జహీరాబాద్: గర్భిణిపై దాడి చేసి.. గర్భస్థ శిశువు మృతికి కారకుడైన నిందితుడికి జీవిత ఖైదు పడింది. దాడి ఘటన గత ఏడాది జరగ్గా తీర్పు మంగళవారం వెలువడింది. జహీరాబాద్ టౌన్ సీఐ నాగరాజు, ఎస్‌ఐ రాజశేఖర్ కథనం ప్రకారం వివరాలు ఇలా... జహీరాబాద్ పట్టణంలోని గాంధీనగర్‌లో ఇంటి ముందు ఉన్న మురికి కాలువ విషయమై ఎండీ ఖాజామియా(35) అనే వ్యక్తి సందీప్, అతడి భార్య కళావతితో గత ఏడాది జూలై 5న గొడవ పడ్డాడు.
అంతేకాకుండా కులం పేరుతో దూ షించి చంపుతానని బెదిరించాడు. మురికి కాలువ నీరు తన ఇంటి ముందుకు రావద్దంటూ గర్భిణి అయిన కళావతి కడుపుపై కాలితో తన్నాడు. బలమైన గాయం కావడంతో ఆమె కడుపులో ఉన్న శిశువు మరణించింది. బాధితురాలి వదిన సునీత ఫిర్యాదు మేరకు అప్పట్లో జహీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసును సం గారెడ్డి డీఎస్పీ ఎం.తిరుపతన్న దర్యాప్తు చేసి నిందితులను రిమాండ్ చేసి అభియోగ పత్రం సమర్పించారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట ఆరో అదనపు జడ్జి రజని మంగళవారం నిందితుడికి జీవిత ఖైదుతోపాటు రూ.5వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్టు సీఐ తెలిపారు.