హక్కులు కరవైన కార్మిక లోకం | Sudha Bharadwaj on Labour Laws in India | Sakshi
Sakshi News home page

హక్కులు కరవైన కార్మిక లోకం

Published Thu, Jun 16 2022 12:42 PM | Last Updated on Thu, Jun 16 2022 12:46 PM

Sudha Bharadwaj on Labour Laws in India - Sakshi

భారతీయ కార్మికవర్గం మొదటినుంచీ బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో పాలు పంచుకుంటూ వచ్చింది. 1908లో ముంబైలో చేసిన ఆరు రోజుల సమ్మె, 1913లో కెనడాలోని పంజాబీ వలస కార్మికులు స్థాపించిన గదర్‌ పార్టీ, 1930లో నాలుగురోజుల పాటు నడిచిన సోలాపూర్‌ కమ్యూన్‌ లాంటి వాటివల్ల భారత కార్మికవర్గం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. 1930లో కార్మికులు కలకత్తా కాంగ్రెస్‌ సెషన్‌లోకి దూసుకెళ్లడం పూర్ణ స్వరాజ్‌ తీర్మానం ప్రకటించడానికి దారి తీసింది. 1937లో కిసాన్‌ సభ, వర్కర్స్‌ పీసెంట్స్‌ పార్టీ కార్యాచరణలు, యునైటెడ్‌ ప్రావిన్స్‌ లలో జమీందారీ వ్యవస్థ రద్దు తీర్మానాలకు దారితీశాయి. 

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్‌ దళాలకు సరఫరాలు తీసుకెళ్లడానికి తిరస్కరించి 1945లో ముంబై, కలకత్తా డాక్‌ వర్కర్లు చేసిన చర్చలు... చివరకు 1946లో రాయల్‌ ఇండియన్‌ నేవీలో తిరుగుబాటు జరిగినప్పుడు కమ్యూనిస్టు పార్టీ మద్దతుతో ముంబై కార్మిక వర్గం ఇచ్చిన వీరోచిత మద్దతు వంటివి భారీ నిరసనలకు దారి తీశాయి. ఇది బ్రిటిష్‌ రాజ్‌కి చివరి సమాధి రాయిగా మారింది.

మంచి జీవితాన్ని గడిపే హక్కు, సంపదనూ, ఉత్పత్తి సాధనాలనూ కొంతమంది చేతుల్లో కేంద్రీకరించని ఆర్థిక వ్యవస్థ, స్త్రీపురుషులకు సమానవేతనం, ఆర్థిక అవసరాల పేరిట కార్మికుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టకపోవడం, వృద్ధాప్యం, వ్యాధులు, అంగవైకల్యం వంటి అంశాలలో సాయం చేయడం... ఇలా రాజ్యాంగ ప్రవేశికలో ప్రజల మనోభావాలన్నింటికీ రూపమివ్వడమే కాకుండా సోషలిస్టు అనే పదం కూడా దానికి జోడించారు.

కానీ ఆచరణలో వేతనాలు, జీవన ప్రమాణాలు, యూనియన్‌ పెట్టుకునే హక్కు, అస్థిరత నుంచి పరిరక్షించే హక్కు వంటివి గగన కుసుమాల్లాగే మారాయి. 1920లో ఏఐటీయూసీ ఏర్పడిన నాటి నుంచీ గత వందేళ్లుగా అనేక పోరాటాలు, అనంత త్యాగాల నుంచే కార్మికులు తమ హక్కులను కాపాడుకుంటూ వచ్చారు. భద్రతా ప్రమా ణాలను నెలకొల్పి, పరిమిత పనిగంటలను కల్పించిన ఫ్యాక్టరీస్‌ యాక్ట్, ఇండస్ట్రియల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ యాక్ట్, ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ యాక్ట్, కనీస వేతనాల చట్టం వంటివి స్వాతంత్య్రం సిద్ధించిన ప్రారంభ సంవత్సరాల్లోనే ఏర్పడుతూ వచ్చాయి.

పెరుగుతున్న ప్రైవేట్‌ రంగం, రాజకీయాల్లో ప్రైవేట్‌ పరిశ్రమ దారుల బలం పెరుగుతూ వచ్చిన క్రమంలో రకరకాల పరిణామాలు సంభవించాయి. ప్రభుత్వ రంగం అనేది సామాజిక, ఆర్థిక సముద్ధరణ లక్ష్యంతో పనిచేయడం కాకుండా లాభాలను సృష్టించే రంగంగా మారిపోసాగింది. శాశ్వత కార్మికులు సోమరులుగా ఉంటున్నారనీ, కూర్చుండబెట్టి మరీ జీతాలు ఇస్తున్నారనే భావాలు కొత్తగా ఏర్పడే క్రమంలో లేబర్‌ వెసులుబాటు పేరుతో ఉద్యోగాల్లోకి తీసుకోవడం, ఉద్యోగాల్లోంచి తొలగించడం వంటి పద్ధతులు పుట్టుకొచ్చాయి. 

1950ల చివరలో భిలాయి స్టీల్‌ ప్లాంటులో 96 వేలమంది పర్మనెంట్‌ కార్మికులు ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య పదివేలకు పడిపోయింది. వారి స్థానంలో 40 వేలమంది కాంట్రాక్టు కార్మికులు వచ్చి చేరారు. వీరికి పర్మనెంట్‌ కార్మికుల జీతాల్లో మూడో వంతు కూడా దక్కడం లేదు. 1974లో చారిత్రాత్మక రైల్వే సమ్మెలో 17 లక్షల మంది పాల్గొనగా 20 రోజులపాటు భారతదేశం స్తంభించిపోయింది. ఎమర్జెన్సీ విధింపునకు, నూతన పాలనకు కూడా ఇదొక కారణమని చెబుతుంటారు. ఈ సమ్మె తర్వాతే రైల్వే కార్మికుల్లో కాంట్రాక్టీరణ శరవేగంతో సాగింది. ఈరోజు లోకో పైలట్లు, టికెట్‌ ఎగ్జామినర్లు వంటి వివిధ విభాగాల కార్మికులు రైల్వే నియమాకం చేసినవారు కాదు.

ఉద్యోగాల వాటా ప్రకారం చూస్తే దేశ అసంఘటిత రంగంలో 83 శాతం మంది ఉండగా 17 శాతం మాత్రమే సంఘటిత రంగంలో ఉంటున్నారు. కానీ ఎంప్లాయ్‌మెంట్‌ స్వభావం బట్టి చూస్తే, మన దేశంలో 92.4 శాతం మంది కార్మికులు అనియత రంగంలోనే ఉన్నారని బోధపడుతుంది. వీరంతా రాతపూర్వక కాంట్రాక్ట్‌ ఉద్యోగాల్లో లేరు కాబట్టి లేబర్‌ చట్టాలు వీరికి వర్తించవు. 2015 నుంచి 2018 వరకు భారత్‌లో నిజవేతన పెరుగుదల 2.8 నుంచి 2.5 శాతానికి దిగజారుతూ వస్తోందని తెలిపింది. పాకిస్తాన్, శ్రీలంక, చైనా, నేపాల్‌ వంటి పొరుగు దేశాలతో పోలిస్తే కూడా భారత్‌లో నిజవేతన పెరుగుదల చాలా తక్కువగా నమోదైంది.  ( భారత్‌ను ఒంటరిని చేస్తారు జాగ్రత్త!)

ఈరోజు, కార్మికుల్లో చాలా తక్కువమంది యూనియన్లలో ఉంటున్నారు. అసంఘటిత రంగంలోని వివిధ సెక్షన్ల కార్మికులు ప్రత్యేకించి నిర్మాణ కార్మికులు, ఇంటిపని కార్మికులు, సఫాయి కర్మచారీలు, హాకర్లు వంటి వారు తమను కాపాడే చట్టాల కోసం పోరాడుతున్నారు. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దేశంలోని 46 లేబర్‌ చట్టాలను తొలగించి వాటిస్థానంలో 4 చట్టాలను తీసుకురావాలనుకుంటోంది. అయితే బీజేపీకి చెందిన భారతీయ మజ్దూర్‌ సంఘంతో సహా పలు రాజకీయ పార్టీలకు చెందిన కార్మిక సంఘాలు ఈ మార్పుల పట్ల తీవ్ర ఆందోళనలు వ్యక్తంచేస్తున్నాయి. కానీ కార్మిక సంఘాల కనీసపాటి డిమాండ్ల పట్ల కూడా కేంద్రప్రభుత్వం ప్రదర్శిస్తున్న మౌనం మరింత భయంకరంగా కనిపిస్తోంది.


- సుధా భరద్వాజ్‌ 
న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement