
అనంతపురం సప్తగిరి సర్కిల్: రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించొద్దని ముస్లింలు, సామాజిక కార్యకర్తలు, మానవతావాదులు నినదించారు. హిజాబ్ విషయంలో అనవసర రాద్ధాంతం తగదని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల నుంచి సప్తగిరి సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముస్లిం మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
హిజాబ్ ధారణ తమ హక్కు అని నినదించారు. ఈ సందర్భంగా నగర మేయర్ వసీం సలీం, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, ఐద్వా నాయకురాలు సావిత్రి, డాక్టర్ నఫీసా, పీజీ స్టూడెంట్ ఆఖిల పర్వీన్ తదితరులు మాట్లాడారు. హిజాబ్ విషయంలో కర్ణాటక ప్రభుత్వ వైఖరి సరికాదన్నారు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ మౌలిక లక్షణమని, దీన్ని దెబ్బతీయడం తగదని అన్నారు. అన్ని మతాలు, జాతులు వారి సంస్కృతీ సంప్రదాయాలను అనుసరించే స్వేచ్ఛను రాజ్యాంగంకల్పించిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో యునైటెడ్ జేఏసీ నాయకులు కాగజ్‌ఘర్ రిజ్వాన్, సాలార్‌బాషా, జాఫర్, గౌస్‌బేగ్, సైఫుల్లాబేగ్, ఖాజా, దాదు, ముష్కిన్, తాజ్, రఫీ రసూల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment