విరసం నేత వరవరరావు అరెస్ట్‌ | Verasa Leader Varavarao Arrested | Sakshi
Sakshi News home page

విరసం నేత వరవరరావు అరెస్ట్‌

Published Wed, Aug 29 2018 1:01 AM | Last Updated on Wed, Aug 29 2018 12:27 PM

Verasa Leader Varavarao Arrested - Sakshi

వరవరరావు (ఫైల్‌ ఫోటో)

పుణే, న్యూఢిల్లీ, ముంబై, రాంచీ, హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రముఖ పౌర హక్కుల నేతలు, మావోయిస్టు సానుభూతిపరుల అరెస్టులు సంచలనం సృష్టించాయి. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానంతో ఏకకాలంలో వారి నివాసాలపై పుణే పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. గతేడాది డిసెంబర్‌లో మహారాష్ట్రలోని కోరెగావ్‌–భీమాలో చెలరేగిన హింసాత్మక ఘటనల కేసు విచారణలో భాగంగా ఈ దాడులు కొనసాగగా.. విరసం నేత వరవరరావు, హక్కుల కార్యకర్తలు సుధా భరద్వాజ్, అరుణ్‌ ఫెరీరా, వెర్నన్‌ గొంజాల్వెజ్, గౌతం నవలఖాల్ని పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఈ అరెస్టుల్ని మానవ హక్కుల పరిరక్షణ కార్యకర్తలు, అభ్యుదయ రచయితలు, న్యాయవాదులు తీవ్రంగా తప్పుపట్టారు. ఈ చర్యలు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని, ప్రజామద్దతు కోల్పోతున్నామనే భయంతోనే అరెస్టులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు.
 
ఏకకాలంలో పలు నగరాల్లో సోదాలు
గతేడాది డిసెంబర్‌ 31న పుణేకి సమీపంలోని కోరెగావ్‌–భీమా గ్రామంలో దళితులు, ఉన్నత వర్గమైన పీష్వాలకు మధ్య చోటుచేసుకున్న హింస కేసు దర్యాప్తులో భాగంగా పుణే పోలీసులు మంగళవారం ఉదయం నుంచి దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లో విరసం(విప్లవ రచయితల సంఘం)నేత వరవరరావు, ముంబైలో హక్కుల కార్యకర్తలు వెర్నన్‌ గొంజాల్వెజ్, అరుణ్‌ ఫెరీరా, ఫరీదాబాద్‌లో ట్రేడ్‌ యూనియన్‌ కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్, ఢిల్లీలో పౌర హక్కుల కార్యకర్త గౌతం నవలఖా ఇళ్లలో ఏకకాలంలో దాడులు నిర్వహించినట్లు సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. అనంతరం హైదరాబాద్‌లో వరవరరావు, ఫరీదాబాద్‌లో సుధా భరద్వాజ్, ముంబైలో ఫెరీరా, గొంజాల్వెజ్, ఢిల్లీలో నవలఖాలపై ఐపీసీలోని 153(ఏ), ఇతర సెక్షన్లతో పాటు, మావోలతో సంబంధాల ఆరోపణల నేపథ్యంలో చట్టవ్యతిరేక కార్యకలాపాల (నియంత్రణ) చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.

అయితే నవలఖాను బుధవారం ఉదయం వరకూ ఢిల్లీ నుంచి బయటకు తీసుకెళ్లద్దని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. నవలఖా తరఫున ఆయన న్యాయవాది వరిషా ఫరాసత్‌ దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను విచారించిన అనంతరం కోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే సుధా భరద్వాజ్‌ ట్రాన్సిట్‌ రిమాండ్‌పై కూడా పంజాబ్, హరియాణా హైకోర్టు స్టే విధించింది. మరోవైపు హైదరాబాద్‌లో క్రాంతి టేకుల, కూర్మనాథ్, రాంచీలో సుసాన్‌ అబ్రహం, ఫాదర్‌ స్టాన్‌ స్వామి, గోవాలో ఆనంద్‌ టెల్‌టుంబ్డే ఇళ్లపై కూడా సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.  
 
మావోలతో సంబంధాలున్నాయనే అరెస్టు చేశాం: పోలీసు వర్గాలు

‘ఈల్గర్‌ పరిషద్‌ ఆందోళనలతో సంబంధాలపై దర్యాప్తు చేయగా ... నిషేధిత సంస్థ సభ్యులకు సంబంధించి కొన్ని ఆధారాలు లభించాయి. దాని ఆధారంగా పోలీసులు చత్తీస్‌గఢ్, ముంబై, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు’అని పోలీసు వర్గాలు వెల్లడించాయి. మావోయిస్టులతో సంబంధాలున్న వ్యక్తుల ఇళ్లతో పాటు.. జూన్‌లో అరెస్టైన ఐదురుగు వ్యక్తులతో ప్రత్యక్షంగా, లేదా పరోక్షంగా సంబంధమున్న వారి ఇళ్లలోను సోదాలు జరిగాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. దాడుల్లో నిషేధిత సంస్థలతో సంబంధాలపై కొన్ని పత్రాల్ని స్వాధీనం చేసుకున్నామని, వారి ఆర్థిక లావాదేవీల్ని, ఫోన్‌ రికార్డుల్ని కూడా పరిశీలిస్తున్నామని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. కాగా కొద్ది నెలల క్రితం మహారాష్ట్ర పోలీసుల తనిఖీల్లో దొరికిన రెండు లేఖల్లో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ హత్యకు మావోయిస్టుల కుట్ర పన్నారన్న సమాచారం నేపథ్యంలోను ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది.  
 
కోరెగావ్‌–బీమా కేసు దర్యాప్తులో భాగంగానే.. కోరెగావ్‌–బీమా హింసతో సంబంధమున్న అనుమానంతో ఈల్గర్‌ పరిషద్‌కు చెందిన ఐదుగురు కార్యకర్తల్ని ఈ ఏడాది జూన్‌లో పోలీసులు అరెస్టు చేశారు. దళిత కార్యకర్త సుధీర్‌ ధావలేను ముంబైలోని తన ఇంట్లో అరెస్టు చేయగా.. న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, కార్యకర్తలు మహేశ్‌ రౌత్, షోమా సేన్‌లను నాగ్‌పూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఇక న్యాయవాది రోనా విల్సన్‌ను ఢిల్లీలోని తన ఇంట్లో అరెస్టు చేశారు. వారికి మావోలతో సన్నిహిత సంబంధాలున్నాయంటూ విశ్రాంబాగ్‌ పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. విల్సన్‌ ఇంట్లో సోదాల్లో దొరికిన లేఖలో వరవరరావు పేరు ఉందని అప్పట్లో పుణే పోలీసులు ప్రకటించారు. రాజీవ్‌ గాంధీ హత్య తరహాలోనే రోడ్‌షోలను లక్ష్యంగా చేసుకుని ప్రధాని మోదీ హత్యకు మావోలు కుట్ర పన్నినట్లు ఆ లేఖలో ఉందని పోలీసులు చెప్పడం అప్పట్లో సంచలనమైంది.  
 
భయపెట్టేందుకే ఈ అరెస్టులు: హక్కుల కార్యకర్తలు  
ఈ అరెస్టుల్ని దేశవ్యాప్తంగా పలువురు హక్కుల కార్యకర్తలు, రచయితలు, న్యాయవాదులు ఖండించారు. ‘నియంతృత్వ శక్తుల కోరలు ఇప్పుడు విశాలంగా తెరచుకున్నాయి’అని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ట్వీట్‌ చేశారు. ఈ అరెస్టులు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని, హక్కులపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిని వేధిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ స్పందిస్తూ.. ఇది పూర్తిగా భయపెట్టే చర్య అని.. స్వేచ్ఛా గొంతుక వినిపించే వారిపై వేధింపుల్ని అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. ‘ప్రజా మద్దతు కోల్పోతున్నామని ప్రభుత్వం భయపడుతోంది. ఆ భయానికి సంకేతాలే ఈ అరెస్టులు. అర్థంలేని ఆరోపణలతో న్యాయవాదులు, కవులు, రచయితలు, దళిత హక్కుల కార్యకర్తలు, మేథావుల్ని అరెస్టు చేస్తున్నారు’అని ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్‌ విమర్శించారు.
 
దళితులు వర్సెస్‌ పీష్వాలు
దళిత సైనికుల సాయంతో జనవరి 1, 1818న పీష్వా పాలకుల్ని బ్రిటిష్‌ సైన్యం ఓడించింది. పీష్వా పాలకులపై విజయానికి చిహ్నంగా దళిత సంఘాలు ఏటా మహారాష్ట్రలోని భీమా కోరెగావ్‌లో విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తాయి. గతేడాది డిసెంబర్‌ 31న ఆ వేడుకల్లో హింస నెలకొంది. కొన్ని హిందూసంస్థలు ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో విధ్వంసం చోటుచేసుకుంది. ముంబయితో పాటు పలు ప్రాంతాలకు అల్లర్లు వ్యాపించడంతో మూడు రోజులు మహారాష్ట్ర స్తంభించింది. 

భయపెట్టేందుకే ఈ అరెస్టులు: హక్కుల కార్యకర్తలు
ఈ అరెస్టుల్ని దేశవ్యాప్తంగా పలువురు హక్కుల కార్యకర్తలు, రచయితలు, న్యాయవాదులు ఖండించారు. ‘నియంతృత్వ శక్తుల కోరలు ఇప్పుడు విశాలంగా తెరచుకున్నాయి’అని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ట్వీట్‌ చేశారు. ఈ అరెస్టులు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని, హక్కులపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిని వేధిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ స్పందిస్తూ.. ఇది పూర్తిగా భయపెట్టే చర్య అని.. స్వేచ్ఛా గొంతుక వినిపించే వారిపై వేధింపుల్ని అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. ‘ప్రజా మద్దతు కోల్పోతున్నామని ప్రభుత్వం భయపడుతోంది. ఆ భయానికి సంకేతాలే ఈ అరెస్టులు. అర్థంలేని ఆరోపణలతో న్యాయవాదులు, కవులు, రచయితలు, దళిత హక్కుల కార్యకర్తలు, మేథావుల్ని అరెస్టు చేస్తున్నారు’అని ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్‌ విమర్శించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement