ఆత్మ విశ్వాసమే.. వారి గెలుపు గీతం | leading ladies of India | Sakshi
Sakshi News home page

ఆత్మ విశ్వాసమే.. వారి గెలుపు గీతం

Published Tue, Feb 27 2018 2:09 AM | Last Updated on Tue, Feb 27 2018 4:09 AM

leading ladies of India - Sakshi

ఆత్మ విశ్వాసమే పెట్టుబడిగా ముందుకు సాగుతూ కళా, సాంకేతిక, వ్యాపారం వంటి వివిధ రంగాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకుని, మహిళా లోకానికి ఆదర్శంగా నిలుస్తోన్న మణిహారికలు ఈ అతివలు. 

సుధా మూర్తి, రచయిత్రి
పొదుపు చేయటంలో మహిళలు దిట్ట అంటారు. అలా ఒకానొక నాడు సుధా మూర్తి పొదుపు చేసిన 10 వేల రూపాయలు ఆమె భర్త స్థాపించిన ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ పెట్టుబడిగా ఉపయోగపడ్డాయి. 1974లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో పట్టా పొందిన మొదటి మహిళా ఇంజనీర్‌గగా చరిత్రకెక్కారు. ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ స్థాపించి ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాల పంపిణీ, పేద విద్యార్థుల విద్యకై నిధులు వెచ్చించడం వంటి పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. రచయిత్రిగా గుర్తింపు పొందారు. 13 పుస్తకాలు రచించారు. వాటిలో రెండు ఆంగ్ల రచనలు కూడా ఉన్నాయి.

రోహిణి నీలేకని, సామాజిక కార్యకర్త 
భారత వ్యాపారవేత్త నందన్‌ నీలేకని భార్య. సామాజిక కార్యకర్త. జర్నలిస్టుగా కూడా పనిచేశారు. అక్షర ఫౌండేషన్‌ ద్వారా సుమారు లక్ష మంది పిల్లలకు సాయం అందిస్తున్నారు. నిరాండంబర జీవితాన్ని గడపడానికే ఇష్టపడతారు. 

ఫరాఖాన్‌, కొరియోగ్రాఫర్‌
బాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఫరాఖాన్‌. కొరియోగ్రాఫర్‌గా, యాడ్‌ ఫిల్మ్‌ మేకర్‌గా, పలు టీవీ షోల నిర్వహణకర్తగా ప్రాచుర్యం పొందిన ఫరాఖాన్‌ తన అభిమాన హీరో షారూఖ్‌ ఖాన్‌ ‘మై హూ నా’ సినిమాతో దర్శకురాలిగా మారారు. ఓం శాంతి ఓం వంటి పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. 

లీలా శాంసన్‌, నృత్యకారిణి
తొమ్మిదేళ్ల ప్రాయంలోనే కళాక్షేత్రంలో అడుగుపెట్టి, దివ్యఙ్ఞాన పాఠశాలలో చేరిన తర్వాత కళనే ఊపిరిగా భావించారు. భరతనాట్యం సాధన చేసి, కళాక్షేత్రంలో తన వంటి ఎందరో నృత్యకారులను తయారు చేసేందుకు నాట్య పాఠాలు నేర్పుతున్నారు.

ఆశా భోస్లే, గాయని
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్‌ సోదరిగానే కాకుండా మధురమైన గాత్రంతో అందరినీ అలరించే గాయనిగా అభిమానుల్ని సంపాదించుకున్నారు ఆశా భోస్లే. సుమారు ఆరు దశాబ్దాలుగా తన పాటల ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. సినిమా పాటలే కాకుండా, సంప్రదాయ సంగీతంతో పాటు గజల్స్‌, భజనలు, కవ్వాలీలు ఆలపిస్తారు. హిందీలోనే కాకుండా మరెన్నో ఇతర భాషల్లో పాటలు పాడారు. సంగీత ప్రపంచంలో అత్యధిక పాటలు రికార్డు చేయబడిన సింగర్‌గా ‘గిన్నిస్‌ బుక్‌ రికార్డు’ సాధించారు.

మల్లికా శ్రీనివాసన్‌, వ్యాపారవేత్త
భారతదేశంలో రెండో అతిపెద్ద ట్రాక్టర్ల తయారీ కంపెనీ ‘టాఫె’ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. టీవీఎస్‌ చైర్మన్‌ వేణు శ్రీనివాసన్‌ భార్యగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. టాఫెలో జనరల్‌ మేనేజర్‌గా చేరి 86 కోట్ల టర్నోవర్‌ ఉన్న కంపెనీ బాధ్యతలు చేపట్టి 2600 కోట్లకు చేర్చారు.


రూపా పురుషోత్తమన్‌, ఆర్థిక నిపుణురాలు
ప్రతిష్టాత్మక ‘యేల్‌ లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌’ నుంచి పట్టా పొందారు. ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడి యాజమాన్య సంస్థ గోల్డ్‌మన్‌ సాచ్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. బ్రిక్స్‌ దేశాల ఎకానమి ప్రశంసా పత్రాల సహరచయితగా వ్యవహరించారు. న్యూయార్క్‌ నుంచి ఇండియాకు తిరిగి వచ్చి ప్రస్తుతం ముంబైలోని ఆర్థిక సంస్థ పాంటాలూన్‌ రీటైల్‌లో పనిచేస్తున్నారు. ఆమె భర్త న్యూయార్క్‌ సిటీ ఎడుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నారు. 

ఏక్తా కపూర్‌, ప్రొడ్యూసర్‌
సినీ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు ఏక్తా కపూర్‌. బాలాజీ టెలీఫిల్మ్స్‌ అధినేతగా, సినీ నిర్మాతగా ఎన్నో విజయవంతమైన సీరియళ్లు, సినిమాలు నిర్మించారు. బోల్డ్‌ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ‘నేను ఇంట్లోనూ పని చేస్తాను.. పనిచేసే ప్రదేశం కూడా నాకు ఇల్లు వంటిదే’ అంటూ వృత్తి పట్ల తన నిబద్ధతను తెలియజేశారు.

ప్రేమ ధన్‌రాజ్‌
ఎనిమిదేళ్ల ప్రాయంలో కాలిన గాయాలతో సీఎమ్‌సీ వెల్లూర్‌ ఆస్పత్రికి చేరారు ప్రేమ ధన్‌రాజ్‌.  తల్లి కోరిక మేరకు వైద్య విద్యనభ్యసించి, నేడు అదే ఆసుపత్రిలో ప్లాస్టిక్‌ సర్జరీ వైద్య విభాగానికి ప్రధాన అధికారిగా వ్యవహరిస్తున్నారు. బర్న్‌ విక్టిమ్స్‌(కాలిన గాయాలతో బాధపడేవారు ) కోసం పలు అంతర్జాతీయ సంస్థలు నిర్వహిస్తున్న అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆమె దేవున్ని నమ్ముతారు. ప్రతీ ఆదివారం చర్చ్‌కి వెళ్తారు. రోజుకు 18 గంటలు పనిచేస్తారు.‘ఒకరితో ఎప్పుడు పోల్చుకోకు. ఏ సత్యాన్రైనా ధైర్యంగా స్వీకరించి, జీవితంలో ముందుకు సాగు’అనేది ఆమె పాటించే జీవన సత్యం.

షాయెస్తా అంబర్‌
అఖిల భారత ముస్లిం మహిళా వ్యక్తిగత లా బోర్డు స్థాపించి సంస్కరణలు తీసుకువచ్చేందుకు పాటుపడ్డారు. ఖురాన్‌ పేరిట ముస్లిం మహిళల పట్ల వివక్ష చూపిస్తున్న మౌల్వీల వ్యవహార శైలిని ప్రశ్నించారు. ఈ కారణంగా ఆమె మతపెద్దల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది. లక్నో యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందారు. ఉర్దూ- పర్షియన్‌ సాహిత్యంలో ఆమెకు ప్రావీణ్యం ఉంది. లక్నో పరిసర గ్రామాల్లో ‘గాడ్‌మదర్‌’గా పేరు పొందారు. ‘ఒక ముస్లిం మహిళగా నా భర్త ఆదేశాలు తప్పనిసరిగా ఆచరించాల్సిందే. కానీ నేను చేసే ప్రతీ పనికి ఆయన సహకారం ఉంటుందని’ పేర్కొన్నారు.

సోనియా మన్‌చంద్ర, డిజైనర్‌
పాంటాలూన్‌, న్రిత్యగ్రామ్‌ వంటి ప్రముఖ కంపెనీలకు డిజైన్లు రూపొందిస్తున్నారు. 35 మందితో ప్రారంభమైన ఆమె ‘ఎ న్యూ ఇడియమ్‌’ నేడు 125 మందికి చేరి భారత్‌లో అతిపెద్ద డిజైనర్‌ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. ‘కంపెనీ ప్రారంభించిన మొదట్లో డిజైన్లు చూపించేందుకు హోటల్‌కి రావాల్సిందిగా ఒక కస్టమర్‌ కోరారు. తీరా అక్కడికి వెళ్లాక నా పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ’ ఆమె ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని పంచుకున్నారు.

లక్ష్మీ పురి, దౌత్యవేత్త
జెనీవాలోని ఐక్యరాజ్య సమితి వాణిజ్యాభివృద్ధి సంస్థకు భారత దౌత్యవేత్తగా వ్యవహరించారు. వాణిజ్య రంగంలో భారత్‌ అభివృద్ధికై తన వంతు కృషి చేశారు. పరిపూర్ణమైన, శాంతయుతమైన, భద్రత కలిగిన ప్రపంచ రూపకల్పనకై కృషి చేసినందుకు ఐక్యరాజ్య సమితి అందించే ‘పవర్‌ ఆఫ్‌ వన్‌ అవార్డు’ అందుకున్నారు.


మంజులా రావు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌
‘బెస్ట్‌ బేకరీ కేసు’ (2002లో వడోదరలో జరిగిన అల్లర్లలో 14 మంది మరణించారు)  కోసం ప్రత్యేక న్యాయవాదిగా నియమితులైన సమయంలో కేసు గురించి పూర్తి అవగాహన పెంచుకునేందుకు గుజరాతీ నేర్చుకుని మరీ వాదించారు. వృత్తి పట్ల ఆమె నిబద్ధతకు ఇది నిదర్శనం. ప్రముఖ మాజీ క్రికెటర్‌ సీకె నాయుడు మనుమరాలు. బాంబే వాలీబాల్‌, బాడ్మింటన్‌ జట్లకు ప్రాతినిథ్యం వహించారు.

మీనాక్షీ చౌదరి, ఊర్వశి గులాటి, కేశ్నీ ఆనంద్‌ అరోరా(ఐఏఎస్‌ అధికారిణిలు)
ఈ ముగ్గురు సోదరీమణులే ఒకప్పుడు పరోక్షంగా హర్యానా ప్రభుత్వాన్ని నడిపించారు. ఎలాగంటే.. చౌదరి హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, గులాటి వైద్య, విద్య కార్యదర్శిగా, అరోరా హోం ప్రత్యేక కారదర్శిగా పనిచేశారు. పంజాబ్‌ యూనివర్సిటీ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ కూతుళ్లైన వీరు ముగ్గురు పనిచేసే చోట తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

సిస్టర్‌ సుధా వర్గిస్‌, సామాజిక కార్యకర్త
పేదరికం వల్ల ఎలుకలనే ఆహారంగా తీసుకునే ‘ముసహర్ల’(బీహార్‌లోని ఎస్సీ వర్గం) ఉద్ధరణకై కేరళ నుంచి బీహార్‌కు వెళ్లారు. వివిధ కేసుల నుంచి వారిని విముక్తి చేసేందుకు న్యాయ విద్యనభ్యసించారు. ఆమె సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

రష్మీ సింగ్‌, నేవీ అధికారిణి
భారత్‌లో మొదటి మహిళా స్కైడైవింగ్‌ శిక్షకురాలు. 400 సార్లు ఆకాశంలో చక్కర్లు కొట్టిన ఆమె, యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ విరాట్‌ సముద్రంలో ఉండగానే డైవింగ్‌ చేస్తూ డెక్‌పై ల్యాండ్‌ అయ్యారు. వైజాగ్‌లోని నౌకాదళ ఎయిర్‌బేస్‌లో ట్రాఫిక్‌ కంట్రోల్‌ ఆఫీసర్‌గా పనిచేశారు.

రుత్‌ మనోరమ, హక్కుల పరిరక్షణకర్త
జాతీయ మహిళా కూటమి అధ్యక్షురాలిగా పనిచేశారు. దళితుల సమస్యల పరిష్కారానికై పోరాడారు. దళితుల్లో దళితులుగా పరిగణింపబడుతున్న దళిత మహిళల హక్కులకై కృషి చేశారు.

అషూ సూయశ్‌, ఆర్థిక నిపుణురాలు
సిటీగ్రూప్‌ సంస్థలో చాలా ఏళ్లు సీఏగా పనిచేసిన తర్వాత, ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ మ్యూచ్‌వల్‌ ఫండ్‌ సంస్థను బోస్టన్‌లో ప్రారంభించారు. దేశీయంగా 3600 కోట్ల టర్నోవర్‌, అంతర్జాతీయంగా 250 బిలియన్‌ డాలర్ల టర్నోవర్‌తో కంపెనీని అభివృద్ధి పథంలో నడిస్తున్నారు. భారత పెట్టుబడి రంగంలోని మహిళలకు ఆదర్శంగా నిలిచారు.

అనురాధా పాల్‌, తబలా వాయిద్యకారిణి
పురుషులు మాత్రమే తబలా వాయిద్యకారులుగా ఉన్న సమయంలో మహిళా వాయిద్యకారిణిగా తనకంటూ ప్రత్యేక ఒరవడిని సృష్టించుకున్నారు. ఆంగ్ల సాహిత్యంలో పీజీ చేశారు. ఆల్‌ ఉమన్‌ పర్కుషన్‌ బ్యాండ్‌, స్త్రీ శక్తిని స్థాపించారు. అన్ని రకాల సంగీతాన్ని ప్రోత్సహించేందుకు కృషి చేశారు. 

లతికా ఖనేజా, స్పోర్ట్స్‌ మేనేజర్‌
ప్రముఖ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌, ఒలంపిక్‌ స్వర్ణ పతక విజేత అభినవ్‌ బింద్రాలకు స్పోర్ట్స్‌ మేనేజర్‌గా వ్యవహరించారు. ఐఐఎమ్‌ కలకత్తా నుంచి పట్టభద్రురాలైన లతిక వ్యాపార ఒప్పందాలు కుదర్చటంలో దిట్ట.

అనితా నాయర్‌, రచయిత్రి
కేరళకు చెందిన ప్రముఖ భారతీయ ఆంగ్ల రచయిత్రి. సాహిత్య రంగంలో ఆమె కృషికి గుర్తింపుగా 2012లో కేరళ సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. ఆమె రచనలు విదేశీ భాషల్లో కూడా ప్రచురితమయ్యాయి. 

ప్రియాదత్‌, రాజకీయ వేత్త
బాలీవుడ్‌ దంపతులు సునీల్‌దత్‌, నర్గీస్‌ల కుమార్తెగా, సంజయ్‌దత్‌ సోదరిగా సుపరిచితమైన ప్రియాదత్‌ రాజకీయవేత్త కూడా. 2005లో తండ్రి మరణానంతరం ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు ముంబై నార్త్‌ వెస్ట్‌ నుంచి కాంగ్రెస్‌ తరపున పోటీచేసి ఎంపీగా గెలుపొందారు. గర్భవతిగా ఉన్న సమయంలో కూడా ప్రచారం నిర్వహించి, కార్యక్షేత్రంలో మహిళలు ఎంతటి కష్టనష్టాలకైనా వెరవరని నిరూపించారు.

పద్మా రవిచందర్‌, ఐటీ నిపుణురాలు
భారత సాంకేతిక రంగంలో శక్తిమంతమైన మహిళగా పద్మా రవిచందర్‌ పేరు పొందారు. బహుళజాతి కంపెనీ ‘పెరోట్‌ సిస్టమ్‌’ను ఒంటిచేత్తో నడిపిస్తూ తన కౌశల్యాన్ని నిరూపించుకున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని  టెక్నోట్రీ సంస్థకు సీఈఓగా ఉన్నారు.
 

రూపా గంగూలీ, నటి
మహాభారతం సీరియల్‌లో ద్రౌపదిగా నటించి ప్రేక్షకుల దృష్టిని తనవైపునకు మరల్చుకున్నారు ఈ బెంగాలీ నటి. తూర్పు భారతదేశంలో ఉన్న అతికొద్ది మంది మహిళా నిర్మాతల్లో ఒకరు. వృద్ధులు, అనాథలను చేరదీసే ఎన్జీవోకి మార్గదర్శకురాలిగా వ్యవహరిస్తున్నారు. 

బెలిందా రైట్‌, వైల్డ్‌లైఫ్‌ ఫోటోగ్రాఫర్‌
కలకత్తాలో జన్మించిన బెలిందా నేషనల్‌ జియోగ్రఫిక్‌ ఫోటోగ్రాఫర్‌గా, ‘లాండ్‌ ఆఫ్‌ టైగర్‌’ సినిమాకు బెస్ట్‌ ఫిల్మ్‌ మేకర్‌గా ఎన్నో అవార్డులు పొందారు. పులుల సంరక్షణకై ఆమె ఎంతగానో కృషి చేశారు. ‘వైల్డ్‌ లైఫ్‌ ప్రొటెక్షన్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా’ను స్థాపించారు.

వినీతా బాలి, వ్యాపారవేత్త
భారతీయ మహిళా వ్యాపారవేత్త. ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌(బీవరేజెస్‌, ప్యాకేజ్‌డ్‌ ఫుడ్స్‌) వ్యాపారంలో ప్రవేశించి అనతికాలంలోనే విజయవంతమయ్యారు. బ్రిటానియా ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌కు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

- సుష్మారెడ్డి యాళ్ళ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement