Sudha Bharadwaj
-
Sudha Bharadwaj: పోరాటమే ఆమె జెండా
అమెరికాలో పుట్టి పెరిగింది సుధా భరద్వాజ్ అమ్మతో పాటు స్వదేశానికి వచ్చి కాన్పూర్ ఐఐటీలో చదువు పూర్తి చేసింది. కార్మికులు, గిరిజన మహిళల వెతలు తెలుసుకొని అమెరికన్ పౌరసత్వాన్ని వదులుకుని న్యాయవాద వృత్తిని చేపట్టింది. మహిళా ఖైదీల సమస్యలపై పోరాడింది. సాధారణ జీవనం నుంచి సామాజిక కార్యకర్తగా బలహీనులకు న్యాయం చేయడానికి సమస్యలపై పోరాడుతూనే ఉంది. సుధా భరద్వాజ్ జీవితం తెలుసుకుంటే స్త్రీ శక్తి మరో కోణంలో పరిచయం అవకుండా ఉండదు. ఈ విషయాలను ఆమె ప్రస్తావిస్తూ... అరవై ఏళ్ల క్రితం నవంబర్ 1న అమెరికాలో పుట్టాను. అమ్మనాన్నలు ఇద్దరూ పేరొందిన ఆర్థిక వేత్తలు. సామాజికంగానూ చాలా చురుకుగా ఉండేవారు. నేను పుట్టిన ఏడాదికి వారిద్దరూ భారతదేశం వచ్చారు. నాకు నాలుగేళ్ల వయసులో అమ్మానాన్నలు విడిపోయారు. అమ్మ ఒంటరిగా ఉంటూ నన్ను పెంచి, పెద్దచేసింది. అమ్మకు కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ఫెలోషిప్ రావడంతో విదేశాలకు వెళ్లిపోయాం. ఆ తర్వాత కొన్నేళ్లకు రాజస్థాన్‌లోని జెఎన్యూలో టీచింగ్ చేయడానికి అమ్మ స్వదేశానికి వచ్చింది. అలా అమ్మతోపాటు నేనూ వచ్చేశాను.‘సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అండ్ ప్లానింగ్’ని స్థాపించడంలో ఆమె ముఖ్యమైన పాత్ర పోషించింది. గొప్ప గొప్ప ఆర్థిక వేత్తలతో కలిసి భారత ఆర్థిక వ్యవస్థపై లోతయిన అధ్యయనాలు చేసింది. జేఎన్యులో చదువుతో పాటు సామాజిక రాజకీయ అంశాలపై కూడా విద్యార్థులు చురుకుగా ఉండేవారు. నేను అలాంటి వాతావరణంలో పెరిగాను. సాహిత్య, సామాజిక కార్యక్రమాలంటే ఇష్టంగా ఉండేది. గణితంలో కూడా మంచి ఆసక్తి ఉండటంతో ఐఐటీ కాన్పూర్‌లో అడ్మిషన్ తీసుకున్నాను. ► చదువుతూ కూలీలతో.. ఐఐటీలో కొంతమంది విద్యార్థులతో ఒక చిన్న రీసెర్చ్ టీమ్ ఏర్పడింది. కోర్సుతో పాటు పబ్లిక్ సెక్టార్, సైన్ ్స అండ్ టెక్నాలజీ వరకు చదివేవాళ్లం. సామాజిక సమస్యలనూ చర్చించేవాళ్లం. అప్పుడే ప్రజా సంక్షేమానికి కృషి చేస్తేనే నా చదువుకు సార్థకత అనుకునేదానిని. కొంతమంది తోటివిద్యార్థులతో కలిసి కూలీల మధ్య పనిచేయడం ప్రారంభించాం. ఓసారి ఉన్నావ్‌లోని ఓ ఫ్యాక్టరీలో కార్మికులపై పోలీసులు కాల్పులు జరిపిన ఘటన చోటుచేసుకుంది. మా టీమ్‌తో కలిసి నిజనిర్ధారణ కోసం వెళ్లాం. కష్టపడి పనిచేసే వారితో అనుబంధం అలా మొదలైంది. అక్కడ కార్మికులతో కలిసి వారి పాటలు, సంగీతం ఆస్వాదించేదాన్ని. కాన్పురియా యాసలో మాట్లాడటం, పాడడం అంటే చాలా ఇష్టం ఉండేది. ఆ విధంగా కార్మికుల ఉద్యమంతో చాలా ప్రభావితమయ్యాను. 1982లో ఆసియా క్రీడలు జరగడానికి ముందు ఢిల్లీలో ఫ్లై ఓవర్లు, స్టేడియం నిర్మిస్తున్నారు. ఈ పనులకోసం ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ లోని మారుమూల ప్రాంతాల నుంచి పేద కూలీలను రప్పించి, వారిని శిబిరాల్లో ఉంచారు. అయితే, వారు తమ ఇంటికి వెళ్ళడానికి టికెట్లు కూడా కొనలేని విధంగా చాలా తక్కువ కూలీ ఇచ్చేవారు. నాకెందుకో వారిని క్యాంపులో బంధించినట్లు అనిపించింది. ఆ తర్వాత 1984లో సిక్కుల ఊచకోత, భోపాల్ గ్యాస్ విషాదం దిగ్భ్రాంతికి గురిచేశాయి. సమాజంలో మార్పు తీసుకు రావాలనే సంకల్పం అప్పుడే నా మనసులో బలంగా మారింది. ► నా దేశం కోసం అమెరికా పౌరసత్వం వదులుకున్నా నాకు 21 ఏళ్లు వచ్చినప్పుడు, నేను పుట్టుకతో పొందిన అమెరికన్ పౌరసత్వాన్ని వదులుకోవాలని అమ్మతో కలిసి అమెరికన్ ఎంబసీకి వెళ్లాను. నేను పౌరసత్వాన్ని వదులుకుంటున్నానని చెబితే ఆశ్చర్యపోయారు. అందుకు తగిన ఫారమ్ కోసం వెతికితే, దొరకలేదు. ‘వారం తర్వాత రండి. ఈ నిర్ణయం తీసుకునేముందు మీ ఇంట్లో ఎవరినైనా అడిగారా...?’ వంటి ప్రశ్నలు వేశారు. అంటే ఇంట్లో మగవారికి తెలియకుండా అమెరికన్ పౌరసత్వాన్ని వదులుకోవడానికి వచ్చామని వారు అనుకున్నారు. యుఎస్ పౌరసత్వాన్ని వదులుకున్న తర్వాత, హోం మంత్రిత్వ శాఖలో భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేశాను. ► కార్మిక ఉద్యమాల్లో భాగంగా.. మరోవైపు దేశంలో అలజడి కొనసాగుతోంది. మిల్లు కార్మికుల ఉద్యమాలు ఊపందుకున్నాయి. ఈ ఉద్యమాల్లోనే అద్భుతమైన కార్మిక నాయకుడు శంకర్ గుహ నియోగి పేరు మొదటిసారిగా తెలిసింది. ’ఛత్తీస్‌గఢ్ ముక్తి మోర్చా’ ద్వారా కార్మికుల ఆర్థిక అవసరాలను పెంచడంతోపాటు, వారికోసం పాఠశాలలు, ఆసుపత్రులను నడుపుతూ వారి మధ్య ఉంటూ వ్యసనాల నుండి బయటపడటానికి సహాయం చేస్తున్నాడు. జాతీయ భద్రతాచట్టం కింద అతణ్ణి అరెస్టు చేసినప్పుడు, అతని విడుదల కోసం విద్యార్థులుగా మేం పోరాడాం. విడుదలైన తర్వాత ఆయనను కలిశాం. 1986 నాటికి, నేను ’ఛత్తీస్‌గఢ్ ముక్తి మోర్చా’తో పనిచేయాలని నిర్ణయించుకున్నాను. భిలాయ్ సమీపంలోని రాజహారా గనులలో పనిచేసే పిల్లలకు చదువు నేర్పించడం ప్రారంభించాను. కొంతకాలం తర్వాత, భిలాయ్‌లో కార్మిక చట్టాలను అమలు చేయడానికి భీకర పోరాటం ప్రారంభమైంది. 16 పెద్ద కంపెనీలు 4,200 మంది కార్మికులను తొలగించాయి. కార్మికులను తిరిగి పనిలో చేర్చడానికి ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు జరిగాయి. కొంతమంది కార్మికులు చనిపోయారు. వారి కుటుంబాలతో కలిసి ఎండవానలు లెక్కచేయకుండా గడిపాం. ► న్యాయం కోసం పోరాటం ... కార్మికుల అభ్యర్థన మేరకు, నేను 2000 సంవత్సరంలో నా న్యాయవిద్యను పూర్తి చేసి వారి కోసం న్యాయపోరాటం ప్రారంభించాను. కూలీలు, గిరిజనులు, మహిళలు అనే తేడా లేకుండా వారి కోసం చేసిన చట్టాలు సక్రమంగా అమలు కాకపోవడం చూశాను. నిరసన తెలిపితే వారిపై కేసులు పెడతారు. ఆ తర్వాత కొంతమంది తోటి లాయర్లతో కలిసి జన్–హిత్ పేరుతో గ్రూప్‌ని ప్రారంభించాను. ఆ తర్వాత భూసేకరణ, అటవీ హక్కులు, పర్యావరణ సంబంధిత సమస్యలకు సంబంధించిన అనేక కేసులను వాదించడం ప్రారంభించాం. కేసులన్నీ కార్పొరేట్లపైనే ఉన్నాయి. అప్పటికి చాలామంది శత్రువులను కూడగట్టుకున్నానని గ్రహించాను. కానీ, ఏ మాత్రం భయపడకుండా బలహీనుల కోసం నా గొంతు పెంచుతూనే ఉన్నాను. ► ఆశ సన్నగిల్లిన సందర్భాలు.. 