Hush money case: డొనాల్డ్‌ ట్రంప్‌ దోషి | Hush money case: Former U.S. President Donald Trump is convicted in hush money trial | Sakshi
Sakshi News home page

Hush money case: డొనాల్డ్‌ ట్రంప్‌ దోషి

Published Sat, Jun 1 2024 5:29 AM | Last Updated on Sat, Jun 1 2024 11:38 AM

Hush money case: Former U.S. President Donald Trump is convicted in hush money trial

హష్‌ మనీ కేసులో న్యూయార్క్‌ కోర్టు తీర్పు  

ట్రంప్‌పై 34 అభియోగాలు రుజువయ్యాయని వెల్లడి  

జూలై 11న శిక్ష ఖరారు చేయనున్న న్యాయస్థానం  

జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశం  

అవినీతికి పాల్పడి తప్పుడు తీర్పు ఇచ్చారని ట్రంప్‌ ఆగ్రహం 

ఒక కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడిగా రికార్డుకెక్కిన ట్రంప్‌   ­

న్యూయార్క్‌/వాషింగ్టన్‌:  ఒక కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌(77) అప్రతిష్ట మూటగట్టుకున్నారు. పోర్న్‌ స్టార్‌ స్టార్మీ డేనియల్స్‌కు 1.30 లక్షల డాలర్లు అక్రమంగా చెల్లించి, బిజినెస్‌ రికార్డులు తారుమారు చేసిన కేసులో న్యూయార్క్‌ కోర్టు ఆయనను దోషిగా తేలి్చంది. ట్రంప్‌పై నమోదైన 34 తీవ్ర అభియోగాలన్నీ రుజువయ్యాయని వెల్లడించింది.

 జూలై 11న న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వడంతోపాటు శిక్ష ఖరారు చేయనుంది. ఈ వ్యవహారంలో ట్రంప్‌కు జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. శిక్ష పడినప్పటికీ.. మరో ఆరు నెలల్లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థిగా ట్రంప్‌ పోటీ చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు కాబోవని అంచనా వేస్తున్నారు. న్యూయార్క్‌ కోర్టు తీర్పుపై డొనాల్డ్‌ ట్రంప్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. కోర్టు బయట ఆయన మీడియాతో మాట్లాడారు.

 ఓ న్యాయమూర్తి అవినీతికి పాల్పడి తప్పుడు తీర్పు ఇచ్చారని విమర్శించారు. ఇక్కడేం జరిగిందో ప్రజలకు తెలుసని చెప్పారు. అసలైన తీర్పును నవంబర్‌ 5న అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా ప్రజలు ఇవ్వబోతున్నారని స్పష్టం చేశారు. తాను నిజాయతీపరుడినని, ఎలాంటి తప్పూ చేయలేదని పేర్కొన్నారు. అమెరికా కోసం, అమెరికా రాజ్యాంగం కోసం పోరాటం కొనసాగిస్తానని వెల్లడించారు. ఈ పోరాటంలో అంతిమ విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు.  

హష్‌ మనీ కేసులో దోషిగా తేలిన తర్వాత డొనాల్డ్‌ ట్రంప్‌ నిబ్బరంగానే కనిపించారు. కోర్టులో నిశ్శబ్దంగా ఉండిపోయారు. తుది తీర్పు వచ్చేదాకా బెయిల్‌పై బయటే ఉంటారు. జూలై 11న శిక్ష ఖరారు కానుంది. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున ట్రంప్‌ అభ్యర్థిత్వం ఇప్పటికే ఖరారైంది. జూలై 15న మిల్వాకీలో రిపబ్లికన్‌ జాతీయ సదస్సులో ట్రంప్‌ అభ్యరి్థత్వాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. 

అంతా అనుకున్నట్లు జరిగితే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌(81)తో డొనాల్డ్‌ ట్రంప్‌ తలపడతారు. కోర్టు తీర్పుపై బైడెన్‌–కమలా హారిస్‌ ప్రచార విభాగం ప్రతినిధి, కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ మైఖేల్‌ టైలర్‌ హర్షం వ్యక్తం చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని న్యూయార్క్‌ కోర్టు తేల్చిచెప్పిందని అన్నారు  

ఏమిటీ కేసు?  
శృంగార తార స్టార్మీ డేనియల్‌తో ట్రంప్‌ సన్నిహితంగా గడిపినట్లు వార్తలొచ్చాయి. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె నోరు విప్పితే తనకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో ట్రంప్‌ అడ్డదారి ఎంచుకున్నారు. ఆమె నోరు మూయించేందుకు 1.30 లక్షల డాలర్లు తన లాయర్‌ ద్వారా చెల్లించారు. ఎన్నికల ప్రచారం కోసం పారీ్టకి అందిన విరాళాల నుంచే ఈ సొమ్మును స్టార్మీ డేనియల్‌కు చేరవేశారు. అక్రమ చెల్లింపులను కప్పిపుచ్చడానికి బిజినెస్‌ రికార్డులను తారుమారు చేశారు.

 ఈ  వ్యవహారమంతా బహిర్గతం కావడంతో అమెరికాలో గగ్గోలు మొదలైంది. ట్రంప్‌పై విచారణ అధికారులు 34  అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసులో న్యూయార్క్‌ కోర్టులో సుదీర్ఘంగా విచారణ జరిగింది. 22 మంది సాక్షులను న్యాయస్థానం ప్రశ్నించింది. ఎన్నికల చట్టాన్ని ట్రంప్‌ ఉల్లంఘించారని, పోర్న్‌ స్టార్‌కు చెల్లించిన సొమ్మును కోర్టు ఖర్చుల కింద చూపించారని ప్రాసిక్యూటర్లు వాదించారు. ట్రంప్‌ తనతో ఏకాంతంగా గడిపిన మాట నిజమేనని స్టార్మీ డేనియల్‌ కోర్టుకు ఇచి్చన వాంగ్మూలంలో అంగీకరించారు. గురువారం 12 మంది న్యాయమూర్తుల ప్యానెల్‌ చరిత్రాత్మక తీర్పు వెలువరించింది.

ఎన్నికల్లో ట్రంప్‌ పోటీ చేయొచ్చా?  
న్యూయార్క్‌ కోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ట్రంప్‌ భవితవ్యంపై పడింది. కోర్టు ఆయనకు జైలు శిక్ష గానీ, జరిమానా గానీ విధిస్తే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా? చట్టపరంగా అది సాధ్యమేనా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. అమెరికా రాజ్యాంగం ప్రకారం చూస్తే నేరస్థులు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకొనే నిబంధన ఏదీ లేదని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోరి్నయాకు చెందిన న్యాయశాస్త్ర ప్రొఫెసర్‌ రిచర్డ్‌ ఎల్‌.హసెన్‌ చెప్పారు. చట్టపరంగా ఇప్పుడు ట్రంప్‌ అభ్యరి్థత్వానికి వచ్చే ముప్పేమీ లేదని అన్నారు.

కారాగారమా? గృహ నిర్బంధమా?  
⇒  ట్రంప్‌పై 34 అభియోగాలు రుజువయ్యాయి. ఒక్కో అభియోగానికి గరిష్టంగా నాలుగేళ్ల చొప్పున జైలుశిక్ష, 5 వేల డాలర్ల దాకా జరిమానా విధించే అవకాశం ఉంది.  
⇒  జైలు శిక్ష కాకుండా జరిమానా, ప్రొబేషన్‌/సామాజిక సేవను శిక్షగా విధించవచ్చు. ప్రొబేషన్‌ శిక్ష విధిస్తే ప్రొబేషన్‌ అధికారి ఎదుట ట్రంప్‌ తరచుగా హాజరు కావాల్సి ఉంటుంది. కండీషనల్‌ డిశ్చార్జి అనే శిక్ష వేస్తే ప్రొబేషన్‌ అధికారి ఎదుట హాజరు కావాల్సిన అవసరం ఉండదు.  
⇒  గృహ నిర్బంధం విధించే అవకాశం సైతం లేకపోలేదు. అప్పుడు ట్రంప్‌ తన ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుంది. ఆయన చుట్టూ ఎల్రక్టానిక్‌ నిఘా పెడతారు. హౌజ్‌ అరెస్టు అయితే ట్రంప్‌ నాలుగు గోడల మధ్య నుంచే ఎన్నికల ప్రచారం చేయాలి.  
⇒  ట్రంప్‌ జైలుకెళ్తారా? అంటే కచ్చితంగా చెప్పలేమని న్యాయ నిపుణులు అంటున్నారు. రాబోయే అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కోర్టు ఆయనకు జైలుశిక్ష విధించకుండా కేవలం జరిమానాతో సరిపెట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.  

రాజకీయ దురుద్దేశాలతోనే నాకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. ఇది హష్‌మనీ వ్యవహారం కాదు. ఇది బహిర్గతం చేయకూడదనే ఒక ఒప్పందం మాత్రమే. పూర్తిగా చట్టబద్ధంగానే జరిగింది. ఇలాంటివి అమెరికాలో సర్వసాధారణమే. ప్రత్యర్థులు నన్ను ఇలా ఇరికించారంటే వారు ఇక ఎవరినైనా ఇరికించగలరు. నాపై తప్పుడు కేసు పెట్టి, ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నారు. వారి ఆటలు సాగవు 

– డొనాల్డ్‌ ట్రంప్‌ 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement