు పిలుపునిస్తున్నారు. ఈ దీపావళికి ఫైర్ క్రాకర్స్ కాల్చకుండా పర్యావరణాన్ని రక్షిద్దామని ప్రజలను కోరుతున్నారు. లక్ష్మీబాంబ్, గణేష్ చక్రా వంటి బాంబులు కాల్చడంతో మన దేవుళ్ల చిత్రాలను మనమే కాల్చివేసినట్లవుతుందని, మరుసటి రోజు దేవుళ్ల చిత్రాలు ముక్కలు, ముక్కలుగా రొడ్లపై చిందరవందరగా పడుంటాయన్నారు. ఇది మన దేవుళ్లకు, మనకు అవమానకరమని చంద్రశేఖర్ తివారీ అనే హిందూ సామాజిక కార్యకర్త అన్నారు. దీనికోసం 6,500 మందితో ఓ గ్రూప్‌ను రూపోందించి దేవుళ్ల చిత్రాలతో ఉన్న పటాసులు కొనవద్దని అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. అయితే ఈ విషయంపై మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని భోపాల్ ఫైర్ క్రాకర్స్ అసోసియేషన్ తెలిపింది. ఫైర్ క్రాకర్స్ సరుకు ఎక్కువగా తమిళనాడు నుంచి వస్తుందని, హిందూ దేవుళ్ల చిత్రాలతో కూడిన పటాసులు రాలేదన్నారు. -
సామాజిక ఉద్యమకారుల స్ఫూర్తి
ఆచార్య కొలకలూరి ఇనాక్ తెనాలి: సమాజాన్ని మార్చిన మేధావుల స్ఫూర్తిగా సామాజిక, సాంస్కృతిక అంశాల్లోని సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని సాహితీవేత్త, ప్రతిష్టాత్మక మూర్తిదేవి అవార్డుకు ఎంపికైన ఆచార్య కొలకలూరి ఇనాక్ సూచించారు. సామాజిక పరివర్తన కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఇక్కడి పెన్షనర్స్ అసోసియేషన్ హాలులో ‘సామాజిక పరివర్తనలో సెప్టెంబర్’ సదస్సు నిర్వహించారు. ఇనాక్ మాట్లాడుతూ.. తొలిసారిగా సత్యశోధక్ సమాజ్ స్థాపనతో సామాజిక ఉద్యమానికి జ్యోతిబా పూలే సెప్టెంబరు 24న నాంది పలికారని గుర్తుచేశారు. అట్టడుగువర్గాల అభ్యున్నతిని ఆశించిన మహాకవి గుర్రం జాషువా, కుసుమ ధర్మన్నకవి, డాక్టర్ బోయి భీమన్న జయంతి ఇదే నెలలోనేనని చెప్పారు. అంబేడ్కర్ కృషితో పూనా ఒడంబడిక, రిజర్వేషన్ల సాధన వంటి అనేక సంఘటనలు సెప్టెంబరు 24నే జరిగాయని వివరించారు. కేంద్రం అధ్యక్షుడు అంబటి అనిల్‌కుమార్ అధ్యక్షత వహించిన సదస్సులో రచయిత్రి గుజ్జర్లమూడి స్వరూపరాణి, వివిధ సంస్థలు, ఉద్యోగ, సాంస్కృతిక సంఘాల నేతలు మాతంగి దిలీప్‌కుమార్, వున్నవ వినయ్‌కుమార్, ఎస్.ఎస్.ఎస్ సుకుమార్, ఎస్.ఎం.ప్రకాష్‌కుమార్ ప్రసంగించారు. -
‘ఫూలింగ్’ ప్రభుత్వంపై పోరు
ఎన్ఏపీఎం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్.. రైతుల్లో అవగాహన పెంపొందించాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: భూ సమీకరణ ప్రక్రియ యావత్తూ అపసవ్యంగా కొనసాగిస్తూ రైతుల్ని ‘ఫూలింగ్’ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ సర్కారుపై న్యాయపోరాటం చేస్తామని, రైతుల ప్రయోజనాల్ని పూర్తిగా పరిరక్షిస్తామని పలు రాష్ట్రాలకు చెందిన సామాజిక కార్యకర్తలు, పౌరహక్కుల నేతలు స్పష్టం చేశారు. పదివేల మంది సిబ్బందితో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ భూ సమీకరణ చేపట్టడంపై వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నూతన రాజధాని నిర్మాణానికి తాము ఎంత మాత్రం వ్యతిరేకం కాదని, ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలపైనే తమ పోరాటమని పేర్కొన్నారు. దేశంలో ఎందరో మేధావులు ఉండగా రాజధాని నిర్మాణంలో వారి సేవలు వినియోగించుకోకుండా సింగపూర్‌ను ఆశ్రయించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఫ్యాప్సీ భవనంలో ఏపీ గ్రీన్‌ఫీల్డ్ రాజధానిపై ‘నేషనల్ అలయెన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్’ (ఎన్ఏపీఎం) సంస్థ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సామాజిక కార్యకర్త భూపతిరాజు రామకృష్ణరాజు అధ్యక్షత వహించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చి సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయాలని సమావేశంలో పలువురు వక్తలు సూచించారు. ఇది ఒక్క తుళ్లూరు ప్రాంతానికి సంబంధించిన అంశంగా చూడకుండా 13 జిల్లాల్లోనూ ప్రచార, కళాజాతల ద్వారా సర్కారు అనుసరిస్తున్న విధానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. జూబ్లీహిల్స్ ఇంటి రేటు ఎంత పెరిగిందో చెప్పాలి ప్రస్తుతం తుళ్ళూరు ప్రాంతంలో ఎకరా రూ.2.5 కోట్లుందని, పదేళ్ళ తర్వాత రూ.10 కోట్లకు చేరుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడాన్ని ప్రస్తావిస్తూ.. భూముల రేట్లు అప్పుడు అంత పలుకుతాయని ప్రభుత్వం నుంచి రైతులు లిఖిత పూర్వకంగా అఫిడవిట్లు కోరాలన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు జూబ్లీహిల్స్‌లో తన ఇల్లు రేటు పదేళ్ళలో ఎంత పెరిగిందో రైతులకు చెప్పాలన్నారు. చంద్రబాబు ఆస్తుల ప్రకటన సమయంలో జూబ్లీహిల్స్‌లో తన స్థలం రేటు ప్రకటించినప్పుడు అంత అసహజమైన పెరుగుదల కనిపించకపోవడాన్ని పౌరహక్కుల నేతలు గుర్తు చేశారు. ప్రభుత్వం రూపొందించిన సీఆర్డీఏ చట్టాన్ని ప్రభుత్వమే అతిక్రమిస్తోందని రిటైర్డ్ ఐఏఎస్, ఉద్యమకారుడు ఎంజీ దేవసహాయం తెలిపారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణానికి సింగపూర్ దేశం మాస్టర్ ప్లాన్‌ను రూపొందించడం తెలుగు జాతిని అవమానించడమేనన్నారు. రాజధాని నిర్మాణానికి ఇంత విస్తీర్ణంలో భూములు తీసుకోవడం వెనుక ఉన్న ఆంతర్యం బయటపెట్టాలన్నారు. మరో మూసీగా కృష్ణా: విశ్రాంత న్యాయమూర్తి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో రైతుల సంక్షేమానికి వ్యతిరేకంగా రెండు పత్రికలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయని, వాస్తవాలు వెలుగులోకొచ్చే పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. నది పక్కనే రాజధాని నిర్మాణంతో కృష్ణా మరో మూసీలా మారనుందన్నారు. సింగపూర్ తరహాలో రాజధాని నిర్ణయమంటున్నారంటే అందులో సామాన్యులకు అవకాశం లేనట్టేనని మాజీ సీఈసీ జేఎం లింగ్డో చెప్పారు. 2013 లో ఆమోదం పొందిన చట్టం ద్వారా భూముల సేకరణ సాధ్యం కాదన్న ఉద్దేశంతోనే ఏపీ ప్రభుత్వం భూ సమీకరణకు దిగిందని విమర్శించారు. యుద్ధ ప్రాతిపదికన కోర్టులను ఆశ్రయించాలని మాజీ డీజీపీ సి.ఆంజనేయరెడ్డి అన్నారు. రిటైర్డ్ ఐఏఎస్‌లు కేబీ సక్సేనా, హర్షమందర్, తమిళనాడుకు చెందిన పౌరహక్కుల నేత సురేష్, ఆర్కిటెక్ట్ శేఖర్, పర్యావరణ వేత్త సాగర్ధారా, మాజీ ఐజీ, న్యాయవాది హనుమంతరెడ్డి, హైకోర్టు న్యాయవాది జగన్మోహన్రెడ్డిలు మాట్లాడారు. రాజధాని ప్రాంతానికి చెందిన శేషగిరిరావు, అనుమోలు గాంధీలు తమ అనుభవాలు వివరించారు. సమావేశానంతరం వక్తలు మీడియాతో మాట్లాడారు. భూ సమీకరణకు ఇష్టపడని రైతులకు మద్దతుగా త్వరలో పాదయాత్ర చేయడానికి నిర్ణయించినట్టు తెలిపారు. ఆయా గ్రామాల్లో పలుచోట్ల న్యాయ సలహా కేంద్రాల ఏర్పాటును ప్రతిపాదించారు. రాజధాని గ్రామాల రైతులతో ఒక కమిటీ, కౌలుదారులు, కూలీలతో మరొక కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వ అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానించారు. రైతుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో లక్ష బుక్లెట్ల పంపిణీ చేస్తామని వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి ప్రకటించారు.