Imprisonment for life
-
4 రోజుల నిరసనకు 4ఏళ్ల శిక్ష
భూమిపై వాతావరణ మార్పులు, కాలుష్యానికి కారణమవుతున్న శిలాజ ఇంధనాల తవ్వకానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నాలుగు రోజులపాటు శాంతియుతంగా నిరసన తెలిపిన నలుగురు సామాజిక కార్యకర్తలకు నాలుగేళ్ల చొప్పున జైలుశిక్ష పడింది. మరో కార్యకర్తకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. పురాతన ప్రజాస్వామ్య దేశమని చెప్పుకొనే యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. కోర్టు తీర్పును ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు తప్పుపడుతున్నారు. యూకేలోని ఉత్తర సముద్రంలో చమురు తవ్వకాలకు 2022లో అప్పటి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. లైసెన్స్‌లు ఇచ్చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2022 నవంబర్‌లో ‘జస్ట్ స్టాప్ ఆయిల్’అనే నినాదంతో సామాజిక కార్యకర్తలు నిరసన బాటపట్టారు. అనుమతులు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమాలను 22 ఏళ్ల గ్రెస్సీ గెథిన్ అనే యువతి ముందుండి నడిపించింది. ఈ ఉద్యమం పలువురిని ఆకర్శించడంతో వారు ఇందులో భాగస్వాములయ్యారు. భూగోళాన్ని కలుషితం చేసే చమురు తవ్వకాలు వద్దంటూ నినదించారు. లండన్ చుట్టూ ఉన్న మేజర్ రింగ్ రోడ్డుపై నాలుగు రోజులపాటు నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శించారు. చెట్లు, భవనాలపైకి ఎక్కి బిగ్గరగా నినాదాలు చేశారు. ఇదంతా పూర్తిగా శాంతియుతంగానే సాగింది. హింస అనే మాటే లేదు. ఆస్తులకు గానీ, ప్రజలకు గానీ ఎలాంటి నష్టం వాటిల్లలేదు.లక్షల డాలర్ల నష్టం వాటిల్లిందట! రింగ్ రోడ్డుపై బైఠాయింపులు, నిరసనలతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపిస్తూ గ్రెస్సీ గెథిన్తోపాటు పలువురు సామాజిక కార్యకర్తలపై పోలీసులు అభియోగాలు మోపారు. దాదాపు రెండేళ్లపాటు లండన్ కోర్టులో విచారణ జరిగింది. ‘జస్ట్ స్టాప్ ఆయిల్’నిరసనల వల్ల నాలుగు రోజులపాటు రింగ్ రోడ్డుపై 7 లక్షలకుపైగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిందని పోలీసుల తరఫున ప్రాసిక్యూటర్లు వాదించారు. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు 9.80 లక్షల డాలర్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. రోడ్డుపై పరిస్థితిని చక్కదిద్దడానికి పోలీసులు 1.3 మిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి వచి్చందని తెలిపారు. నిరసనకారులు కుట్రపూరితంగానే ప్రజలకు ఇక్కట్లు కలుగజేశారని ఆరోపించారు. ప్రాసిక్యూటర్ల వాదనతో లండన్ కోర్టు ఏకీభవించింది. గ్రెస్సీ గెథిన్తోపాటు లూయిసీ లాంకాస్టర్, డేనియల్ షా, లూసియాకు నాలుగేళ్ల చొప్పున జైలుశిక్ష విధిస్తూ ఈ ఏడాది జూలైలో తీర్పు వెలువరించింది. ‘జస్ట్ స్టాప్ ఆయిల్’సహా వ్యవస్థాపకుడు రోజర్ హల్లామ్ ఐదేళ్లపాటు జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం దోషులంతా జైలులో ఉన్నారు. వారి విడుదల కోసం సామాజిక కార్యకర్తలు పోరాడుతున్నారు. న్యాయం పోరాటం కొనసాగిస్తున్నారు. అహింసాయుతంగా జరిగిన నిరసనలకు నాలుగేళ్ల చొప్పున జైలుశిక్ష విధించడం యూకే చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. శాంతియుత నిరసనలకు సైతం జైలుశిక్ష విధించేలా యూకేలో రెండు వివాదాస్పద చట్టాలు అమల్లో ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
USA: చేయని తప్పుకు 43 ఏళ్లు కారాగారంలోనే
వాషింగ్టన్: చేయని నేరానికి 43 ఏళ్లపాటు జైలుశిక్ష అనుభవించిన అమాయకురాలికి ఎట్టకేలకు విముక్తి లభించింది. అమెరికాలోని ఒహాయోకు చెందిన 63 ఏళ్ల సాండ్రా హెమ్మీ కథ ఇది. మిస్సోరీలో 1980లో ఓ లైబ్రరీ వర్కర్‌ను కత్తితో పొడిచి చంపిందని సాండ్రాను అరెస్ట్ చేశారు. లాయర్‌తో వాదించుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. మానసిక చికిత్సకు అధిక మోతాదులో తీసుకున్న ఔషధాల మత్తులో ఆమె చెప్పిన నేరాంగీకార వాంగ్మూలాన్నే పోలీసులు కోర్టుకు సమరి్పంచారు. దాంతో ఆమెకు జీవితఖైదు విధించారు. కానీ అసలు హంతకుడు మైఖేల్ హోల్మ్యాన్ అనే పోలీసు అధికారి. ఈ విషయాన్ని సాండ్రా లాయర్లు ఆధారసహితంగా తాజాగా కోర్టులో నిరూపించారు. దాంతో ఆమె శుక్రవారం విడుదలయ్యారు. కూతురు, మనవరాలిని హత్తుకుని బోరున విలపించారు. అమెరికా చరిత్రలో చేయని నేరానికి అత్యంత ఎక్కువ కాలం శిక్ష అనుభవించిన మహిళగా సాండ్రా పేరు నిలిచిపోనుంది. -
థాయ్ రాచరికంపై విమర్శలు.. 50 ఏళ్ల జైలు
బ్యాంకాక్: దేశంలోని రాచరిక వ్యవస్థను అగౌరవపరిచిన ఓ వ్యక్తికి థాయ్‌ల్యాండ్ కోర్టు రికార్డు స్థాయిలో 50 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కఠిన చట్టాలు అమల్లో ఉన్న థాయ్‌ల్యాండ్‌లో ఇంతటి భారీ శిక్షను విధించడం ఇదే మొదటిసారని హక్కుల సంఘాలు అంటున్నాయి. చియాంగ్ రాయ్ ప్రావిన్స్‌కు చెందిన మొంగ్కొల్ తిరఖోట్(30) ఆన్లైన్లో వస్త్ర వ్యాపారం చేస్తుంటాడు. రాజకీయ హక్కుల కార్యకర్త కూడా. రాజు ప్రతిష్టకు భంగం కలిగేలా ఆన్లైన్లో పోస్టులు పెట్టారంటూ 2023లో కోర్టు ఈయనకు 28 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మరో 12కు పైగా చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలడంతో గురువారం ఆయనకు మరో 22 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ప్రపంచంలోనే అత్యంత కఠిన రాజరిక చట్టాలు థాయ్‌ల్యాండ్‌లో అమలవుతున్నాయి. రాజు, రాణి, వారసులను విమర్శిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష ఖాయం. -
కామాంధుడికి జీవిత ఖైదు
విజయవాడ లీగల్: బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి జీవితకాల జైలుశిక్షతో పాటు రు.10 వేల జరిమానా విధిస్తూ అదనపు జిల్లా జడ్జి, పోక్సో కోర్టు జడ్జి డాక్టర్ ఎస్.రజని మంగళవారం తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో నివసించే దంపతులకు ఇద్దరు కుమారులు. ఇదేప్రాంతంలో అమరావతి తిరుపతిరావు (32) నివశిస్తున్నాడు. గతేడాది ఆగస్టు 22న రాఖీ పండుగ రోజు తన ఇద్దరు కుమారులతో కలసి తల్లి తన అన్నయ్య ఇంటికి వెళ్లింది. ఐదేళ్ల రెండోకుమారుడు ఆరుబ యట ఆడుకుంటుండగా తిరుపతిరావు ఆ బాలుడికి మాయమాటలుచెప్పి ఎదురుగా నిర్మిస్తున్న ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలుడి శరీరభాగాల్లో రాళ్లను జొప్పించాడు. కొద్దిసేపటి తర్వాత నోటి నుంచి రక్తం కారుతూ నడవలేని స్థితిలో చేతులతో పాకుతూ వస్తున్న కుమారుడిని చూసిన తల్లి పడిపోయాడని భావించింది. స్నానం చేయించేందుకు దుస్తులు విప్పగా రక్తం కారుతుండటం గమనించి.. ఏం జరిగిందని ఆరా తీసింది. బాలుడు జరిగింది చెప్పడంతో దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సెప్టెంబర్ 29న నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నేరం రుజువు కావడంతో అమరావతి తిరుపతిరావుకు న్యాయమూర్తి పైన పేర్కొన్న శిక్షను విధిస్తూ.. బాలుడికి రూ.5 లక్షలు వచ్చేటట్లు చూడాలని మండల న్యాయసేవాధికార సంస్థను ఆదేశించారు. -
మనవడిని కొట్టి చంపిన తాతకు వందేళ్ల జైలు
మొంటానా: మనవడిని కొట్టి చంపిన కేసులో మొంటానాలోని ఎల్లోస్టోన్కు చెందిన ఓ వ్యక్తికి కోర్టు 100 ఏళ్ల జైలు శిక్ష విధించింది. జేమ్స్ సస్సెర్ జూనియర్ కొడుకు టేట్ చనిపోవడంతో అతడి కొడుకు అలెక్స్ హరీ(12)తాత వద్దకు వచ్చి ఉంటున్నాడు. అదే సమయంలో భార్య పాట్రిసియాకు విడాకులు ఇచ్చేందుకు జేమ్స్ సస్సెర్ సిద్ధమయ్యాడు. అయితే, విడాకుల తర్వాత మనవళ్లను చూసే అవకాశం ఇవ్వనంటూ ఆమె బెదిరించడంతో వెనక్కి తగ్గాడు. మనవడు అలెక్స్ కుటుంబసభ్యుల మాట వినడం లేదని పాట్రిసియా చెప్పడంతో అతడిపై జేమ్స్ సస్సెర్ జూనియర్ ద్వేషం పెంచుకున్నాడు. అప్పటి నుంచి అలెక్స్‌పై అమ్మమ్మ, తాతతోపాటు వారి కొడుకు సస్సెర్(14)కూడా వేధింపులు ప్రారంభించారు. అలెక్స్ అక్కడ గడిపిన రెండేళ్లు మానసికంగా, శారీరకంగా తీవ్రంగా వేధించారు. ఆహారం కూడా సరిగ్గా ఇవ్వలేదు. 2020 ఫిబ్రవరిలో అలెక్స్ హర్లీ(12)చనిపోయాడు. అంతకు ముందు 36 గంటలపాటు అతడిని తీవ్రంగా కొట్టారు. తల భాగం సహా అతడి శరీరం నిండా గాయాలే ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. రక్షణ ఇవ్వాల్సిన కుటుంబసభ్యులే అభంశుభం తెలియని బాలుడిని క్రూరంగా హింసించి చంపడంపై విచారణ సందర్భంగా జడ్జి బ్రౌన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో జేమ్స్ సస్సెర్కు 100 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. అతడి 14 ఏళ్ల కొడుకుకు 18 ఏళ్లు వచ్చే వరకు జువనైల్ డిటెన్షన్ సెంటర్లో, 25 ఏళ్లు వచ్చే వరకు ప్రొబేషన్‌లో గడపాలని తీర్పునిచ్చారు. ఈ కేసులో పాట్రిసియాపై మేలో విచారణ జరగనుంది. -
హత్యాచార కేసు: 30 రోజుల్లోనే విచారణ పూర్తి.. సంచలన తీర్పు
సూరత్: నాలుగేళ్లు చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి అరెస్టయిన వ్యక్తికి 30 రోజుల్లోనే శిక్ష విధించింది గుజరాత్ కోర్టు. అతను దోషిగా తేలడంతో జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఈ ఘటన గుజరాత్‌లోని ట్రయల్ కోర్టు లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే .. అజయ్ నిషద్ అనే వ్యక్తి.. అక్టోబర్ 12న సూరత్‌లోని సచిన్ డీఐడీసీ ప్రాంతంలో తన ఇంటి వద్ద ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారికి మాయ మాటలు చెప్పి అక్కడి నుంచి కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ తెలియకూడదని ఆ బాలికను హత్యచేసి ఎవరూ లేని ప్రదేశంలో పడేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు లో నిషద్ దోషిగా తేలడంతో అతన్ని అక్టోబర్ 13న పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నిందితుడిపై పది రోజుల్లోనే చార్జిషీటు దాఖలు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుని ప్రత్యేక కోర్టు అక్టోబర్ 25న విచారణను ప్రారంభించి ఐదు రోజుల్లోనే ముగించింది. దోషికి జీవిత ఖైదుతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి పీఎస్ కాలా గురువారం తీర్పునిచ్చారు. కాగా గుజరాత్‌లోని ట్రయల్ కోర్టు ఇంత తక్కువ వ్యవధిలో తీర్పు ఇవ్వడం ఇదే మొదటిసారి కావడం విశేషం. చదవండి: karnataka: బస్సులో ఫుల్ సౌండ్‌తో పాటలు వింటున్నారా.. ఇకపై జాగ్రత్త! -
కామాంధుడికి జీవిత ఖైదు
భూపాలపల్లి: ఒక్కగానొక్క బిడ్డ.. అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. బిడ్డ పుట్టిన రోజు వేడుకను ఘనంగా జరుపుకోవాలని కేక్, చాక్లెట్లు, కొత్త బట్టలు తెచ్చారు. తెల్లవారితే వేడుకలు జరగాల్సిన ఇంట్లోకి విషాదం దూసుకొచ్చింది. కామాంధుడి చేతిలో బలైన చిట్టితల్లిని చూసి ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నం టాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం గోరికొత్తపల్లిలో జరిగిన ఈ సంఘటనపై శుక్రవారం కోర్టు తీర్పు వెలువడింది. మానవ మృగానికి జీవిత ఖైదు పడింది. బర్త్‌డేకు ముందు రోజే.. గోరికొత్తపల్లికి చెందిన ఈర్ల రాజు, ప్రవళిక దంపతులకు ఒకే కుమార్తె రేష్మ(6). కూతురు స్థానిక ఓ ప్రైవేట్ పాఠశాలలో చేర్పించారు. 2017 డిసెంబర్ 4న రేష్మ పుట్టిన రోజు కావడంతో ఓ రైస్ మిల్లులో డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజు ముందు రోజు కొత్త బట్టలు తెమ్మని భార్య ప్రవళికకు డబ్బులు ఇచ్చి డ్యూటీకి వెళ్లాడు. తల్లీబిడ్డలు ఉదయం పరకాలకు వెళ్లి డ్రెస్, కేక్, చాక్లెట్లు తెచ్చుకున్నారు. సాయంత్రం 6 గంటలకు రాజు ఇంటికి వచ్చి పుట్టిన రోజు వేడుకల విషయమై మాట్లాడుకుంటున్నారు. 7.30 గంటలకు సమయంలో ఇంటి ముందు డీజీ సౌండ్ వినిపించడంతో భోజనం చేస్తున్న రేష్మ ప్లేటును తల్లి చేతికి ఇచ్చి పాటలు విని వస్తానంటూ వెళ్లింది. గంట దాటినా బిడ్డ రాకపోవడంతో ప్రవళిక బయటకు వచ్చి వెతికినా కనిపించకపోవడంతో భర్తకు చెప్పింది. బంధువులు, ఇరుగుపొరుగు వారు కలిసి గ్రామంలో వెతికినా ఫలితం లేకపోవడంతో అర్ధరాత్రి ఒంటిగంటకు రేగొండ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. భార్యాభర్తలు రాత్రంతా ఏడ్చుకుంటూనే ఉన్నారు. మరునాడు రాజు సోదరుడు సదయ్య గ్రామ సమీపంలోని ఓ గడ్డివామును కట్టెతో కదిలించగా అందులో రేష్మ మృతదేహం కనిపించగా వెంటనే రాజుకు తెలపడంతో వారు వచ్చి చూసి కన్నీరుమున్నీరయ్యారు. అత్యంత కిరాతకంగా.. రేష్మపై అదే గ్రామానికి చెందిన కనకం శివ అత్యంత కిరాతకంగా లైంగిక దాడి చేసి ఆపై గొంతు నులిమి హత్య చేశాడు. డీజీ సౌండ్ విని బయటకు వచ్చిన రేష్మను కొద్దిసేపు శివ ఎత్తుకొని డాన్స్ చేసిన అనంతరం మిక్చర్ ప్యాకెట్ కొనిచ్చి గ్రామానికి అనుకొని ఉన్న పంట పొలాల వద్ద లైంగిక దాడికి పాల్పడిన తర్వాత గొంతు నులిమి చంపాడు. పాత కక్షలతోనే ఘాతుకం.. పాత కక్షలతోనే శివ ఈ ఘాతుకానికి పాల్పడిన ట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. శివ అన్నయ్య సదానందం అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఈ విషయమై గ్రామస్తులతో పాటు రేష్మ తండ్రి రాజు కూడా మందలించాడు. దీంతో సదానందం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన అన్నయ్య చావుకు రాజే కారణమని భావించిన శివ ఎప్పటికైనా పగ తీర్చుకోవాలనుకున్నాడు. రెండు రోజుల్లోనే అదుపులోకి.. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు 2 రోజుల్లోనే పట్టుకున్నారు. సంఘటన జరిగిన రోజు రాత్రి రేష్మ కోసం ఆమె తల్లితండ్రులు, గ్రామస్తులంతా కలిసి వెతుకుతుండగా శివ మాత్రం తాపీగా ఓ బెల్టుషాపులో కూర్చొని మద్యం తాగడాన్ని గ్రామస్తులు గమనించారు. పోలీసులు శివను గుర్తించి సెక్షన్ 364, 302, 201, 376, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విచారణ అధికారిగా భూపాలపల్లి డీఎస్పీ కిరణ్ కుమార్ ఉన్నారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో 14 మంది సాక్షుల వాంగ్మూలం విచారించిన కోర్టు నేరము రుజువుకావడంతో నిందితుడకి శిక్ష విధిస్తూ జడ్జి జయకుమార్ తీర్పు వెల్లడించారు. -
ఐదుగురికి జీవిత ఖైదు..ముద్దాయి పరారీ
గుంటూరు : రియల్ ఎస్టేట్ వ్యాపారి కంభాల కోటేశ్వరరావు హత్య కేసులో ఐదుగురికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. న్యాయమూర్తి తీర్పివ్వగానే కోర్టు నుంచి ముద్దాయి రఫీ చాకచక్యంగా పరారయ్యాడు. అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 2010లో సత్తెనపల్లిలోని ఓ గోడౌన్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కోటేశ్వరరావును కొంతమంది వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారు. ఓ స్థల విషయమై కోటేశ్వర రావుతో కొంతమంది వ్యక్తులకు పొరపొచ్చాలు రావడంతో వారు హత్యకు పూనుకున్నారు. ఈ కేసులో మొత్తం ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణలో ఉండగా ఒకరు చనిపోయారు. మిగిలిన ఐదుగురికి గుంటూరు నాలుగవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అలాగే రూ.1000 జరిమానా కూడా విధించారు. పారిపోయిన ముద్దాయిని పోలీసులు పట్టుకున్నారా లేదా అనే విషయంపై పోలీసులు స్పష్టత ఇవ్వడంలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గర్భిణిపై దాడి కేసులో నిందితుడికి జీవిత ఖైదు
జహీరాబాద్: గర్భిణిపై దాడి చేసి.. గర్భస్థ శిశువు మృతికి కారకుడైన నిందితుడికి జీవిత ఖైదు పడింది. దాడి ఘటన గత ఏడాది జరగ్గా తీర్పు మంగళవారం వెలువడింది. జహీరాబాద్ టౌన్ సీఐ నాగరాజు, ఎస్ఐ రాజశేఖర్ కథనం ప్రకారం వివరాలు ఇలా... జహీరాబాద్ పట్టణంలోని గాంధీనగర్‌లో ఇంటి ముందు ఉన్న మురికి కాలువ విషయమై ఎండీ ఖాజామియా(35) అనే వ్యక్తి సందీప్, అతడి భార్య కళావతితో గత ఏడాది జూలై 5న గొడవ పడ్డాడు. అంతేకాకుండా కులం పేరుతో దూ షించి చంపుతానని బెదిరించాడు. మురికి కాలువ నీరు తన ఇంటి ముందుకు రావద్దంటూ గర్భిణి అయిన కళావతి కడుపుపై కాలితో తన్నాడు. బలమైన గాయం కావడంతో ఆమె కడుపులో ఉన్న శిశువు మరణించింది. బాధితురాలి వదిన సునీత ఫిర్యాదు మేరకు అప్పట్లో జహీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును సం గారెడ్డి డీఎస్పీ ఎం.తిరుపతన్న దర్యాప్తు చేసి నిందితులను రిమాండ్ చేసి అభియోగ పత్రం సమర్పించారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట ఆరో అదనపు జడ్జి రజని మంగళవారం నిందితుడికి జీవిత ఖైదుతోపాటు రూ.5వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్టు సీఐ తెలిపారు. -
నిందితులకు శిక్ష రద్దు
చుండూరు దళితుల హత్య కేసులో... చుండూరు దళితుల ఊచకోత కేసులో హైకోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది. 1991 ఆగస్టు 6న గుంటూరు జిల్లా చుండూరులో జరిగిన 8 మంది దళితుల హత్య కేసులో ప్రత్యేక కోర్టు 21 మందికి విధించిన యావజ్జీవ శిక్షను, మరో 35 మందికి విధించిన ఏడాది జైలు శిక్ష, జరిమానాను రద్దు చేసింది. సాక్ష్యాల మధ్య వైరుధ్యాలు ఉన్నప్పటికీ ప్రత్యేక కోర్టు వాటిని పట్టించుకోకుండా నిందితులకు జైలుశిక్ష విధించడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. ఇతర కేసుల్లో అవసరమైతే తప్ప, ఈ 56 మందిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. వీరి నుంచి ఏమైనా జరిమానా మొత్తాలు వసూలు చేసి ఉంటే వాటిని తిరిగివ్వాలని సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తులు ఎల్.నర్సింహారెడ్డి, ఎం.ఎస్.కె.జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు చెప్పింది. ఈ తీర్పు నేపథ్యంలో చుండూరు, మోదుకూరు గ్రామాల్లో ఎటువంటి సంబరాలు, నిరసనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ గ్రామాలపై మూడు నెలల పాటు నిఘా ఉంచాలని గుంటూరు గ్రామీణ ఎస్పీని ధర్మాసనం ఆదేశించింది. కేసు పూర్వాపరాలు.. చుండూరు దళితుల ఊచకోతపై సుదీర్ఘ విచారణ తరువాత ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అనీస్ 2007, జూలై 31న తీర్పు వెలువరించారు. ఈ కేసు నిందితులకు ఉరిశిక్ష విధించేంత అత్యంత అరుదైన కేసుల్లో ఒకటి కాదంటూ మొత్తం 179 మంది నిందితుల్లో 123 మందిని నిర్దోషులుగా ప్రకటించారు. మిగిలిన వారిలో 21 మందికి యావజ్జీవం, మరో 35 మందికి ఏడాది జైలు శిక్ష, జరిమానా విధించారు. అరుుతే ఈ తీర్పులోని కొన్ని అంశాలపై సందేహాలను లేవనెత్తుతూ బాధిత కుటుంబాలు హైకోర్టును ఆశ్రయించాయి. అదే విధంగా శిక్ష పడిన వారు తమ శిక్షను రద్దు చేయాలంటూ పిటిషన్లు దాఖలు చేశారు. కోర్టు కొందరిని నిర్దోషులుగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం పిటిషన్లు దాఖలు చేసింది. ఈ పిటిషన్లలో.. తమ శిక్షను రద్దు చేయాలంటూ శిక్ష పడినవారు దాఖలు చేసుకున్న అప్పీళ్లపై సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. తీర్పులో ధర్మాసనం పలు కీలక అంశాలను ప్రస్తావించింది. మృతులు కచ్చితంగా ఏ సమయంలో మృతి చెందారు? ఎక్కడ మృతి చెందారు? దాడి చేసిన వారిని గుర్తించడం తదితర అంశాలకు సంబంధించి తగిన ఆధారాలను కోర్టు ముందుంచడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని తెలిపింది. ప్రాసిక్యూషన్ వైపు నుంచి పలు లోపాలు ఉన్నాయని స్వయంగా ప్రత్యేక కోర్టే స్పష్టంగా పేర్కొందని గుర్తు చేసింది. ఎవరూ ఫిర్యాదే చేయలేదు.. 1991 ఆగస్టు 6న 8 మంది హరిజనులు హత్యకు గురైతే సమీపంలో ఉన్న పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఎవరూ ఫిర్యాదు చేయలేదని ధర్మాసనం తెలిపింది. ‘గ్రామంలో భారీ బందోబస్తు ఉన్న సమయంలోనే ఈ హత్యలు, దాడులు చోటు చేసుకోగా.. ఈ హత్యల గురించి పోలీసులకు సమాచారం అందకపోవడం ఊహకందని విషయం. మొదటి రెండు మృతదేహాలను తుంగభద్ర కాలువ వద్ద 9వ సాక్షి గుర్తించేంత వరకు హత్య గురించి పోలీసులకు ఎటువంటి సమాచారం లేదు. కనీసం ఆగస్టు 7వ తేదీన కూడా మృతుల కుటుంబీకులు తమ సంబంధీకులు కనిపించడం లేదంటూ ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. సమాచారం అరుునా ఇవ్వలేదు. ఈ కేసులో 8, 15వ సాక్షులుగా ఉన్న వ్యక్తులు కూడా అప్పటి ఘటనలో గాయపడ్డారు. పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, వారంతట వారుగా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. వాంగ్మూలాలను నమోదు చేసే సమయంలో కూడా 8 మంది హత్య గురించి వారు పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఈ కేసులో మొదటి సాక్షిగా ఉన్న వ్యక్తి హరిజన వర్గానికి నాయకుడు. తమపై జరిగిన దాడులకు సంబంధించి ఆయన కూడా ఎటువంటి సమాచారం గానీ, ఫిర్యాదు గానీ ఇవ్వలేదు..’ అని పేర్కొంది. ఈ హత్యలకు సంబంధించి సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేసి, ఎఫ్ఐఆర్లు జారీ చేసినట్లు తెలిపింది. సాక్ష్యాల మధ్య వైరుధ్యాలు.. సాక్ష్యాల మధ్య అనేక వైరుధ్యాలను ఎత్తిచూపిన ధర్మాసనం.. 15వ సాక్షి ఇచ్చిన సాక్ష్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. ‘15వ సాక్షి తమను వెంబడించి, దాడులకు పాల్పడిన వారు 100 నుంచి 120 మంది ఉంటారంటూ వారి పేర్లు చెప్పారు. అదే వ్యక్తి తమ వర్గానికి చెందిన, తనకన్నా ముందువెళ్లిన వారి పేర్లు తనకు తెలియవని స్వయంగా అంగీకరించారు. అగ్రవర్ణాల దాడుల్లో తనకు తీవ్ర గాయాలయ్యాయని, అయినా కూడా కాలువలో నీటి ప్రవాహానికి ఎదురుగా మూడు కిలోమీటర్ల మేర ఈదానని చెప్పారు. ఇది ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారానికి ఎంత విశ్వసనీయత ఉందో చెబుతోంది.’ అని ధర్మాసనం పేర్కొంది. ‘దాడిపై ఫిర్యాదు చేయని హరిజన వర్గ నాయకుడు తనకు ఈత రాదని అంగీకరించారు. అదే సమయంలో 150 అడుగుల వెడల్పు, 10 అడుగుల లోతు ఉన్న కాలువను దాటానని చెప్పారు. తెనాలిలో ఉన్న బంధువుల ఇంట్లో 10.8.1991 వరకు ఆశ్రయం పొందినట్లు అదే ప్రధాన సాక్షి సాక్ష్యమిచ్చారు. పోలీసులు అదే వ్యక్తిని 7.8.1991న జరిగిన మొదటి, రెండవ మృతుల శవ పంచాయతీ సమయంలో సాక్షిగా పేర్కొన్నారు. హత్యలు జరిగినట్లు చెబుతున్న ప్రదేశాలకు, మృతదేహాలు దొరికిన ప్రదేశాలకు సంబంధించిన సాక్ష్యాల మధ్య ఎటువంటి పొంతన లేదు. 131వ నిందితునిగా ఉన్న వ్యక్తి హత్యాకాండ ఘటనలో పాల్గొన్నట్లు సాక్షులు చెప్పారు. వాస్తవానికి ఆ వ్యక్తి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)లో విధి నిర్వహణలో ఉన్నట్లు ప్రత్యేక కోర్టు తేల్చింది. సాక్షుల సాక్ష్యాల్లో ఉన్న తేడాలను ఇది స్పష్టం చేస్తోంది. మొదటి మృతునిపై ఎ1, ఎ6, ఎ11, ఎ20లు దాడి చేశారని ప్రధాన సాక్షి చెబితే, అదే మృతునిపై ఎ1, ఎ2, ఎ6, ఎ11, ఎ20, ఎ26 దాడి చేశారని నాల్గవ సాక్షి చెప్పారు. ఎ2, ఎ6, ఎ11, ఎ26 మాత్రమే దాడి చేశారని ఏడవ సాక్షి చెప్పారు..’ అంటూ ధర్మాసనం వివరించింది. మొదటి మృతుని హత్యకు ఎ6, ఎ20 కారకులని తేల్చిన ప్రత్యేక కోర్టు, అందుకు ఆధారాలు ఏమిటో చెప్పలేదంది. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద మోపిన అభియోగాలను కూడా ధర్మాసనం తోసిపుచ్చింది. వాటిని ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని తేల్చి చెప్పింది. ఇప్పటికైనా వైషమ్యాలను మరిచిపోండి... ‘ఈ వైషమ్యాల వల్ల 8 విలువైన ప్రాణాలు పోయాయి. మృతుల కుటుంబాలు శిథిలమైపోయాయి. దశాబ్దాలుగా నెలకొని ఉన్న వైషమ్యాలను ఇప్పటికైనా మరిచిపోవాలి. ఇందుకు ఇరుపక్షాల పెద్దలు చొరవ తీసుకోవాలి..’ అని ధర్మాసనం విజ్ఞప్తి చేసింది. వికలాంగుడెలా తరమగలడు? ‘‘ఈ కేసులో 6వ నిందితునిగా ఉన్న వ్యక్తి శారీక వికలాంగుడు. తన మోకాలిపై చేయి వేయకుండా అతను కనీసం నడవలేడని ఈ ఘటనకు ప్రధాన ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న వారే స్వయంగా అంగీకరిస్తున్నారు. అయితే వికలాంగుడైన ఆ వ్యక్తి ఇతర నిందితులతో కలసి తమను తరిమినట్టు అదే ప్రధాన ప్రత్యక్ష సాక్షులు ప్రత్యేక కోర్టు ముందు సాక్ష్యం ఇచ్చారు. శారీరక వికలాంగుడు ఎలా తరమగలడన్న విషయాన్ని కిందికోర్టు కనీస స్థాయిలో ఆలోచించకుండా ప్రధాన సాక్షుల సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకుంది..’’ అంటూ హైకోర్టు ధర్మాసనం సాక్ష్యాల మధ్య వైరుధ్యాలను వివరించింది. సుప్రీంకోర్టుకు వెళతాం.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రరుుంచనున్నట్టు గుంటూరు రూరల్ ఎస్పీ జెక్కంశెట్టి సత్యనారాయణ తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులు అందిన తర్వాత వాటిని పరిశీలించి సుప్రీంలో అప్పీల్ దాఖలు చేస్తామని చెప్పారు. చుండూరు మారణకాండలో 21మంది జీవిత ఖైదీలకు హైకోర్టు విముక్తి కలిగించడంపై సుప్రీంకోర్టుకు వెళతామని రాష్ట్ర దళిత మహాసభ ప్రధాన కార్యదర్శి కత్తి పద్మారావు పొన్నూరులో చెప్పారు. నిందితులకు శిక్షపడే వరకు పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వం కూడా తన బాధ్యతగా సుప్రీంకోర్టులో అప్పీల్ చేయూలని కోరారు. గ్రామాల్లో పోలీస్ పికెట్లు చుండూరు ఊచకోత కేసును హైకోర్టులో కొట్టేసిన నేపథ్యంలో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. చుండూరు, అంబేద్కర్ నగర్, మున్నంగివారిపాలెం, మోదుకూరులో అదనపు బలగాలతో పికెట్లు ఏర్పాటు చేశారు. తెనాలి డీఎస్పీ టి.పి.విఠలేశ్వర్ మంగళవారం చుండూరును సంద ర్శించి శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. మంగళవారంతో ముడిపడ్డ కేసు చుండూరు దళితుల ఊచకోత జరిగిన 1991 ఆగస్టు 6 మంగళవారం. దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది కూడా 2007, జూలై 31 మంగళవారం నాడే. దీనిపై దాఖలైన అనేక అప్పీళ్ల నేపథ్యంలో.. ఈ ఏడాది ఫిబ్రవరి 18న మంగళవారం నాడే హైకోర్టు వీటి విచారణ చేపట్టింది. కాగా మంగళవారం నాడే నిందితులకు విధించిన శిక్షలను రద్దు చేస్తూ హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించడం విశేషం.