హష్‌ మనీ కేసు: అమెరికాలో చరిత్రలోనే నేరం నిరూపితమైన అధ్యక్షుడిగా ట్రంప్‌ | Us President Elect Donald Trump Given Unconditional Discharge In Hush Money Case | Sakshi
Sakshi News home page

హష్‌ మనీ కేసు: అమెరికాలో చరిత్రలోనే నేరం నిరూపితమైన అధ్యక్షుడిగా ట్రంప్‌

Published Fri, Jan 10 2025 9:54 PM | Last Updated on Fri, Jan 10 2025 9:59 PM

Us President Elect Donald Trump Given Unconditional Discharge In Hush Money Case

న్యూయార్క్‌: హష్‌ మనీ కేసులో ట్రంప్‌ నేరాన్ని కోర్టు నిర్థారించింది. జైలు శిక్ష, జరిమానా నుంచి ట్రంప్‌కు మినహాయింపునిచ్చింది. అమెరికాలో చరిత్రలోనే నేరం నిరూపితమైన అధ్యక్షుడిగా ట్రంప్‌ నిలవనున్నారు. ఈ కేసులో న్యాయస్థానం తీర్పు వెలువరిస్తూ.. ఆయనకు అన్‌కండిషనల్‌ డిశ్చార్జ్‌ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేసులో ట్రంప్‌ దోషిగా తేలినప్పటికీ.. ఎటువంటి జైలు శిక్ష, జరిమానా ఎదుర్కోనవసరం లేదు. జనవరి 20న అమెరికా నూతన అధ్యక్షుడుగా డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి బాధ్యతలు స్వీకరించనున్న విషయం తెలిసిందే.

కాగా, అమెరికా రాజకీయ చరిత్రలో గతంలో ఎన్నడూ కనివినీ ఎరుగని వింత ఘట్టానికి న్యాయమూర్తి జువాన్‌ ఎం.మర్చన్‌ తెరలేపారు. క్రిమినల్‌ కేసులో దోషిగా తేలిన వ్యక్తిని శిక్షిస్తానంటూనే శిక్షాకాలం విధించబోనని చెప్పి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే.. అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణం చేయడానికి సరిగ్గా పది రోజుల ముందు జనవరి పదో తేదీ ఉదయం 9.30 గంటలకు సంబంధిత తీర్పు చెప్తానని జడ్జి ప్రకటించారు.

నీలిచిత్రాల తార స్టార్మీ డేనియల్‌కు అనైతిక నగదు చెల్లింపుల కేసులో దోషిగా తేలిన ట్రంప్‌కు పదో తేదీన శిక్ష ఖరారు చేస్తానని న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌ కోర్టు జడ్జి వెల్లడించారు. ‘‘కారాగారంలో జైలుశిక్ష అనుభవించాల్సిన అవసరంలేకుండా ట్రంప్‌ను బేషరతుగా వదిలేస్తూ, కేసుకు ముగింపు పలుకుతూ తీర్పు రాస్తా. అన్‌కండీషనల్‌ డిశ్చార్జ్‌ తీర్పు వినేందుకు ట్రంప్‌ కుదిరితే ప్రత్యక్షంగా లేదంటే వర్చువల్‌గా కోర్టు ఎదుట హాజరవ్వాల్సి ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే.

ట్రంప్‌కు ఎలాంటి ప్రొబేషన్‌ పిరియడ్, జరిమానా విధించబోను’’అని జడ్జి చెప్పారు. గతంలో తనతో శృంగారం జరిపిన విషయం ఎవరికీ చెప్పకుండా దాచేందుకు స్టార్మీ డేనియల్‌కు ట్రంప్‌ తన లాయర్‌ ద్వారా 2016 ఏడాదిలో 1,30,000 డాలర్లు ఇచ్చారు. ఈ నగదును లెక్కల్లో తప్పుగా చూపారు. ఈమెకు నగదు ఇచి్చన విషయాన్ని దాచి ఆ నగదును ఎన్నికల జమా ఖర్చు కింద మార్చిరాశారు. ఈ అనైతిక చెల్లింపును ‘హష్‌ మనీ’గా పేర్కొంటారు.

ఎన్నికల విరాళాలను ఇలా అక్రమంగా దుర్వినియోగం చేశారని ట్రంప్‌పై కేసు నమోదైంది. ఈ కేసులో 34 అంశాల్లో ట్రంప్‌ దోషిగా తేలిన విషయం విదితమే. జూలై 11వ తేదీనే ట్రంప్‌ కేసు ముగింపుకొచ్చినా అధ్యక్షునిగా గెలిచిన వ్యక్తికి క్రిమినల్‌ కేసు విచారణ నుంచి మినహాయింపు ఉంటుందంటూ ట్రంప్‌ న్యాయవాదులు ఇన్నాళ్లూ వాదిస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఇవన్నీ చెల్లవంటూ న్యాయమూర్తి ఇవాళ తన తీర్పున వెలువరించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement