బుధవారం వరవర రావు, వెర్నాన్ గంజాల్వేస్‌లను పుణెలోని కోర్టుకు తీసుకొస్తున్న పోలీసులు
న్యూఢిల్లీ: భీమా–కోరేగావ్ హింస కేసులో అరెస్టయిన ఐదుగురు మానవహక్కుల కార్యకర్తలకు సుప్రీంకోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. అరెస్టు చేసిన వారిని సెప్టెంబర్ 6 వరకు గృహనిర్బంధంలో ఉంచాలని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఆదేశించింది. భిన్నాభిప్రాయాన్ని వెల్లడించడం ప్రజాస్వామ్యంలో భాగమని, దీన్ని అణగదొక్కడం సరికాదని పేర్కొంది. తదుపరి విచారణను సెప్టెంబర్ 6కు వాయిదా వేసింది. భీమా–కోరేగావ్ హింస జరిగిన 9 నెలల తర్వాత వీరిని అరెస్టు చేయడంపై మహారాష్ట్ర పోలీసులను ప్రశ్నించింది.
ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను వెల్లడించే హక్కు ఉందని జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లు సభ్యులుగా ఉన్న ధర్మాసనం పేర్కొంది. ‘ప్రజాస్వామ్యంలో భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు సేఫ్టీ వాల్వ్ వంటిది. దీన్ని మీరు అణచాలని చూస్తే ఎప్పుడో ఓసారి అది బద్దలవుతుంది’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. ఈ అరెస్టులను ఖండిస్తూ.. చరిత్రకారురాలు రోమిలా థాపర్, ప్రభాత్ పట్నాయక్, దేవికా జైన్ సహా ఐదుగురు వేసిన పిటిషన్ ఆధారంగా మహారాష్ట్ర ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
కాగా, నవలఖా అరెస్టుపై ఇచ్చిన ట్రాన్సిట్ రిమాండ్‌ను పరిశీలిస్తామని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా సరైన ఆధారాలు చూపకుండానే నవలఖాను ఎలా అరెస్టు చేశారని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అటు ఎన్‌హెచ్చార్సీ కూడా ఈ అరెస్టులపై వివరణ ఇవ్వాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అరెస్టు చేసిన వారందరినీ వారి ఇళ్లకు పంపించాలని పుణే కోర్టు ఆ రాష్ట్ర పోలీసులను ఆదేశించింది.
కోర్టుకు మహా విన్నపం
అరెస్టయిన ఐదుగురిని విడుదల చేయాలంటూ దాఖలయ్యే పిటిషన్లను విచారణకు అంగీకరించవద్దని మహారాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. ఇప్పటికే పలువురు ఈ అంశంపై వివిధ హైకోర్టులను ఆశ్రయించిన నేపథ్యంలో మహా సర్కారు ఈ అంశాన్ని లేవనెత్తింది. హైదరాబాద్ నుంచి వరవరరావు, ముంబై నుంచి అరున్ ఫెరీరా, వెర్నాన్ గంజాల్వేస్, హరియాణాలోని ఫరీదాబాద్ నుంచి సుధా భరద్వాజ్, ఢిల్లీ నుంచి గౌతమ్ నవలఖాలను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. డిసెంబర్ 31న భీమా–కోరేగావ్ గ్రామంలో జరిగిన ‘ఎల్గార్ పరిషత్’ సభ కారణంగానే దళితులు, అగ్రవర్ణాల మధ్య హింస ప్రజ్వరిల్లిందనే కేసులో ఈ ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
నవలఖా అరెస్టుపై ఢిల్లీ హైకోర్టు..
హక్కుల కార్యకర్త నవలఖా అరెస్టు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. కేసుకు సంబంధించిన దస్తావేజులను మరాఠీలోనే ఉంచడాన్ని ప్రశ్నించింది. ‘తననెందుకు అరెస్టు చేస్తున్నారో తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలాంటప్పుడు అరెస్టు పేపర్లను ఇంగ్లిషులోకి తర్జుమా చేసి నవలఖాకు ఎందుకు ఇవ్వలేదు?’ అని కూడా ప్రశ్నించింది. దస్తావేజులు వేరే భాషలో ఉన్నప్పటికీ మెజిస్టీరియల్ కోర్టు ట్రాన్సిట్ రిమాండ్ ఎలా జారీ చేసిందని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పోలీసు దస్తావేజులను వెంటనే ఇంగ్లిష్‌లోకి మార్చాలని కోర్టు ఆదేశించింది.
నవలఖా అరెస్టులో న్యాయపరమైన అంశాలు, పుణే కోర్టుకు తీసుకెళ్లేందుకు అవసరమైన ట్రాన్సిట్ రిమాండ్‌ను పరిశీలిస్తామని పేర్కొంది. అయితే సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా చదివిన తర్వాతే ఈ దిశగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. భీమా–కోరేగావ్ వివాదానికి సంబంధించి మిగిలిన అరెస్టులు సరైనవే అని వెల్లడైతే.. నవలఖా విషయంలోనూ స్పష్టత వస్తుందని కోర్టు పేర్కొంది. కాగా, మరాఠీలో ఉన్న పత్రాలను ఇంగ్లిష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసి నవలఖా లాయర్లకు ఇస్తామని మహారాష్ట్ర పోలీసుల తరఫు న్యాయవాది అడిషనల్ సొలిసిటర్ జనరల్ అమన్ లేఖీ కోర్టుకు తెలిపారు.
ప్రజాగొంతుక నొక్కేస్తున్నారు: అంబేడ్కర్
ప్రజల గొంతుకను నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. భారతీయ రిపబ్లిక్ పార్టీ బహుజన్ మహాసంఘ్ నేత ప్రకాశ్ అంబేడ్కర్ ఆరోపించారు. వామపక్ష భావజాలమున్న నేతలను అరెస్టు చేయడం.. ప్రజల గొంతుకను నొక్కడమేనన్నారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా గొంతెత్తుతున్న ఎన్జీవోలు, రాజకీయేతర సంస్థలు లక్ష్యంగానే ఈ దాడులు జరుగుతున్నాయని ఆయన ముంబైలో విమర్శించారు. సనాతన్ సంస్థపై దాడులు జరుగుతున్న సమయంలో కావాలనే ఎల్గార్ పరిషత్ సభ్యులపైనా దాడులు నిర్వహిస్తున్నారన్నారు.
అటు శివసేన కూడా భీమా–కోరేగావ్ హింసకు అసలైన సూత్రధారులను ఇంకా అరెస్టు చేయకపోవడం దారుణమని పేర్కొంది. మావోయిస్టులతో సంబంధాన్ని అంటగడుతూ అరెస్టులు జరిపే సంస్కృతి దేశవ్యాప్తంగా జరుగుతోందని విమర్శించింది. భారతీయ శిక్షాస్మృతి 153 (ఏ) కింద (మతం, జాతి, పుట్టిన ప్రాంతం, భాష ఆధారంగా వివిధ వర్గాల మధ్య శతృత్వాన్ని పెంచేలా వ్యాఖ్యానించడం) ఐదుగురిని పుణే పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా, అరెస్టులకు ముందు చట్టపరమైన అన్ని నిబంధనలు అమలుచేశామని మహారాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి దీపక్ సర్కార్ తెలిపారు. అన్ని ఆధారాలు ఉన్నందునే అరెస్టులు జరిగాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment