యూకేలో చమురు తవ్వకాలకు అనుమతులు రద్దు చేయాలని ఆందోళన
రింగ్ రోడ్డుపై శాంతియుతంగా నిరసన చేపట్టిన సామాజిక కార్యకర్తలు
వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిందని, ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లిందని పోలీసుల అభియోగాలు
ఐదుగురికి జైలు శిక్ష విధిస్తూ లండన్ కోర్టు తీర్పు
భూమిపై వాతావరణ మార్పులు, కాలుష్యానికి కారణమవుతున్న శిలాజ ఇంధనాల తవ్వకానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నాలుగు రోజులపాటు శాంతియుతంగా నిరసన తెలిపిన నలుగురు సామాజిక కార్యకర్తలకు నాలుగేళ్ల చొప్పున జైలుశిక్ష పడింది. మరో కార్యకర్తకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. పురాతన ప్రజాస్వామ్య దేశమని చెప్పుకొనే యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)లో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
కోర్టు తీర్పును ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు తప్పుపడుతున్నారు. యూకేలోని ఉత్తర సముద్రంలో చమురు తవ్వకాలకు 2022లో అప్పటి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. లైసెన్స్‌లు ఇచ్చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2022 నవంబర్‌లో ‘జస్ట్ స్టాప్ ఆయిల్’అనే నినాదంతో సామాజిక కార్యకర్తలు నిరసన బాటపట్టారు. అనుమతులు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నిరసన కార్యక్రమాలను 22 ఏళ్ల గ్రెస్సీ గెథిన్ అనే యువతి ముందుండి నడిపించింది. ఈ ఉద్యమం పలువురిని ఆకర్శించడంతో వారు ఇందులో భాగస్వాములయ్యారు. భూగోళాన్ని కలుషితం చేసే చమురు తవ్వకాలు వద్దంటూ నినదించారు. లండన్ చుట్టూ ఉన్న మేజర్ రింగ్ రోడ్డుపై నాలుగు రోజులపాటు నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శించారు. చెట్లు, భవనాలపైకి ఎక్కి బిగ్గరగా నినాదాలు చేశారు. ఇదంతా పూర్తిగా శాంతియుతంగానే సాగింది. హింస అనే మాటే లేదు. ఆస్తులకు గానీ, ప్రజలకు గానీ ఎలాంటి నష్టం వాటిల్లలేదు.
లక్షల డాలర్ల నష్టం వాటిల్లిందట!
రింగ్ రోడ్డుపై బైఠాయింపులు, నిరసనలతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపిస్తూ గ్రెస్సీ గెథిన్‌తోపాటు పలువురు సామాజిక కార్యకర్తలపై పోలీసులు అభియోగాలు మోపారు. దాదాపు రెండేళ్లపాటు లండన్ కోర్టులో విచారణ జరిగింది. ‘జస్ట్ స్టాప్ ఆయిల్’నిరసనల వల్ల నాలుగు రోజులపాటు రింగ్ రోడ్డుపై 7 లక్షలకుపైగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిందని పోలీసుల తరఫున ప్రాసిక్యూటర్లు వాదించారు. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు 9.80 లక్షల డాలర్ల నష్టం వాటిల్లిందని చెప్పారు.
రోడ్డుపై పరిస్థితిని చక్కదిద్దడానికి పోలీసులు 1.3 మిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి వచి్చందని తెలిపారు. నిరసనకారులు కుట్రపూరితంగానే ప్రజలకు ఇక్కట్లు కలుగజేశారని ఆరోపించారు. ప్రాసిక్యూటర్ల వాదనతో లండన్ కోర్టు ఏకీభవించింది. గ్రెస్సీ గెథిన్‌తోపాటు లూయిసీ లాంకాస్టర్, డేనియల్ షా, లూసియాకు నాలుగేళ్ల చొప్పున జైలుశిక్ష విధిస్తూ ఈ ఏడాది జూలైలో తీర్పు వెలువరించింది. ‘జస్ట్ స్టాప్ ఆయిల్’సహా వ్యవస్థాపకుడు రోజర్ హల్లామ్ ఐదేళ్లపాటు జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం దోషులంతా జైలులో ఉన్నారు. వారి విడుదల కోసం సామాజిక కార్యకర్తలు పోరాడుతున్నారు. న్యాయం పోరాటం కొనసాగిస్తున్నారు. అహింసాయుతంగా జరిగిన నిరసనలకు నాలుగేళ్ల చొప్పున జైలుశిక్ష విధించడం యూకే చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. శాంతియుత నిరసనలకు సైతం జైలుశిక్ష విధించేలా యూకేలో రెండు వివాదాస్పద చట్టాలు అమల్లో ఉన్నాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment