అరుణ్ ఫరేరా
మనదేశంలో న్యాయం, చట్టం ఏమాత్రం అమలు జరగని ప్రదేశం జైలు. చట్టబద్ధంగా జరిగేదేదీ అతిక్రమణ కాజాలదు. కానీ జైలులో అమలు జరిగే దేదీ చట్టం పరిధిలో ఉండదు. అక్కడ అధికారులు, పోలీసులు చెప్పిందే శాసనం.
ఇనుపచువ్వల మాటున, ఖాకీ డ్రస్సుల చాటున, జైలు గోడల మధ్యన దాగిన క్రూరత్వానికి సజీవసాక్ష్యం అరుణ్ ఫరేరా. ఊపిరి సలపని జైలు గోడలకు వేళాడదీసిన వేన వేల శాల్తీల్లో అరుణ్ ఫరేరా ఒకరు. పెడరెక్కలు విరి చికట్టి మానవ శరీరాలను మాంసపు ముద్దలుగా మార్చి, కారే నెత్తుటి చుక్కల లెక్కల నుంచి మొదలవుతుంది ఇంటరాగేషన్. ఒకటా, రెండా... అచ్చంగా ఐదేళ్ల పాటు విచారణ పేరుతో నాగ్‌పూర్ సెంట్రల్ జైలులోని అండా సెల్‌లో మగ్గిపోయిన మావోయిస్టు ఖైదీయే అరుణ్ ఫరేరా. ముంబై మూలవాసి అయిన అరుణ్ విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతోన్న విద్యార్థి సంఘ నాయ కుడు. తప్పుడు కేసులు పెట్టి, ఇనుప బూట్లతో ఒళ్లుకుళ్ల బొడిచి, గోళ్లల్లో గుండు సూదులు గుచ్చి, చెవుల్లోంచి రక్తం చిందినా చలించని ఉక్కు మనిషి అరుణ్ ఫరేరా. కలర్స్ ఆఫ్ ద కేజ్ పేరుతో ఆంగ్లంలో పుస్తక రూపంలో విడుదలైన తన అనుభవాలను ‘సంకెళ్ల సవ్వడి’ పేరుతో మలుపు పబ్లిషర్స్ తెలుగులోకి తెచ్చారు. పుస్తకావిష్క రణ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన అరుణ్ ఫరేరాతో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ.
జైలులో ఉండగానే ఈ పుస్తకం రాశారా?
స్వతహాగా నేను కార్టూనిస్టుని. నన్ను తప్పుడు కేసుల్లో ఇరికించి చిత్రహింసలకు గురిచేశారు ముంబయి పోలీ సులు. నాలుగు సంవత్సరాల 8 నెలలపాటు గాలి, వెలు తురు సోకని అండాసెల్ అని పిలిచే చీకటి కారాగారంలో ఉంచారు. నేననుభవిస్తున్న హింసని, జైలుగోడల మధ్య నలుగుతున్న నాలాంటి ఎందరో ఖైదీల అనుభవాలనూ కార్టూన్లుగా గీసాను. నాపై మోపినవి తప్పుడు కేసులని రుజువయ్యాక బయటికి వచ్చిన వాటికి అక్షర రూపం ఇచ్చాను.
జైళ్లపై మీ అభిప్రాయం?
భారత దేశంలోని జైలు... న్యాయం, చట్టం అమలు జర గని ఒక ప్రదేశం. చట్టబద్ధంగా జరిగేదేదీ అతిక్రమణ కాజాలదు. కానీ ఇక్కడ అమలు జరిగే దేదీ చట్టం పరి ధిలో ఉండదు. అక్కడ అధికారులు, పోలీసులు చెప్పిందే శాసనం. నాలుగ్గోడల మధ్య మాకున్న ఏకైక పోరాట రూపం నిరాహార దీక్ష. అదే చేశాం. భారత ప్రభుత్వం ఆమోదించిన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశాం. పోరాటం జైలు గోడలు దాటి రాకపోతే మేం చేసింది వృథాయే. ఆ వార్తను పత్రికలకు చేరవేయడం మరో ప్రహసనం.
ఇంటరాగేషన్ క్రమంలో మీరెలాంటి చిత్రహింసలు ఎదు ర్కొన్నారు?
నా శరీరంలో ఒక్క అంగుళం కూడా మిగలకుండా హిం సించారు. గోళ్లల్లో సూదులు గుచ్చారు. తల్లకిందులుగా వేలాడదీసారు. కిటికీకి చేతులు విరిచికట్టి నా తొడలపై ఇద్దరు కానిస్టేబుల్స్‌ని గంటలకొద్దీ నించోబెట్టేవారు. కరెంట్ షాక్ ఇచ్చారు. వారు పెట్టిన హింసకు చెవుల్లో నుంచి రక్తం కారేది. కానీ నా నోటినుంచి మాత్రం ఏనా డూ ఒక్కమాట రాబట్టలేకపోయారు. ఇది నా కథ మాత్రమే కాదు. నాలాంటి వేలాది మంది ఖైదీలు అను భవిస్తున్న ఘోరాలు. నాతోటి ఖైదీలకు ఎనీమా ఇచ్చి నట్టు 100 మిల్లీ లీటర్ల పెట్రోల్ లోపలికి పంపించారు. అంతే కటి భాగంలో పుళ్లుపడి నడవలేక, రోజులు, నెలల తరబడి రక్తం కారి, చివరకు ప్రాణం పోయేంతటి ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రత్యేకమైన శిక్షణ లేకపోతే తప్ప ఇలా హింసించాలని వాళ్లకెలా తెలు స్తుందా అని నాకెప్పటికీ ఆశ్చర్యమే.
మావోయిస్టు ఖైదీల పరిస్థితేనా, లేక ఎవరికైనా ఈ చిత్ర హింసలు తప్పవా?
తేడా ఉంటుంది. అలా అని సాధారణ ఖైదీలను హింసిం చరని కాదు. నాకు జరిగింది కేవలం ఒక వంతే. అంతకు పదింతలు ఎక్కువగా చిత్రహింసలు అనుభవిస్తున్న వారు ఇంకా జైల్లోనే మగ్గుతున్నారు. అంతెందుకు ఢిల్లీలో అక్రమంగా అరెస్టయిన సాయిబాబా నేనున్న అండాసెల్ లోనే ప్రస్తుతం ఉన్నాడు. 48 డిగ్రీల వేడికి గాలిసోకని అండాసెల్ ఉడికి పోతుంది. ఓ మూలకు చేరి రాత్రిపగలు వేడి సెగసోకకుండా గొంతుక్కూర్చొని శరీ రాన్ని కాపాడుకోవాలి. నేనైతే ఐదేళ్లపాటు అదే సెల్‌లో ఎలాగో బతికాను. కానీ, సాయిబాబా నడవలేడు. మం డే గచ్చుమీద పాక్కుంటూ వేడిని తట్టుకోవాలి. ఊహిం చుకోడానికే భయంగా ఉంది. జైళ్లలో మగ్గుతున్నది నూటికి 80 శాతం మంది విచారణ ఖైదీలే. 30 ఏళ్లనాటి జైలు నిబంధనలనే ఇప్పటికీ అనుసరించడం దారుణ మైన విషయం.
విషయాలు రాబట్టడానికే పోలీసులు మిమ్మల్ని చిత్రహిం సలు పెట్టారని భావించొచ్చా?
పోలీసు అధికారులకు కావాల్సింది వేరు. శాశ్వతంగా ఉద్యమం నుంచి మమ్మల్ని దూరంగా ఉంచడం. ఓ మావోయిస్టు ఖైదీపై నార్కో టెస్ట్‌లు చేయడం నాతోనే మొదలు. నార్కో టెస్ట్‌లో మేం ఏం చెప్పినా అది వారికి అనుకూలంగా మార్చుకొని రాసుకుంటారు. సమాధా నాలు మావే ఉంచి, ప్రశ్నలు మార్చి రికార్డు చేస్తారు. ఇప్పుడైతే ఖైదీ అనుమతి లేకుండా నార్కో టెస్ట్ చేయకూ డదు. ఎన్ని హింసలు పెట్టినా సత్యం జయించింది. నాపై మోపిన తప్పుడు కేసులు వీగిపోయాయి. కానీ కోల్పోయిన నా జీవితం తిరిగిరాదుగా...
జైళ్లలో మగ్గుతున్న వారిలో అత్యధిక శాతం దళితులు, ఆదివాసీలు, మైనారిటీలే. అలా ఎందుకు జరుగుతోంది?
అమెరికా జైళ్ళ నిండా బ్లాక్సే ఉంటారు ఎందుకు? ఎం దుకంటే వారు వాయిస్ లెస్ పీపుల్. గొంతులేని వారే అణచబడతారు. అందుకే మేం ఇలాంటి వేలాది మంది జైళ్లలో మగ్గుతున్న ఖైదీలకు లీగల్ ఎయిడ్ కావాలని కోరుతున్నాం. వారి పక్షాన నిలబడే బాలగోపాల్ లాం టి అడ్వొకేట్ ఒక్కరయినా కావాలి. న్యాయాన్ని కొనుక్కో లేక ఏళ్లతరబడి జైళ్లలో మగ్గుతున్న వాళ్లకి న్యాయం చేయాలన్న ఉద్దేశ్యంతోనే నేనిప్పుడు లా చేస్తున్నాను.
జైలు జీవితం తరువాత మీ దృక్పథంలోగానీ, మీ సంక ల్పంలోగానీ ఏమైనా తేడా ఉందా?
కచ్చితంగా లేదు. నా చిన్నారి బిడ్డని వదిలి వెళ్లినా, మళ్లీ స్వేచ్ఛా ప్రపంచంలోకి వచ్చి వాడిని గుండెలకు హత్తు కున్నాను. అలాగే ఉద్యమాన్ని హత్తుకుంటాను. జైలు గోడలు బద్దలయ్యే రోజు కోసం ఎదురుచూస్తాను.
- అత్తలూరి అరుణ