సాక్షి, న్యూఢిల్లీ : భీమా కోరెగావ్ కేసులో ‘అర్బన్ మావోయిస్టులు’ అంటూ ఐదుగురు సామాజిక కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ప్రముఖ చరిత్రకారులు రొమిల్లా థాపర్, మరో నలుగురు ప్రముఖులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు బుధవారం నాడు విచారణ ప్రారంభించింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పుణె పోలీసులు రెండు పరస్పర భిన్నంగా దాఖలు చేసిన అఫిడవిట్లపై కూడా సుప్రీం కోర్టు విచారణ కొనసాగనుంది. కోరెగావ్ కేసులో హైదరాబాద్‌లో వరవర రావుతోపాటు దేశవ్యాప్తంగా మరో నలుగురు సామాజిక కార్యకర్తలను ఆగస్టు 28వ తేదీన పుణె పోలీసులు అరెస్ట్ చేయడం, రొమిల్లా థాపర్ నాయకత్వాన ప్రజాహిత పిటిషన్‌ను దాఖలు చేయడం, దానికి స్పందించి సెప్టెంబర్ మూడవ తేదీన పుణె పోలీసులు రెండో అఫిడవిట్ దాఖలు చేయడం తదితర పరిణామాలు తెల్సినవే.
ఆ అఫిడవిట్ ప్రకారం భీమా కోరెగావ్ గ్రామానికి సరిగ్గా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుణె నగరంలో ఎల్గార్ పరిషద్ పేరిట గతేడాది డిసెంబర్ 31వ తేదీన బహిరంగ సభ జరిగింది. ఆ సభను నిర్వహించిన నిషేధిత సీపీఐ (మావోయిస్టు) కార్యకర్తలు దళితులను రెచ్చగొట్టారు. ఫలితంగా ఆ మరుసటి రోజు అంటే జనవరి 1వ తేదీన భీమా కోరెగావ్ గ్రామంలో అల్లర్లు చెలరేగాయి. అందులో ఒకరు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. కోట్లాది రూపాయ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఆ నాడు దళితులను రెచ్చగొడుతూ ప్రసంగించారన్న కారణంగానే వరవర రావు సహా ఐదుగురు సామాజిక కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అదే రోజు ప్రజాహిత వ్యాజ్యం కారణంగా సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని నిందితులను అరెస్ట్ చేయడానికి వీల్లేదని, వారిని గృహ నిర్బంధానికి పరిమితం చేయాల్సిందిగా ఆదేశించింది.
దేశంలోని దాదాపు 250 దళిత సంఘాలను ఏకతాటిపైకి తీసుకరావాలనే లక్ష్యంతో ఎల్గార్ పరిషద్ ఏర్పాటయింది. ఆ రోజు ఎల్గార్ పరిషద్ పేరిటనే బహిరంగ సభ జరిగినప్పటికీ సభ నిర్వహణలో కీలక పాత్ర వహించినదీ ఓ మాజీ సుప్రీం కోర్టు జడ్జీ, మరో మాజీ హైకోర్టు చీఫ్ జడ్జీలు. ఈ విషయాన్ని వారే (బీజీ కోస్లే–పాటిల్, పీబీ సావంత్‌లు) స్వయంగా చెప్పడంతోపాటు సభ నిర్వహణకు అరెస్టైన సమాజిక కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదని కూడా వారు చెప్పారు.
పుణె పోలీసులు భీమా కోరెగావ్ కేసులో రెండో అఫిడవిట్ దాఖలు చేయడానికి ఆరు నెలల ముందు ఫిబ్రవరి 13వ తేదీన మొదటి అఫిడవిట్‌ను దాఖలు చేశారు. అందులో హిందూ అఘాది సంస్థ నాయకుడు మిలింద్ ఎక్బోటే అల్లర్లకు ప్రధాన కారకుడని ఆరోపించారు.
‘ఎక్బోటో అల్లర్లను సృష్టించేందుకు నేరపూరిత కుట్ర పన్నారని మా దర్యాప్తు సందర్భంగా వెలుగులోకి వచ్చింది. ఆయన కర పత్రాలను పంచడం ద్వారా కలసిమెలసి ఉంటున్న ప్రజల మధ్య చిచ్చు పెట్టారు. చట్టాన్ని ఉల్లంఘించి, అల్లర్లలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఫలితంగా కోట్లాది రూపాయల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి’ అని ఆ అఫిడవిట్‌లో పోలీసులు పేర్కొన్నారు. దళితులు నమ్ముతున్న భీమా కోరెగావ్ చరిత్రను వక్రీకరిస్తూ ఎక్బోటే కరపత్రాలను పంచారని, ఆయన అనుచరులు ఫేస్‌బుక్ ద్వారా అల్లర్లకు ఆజ్యం పోశారని పుణె డిప్యూటీ మేయర్ సిద్ధార్ట్ ధిండే కూడా ఆరోపించారు.
మొదటి అఫిడవిట్‌లో మిలింద్ ఎక్బోటేనే అల్లర్లకు ముఖ్య కారకుడని పోలీసులు పేర్కొన్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సన్నిహితుడవడం వల్ల ఆయన్ని అరెస్ట్ చేయడానికి వారు సాహసించలేక పోయారు. ఆర్నెళ్లలో కథ పూర్తిగా మారిపోయింది. పోలీసులు రెండో అఫిడవిట్ దాఖలు చేశారు. మొదటి అఫిడవిట్‌లో నిందితులు హిందూ సంస్థ నాయకులు కాగా, రెండో అఫిడవిట్‌లో అర్బన్ మావోయిస్టులు నిందితులుగా మారారు. పరస్పర భిన్నమైన ఈ అఫిడవిట్లపై సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుందో, పోలీసులు ఎలా సమర్థించుకుంటారో చూడాలి.
‘కోరెగావ్’ పై పోలీసుల భిన్న స్వరాలు
Published Wed, Sep 12 2018 3:36 PM | Last Updated on Wed, Sep 12 2018 7:20 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment