కామాంధుడికి జీవిత ఖైదు | Man Sentenced to Life Imprisonment for Raping and Killing A Girl | Sakshi
Sakshi News home page

కామాంధుడికి జీవిత ఖైదు

Published Sat, Sep 21 2019 11:01 AM | Last Updated on Sat, Sep 21 2019 11:02 AM

Man Sentenced to Life Imprisonment for Raping and Killing A Girl - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

భూపాలపల్లి: ఒక్కగానొక్క బిడ్డ.. అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. బిడ్డ పుట్టిన రోజు వేడుకను ఘనంగా జరుపుకోవాలని కేక్, చాక్లెట్లు, కొత్త బట్టలు తెచ్చారు. తెల్లవారితే వేడుకలు జరగాల్సిన ఇంట్లోకి విషాదం దూసుకొచ్చింది. కామాంధుడి చేతిలో బలైన చిట్టితల్లిని చూసి ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నం టాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం గోరికొత్తపల్లిలో జరిగిన ఈ సంఘటనపై శుక్రవారం కోర్టు తీర్పు వెలువడింది. మానవ మృగానికి జీవిత ఖైదు పడింది.

బర్త్‌డేకు ముందు రోజే..
గోరికొత్తపల్లికి చెందిన ఈర్ల రాజు, ప్రవళిక దంపతులకు ఒకే కుమార్తె రేష్మ(6). కూతురు స్థానిక ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చేర్పించారు.  2017 డిసెంబర్‌ 4న రేష్మ పుట్టిన రోజు కావడంతో ఓ రైస్‌ మిల్లులో డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజు ముందు రోజు కొత్త బట్టలు తెమ్మని భార్య ప్రవళికకు డబ్బులు ఇచ్చి డ్యూటీకి వెళ్లాడు. తల్లీబిడ్డలు ఉదయం పరకాలకు వెళ్లి డ్రెస్, కేక్, చాక్లెట్లు తెచ్చుకున్నారు. సాయంత్రం 6 గంటలకు రాజు ఇంటికి వచ్చి పుట్టిన రోజు వేడుకల విషయమై మాట్లాడుకుంటున్నారు. 7.30 గంటలకు సమయంలో ఇంటి ముందు డీజీ సౌండ్‌ వినిపించడంతో భోజనం చేస్తున్న రేష్మ ప్లేటును తల్లి చేతికి ఇచ్చి పాటలు విని వస్తానంటూ వెళ్లింది. గంట దాటినా బిడ్డ రాకపోవడంతో ప్రవళిక బయటకు వచ్చి వెతికినా కనిపించకపోవడంతో భర్తకు చెప్పింది. బంధువులు, ఇరుగుపొరుగు వారు కలిసి గ్రామంలో వెతికినా ఫలితం లేకపోవడంతో అర్ధరాత్రి ఒంటిగంటకు రేగొండ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. భార్యాభర్తలు రాత్రంతా ఏడ్చుకుంటూనే ఉన్నారు. మరునాడు రాజు సోదరుడు సదయ్య గ్రామ సమీపంలోని ఓ గడ్డివామును కట్టెతో కదిలించగా అందులో రేష్మ మృతదేహం కనిపించగా వెంటనే రాజుకు తెలపడంతో వారు వచ్చి చూసి కన్నీరుమున్నీరయ్యారు.
 
అత్యంత కిరాతకంగా.. 
రేష్మపై అదే గ్రామానికి చెందిన కనకం శివ అత్యంత కిరాతకంగా లైంగిక దాడి చేసి ఆపై గొంతు నులిమి హత్య చేశాడు. డీజీ సౌండ్‌ విని బయటకు వచ్చిన రేష్మను కొద్దిసేపు శివ ఎత్తుకొని డాన్స్‌ చేసిన అనంతరం మిక్చర్‌ ప్యాకెట్‌ కొనిచ్చి గ్రామానికి అనుకొని ఉన్న పంట పొలాల వద్ద లైంగిక దాడికి పాల్పడిన తర్వాత గొంతు నులిమి చంపాడు. 

పాత కక్షలతోనే ఘాతుకం..
పాత కక్షలతోనే శివ ఈ ఘాతుకానికి పాల్పడిన ట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. శివ అన్నయ్య సదానందం అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఈ విషయమై గ్రామస్తులతో పాటు రేష్మ తండ్రి రాజు కూడా మందలించాడు. దీంతో సదానందం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన అన్నయ్య చావుకు రాజే కారణమని భావించిన శివ ఎప్పటికైనా పగ తీర్చుకోవాలనుకున్నాడు.  

రెండు రోజుల్లోనే అదుపులోకి.. 
ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు 2 రోజుల్లోనే పట్టుకున్నారు. సంఘటన జరిగిన రోజు రాత్రి రేష్మ కోసం ఆమె తల్లితండ్రులు, గ్రామస్తులంతా కలిసి వెతుకుతుండగా శివ మాత్రం తాపీగా ఓ బెల్టుషాపులో కూర్చొని మద్యం తాగడాన్ని గ్రామస్తులు గమనించారు. పోలీసులు శివను గుర్తించి సెక్షన్‌ 364, 302, 201, 376, పోక్సో చట్టం కింద కేసు  నమోదు చేశారు. విచారణ అధికారిగా భూపాలపల్లి డీఎస్పీ కిరణ్‌ కుమార్‌ ఉన్నారు. డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ సత్యనారాయణ ఆధ్వర్యంలో 14 మంది సాక్షుల వాంగ్మూలం విచారించిన కోర్టు నేరము రుజువుకావడంతో నిందితుడకి శిక్ష విధిస్తూ జడ్జి జయకుమార్‌ తీర్పు వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement