న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాలపై బలమైన సాక్ష్యాధారాలు ఉండటంతోనే ఐదుగురు హక్కుల కార్యకర్తలను అరెస్ట్ చేశామని మహారాష్ట్ర బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. కేవలం అసమ్మతి, అభిప్రాయభేదం కారణంగా ఈ అరెస్టులు జరగలేదని స్పష్టం చేసింది. పుణెలోని భీమా కొరేగావ్‌లో గతేడాది డిసెంబర్ 31న ఎల్గర్ పరిషత్ సభ సందర్భంగా చెలరేగిన హింసకు మావోలతో కలసి కుట్రపన్నారంటూ విప్లవ రచయితల సంఘం (విరసం) సభ్యుడు వరవరరావు, అరుణ్ ఫెరీరా, వెర్మన్ గంజాల్వెజ్, సుధా భరద్వాజ్, గౌతమ్ నవలఖాల వంటి మానవహక్కుల కార్యకర్తలను పుణె పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీన్ని విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఐదుగురిని విడుదలచేసి గృహనిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది. ఈ సందర్భంగా అసమ్మతి, భిన్నాభిప్రాయం అన్నది ప్రజాస్వామ్యానికి రక్షక కవాటం వంటిదని కోర్టు పేర్కొంది. తాజాగా ఈ హక్కుల కార్యకర్తల అరెస్ట్‌ను సవాలుచేస్తూ చరిత్రకారిణి రొమీలా థాపర్, ఆర్థికవేత్తలు ప్రభాత్ పట్నాయక్, దేవకి జైన్, సామాజికవేత్త సతీశ్ దేశ్‌పాండే, న్యాయ నిపుణుడు మజా దరువాలాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో బుధవారం సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్‌లో మహారాష్ట్ర పోలీసులు స్పందిస్తూ.. ‘న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన ఐదుగురికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. ప్రస్తుతం విచారణ సాగుతుండగానే వీరు ఐదుగురు హక్కుల కార్యకర్తల బెయిల్ కోసం పిటిషన్ దాఖలుచేశారు. మేం అరెస్ట్ చేసిన ఐదుగురు నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీలో చురుగ్గా పనిచేస్తూ నేరపూరిత కుట్రలో భాగస్వాములయ్యారు. వీరు ఎల్గర్ పరిషత్ పేరుతో బహిరంగ సభను ఏర్పాటుచేశారు. రాజకీయ సిద్ధాంతాలు, భావజాలాల మధ్య భిన్నాభిప్రాయంతో ఈ ఐదుగురిని అరెస్ట్ చేయలేదు. వీరు తీవ్రమైన నేరాలకు పాల్పడినట్లు బలమైన సాక్ష్యాలు లభించాయి. తనిఖీల సందర్భంగా వీరి ఇళ్లలోని కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, పెన్‌డ్రైవ్‌లు, మెమొరి కార్డుల్లో లభ్యమైన సమాచారాన్ని బట్టి వీరు సమాజాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నినట్లు తేలింది’ అని తెలిపారు.
‘రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, ఇతరుల నుంచి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాల్లో దేశంతో పాటు భద్రతాబలగాలపై దాడికి ప్రణాళిక, ఇతర కార్యకర్తలతో సమన్వయం తదితరాలపై కీలక సమాచారం లభిం చింది. అంతేకాకుండా వీరు తమ పార్టీలోకి నియామకాలను చేపట్టడంతో పాటు వారిని అండర్‌గ్రౌండ్ శిక్షణకు పంపడం, నిధుల సమీకరణ–పంపకం, ఆయుధాల ఎంపిక, కొనుగోలు, వీటిని దేశంలోకి అక్రమరవాణా చేసేందుకు మార్గాలను ఎంపికచేయడంలో భాగస్వాములయ్యారు. అరెస్టయినవారిలో కొందరు కూంబింగ్ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాత్మక పద్ధతులను మావోలకు అందజేస్తున్నట్లు ఆ పత్రాల్లో లభ్యమైంది’ అని పోలీసులు చెప్పారు.
ధనరూపంలో వెలకట్టలేనిది జీవితం
రేప్ బాధితులపై సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీః జీవితం అమూల్యమైనదని, ఏ కోర్టూ దాన్ని ధనరూపంలో వెలకట్టలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అత్యాచార, యాసిడ్ దాడి బాధిత మహిళలకు జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ(నల్సా) రూపొందించిన పరిహార పథకంపై విచారణ సందర్భంగా బుధవారం పైవిధంగా స్పందించింది. పైన పేర్కొన్న రెండు నేరాల్లో బాధిత మహిళకు కనిష్టంగా రూ.5 లక్షలు, గరిష్టంగా(మరణించిన పక్షంలో) రూ.10 లక్షలు చెల్లించాలని నల్సా సిఫార్సు చేసింది. ఈ పరిహార పథకాన్ని ఓ లాయర్ ప్రశ్నించగా..‘జీవితానికి వెలను నిర్ధారించలేం. దాన్ని ధనరూపంలో చెప్పలేం’ అని జస్టిస్ మదన్ బి.లోకూర్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టు ఆమోదించిన నల్సా పరిహార పథకం అక్టోబర్ 2 నుంచి అమల్లోకి రానుంది.
ఏపీలో 901 కేసుల్లో ఒక్కరికే...
రేప్, యాసిడ్ దాడి బాధితుల్లో కేవలం 5 నుంచి 10 శాతం మందికే పరిహారం అందుతోందని నల్సా ధర్మాసనం దృష్టికి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది 901 కేసులు నమోదైతే ఒక బాధితురాలికే పరిహారం దక్కినట్టు వెల్లడించింది. పోక్సో చట్టం కింద ఆంధ్రప్రదేశ్‌లో 1028 కేసులు నమోదైతే కేవలం 11 మంది బాధితులకే పరిహారం అందినట్లు తెలిపింది.
‘మావో’ లింకులపై బలమైన సాక్ష్యాలు
Published Thu, Sep 6 2018 2:54 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment