ముంబయి: బీమా కొరేగావ్ కేసులో నిందితులుగా ఉన్న ఎల్గార్ పరిషత్ సభ్యులు వెర్నాన్ గోన్సాల్వేస్, అరుణ్ ఫెరీరాలకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తీవ్రవాద వ్యతిరేక నిరోధక చట్టం (ఊపా) కింద అరెస్టైన వీరిద్దరి బెయిల్ పిటీషన్‌ను 2021 డిసెంబర్‌లో బాంబే హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. బీమా కోరేగావ్ కేసులో హింసను ప్రేరేపించారనే ఆరోపణలపై 2018లో వీరిని అరెస్టు చేశారు. అప్పటి నుంచి ముంబయిలోని తలోజా జైలులో నిర్భందించారు.
ఐదేళ్లపాటు వరుసగా కస్టడీలోనే ఉన్నందున కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. నిందితులపై ఉన్న ఆరోపణలు తీవ్రమైనవి అనే ఒక్క కారణంతో బెయిల్ నిరాకరించడం సమంజసం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. వెర్నాన్ గోన్సాల్వేస్, అరుణ్ ఫెరీరాల తరపున న్యాయవాదులు మూడు రోజుల పాటు వాదనలు వినిపించారు. ఊపా చట్టం కింద అరెస్టు చేయడానికి సరిపడు ఆధారాలు తమ క్లయింట్ల వద్ద లభించలేదని విన‍్నివించారు. అందుకు తగు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకోలేదని స్పష్టం చేశారు.
పూణెలోని బీమా కొరేగావ్ యుద్ధ స‍్మారకం వద్ద 2017 డిసెంబర్‌లో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ కేసులో వెర్నాన్ గోన్సాల్వేస్, అరుణ్ ఫెరీరాలతో సహా 14 మందిని ఎన్‌ఐఏ నిందితులుగా చేర‍్చింది. బీమా కొరేగావ్ యుద్ధం జరిగి 200 ఏళ్ల వార్షికోత్సవాన్ని 2017 డిసెంబర్ 31న జరిపారు.
దీనిని పురస్కరించుకుని ఎల్గార్ పరిషత్ ఈవెంట్‌కు సంబంధించి మావోయిస్టులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ముంబయి, నాగ్‌పూర్, ఢిల్లీ నుంచి 2018 జూన్‌లో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఎల్గార్ పరిషత్ కార్యక్రమంలో రెచ్చగొట్టే ప్రసంగాలు హింసను ప్రేరేపించాయని విశ్రాంబాగ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఇదీ చదవండి: కావాలనే లీక్ చేశారు.. మణిపూర్ నగ్న ఊరేగింపు ఘటనపై హోం మంత్రి వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment