ముంబై: ఎల్గార్ పరిషత్–మావోయిస్టులతో సంబంధాల కేసులో అరెస్టయి విచారణ ఖైదీగా సంవత్సరాల తరబడి జైలు జీవితం గడిపిన సామాజిక కార్యకర్తలు వెర్నాన్ గొన్సాల్వేజ్, అరుణ్ ఫెరీరాలు ఎట్టకేలకు జైలు నుంచి బెయిలుపై బయటికొచ్చారు. గత వారం వారికి బెయిల్ ఇస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పునివ్వడం తెల్సిందే. శనివారం ప్రత్యేక కోర్టు సంబంధిత విడుదల పత్రాలను నవీ ముంబైలోని తలోజ కారాగారం అధికారులకు పంపడంతో వారం తర్వాత ఎట్టకేలకు వారు బయటికొచ్చారు.
జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) దర్యాప్తు చేస్తూ ప్రత్యేక కోర్టు పరిశీలనలో ఉన్న ఈ కేసుకు సంబంధించి ఇప్పటిదాకా 16 మంది అరెస్టయ్యారు. గొన్సాల్వేజ్, అరుణ్‌తో కలిపి ఇప్పటిదాకా ఐదుగురు బెయిల్‌పై బయటికొచ్చారు. ఒక్కో నిందితుడు ఒక మొబైల్ వాడుకోవచ్చని, వారు ఉండే అడ్రస్ ఎన్‌ఐఏకు ఇవ్వాలని, సంబంధిత నిబంధనలు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు అవుతుందని ధర్మాసనం స్పష్టంచేసింది. విద్యావేత్త, కార్యకర్త ఆనంద్ తేల్‌తుంబ్డే, న్యాయవాది సుధా భరద్వాజ్‌లకు గతంలో సాధారణ బెయిల్ రాగా, అనారోగ్య కారణాలతో విప్లవ కవి వరవరరావు బెయిల్ సాధించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో జైలు నుంచి బయటికొచ్చిన కార్యకర్త గౌతమ్ నవ్‌లఖా ప్రస్తుతం గృహనిర్బంధంలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment