సాక్షి, హైదరాబాద్ : విరసం నేత వరవరరావు అరెస్ట్‌కు నిరసనగా బుధవారం రాష్ట్ర వ్యాప్త నిరసనలకు ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణల నేపథ్యంలో విరసం నేత వరవరరావును మంగళవారం పుణె పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తొలుత వరవరరావు ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు.. ఆపై ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. వరవరరావు అరెస్ట్‌పై ఎవరేమన్నారంటే..
ప్రో. హరగోపాల్ : దేశ వ్యాప్తంగా దాడులు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ వ్యతిరేక శక్తులను ఇరుకున పెట్టె ప్రయత్నం చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని చూస్తే సిగ్గేస్తుంది. పూణే పోలీసులు హైదరాబాద్‌లో చేస్తున్న సోదాలపై డీజీపీ, హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశా. కానీ ఎవరూ అందుబాటులోకి రాలేదు. పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాము. కేసీఆర్ కోసం ఉద్యమం చేయలేదు. ఎమర్జెన్సీ సమయంలో కూడా ఇలా దాడులు చేయలేదు. భవిష్యత్‌లో ఇలాంటి దాడులు జరగకుండా ఉండేందుకు కార్యాచరణ రూపొందిస్తాము.
వరవరరావు అరెస్ట్‌పై ప్రజా సంఘాలు : ప్రజల హక్కుల గురించి మాట్లాడితే ప్రభుత్వం ఇలా దాడులు చేస్తుందని హెచ్చరికలు పంపింది. ఉదయం 6గంటల నుండి దేశ వ్యాప్తంగా దాడులు జరిపారు. వరవరరావు ఇంట్లోకి ప్రవేశించిన మహారాష్ట్ర పోలీసులు ల్యాండ్ లైన్ ఫోన్ వైర్ కట్ చేశారు. వరవరరావు, అతని భార్య హేమలత సెల్ ఫోన్స్ లాక్కున్నారు. ఎవరితో మాట్లాడకుండా 8గంటల పాటు తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు బంధించారు. క్రాంతితో పాటు అతని బందువుల ఇళ్లపై దాడి చేశారు. జూన్ 6న కూడా ఇదే తరహాలో దాడులు చేశారు. భీమా కోరేఘం పేరుతో రాంచీ, మహారాష్ట్ర, ఢిల్లీ, హైదరాబాద్‌లో అరెస్టులు చేశారు. లెటర్లు అన్ని బోగస్ దొంగ ఉత్తరాలు. మోదీ తన గ్రాఫ్ పడిపోతుందని అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. అబద్ధపు ఉత్తరం మీద అక్రమ కేసులు పెట్టారు. కోర్టులో ఇలాంటి కేసు నిలబడదు. ఇంట్లో సోదాలు చేసి పంచనామా రిపోర్ట్ ఇచ్చి అరెస్ట్ చేశారు. వారి వద్ద ఎలాంటి అరెస్ట్ వారెంట్ లేదు. మాట్లాడే వాళ్లను భయపెట్టే భాగంలో ఇలాంటి దాడులు చేస్తున్నారు. ఈ దాడులను ఖండిస్తున్నాము.
వరవరరావు భార్య హేమలత : 50 ఏళ్లుగా అరెస్టులు చేస్తున్నారు. 25 కేసులు పెట్టారు. తప్పుడు కేసులన్ని కోర్టులో వీగిపోయాయి. ఇంట్లో అణువణువు గాలించారు. మా కూతుళ్ల ఇళ్లలో కూడా సోదాలు చేశారు. అరెస్టులు మాకు కొత్త కాదు. 70 ఏళ్ల మనిషి.. అనారోగ్యంతో బాధపడుతున్నడు(కన్నీళ్లు తుడుచుకుంటూ). అక్కడ ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తారో.
క్రాంతి(జర్నలిస్ట్) : రాత్రి 8 గంటలకు ఇంట్లోకి ప్రవేశించి ఫోన్లు లాక్కున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చి ఓ కాగితం చేతిలో పెట్టి 20మంది తెల్లవార్లు సోదాలు చేశారు. మా అమ్మ హార్ట్ పేషెంట్ అని చూడకుండా చాలా ఇబ్బందులు పెట్టారు. ఎఫ్‌ఐఆర్‌లో పెరు లేకుండా తన ఇంట్లో సోదాలు చేశారు. నా వ్యక్తిగత సమాచారాన్ని మొత్తం లాగేసుకున్నారు. పలాన కేసు విషయంలో సోదాలు చేస్తున్నామనే విషయాన్ని కూడా చెప్పలేదు.
కుర్మా నాథ్ (జర్నలిస్ట్) : మహారాష్ట్ర, తెలంగాణ పోలీసులు 5 గంటలపాటూ మా ఇంట్లో చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఆంధ్రపాలకుల సమయంలో ఇలాంటి దాడులు ఎన్నడూ చేయలేదు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే సందర్భంలో అతని వ్యతిరేక శక్తులు ఉండోదనే మోదీని ప్రసన్నం చేసుకున్న కేసీఆర్ ఈ దాడులు చేయించారు. ఇంట్లో ఉన్న విలువైన మా వ్యక్తి గత సమాచారాన్ని ఎత్తుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment