Arun ferreira
-
ఎట్టకేలకు గొన్సాల్వేజ్, ఫెరీరా విడుదల
ముంబై: ఎల్గార్ పరిషత్–మావోయిస్టులతో సంబంధాల కేసులో అరెస్టయి విచారణ ఖైదీగా సంవత్సరాల తరబడి జైలు జీవితం గడిపిన సామాజిక కార్యకర్తలు వెర్నాన్ గొన్సాల్వేజ్, అరుణ్ ఫెరీరాలు ఎట్టకేలకు జైలు నుంచి బెయిలుపై బయటికొచ్చారు. గత వారం వారికి బెయిల్ ఇస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పునివ్వడం తెల్సిందే. శనివారం ప్రత్యేక కోర్టు సంబంధిత విడుదల పత్రాలను నవీ ముంబైలోని తలోజ కారాగారం అధికారులకు పంపడంతో వారం తర్వాత ఎట్టకేలకు వారు బయటికొచ్చారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తూ ప్రత్యేక కోర్టు పరిశీలనలో ఉన్న ఈ కేసుకు సంబంధించి ఇప్పటిదాకా 16 మంది అరెస్టయ్యారు. గొన్సాల్వేజ్, అరుణ్‌తో కలిపి ఇప్పటిదాకా ఐదుగురు బెయిల్‌పై బయటికొచ్చారు. ఒక్కో నిందితుడు ఒక మొబైల్ వాడుకోవచ్చని, వారు ఉండే అడ్రస్ ఎన్ఐఏకు ఇవ్వాలని, సంబంధిత నిబంధనలు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు అవుతుందని ధర్మాసనం స్పష్టంచేసింది. విద్యావేత్త, కార్యకర్త ఆనంద్ తేల్తుంబ్డే, న్యాయవాది సుధా భరద్వాజ్‌లకు గతంలో సాధారణ బెయిల్ రాగా, అనారోగ్య కారణాలతో విప్లవ కవి వరవరరావు బెయిల్ సాధించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో జైలు నుంచి బయటికొచ్చిన కార్యకర్త గౌతమ్ నవ్లఖా ప్రస్తుతం గృహనిర్బంధంలో ఉన్నారు. -
బీమా కొరేగావ్ కేసు: ఇద్దరు నిందితులకు సుప్రీంకోర్టు ఊరట
ముంబయి: బీమా కొరేగావ్ కేసులో నిందితులుగా ఉన్న ఎల్గార్ పరిషత్ సభ్యులు వెర్నాన్ గోన్సాల్వేస్, అరుణ్ ఫెరీరాలకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తీవ్రవాద వ్యతిరేక నిరోధక చట్టం (ఊపా) కింద అరెస్టైన వీరిద్దరి బెయిల్ పిటీషన్‌ను 2021 డిసెంబర్లో బాంబే హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. బీమా కోరేగావ్ కేసులో హింసను ప్రేరేపించారనే ఆరోపణలపై 2018లో వీరిని అరెస్టు చేశారు. అప్పటి నుంచి ముంబయిలోని తలోజా జైలులో నిర్భందించారు. ఐదేళ్లపాటు వరుసగా కస్టడీలోనే ఉన్నందున కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. నిందితులపై ఉన్న ఆరోపణలు తీవ్రమైనవి అనే ఒక్క కారణంతో బెయిల్ నిరాకరించడం సమంజసం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. వెర్నాన్ గోన్సాల్వేస్, అరుణ్ ఫెరీరాల తరపున న్యాయవాదులు మూడు రోజుల పాటు వాదనలు వినిపించారు. ఊపా చట్టం కింద అరెస్టు చేయడానికి సరిపడు ఆధారాలు తమ క్లయింట్ల వద్ద లభించలేదని విన్నివించారు. అందుకు తగు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకోలేదని స్పష్టం చేశారు. పూణెలోని బీమా కొరేగావ్ యుద్ధ స్మారకం వద్ద 2017 డిసెంబర్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ కేసులో వెర్నాన్ గోన్సాల్వేస్, అరుణ్ ఫెరీరాలతో సహా 14 మందిని ఎన్ఐఏ నిందితులుగా చేర్చింది. బీమా కొరేగావ్ యుద్ధం జరిగి 200 ఏళ్ల వార్షికోత్సవాన్ని 2017 డిసెంబర్ 31న జరిపారు. దీనిని పురస్కరించుకుని ఎల్గార్ పరిషత్ ఈవెంట్‌కు సంబంధించి మావోయిస్టులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ముంబయి, నాగ్‌పూర్, ఢిల్లీ నుంచి 2018 జూన్‌లో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఎల్గార్ పరిషత్ కార్యక్రమంలో రెచ్చగొట్టే ప్రసంగాలు హింసను ప్రేరేపించాయని విశ్రాంబాగ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇదీ చదవండి: కావాలనే లీక్ చేశారు.. మణిపూర్ నగ్న ఊరేగింపు ఘటనపై హోం మంత్రి వ్యాఖ్యలు -
‘ప్రధాని హత్యకు కుట్ర’ కేసు పెడతారా?
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లో మంగళవారం పుణె పోలీసులు పది మంది సామాజిక కార్యకర్తల ఇళ్లపై దాడులు నిర్వహించి అరెస్ట్ చేసిన ఐదుగురు సామాజిక కార్యకర్తలపై పోలీసులు ఎలాంటి కేసులు పెట్టారు ? ఎలాంటి కేసులు పెడుతున్నారు ? ఏ చట్టం కింద? ఏ సెక్షన్ కింద? అన్న విషయాలు ఇప్పుడు చర్చనీయాంశాలయ్యాయి. మహారాష్ట్రలోని భీమా కోరెగావ్‌లో జనవరి ఒకటవ తేదీన జరిగిన దళితుల మహార్యాలీ సందర్భంగా తలెత్తిన అల్లర్ల విచారణలో భాగంగానే వీరిని అరెస్ట్ చేసినట్లు ప్రాథమిక వార్తలు తెలియజేశాయి. ఇదే అల్లర్లకు సంబంధించి జూన్ 6వ తేదీన ఐదుగురు సామాజిక కార్యకర్తలను పుణె పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై అత్యంత వివాదాస్పదమైన ‘చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం–1967 (వీఏపీఏ)’ను దాఖలు చేశారు. 2012లో ఈ చట్టాన్ని కేంద్రం సవరించినప్పటికీ ప్రమాదకర సెక్షన్లు, అంశాలు ఇంకా అందులో అలాగే ఉన్నాయి. హైదరాబాద్‌లో అరెస్టయిన వరవరరావు సహా ఐదుగురు సామాజిక కార్యకర్తలపై కూడా వీఏపీఏ చట్టాన్నే దాఖలు చేసే అవకాశం ఉంది. పుణెలోని జాయింట్ కమిషనర్ కార్యాలయం నుంచి రాంచి పోలీసు స్టేషన్‌కు అందిన ఉత్తర్వుల్లో ‘నెంబర్ 4–2018’ కేసులో విచారణ కోసం అరెస్ట్ చేయాల్సిందిగా ఉంది. అంటే ఆ నెంబర్ కేసు వీఏపీఏదే. అయితే గతంలో అరెస్టై ప్రస్తుతం పుణె పోలీసుల నిర్బంధంలో ఉన్న సామాజిక కార్యకర్త రోనా విల్సన్ వద్ద దొరికినట్లు పోలీసులు చెబుతున్న ఓ లేఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు మావోయిస్టులు కుట్రపన్నారని ఉంది. దీంతో ప్రధాని హత్యకు కుట్రపన్నారన్న ఆరోపణలపై కేసు పెట్టే అవకాశం ఉందని ఊహాగానాలు చెలరేగాయి. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మోదీ ప్రభుత్వమే ఇలాంటి కుట్రలు పన్నుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో, మోదీ హత్య కుట్రకు ఎలాంటి బలమైన ఆధారాలు లేకపోవడం వల్ల ఆ కేసును దాఖలు చేయక పోవచ్చు. వరవరరావు, ఆనంద్ టెల్టుంబ్డే, రోనా విల్సన్ వీఏపీఏ చట్టం ఎంతో ప్రమాదకరమైనది ఈ చట్టంలోని 13, 16, 17, 17బీ, 20, 38, 39, 40 సెక్షన్ల కింద నిందితులను విచారిస్తున్నారు. ఇందులోని 13వ సెక్షన్ ప్రకారం చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న, వాటితో సంబంధం ఉన్నా ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించివచ్చు. మిగతా సెక్షన్లు దీనికంటే ప్రమాదరకమైనవి. టెర్రరిస్టు కార్యకలాపాలను సూచించేవి. టెర్రరిస్టు కార్యకలాపాలతో ఎవరి చావుకు కారణమైన, టెర్రరిస్టు చర్యకు ఆర్థిక సహాయం అందించినా, టెర్రరిస్టు చర్యకు పాల్పడినా, టెర్రరిస్టు సంస్థకు నియామకాలు జరిపినా, అందులో సభ్యుడిగా కొనసాగినా, ఆ సంస్థ తరఫున విరాళాలు వసూలు చేసినా ఐదేళ్ల నుంచి యావజ్జీవ శిక్ష, మరణ శిక్ష విధించే సెక్షన్లు వీటిలో ఉన్నాయి. మహాయిస్టు చర్యలను టెర్రరిస్టు చర్యలుగా పోలీసులు పరిగణిస్తున్న విషయం తెల్సిందే. హర్యానాలోని ఫరిదాబాద్‌లో అరెస్ట్ చేసిన న్యాయవాది సుధా భరద్వాజ్‌పై వీఏపీఏ చట్టంలోని కొన్ని సెక్షన్లతోపాటు మత విద్వేషాలను రెచ్చగొట్టారని, ప్రజల్లో భయాందోళనలు సృష్టించారని, వదంతలు వ్యాప్తి చేశారని, ప్రజలను తప్పుదోవ పట్టించారని.. ఇలా పలు ఆరోపణలు చేస్తూ భారతీయ శిక్షా స్మృతిలోని 34, 153 ఏ, 505 (1బీ), 117, 120 బీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెల్సింది. ఆమె వద్ద దొరికిన ఓ లేఖలో కశ్మీరు వేర్పాటువాదులకు, మావోయిస్టులకు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోందని పోలీసులు అంటున్నారు. ఇంతకు వీరిపై కేసులెందుకు? ఈ ఏడాది జనవరి 1వ తేదీన పుణెకు సరిగ్గా 30 కిలోమీటర్ల దూరంలోని భీమా కోరెగావ్‌లో ఏటా జరిగే దళితుల మహార్యాలీ జరిగింది. దాదాపు మూడు లక్షల మంది హాజరైన ఆ ర్యాలీ సందర్భంగా విధ్వంసకాండ చెలరేగింది. అందులో ఒకరు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ అల్లర్లను డిసెంబర్ 31వ తేదీన ఓ బహిరంగ వేదిక నుంచి ప్రసంగించిన సామాజిక కార్యకర్తలు రెచ్చగొట్టే ప్రసంగాలతోపాటు ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టించారన్నది పోలీసుల అభియోగం. (చదవండి: భీమా కోరేగావ్ సంఘటనకు బాధ్యలెవరు?) ప్రధాని నరేంద్ర మోదీతో సంభాజి భిడే నాడేమి వార్తలొచ్చాయి? కాషాయ జెండాలు ధరించిన ఆరెస్సెస్ కార్యకర్తలు ర్యాలీని అడ్డుకునేందుకు ప్రయత్నించడం వల్లనే విధ్వంసకాండ చెలరేగిందని నాడు వార్తలు వచ్చాయి. ర్యాలీకి కొన్ని రోజుల ముందు ర్యాలీని అడ్డుకోవాల్సిందిగా హిందూ సంఘాల నాయకులు ఇచ్చిన పిలుపే అల్లర్లకు కారణమైందని ఆ వార్తలు సూచించాయి. దాంతో ఆరెస్సెస్ కార్యకర్తలను రెచ్చగొడుతూ మాట్లాడినా ‘హిందూ ఏక్తా మంచ్’ అధ్యక్షుడు మిలింద్ ఎక్బోటే, ‘శివప్రతిష్ఠాన్ హిందుస్థాన్’ సంస్థ చీఫ్ సంభాజీ భిడేలపై పుణె పోలీసులు జనవరి 3వ తేదీన కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వారిద్దరికి ఆరెస్సెస్ అధినాయకులతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో వారిని కనీసం పోలీసులు అరెస్ట్ చేసేందుకు సాహసించలేక పోయారు. ఆ విషయమై సుప్రీం కోర్టు మహారాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదిని తీవ్రంగా నిలదీసింది. అరెస్ట్‌లు చూపించాక కోర్టుకు రావాలని కూడా ఆదేశించింది. దాంతో మిలింద్ ఎక్బోటేను అరెస్ట్ చేసిన పోలీసులు వెంటనే బెయిల్‌పై విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తన గురువుగా భావించే సంభాజి భిడేను అరెస్ట్ చేయడానికి మాత్రం ఎప్పుడూ ప్రయత్నించలేదు. హఠాత్తుగా మలుపు తిరిగిన కేసు హిందూ సంఘాలపై నుంచి కేసు దృష్టి ఒక్కసారిగా సామాజిక కార్యకర్తల వైపు మళ్లింది. ఎక్బోటే, భిడేలాంటి హిందూ నాయకుల ప్రసంగాల వల్ల అల్లర్లు చోటు చేసుకోలేదని, సామాజిక కార్యకర్తలు రెచ్చగొట్టడం వల్లనే అల్లర్లు జరిగాయని అభిప్రాయపడిన పుణె పోలీసులు జూన్ ఆరవ తేదీన ఐదుగురు సామాజిక కార్యకర్తలను అరెస్ట్ చేశారు. నాడు విద్వేషాలను రెచ్చగొట్టారంటూ హిందూత్వ నాయకులపై భారతీయ శిక్షాస్మృతిలోని సాధారణ సెక్షన్లను నమోదు చేయగా, ఆ తర్వాత సామాజిక కార్యకర్తలపై మాత్రం అత్యంత వివాదాస్పదమైన ‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం’ కింద కేసులు పెట్టారు. -
చిత్రహింసల కొలిమిలోంచి...
మనదేశంలో న్యాయం, చట్టం ఏమాత్రం అమలు జరగని ప్రదేశం జైలు. చట్టబద్ధంగా జరిగేదేదీ అతిక్రమణ కాజాలదు. కానీ జైలులో అమలు జరిగే దేదీ చట్టం పరిధిలో ఉండదు. అక్కడ అధికారులు, పోలీసులు చెప్పిందే శాసనం. ఇనుపచువ్వల మాటున, ఖాకీ డ్రస్సుల చాటున, జైలు గోడల మధ్యన దాగిన క్రూరత్వానికి సజీవసాక్ష్యం అరుణ్ ఫరేరా. ఊపిరి సలపని జైలు గోడలకు వేళాడదీసిన వేన వేల శాల్తీల్లో అరుణ్ ఫరేరా ఒకరు. పెడరెక్కలు విరి చికట్టి మానవ శరీరాలను మాంసపు ముద్దలుగా మార్చి, కారే నెత్తుటి చుక్కల లెక్కల నుంచి మొదలవుతుంది ఇంటరాగేషన్. ఒకటా, రెండా... అచ్చంగా ఐదేళ్ల పాటు విచారణ పేరుతో నాగ్‌పూర్ సెంట్రల్ జైలులోని అండా సెల్లో మగ్గిపోయిన మావోయిస్టు ఖైదీయే అరుణ్ ఫరేరా. ముంబై మూలవాసి అయిన అరుణ్ విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతోన్న విద్యార్థి సంఘ నాయ కుడు. తప్పుడు కేసులు పెట్టి, ఇనుప బూట్లతో ఒళ్లుకుళ్ల బొడిచి, గోళ్లల్లో గుండు సూదులు గుచ్చి, చెవుల్లోంచి రక్తం చిందినా చలించని ఉక్కు మనిషి అరుణ్ ఫరేరా. కలర్స్ ఆఫ్ ద కేజ్ పేరుతో ఆంగ్లంలో పుస్తక రూపంలో విడుదలైన తన అనుభవాలను ‘సంకెళ్ల సవ్వడి’ పేరుతో మలుపు పబ్లిషర్స్ తెలుగులోకి తెచ్చారు. పుస్తకావిష్క రణ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన అరుణ్ ఫరేరాతో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ. జైలులో ఉండగానే ఈ పుస్తకం రాశారా? స్వతహాగా నేను కార్టూనిస్టుని. నన్ను తప్పుడు కేసుల్లో ఇరికించి చిత్రహింసలకు గురిచేశారు ముంబయి పోలీ సులు. నాలుగు సంవత్సరాల 8 నెలలపాటు గాలి, వెలు తురు సోకని అండాసెల్ అని పిలిచే చీకటి కారాగారంలో ఉంచారు. నేననుభవిస్తున్న హింసని, జైలుగోడల మధ్య నలుగుతున్న నాలాంటి ఎందరో ఖైదీల అనుభవాలనూ కార్టూన్లుగా గీసాను. నాపై మోపినవి తప్పుడు కేసులని రుజువయ్యాక బయటికి వచ్చిన వాటికి అక్షర రూపం ఇచ్చాను. జైళ్లపై మీ అభిప్రాయం? భారత దేశంలోని జైలు... న్యాయం, చట్టం అమలు జర గని ఒక ప్రదేశం. చట్టబద్ధంగా జరిగేదేదీ అతిక్రమణ కాజాలదు. కానీ ఇక్కడ అమలు జరిగే దేదీ చట్టం పరి ధిలో ఉండదు. అక్కడ అధికారులు, పోలీసులు చెప్పిందే శాసనం. నాలుగ్గోడల మధ్య మాకున్న ఏకైక పోరాట రూపం నిరాహార దీక్ష. అదే చేశాం. భారత ప్రభుత్వం ఆమోదించిన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశాం. పోరాటం జైలు గోడలు దాటి రాకపోతే మేం చేసింది వృథాయే. ఆ వార్తను పత్రికలకు చేరవేయడం మరో ప్రహసనం. ఇంటరాగేషన్ క్రమంలో మీరెలాంటి చిత్రహింసలు ఎదు ర్కొన్నారు? నా శరీరంలో ఒక్క అంగుళం కూడా మిగలకుండా హిం సించారు. గోళ్లల్లో సూదులు గుచ్చారు. తల్లకిందులుగా వేలాడదీసారు. కిటికీకి చేతులు విరిచికట్టి నా తొడలపై ఇద్దరు కానిస్టేబుల్స్‌ని గంటలకొద్దీ నించోబెట్టేవారు. కరెంట్ షాక్ ఇచ్చారు. వారు పెట్టిన హింసకు చెవుల్లో నుంచి రక్తం కారేది. కానీ నా నోటినుంచి మాత్రం ఏనా డూ ఒక్కమాట రాబట్టలేకపోయారు. ఇది నా కథ మాత్రమే కాదు. నాలాంటి వేలాది మంది ఖైదీలు అను భవిస్తున్న ఘోరాలు. నాతోటి ఖైదీలకు ఎనీమా ఇచ్చి నట్టు 100 మిల్లీ లీటర్ల పెట్రోల్ లోపలికి పంపించారు. అంతే కటి భాగంలో పుళ్లుపడి నడవలేక, రోజులు, నెలల తరబడి రక్తం కారి, చివరకు ప్రాణం పోయేంతటి ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రత్యేకమైన శిక్షణ లేకపోతే తప్ప ఇలా హింసించాలని వాళ్లకెలా తెలు స్తుందా అని నాకెప్పటికీ ఆశ్చర్యమే. మావోయిస్టు ఖైదీల పరిస్థితేనా, లేక ఎవరికైనా ఈ చిత్ర హింసలు తప్పవా? తేడా ఉంటుంది. అలా అని సాధారణ ఖైదీలను హింసిం చరని కాదు. నాకు జరిగింది కేవలం ఒక వంతే. అంతకు పదింతలు ఎక్కువగా చిత్రహింసలు అనుభవిస్తున్న వారు ఇంకా జైల్లోనే మగ్గుతున్నారు. అంతెందుకు ఢిల్లీలో అక్రమంగా అరెస్టయిన సాయిబాబా నేనున్న అండాసెల్ లోనే ప్రస్తుతం ఉన్నాడు. 48 డిగ్రీల వేడికి గాలిసోకని అండాసెల్ ఉడికి పోతుంది. ఓ మూలకు చేరి రాత్రిపగలు వేడి సెగసోకకుండా గొంతుక్కూర్చొని శరీ రాన్ని కాపాడుకోవాలి. నేనైతే ఐదేళ్లపాటు అదే సెల్లో ఎలాగో బతికాను. కానీ, సాయిబాబా నడవలేడు. మం డే గచ్చుమీద పాక్కుంటూ వేడిని తట్టుకోవాలి. ఊహిం చుకోడానికే భయంగా ఉంది. జైళ్లలో మగ్గుతున్నది నూటికి 80 శాతం మంది విచారణ ఖైదీలే. 30 ఏళ్లనాటి జైలు నిబంధనలనే ఇప్పటికీ అనుసరించడం దారుణ మైన విషయం. విషయాలు రాబట్టడానికే పోలీసులు మిమ్మల్ని చిత్రహిం సలు పెట్టారని భావించొచ్చా? పోలీసు అధికారులకు కావాల్సింది వేరు. శాశ్వతంగా ఉద్యమం నుంచి మమ్మల్ని దూరంగా ఉంచడం. ఓ మావోయిస్టు ఖైదీపై నార్కో టెస్ట్‌లు చేయడం నాతోనే మొదలు. నార్కో టెస్ట్‌లో మేం ఏం చెప్పినా అది వారికి అనుకూలంగా మార్చుకొని రాసుకుంటారు. సమాధా నాలు మావే ఉంచి, ప్రశ్నలు మార్చి రికార్డు చేస్తారు. ఇప్పుడైతే ఖైదీ అనుమతి లేకుండా నార్కో టెస్ట్ చేయకూ డదు. ఎన్ని హింసలు పెట్టినా సత్యం జయించింది. నాపై మోపిన తప్పుడు కేసులు వీగిపోయాయి. కానీ కోల్పోయిన నా జీవితం తిరిగిరాదుగా... జైళ్లలో మగ్గుతున్న వారిలో అత్యధిక శాతం దళితులు, ఆదివాసీలు, మైనారిటీలే. అలా ఎందుకు జరుగుతోంది? అమెరికా జైళ్ళ నిండా బ్లాక్సే ఉంటారు ఎందుకు? ఎం దుకంటే వారు వాయిస్ లెస్ పీపుల్. గొంతులేని వారే అణచబడతారు. అందుకే మేం ఇలాంటి వేలాది మంది జైళ్లలో మగ్గుతున్న ఖైదీలకు లీగల్ ఎయిడ్ కావాలని కోరుతున్నాం. వారి పక్షాన నిలబడే బాలగోపాల్ లాం టి అడ్వొకేట్ ఒక్కరయినా కావాలి. న్యాయాన్ని కొనుక్కో లేక ఏళ్లతరబడి జైళ్లలో మగ్గుతున్న వాళ్లకి న్యాయం చేయాలన్న ఉద్దేశ్యంతోనే నేనిప్పుడు లా చేస్తున్నాను. జైలు జీవితం తరువాత మీ దృక్పథంలోగానీ, మీ సంక ల్పంలోగానీ ఏమైనా తేడా ఉందా? కచ్చితంగా లేదు. నా చిన్నారి బిడ్డని వదిలి వెళ్లినా, మళ్లీ స్వేచ్ఛా ప్రపంచంలోకి వచ్చి వాడిని గుండెలకు హత్తు కున్నాను. అలాగే ఉద్యమాన్ని హత్తుకుంటాను. జైలు గోడలు బద్దలయ్యే రోజు కోసం ఎదురుచూస్తాను. - అత్తలూరి అరుణ