2006లో దంతెవాడలో ఐదుగురు మహిళలపై సామూహిక అత్యాచారం జరిగిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆ మహిళల కేసుపై పోరాడేందుకు న్యాయవాది ఎవరూ సిద్ధంగా లేరు, నేను నా సహోద్యోగులతో కలిసి వారికి న్యాయం చేసే బాధ్యతను తీసుకున్నాను. బాధితుల వాంగ్మూలం నమోదు చేసేందుకు దంతెవాడకు 150 కి.మీ దూరంలోని కొంటకు వెళ్లాల్సి వచ్చింది. ఛత్తీస్‌గఢ్ భాషలో, కొంట అంటే మూల అని అర్థం, ఆ ప్రదేశం నిజానికి ఛత్తీస్‌గఢ్‌లోని ఒక మూల. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రారంభమవుతుంది. జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ప్యూన్ సైకిల్‌పై ఎక్కి వస్తారంటే అక్కడి పరిస్థితిని అంచనా వేయవచ్చు. బాధితులు గోండీ భాషలో తమ బాధలను వివరిస్తుంటే అక్కడ ఉన్న ప్యూన్ అనువాదకుడిగా మారాడు. అప్పుడే అత్యాచారం కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కేసు దంతెవాడకు బదిలీ అయింది. ఆ తర్వాత మహిళలపై ఒత్తిడి తెచ్చి కేసులు ఒక్కొక్కటిగా వెనక్కి తీసుకునేలా చేశారు. అప్పుడు న్యాయంపై ఆశ చచ్చిపోయిందనిపించింది. ► గర్భస్రావం తర్వాత దత్తత కుమార్తె రాజహారలో ఉన్నప్పుడు 8 నెలల గర్భిణిని. ఆ రోజు చాలా వర్షం, మెరుపులు, కడుపునొప్పితో బాధపడుతున్నాను. మా యూనియన్ చెందిన షాహీద్ హాస్పిటల్ కి నడుచుకుంటూ వెళుతుండగా రక్తం కారుతున్నట్లు అనిపించింది. ఎలాగోలా ఆసుపత్రికి చేరుకుని అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆపరేషన్ అయింది. స్పృహ వచ్చాక గర్భస్రావం అయిందని తెలిసింది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత, మళ్లీ గర్భం ప్రమాదకరమనుకున్నాను. అందుకే ఒకమ్మాయిని దత్తత తీసుకున్నాను. కూతురు డిగ్రీ చదువు కోసం డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఢిల్లీకి వచ్చి 58 ఏళ్ల వయసులో నేషనల్ లా యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా తొలిసారి రెగ్యులర్ ఉద్యోగంలో చేరాను. ఏడాది సాఫీగానే గడిచింది. కానీ, ఉద్యమకారిణిగా నన్ను అరెస్టు చేసి జైలుకు పంపారు. చాలా పోరాటం తర్వాత తను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. జైలులో ఉన్నప్పుడు కూతురిని కలవాలని చాలా తపించేదాన్ని. నెలకు ఒకసారి ఉత్తరానికి సమాధానం వచ్చేది. కలవడానికి వీలయ్యేది కాదు. జైలులో ఉన్న మూడేళ్లు మహిళా ఖైదీల సమస్యలను వింటూ, వారి కోసం వర్క్ చేశాను. సామాజిక కార్యకర్తలకు వ్యక్తిగత జీవితం లేదన్నది నిజం. వారు ఇంటికీ, సామాజిక జీవితానికీ మధ్య సమన్వయం చేసుకోలేరు. దీపం కింద చీకటి అనే సామెత నిజం అవుతుంది. ముఖ్యంగా మహిళా సామాజిక కార్యకర్తలు మరిన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నా జైలు డైరీ ’ఫ్రం ఫాన్సీ యార్డ్’లో నేను అలాంటి చాలామంది మహిళల కథలను పంచుకున్నాను. సమాజంలోని ఈ దురాచారాలకు వ్యతిరేకంగా నేను ఎప్పుడూ పోరాడుతూనే ఉన్నాను’’ అని వివరిస్తారు ఈ సామాజిక కార్యకర్త. -
హక్కులు కరవైన కార్మిక లోకం
భారతీయ కార్మికవర్గం మొదటినుంచీ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో పాలు పంచుకుంటూ వచ్చింది. 1908లో ముంబైలో చేసిన ఆరు రోజుల సమ్మె, 1913లో కెనడాలోని పంజాబీ వలస కార్మికులు స్థాపించిన గదర్ పార్టీ, 1930లో నాలుగురోజుల పాటు నడిచిన సోలాపూర్ కమ్యూన్ లాంటి వాటివల్ల భారత కార్మికవర్గం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. 1930లో కార్మికులు కలకత్తా కాంగ్రెస్ సెషన్‌లోకి దూసుకెళ్లడం పూర్ణ స్వరాజ్ తీర్మానం ప్రకటించడానికి దారి తీసింది. 1937లో కిసాన్ సభ, వర్కర్స్ పీసెంట్స్ పార్టీ కార్యాచరణలు, యునైటెడ్ ప్రావిన్స్ లలో జమీందారీ వ్యవస్థ రద్దు తీర్మానాలకు దారితీశాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ దళాలకు సరఫరాలు తీసుకెళ్లడానికి తిరస్కరించి 1945లో ముంబై, కలకత్తా డాక్ వర్కర్లు చేసిన చర్చలు... చివరకు 1946లో రాయల్ ఇండియన్ నేవీలో తిరుగుబాటు జరిగినప్పుడు కమ్యూనిస్టు పార్టీ మద్దతుతో ముంబై కార్మిక వర్గం ఇచ్చిన వీరోచిత మద్దతు వంటివి భారీ నిరసనలకు దారి తీశాయి. ఇది బ్రిటిష్ రాజ్‌కి చివరి సమాధి రాయిగా మారింది. మంచి జీవితాన్ని గడిపే హక్కు, సంపదనూ, ఉత్పత్తి సాధనాలనూ కొంతమంది చేతుల్లో కేంద్రీకరించని ఆర్థిక వ్యవస్థ, స్త్రీపురుషులకు సమానవేతనం, ఆర్థిక అవసరాల పేరిట కార్మికుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టకపోవడం, వృద్ధాప్యం, వ్యాధులు, అంగవైకల్యం వంటి అంశాలలో సాయం చేయడం... ఇలా రాజ్యాంగ ప్రవేశికలో ప్రజల మనోభావాలన్నింటికీ రూపమివ్వడమే కాకుండా సోషలిస్టు అనే పదం కూడా దానికి జోడించారు. కానీ ఆచరణలో వేతనాలు, జీవన ప్రమాణాలు, యూనియన్ పెట్టుకునే హక్కు, అస్థిరత నుంచి పరిరక్షించే హక్కు వంటివి గగన కుసుమాల్లాగే మారాయి. 1920లో ఏఐటీయూసీ ఏర్పడిన నాటి నుంచీ గత వందేళ్లుగా అనేక పోరాటాలు, అనంత త్యాగాల నుంచే కార్మికులు తమ హక్కులను కాపాడుకుంటూ వచ్చారు. భద్రతా ప్రమా ణాలను నెలకొల్పి, పరిమిత పనిగంటలను కల్పించిన ఫ్యాక్టరీస్ యాక్ట్, ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్, కనీస వేతనాల చట్టం వంటివి స్వాతంత్య్రం సిద్ధించిన ప్రారంభ సంవత్సరాల్లోనే ఏర్పడుతూ వచ్చాయి. పెరుగుతున్న ప్రైవేట్ రంగం, రాజకీయాల్లో ప్రైవేట్ పరిశ్రమ దారుల బలం పెరుగుతూ వచ్చిన క్రమంలో రకరకాల పరిణామాలు సంభవించాయి. ప్రభుత్వ రంగం అనేది సామాజిక, ఆర్థిక సముద్ధరణ లక్ష్యంతో పనిచేయడం కాకుండా లాభాలను సృష్టించే రంగంగా మారిపోసాగింది. శాశ్వత కార్మికులు సోమరులుగా ఉంటున్నారనీ, కూర్చుండబెట్టి మరీ జీతాలు ఇస్తున్నారనే భావాలు కొత్తగా ఏర్పడే క్రమంలో లేబర్ వెసులుబాటు పేరుతో ఉద్యోగాల్లోకి తీసుకోవడం, ఉద్యోగాల్లోంచి తొలగించడం వంటి పద్ధతులు పుట్టుకొచ్చాయి. 1950ల చివరలో భిలాయి స్టీల్ ప్లాంటులో 96 వేలమంది పర్మనెంట్ కార్మికులు ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య పదివేలకు పడిపోయింది. వారి స్థానంలో 40 వేలమంది కాంట్రాక్టు కార్మికులు వచ్చి చేరారు. వీరికి పర్మనెంట్ కార్మికుల జీతాల్లో మూడో వంతు కూడా దక్కడం లేదు. 1974లో చారిత్రాత్మక రైల్వే సమ్మెలో 17 లక్షల మంది పాల్గొనగా 20 రోజులపాటు భారతదేశం స్తంభించిపోయింది. ఎమర్జెన్సీ విధింపునకు, నూతన పాలనకు కూడా ఇదొక కారణమని చెబుతుంటారు. ఈ సమ్మె తర్వాతే రైల్వే కార్మికుల్లో కాంట్రాక్టీరణ శరవేగంతో సాగింది. ఈరోజు లోకో పైలట్లు, టికెట్ ఎగ్జామినర్లు వంటి వివిధ విభాగాల కార్మికులు రైల్వే నియమాకం చేసినవారు కాదు. ఉద్యోగాల వాటా ప్రకారం చూస్తే దేశ అసంఘటిత రంగంలో 83 శాతం మంది ఉండగా 17 శాతం మాత్రమే సంఘటిత రంగంలో ఉంటున్నారు. కానీ ఎంప్లాయ్మెంట్ స్వభావం బట్టి చూస్తే, మన దేశంలో 92.4 శాతం మంది కార్మికులు అనియత రంగంలోనే ఉన్నారని బోధపడుతుంది. వీరంతా రాతపూర్వక కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో లేరు కాబట్టి లేబర్ చట్టాలు వీరికి వర్తించవు. 2015 నుంచి 2018 వరకు భారత్‌లో నిజవేతన పెరుగుదల 2.8 నుంచి 2.5 శాతానికి దిగజారుతూ వస్తోందని తెలిపింది. పాకిస్తాన్, శ్రీలంక, చైనా, నేపాల్ వంటి పొరుగు దేశాలతో పోలిస్తే కూడా భారత్‌లో నిజవేతన పెరుగుదల చాలా తక్కువగా నమోదైంది. ( భారత్‌ను ఒంటరిని చేస్తారు జాగ్రత్త!) ఈరోజు, కార్మికుల్లో చాలా తక్కువమంది యూనియన్లలో ఉంటున్నారు. అసంఘటిత రంగంలోని వివిధ సెక్షన్ల కార్మికులు ప్రత్యేకించి నిర్మాణ కార్మికులు, ఇంటిపని కార్మికులు, సఫాయి కర్మచారీలు, హాకర్లు వంటి వారు తమను కాపాడే చట్టాల కోసం పోరాడుతున్నారు. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దేశంలోని 46 లేబర్ చట్టాలను తొలగించి వాటిస్థానంలో 4 చట్టాలను తీసుకురావాలనుకుంటోంది. అయితే బీజేపీకి చెందిన భారతీయ మజ్దూర్ సంఘంతో సహా పలు రాజకీయ పార్టీలకు చెందిన కార్మిక సంఘాలు ఈ మార్పుల పట్ల తీవ్ర ఆందోళనలు వ్యక్తంచేస్తున్నాయి. కానీ కార్మిక సంఘాల కనీసపాటి డిమాండ్ల పట్ల కూడా కేంద్రప్రభుత్వం ప్రదర్శిస్తున్న మౌనం మరింత భయంకరంగా కనిపిస్తోంది. - సుధా భరద్వాజ్ న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త -
సుధా భరద్వాజ్.. జైలు నుంచి విడుదల
ముంబై: ఎల్గార్ పరిషత్–మావోయిస్టులతో సంబంధాల కేసులో అరెస్టయిన ప్రముఖ మహిళా న్యాయవాది, సామాజిక కార్యకర్త సుధా భరద్వాజ్(60) గురువారం జైలు నుంచి విడుదలయ్యారు. మూడేళ్లకు పైగా ఆమె జైలు జీవితం గడిపిన ఆమెకు బాంబే హైకోర్టు డిసెంబర్ 1న డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ కండీషన్‌తో పాటు ఆమెను ఎప్పుడు విడుదల చేయాలన్నది ఎన్ఐఏ ప్రత్యేక కోర్టే నిర్ణయిస్తుందని తెలిపింది. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎన్ఐఏ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఎన్ఐఏ అప్పీల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కాగా, రూ. 50 వేల పూచీకత్తుతో సుధా భరద్వాజ్‌ను విడుదల చేయాలని ప్రత్యేక కోర్టు బుధవారం ఆదేశించింది. ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత, భరద్వాజ్ గురువారం మధ్యాహ్నం బైకుల్లా మహిళా జైలు నుంచి విడుదలయ్యారు. కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సాగించిన కుట్రలో భాగస్వామిగా మారారని ఆరోపిస్తూ వరవరరావు, సుధా భరద్వాజ్ సహా 16 మంది సామాజిక కార్యకర్తలు, మేధావులను 2018 ఆగస్టులో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. (Nagaland Firing: డ్రెస్ మార్చి, మృతదేహాల దగ్గర ఆయుధాలు పెట్టబోయారు) -
ఎల్గార్ కేసులో సుధాకు డిఫాల్ట్ బెయిల్
ముంబై: ఎల్గార్ పరిషత్–మావోయిస్టులతో సంబం ధాల కేసులో అరెస్టయిన ప్రముఖ మహిళా న్యాయవాది, సామాజిక కార్యకర్త సుధా భరద్వాజ్‌కు బాంబే హైకోర్టు బుధవారం డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. వరవరరావుతో సహా మరో 8 మంది నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సాగించిన కుట్రలో భాగస్వామిగా మారారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సుధా భరద్వాజ్ డిఫాల్ట్ బెయిల్‌కు అర్హులేనని ఉత్తర్వులో స్పష్టం చేసింది.బెయిల్ కండీషన్‌తోపాటు ఆమెను ఎప్పుడు విడుదల చేయాలన్నది ప్రత్యేక కోర్టే నిర్ణయిస్తుందని తెలిపింది. కేసు నమదైన 90 రోజుల్లోగా కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలి. దాఖలు చేయకుండా దర్యాప్తు సంస్థ 90 రోజులకు మించి నిందితుడిని తమ అదుపులో ఉంచుకోవడానికి వీల్లేదు. ఇలాంటి సందర్భాల్లో నిందితుడికి డిఫాల్ట్ బెయిల్ పొందే అర్హత ఉంటుంది. సుధా భరద్వాజ్‌ను 2018 ఆగస్టులో పోలీసులు అదుపులోకి తీసుకొని, గృహ నిర్బంధంలో ఉంచారు. -
హక్కుల కార్యకర్తలను విడుదల చేయండి
లక్నో: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై సుధా భరద్వాజ్ సహా పలువురు హక్కుల కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నట్లు ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, విద్యార్థులు తెలిపారు. దేశవ్యాప్తంగా రచయితలు, మేధావులు, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులకు కొనసాగింపుగానే ఈ అరెస్టులు చోటుచేసుకున్నాయని వ్యాఖ్యానించారు. భరద్వాజ్‌కు బెయిల్ రాకుండా చేసేందుకే చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద పోలీసులు ఆమెపై కేసు నమో దు చేశారన్నారు. భరద్వాజ్ పేరును చెడగొట్టేలా అధికారులు తప్పుడు కథనాలను కొన్ని టీవీ చానల్స్ ద్వారా ప్రసారం అయ్యేలా చేశారన్నారు. సుధా భరద్వాజ్ సహా పోలీసులు అరెస్ట్ చేసిన హక్కుల కార్యకర్తలందరినీ బేషరతుగా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టులపై జాతీయ మానవహక్కుల కమిషన్‌తో నిష్పాక్షిక విచారణ జరిపించాలన్నారు. -
‘ప్రధాని హత్యకు కుట్ర’ కేసు పెడతారా?
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లో మంగళవారం పుణె పోలీసులు పది మంది సామాజిక కార్యకర్తల ఇళ్లపై దాడులు నిర్వహించి అరెస్ట్ చేసిన ఐదుగురు సామాజిక కార్యకర్తలపై పోలీసులు ఎలాంటి కేసులు పెట్టారు ? ఎలాంటి కేసులు పెడుతున్నారు ? ఏ చట్టం కింద? ఏ సెక్షన్ కింద? అన్న విషయాలు ఇప్పుడు చర్చనీయాంశాలయ్యాయి. మహారాష్ట్రలోని భీమా కోరెగావ్‌లో జనవరి ఒకటవ తేదీన జరిగిన దళితుల మహార్యాలీ సందర్భంగా తలెత్తిన అల్లర్ల విచారణలో భాగంగానే వీరిని అరెస్ట్ చేసినట్లు ప్రాథమిక వార్తలు తెలియజేశాయి. ఇదే అల్లర్లకు సంబంధించి జూన్ 6వ తేదీన ఐదుగురు సామాజిక కార్యకర్తలను పుణె పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై అత్యంత వివాదాస్పదమైన ‘చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం–1967 (వీఏపీఏ)’ను దాఖలు చేశారు. 2012లో ఈ చట్టాన్ని కేంద్రం సవరించినప్పటికీ ప్రమాదకర సెక్షన్లు, అంశాలు ఇంకా అందులో అలాగే ఉన్నాయి. హైదరాబాద్‌లో అరెస్టయిన వరవరరావు సహా ఐదుగురు సామాజిక కార్యకర్తలపై కూడా వీఏపీఏ చట్టాన్నే దాఖలు చేసే అవకాశం ఉంది. పుణెలోని జాయింట్ కమిషనర్ కార్యాలయం నుంచి రాంచి పోలీసు స్టేషన్‌కు అందిన ఉత్తర్వుల్లో ‘నెంబర్ 4–2018’ కేసులో విచారణ కోసం అరెస్ట్ చేయాల్సిందిగా ఉంది. అంటే ఆ నెంబర్ కేసు వీఏపీఏదే. అయితే గతంలో అరెస్టై ప్రస్తుతం పుణె పోలీసుల నిర్బంధంలో ఉన్న సామాజిక కార్యకర్త రోనా విల్సన్ వద్ద దొరికినట్లు పోలీసులు చెబుతున్న ఓ లేఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు మావోయిస్టులు కుట్రపన్నారని ఉంది. దీంతో ప్రధాని హత్యకు కుట్రపన్నారన్న ఆరోపణలపై కేసు పెట్టే అవకాశం ఉందని ఊహాగానాలు చెలరేగాయి. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మోదీ ప్రభుత్వమే ఇలాంటి కుట్రలు పన్నుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో, మోదీ హత్య కుట్రకు ఎలాంటి బలమైన ఆధారాలు లేకపోవడం వల్ల ఆ కేసును దాఖలు చేయక పోవచ్చు. వరవరరావు, ఆనంద్ టెల్టుంబ్డే, రోనా విల్సన్ వీఏపీఏ చట్టం ఎంతో ప్రమాదకరమైనది ఈ చట్టంలోని 13, 16, 17, 17బీ, 20, 38, 39, 40 సెక్షన్ల కింద నిందితులను విచారిస్తున్నారు. ఇందులోని 13వ సెక్షన్ ప్రకారం చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న, వాటితో సంబంధం ఉన్నా ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించివచ్చు. మిగతా సెక్షన్లు దీనికంటే ప్రమాదరకమైనవి. టెర్రరిస్టు కార్యకలాపాలను సూచించేవి. టెర్రరిస్టు కార్యకలాపాలతో ఎవరి చావుకు కారణమైన, టెర్రరిస్టు చర్యకు ఆర్థిక సహాయం అందించినా, టెర్రరిస్టు చర్యకు పాల్పడినా, టెర్రరిస్టు సంస్థకు నియామకాలు జరిపినా, అందులో సభ్యుడిగా కొనసాగినా, ఆ సంస్థ తరఫున విరాళాలు వసూలు చేసినా ఐదేళ్ల నుంచి యావజ్జీవ శిక్ష, మరణ శిక్ష విధించే సెక్షన్లు వీటిలో ఉన్నాయి. మహాయిస్టు చర్యలను టెర్రరిస్టు చర్యలుగా పోలీసులు పరిగణిస్తున్న విషయం తెల్సిందే. హర్యానాలోని ఫరిదాబాద్‌లో అరెస్ట్ చేసిన న్యాయవాది సుధా భరద్వాజ్‌పై వీఏపీఏ చట్టంలోని కొన్ని సెక్షన్లతోపాటు మత విద్వేషాలను రెచ్చగొట్టారని, ప్రజల్లో భయాందోళనలు సృష్టించారని, వదంతలు వ్యాప్తి చేశారని, ప్రజలను తప్పుదోవ పట్టించారని.. ఇలా పలు ఆరోపణలు చేస్తూ భారతీయ శిక్షా స్మృతిలోని 34, 153 ఏ, 505 (1బీ), 117, 120 బీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెల్సింది. ఆమె వద్ద దొరికిన ఓ లేఖలో కశ్మీరు వేర్పాటువాదులకు, మావోయిస్టులకు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోందని పోలీసులు అంటున్నారు. ఇంతకు వీరిపై కేసులెందుకు? ఈ ఏడాది జనవరి 1వ తేదీన పుణెకు సరిగ్గా 30 కిలోమీటర్ల దూరంలోని భీమా కోరెగావ్‌లో ఏటా జరిగే దళితుల మహార్యాలీ జరిగింది. దాదాపు మూడు లక్షల మంది హాజరైన ఆ ర్యాలీ సందర్భంగా విధ్వంసకాండ చెలరేగింది. అందులో ఒకరు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ అల్లర్లను డిసెంబర్ 31వ తేదీన ఓ బహిరంగ వేదిక నుంచి ప్రసంగించిన సామాజిక కార్యకర్తలు రెచ్చగొట్టే ప్రసంగాలతోపాటు ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టించారన్నది పోలీసుల అభియోగం. (చదవండి: భీమా కోరేగావ్ సంఘటనకు బాధ్యలెవరు?) ప్రధాని నరేంద్ర మోదీతో సంభాజి భిడే నాడేమి వార్తలొచ్చాయి? కాషాయ జెండాలు ధరించిన ఆరెస్సెస్ కార్యకర్తలు ర్యాలీని అడ్డుకునేందుకు ప్రయత్నించడం వల్లనే విధ్వంసకాండ చెలరేగిందని నాడు వార్తలు వచ్చాయి. ర్యాలీకి కొన్ని రోజుల ముందు ర్యాలీని అడ్డుకోవాల్సిందిగా హిందూ సంఘాల నాయకులు ఇచ్చిన పిలుపే అల్లర్లకు కారణమైందని ఆ వార్తలు సూచించాయి. దాంతో ఆరెస్సెస్ కార్యకర్తలను రెచ్చగొడుతూ మాట్లాడినా ‘హిందూ ఏక్తా మంచ్’ అధ్యక్షుడు మిలింద్ ఎక్బోటే, ‘శివప్రతిష్ఠాన్ హిందుస్థాన్’ సంస్థ చీఫ్ సంభాజీ భిడేలపై పుణె పోలీసులు జనవరి 3వ తేదీన కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వారిద్దరికి ఆరెస్సెస్ అధినాయకులతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో వారిని కనీసం పోలీసులు అరెస్ట్ చేసేందుకు సాహసించలేక పోయారు. ఆ విషయమై సుప్రీం కోర్టు మహారాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదిని తీవ్రంగా నిలదీసింది. అరెస్ట్‌లు చూపించాక కోర్టుకు రావాలని కూడా ఆదేశించింది. దాంతో మిలింద్ ఎక్బోటేను అరెస్ట్ చేసిన పోలీసులు వెంటనే బెయిల్‌పై విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తన గురువుగా భావించే సంభాజి భిడేను అరెస్ట్ చేయడానికి మాత్రం ఎప్పుడూ ప్రయత్నించలేదు. హఠాత్తుగా మలుపు తిరిగిన కేసు హిందూ సంఘాలపై నుంచి కేసు దృష్టి ఒక్కసారిగా సామాజిక కార్యకర్తల వైపు మళ్లింది. ఎక్బోటే, భిడేలాంటి హిందూ నాయకుల ప్రసంగాల వల్ల అల్లర్లు చోటు చేసుకోలేదని, సామాజిక కార్యకర్తలు రెచ్చగొట్టడం వల్లనే అల్లర్లు జరిగాయని అభిప్రాయపడిన పుణె పోలీసులు జూన్ ఆరవ తేదీన ఐదుగురు సామాజిక కార్యకర్తలను అరెస్ట్ చేశారు. నాడు విద్వేషాలను రెచ్చగొట్టారంటూ హిందూత్వ నాయకులపై భారతీయ శిక్షాస్మృతిలోని సాధారణ సెక్షన్లను నమోదు చేయగా, ఆ తర్వాత సామాజిక కార్యకర్తలపై మాత్రం అత్యంత వివాదాస్పదమైన ‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం’ కింద కేసులు పెట్టారు.