నీలిచిత్రాల తారకు అనైతిక చెల్లింపుల కేసులో ట్రంప్‌కు శిక్షపై జడ్జి
న్యూయార్క్: అమెరికా రాజకీయ చరిత్రలో గతంలో ఎన్నడూ కనివినీ ఎరుగని వింత ఘట్టానికి న్యాయమూర్తి జువాన్ ఎం.మర్చన్ తెరలేపారు. క్రిమినల్ కేసులో దోషిగా తేలిన వ్యక్తిని శిక్షిస్తానంటూనే శిక్షాకాలం విధించబోనని చెప్పి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణంచేయడానికి సరిగ్గా పది రోజుల ముందు జనవరి పదో తేదీ ఉదయం 9.30 గంటలకు సంబంధిత తీర్పు చెప్తానని జడ్జి ప్రకటించారు.
నీలిచిత్రాల తార స్టార్మీ డేనియల్‌కు అనైతిక నగదు చెల్లింపుల కేసులో దోషిగా తేలిన ట్రంప్‌కు పదో తేదీన శిక్ష ఖరారుచేస్తానని శుక్రవారం న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్ కోర్టు జడ్జి వెల్లడించారు. ‘‘కారాగారంలో జైలుశిక్ష అనుభవించాల్సిన అవసరంలేకుండా ట్రంప్‌ను బేషరతుగా వదిలేస్తూ, కేసుకు ముగింపు పలుకుతూ తీర్పు రాస్తా. అన్‌కండీషనల్ డిశ్చార్జ్ తీర్పు వినేందుకు ట్రంప్ కుదిరితే ప్రత్యక్షంగా లేదంటే వర్చువల్‌గా కోర్టు ఎదుట హాజరవ్వాల్సి ఉంటుంది.
ట్రంప్‌కు ఎలాంటి ప్రొబేషన్ పిరియడ్, జరిమానా విధించబోను’’అని జడ్జి చెప్పారు. గతంలో తనతో శృంగారం జరిపిన విషయం ఎవరికీ చెప్పకుండా దాచేందుకు స్టార్మీ డేనియల్‌కు ట్రంప్ తన లాయర్ ద్వారా 2016 ఏడాదిలో 1,30,000 డాలర్లు ఇచ్చారు. ఈ నగదును లెక్కల్లో తప్పుగా చూపారు. ఈమెకు నగదు ఇచి్చన విషయాన్ని దాచి ఆ నగదును ఎన్నికల జమా ఖర్చు కింద మార్చిరాశారు. ఈ అనైతిక చెల్లింపును ‘హష్ మనీ’గా పేర్కొంటారు.
ఎన్నికల విరాళాలను ఇలా అక్రమంగా దుర్వినియోగం చేశారని ట్రంప్‌పై కేసు నమోదైంది. ఈ కేసులో 34 అంశాల్లో ట్రంప్ దోషిగా తేలిన విషయం విదితమే. జూలై 11వ తేదీనే ట్రంప్ కేసు ముగింపుకొచ్చినా అధ్యక్షునిగా గెలిచిన వ్యక్తికి క్రిమినల్ కేసు విచారణ నుంచి మినహాయింపు ఉంటుందంటూ ట్రంప్ న్యాయవాదులు ఇన్నాళ్లూ వాదిస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఇవన్నీ చెల్లవంటూ న్యాయమూర్తి తన తీర్పున వెలువరించేందుకు సిద్ధమయ్యారు.
క్రిమినల్ కేసులో దోషిగా తేలి శిక్షను ఎదుర్కోబోతున్న మొట్టమొదటి అమెరికా మాజీ, కాబోయే అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రలో నిలవబోతున్నారు. తీర్పు వచ్చాక న్యూయార్క్ చట్టాల ప్రకారం ట్రంప్ తన డీఎన్‌ఏ శాంపిల్‌ను రాష్ట్ర నేర డేటాబ్యాంక్‌కు అందించాల్సి ఉంటుంది. ఒకవేళ ట్రంప్‌కు జడ్జి శిక్ష విధిస్తే పదిరోజుల తర్వాత అధ్యక్షుడి హోదాలో తనకు తాను క్షమాభిక్ష ప్రసాదించుకునే అవకాశం ట్రంప్ లేదని అమెరికా రాజ్యాంగం చెబుతోంది. దేశ స్థాయిలో శిక్షలకు మాత్రమే అధ్యక్షుడు క్షమాభిక్ష ప్రసాదించగలడు. న్యూయార్క్ రాష్ట్ర కోర్టు ఇచ్చే తీర్పులకు ఇది వర్తించదు.
ఇదీ చదవండి: డాలర్ డ్రీమ్స్‌పై మరో పిడుగు
Comments
Please login to add a commentAdd a comment