వెర్నన్ గొంజాల్వెజ్, స్టాన్ స్వామి, అరుణ్ ఫెరీరా, సుధా భరద్వాజ్, గౌతం నవలఖా
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లో మంగళవారం పుణె పోలీసులు పది మంది సామాజిక కార్యకర్తల ఇళ్లపై దాడులు నిర్వహించి అరెస్ట్ చేసిన ఐదుగురు సామాజిక కార్యకర్తలపై పోలీసులు ఎలాంటి కేసులు పెట్టారు ? ఎలాంటి కేసులు పెడుతున్నారు ? ఏ చట్టం కింద? ఏ సెక్షన్ కింద? అన్న విషయాలు ఇప్పుడు చర్చనీయాంశాలయ్యాయి. మహారాష్ట్రలోని భీమా కోరెగావ్‌లో జనవరి ఒకటవ తేదీన జరిగిన దళితుల మహార్యాలీ సందర్భంగా తలెత్తిన అల్లర్ల విచారణలో భాగంగానే వీరిని అరెస్ట్ చేసినట్లు ప్రాథమిక వార్తలు తెలియజేశాయి. ఇదే అల్లర్లకు సంబంధించి జూన్ 6వ తేదీన ఐదుగురు సామాజిక కార్యకర్తలను పుణె పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై అత్యంత వివాదాస్పదమైన ‘చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం–1967 (వీఏపీఏ)’ను దాఖలు చేశారు. 2012లో ఈ చట్టాన్ని కేంద్రం సవరించినప్పటికీ ప్రమాదకర సెక్షన్లు, అంశాలు ఇంకా అందులో అలాగే ఉన్నాయి.
హైదరాబాద్‌లో అరెస్టయిన వరవరరావు సహా ఐదుగురు సామాజిక కార్యకర్తలపై కూడా వీఏపీఏ చట్టాన్నే దాఖలు చేసే అవకాశం ఉంది. పుణెలోని జాయింట్ కమిషనర్ కార్యాలయం నుంచి రాంచి పోలీసు స్టేషన్‌కు అందిన ఉత్తర్వుల్లో ‘నెంబర్ 4–2018’ కేసులో విచారణ కోసం అరెస్ట్ చేయాల్సిందిగా ఉంది. అంటే ఆ నెంబర్ కేసు వీఏపీఏదే. అయితే గతంలో అరెస్టై ప్రస్తుతం పుణె పోలీసుల నిర్బంధంలో ఉన్న సామాజిక కార్యకర్త రోనా విల్సన్ వద్ద దొరికినట్లు పోలీసులు చెబుతున్న ఓ లేఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు మావోయిస్టులు కుట్రపన్నారని ఉంది. దీంతో ప్రధాని హత్యకు కుట్రపన్నారన్న ఆరోపణలపై కేసు పెట్టే అవకాశం ఉందని ఊహాగానాలు చెలరేగాయి. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మోదీ ప్రభుత్వమే ఇలాంటి కుట్రలు పన్నుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో, మోదీ హత్య కుట్రకు ఎలాంటి బలమైన ఆధారాలు లేకపోవడం వల్ల ఆ కేసును దాఖలు చేయక పోవచ్చు.
వరవరరావు, ఆనంద్ టెల్‌టుంబ్డే, రోనా విల్సన్
వీఏపీఏ చట్టం ఎంతో ప్రమాదకరమైనది
ఈ చట్టంలోని 13, 16, 17, 17బీ, 20, 38, 39, 40 సెక్షన్ల కింద నిందితులను విచారిస్తున్నారు. ఇందులోని 13వ సెక్షన్ ప్రకారం చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న, వాటితో సంబంధం ఉన్నా ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించివచ్చు. మిగతా సెక్షన్లు దీనికంటే ప్రమాదరకమైనవి. టెర్రరిస్టు కార్యకలాపాలను సూచించేవి. టెర్రరిస్టు కార్యకలాపాలతో ఎవరి చావుకు కారణమైన, టెర్రరిస్టు చర్యకు ఆర్థిక సహాయం అందించినా, టెర్రరిస్టు చర్యకు పాల్పడినా, టెర్రరిస్టు సంస్థకు నియామకాలు జరిపినా, అందులో సభ్యుడిగా కొనసాగినా, ఆ సంస్థ తరఫున విరాళాలు వసూలు చేసినా ఐదేళ్ల నుంచి యావజ్జీవ శిక్ష, మరణ శిక్ష విధించే సెక్షన్లు వీటిలో ఉన్నాయి. మహాయిస్టు చర్యలను టెర్రరిస్టు చర్యలుగా పోలీసులు పరిగణిస్తున్న విషయం తెల్సిందే.
హర్యానాలోని ఫరిదాబాద్‌లో అరెస్ట్ చేసిన న్యాయవాది సుధా భరద్వాజ్‌పై వీఏపీఏ చట్టంలోని కొన్ని సెక్షన్లతోపాటు మత విద్వేషాలను రెచ్చగొట్టారని, ప్రజల్లో భయాందోళనలు సృష్టించారని, వదంతలు వ్యాప్తి చేశారని, ప్రజలను తప్పుదోవ పట్టించారని.. ఇలా పలు ఆరోపణలు చేస్తూ భారతీయ శిక్షా స్మృతిలోని 34, 153 ఏ, 505 (1బీ), 117, 120 బీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెల్సింది. ఆమె వద్ద దొరికిన ఓ లేఖలో కశ్మీరు వేర్పాటువాదులకు, మావోయిస్టులకు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోందని పోలీసులు అంటున్నారు.
ఇంతకు వీరిపై కేసులెందుకు?
ఈ ఏడాది జనవరి 1వ తేదీన పుణెకు సరిగ్గా 30 కిలోమీటర్ల దూరంలోని భీమా కోరెగావ్‌లో ఏటా జరిగే దళితుల మహార్యాలీ జరిగింది. దాదాపు మూడు లక్షల మంది హాజరైన ఆ ర్యాలీ సందర్భంగా విధ్వంసకాండ చెలరేగింది. అందులో ఒకరు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ అల్లర్లను డిసెంబర్ 31వ తేదీన ఓ బహిరంగ వేదిక నుంచి ప్రసంగించిన సామాజిక కార్యకర్తలు రెచ్చగొట్టే ప్రసంగాలతోపాటు ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టించారన్నది పోలీసుల అభియోగం. (చదవండి: భీమా కోరేగావ్ సంఘటనకు బాధ్యలెవరు?)
ప్రధాని నరేంద్ర మోదీతో సంభాజి భిడే
నాడేమి వార్తలొచ్చాయి?
కాషాయ జెండాలు ధరించిన ఆరెస్సెస్ కార్యకర్తలు ర్యాలీని అడ్డుకునేందుకు ప్రయత్నించడం వల్లనే విధ్వంసకాండ చెలరేగిందని నాడు వార్తలు వచ్చాయి. ర్యాలీకి కొన్ని రోజుల ముందు ర్యాలీని అడ్డుకోవాల్సిందిగా హిందూ సంఘాల నాయకులు ఇచ్చిన పిలుపే అల్లర్లకు కారణమైందని ఆ వార్తలు సూచించాయి. దాంతో ఆరెస్సెస్ కార్యకర్తలను రెచ్చగొడుతూ మాట్లాడినా ‘హిందూ ఏక్తా మంచ్’ అధ్యక్షుడు మిలింద్ ఎక్బోటే, ‘శివప్రతిష్ఠాన్ హిందుస్థాన్’ సంస్థ చీఫ్ సంభాజీ భిడేలపై పుణె పోలీసులు జనవరి 3వ తేదీన కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వారిద్దరికి ఆరెస్సెస్ అధినాయకులతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో వారిని కనీసం పోలీసులు అరెస్ట్ చేసేందుకు సాహసించలేక పోయారు. ఆ విషయమై సుప్రీం కోర్టు మహారాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదిని తీవ్రంగా నిలదీసింది. అరెస్ట్‌లు చూపించాక కోర్టుకు రావాలని కూడా ఆదేశించింది. దాంతో మిలింద్ ఎక్బోటేను అరెస్ట్ చేసిన పోలీసులు వెంటనే బెయిల్‌పై విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తన గురువుగా భావించే సంభాజి భిడేను అరెస్ట్ చేయడానికి మాత్రం ఎప్పుడూ ప్రయత్నించలేదు.
హఠాత్తుగా మలుపు తిరిగిన కేసు
హిందూ సంఘాలపై నుంచి కేసు దృష్టి ఒక్కసారిగా సామాజిక కార్యకర్తల వైపు మళ్లింది. ఎక్బోటే, భిడేలాంటి హిందూ నాయకుల ప్రసంగాల వల్ల అల్లర్లు చోటు చేసుకోలేదని, సామాజిక కార్యకర్తలు రెచ్చగొట్టడం వల్లనే అల్లర్లు జరిగాయని అభిప్రాయపడిన పుణె పోలీసులు జూన్ ఆరవ తేదీన ఐదుగురు సామాజిక కార్యకర్తలను అరెస్ట్ చేశారు. నాడు విద్వేషాలను రెచ్చగొట్టారంటూ హిందూత్వ నాయకులపై భారతీయ శిక్షాస్మృతిలోని సాధారణ సెక్షన్లను నమోదు చేయగా, ఆ తర్వాత సామాజిక కార్యకర్తలపై మాత్రం అత్యంత వివాదాస్పదమైన ‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం’ కింద కేసులు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment