సిద్ధిఖీ హత్య కేసు: లారెన్స్‌ బిష్ణోయ్‌ సోదరుడితో నిందితుల చాట్‌ | Baba Siddique shooters spoke to Lawrence Bishnoi brother before attack: Cops | Sakshi
Sakshi News home page

సిద్ధిఖీ హత్య కేసు: లారెన్స్‌ బిష్ణోయ్‌ సోదరుడితో నిందితుల చాట్‌

Published Wed, Oct 23 2024 12:55 PM | Last Updated on Wed, Oct 23 2024 2:46 PM

Baba Siddique shooters spoke to Lawrence Bishnoi brother before attack: Cops

మహారాష్ట్రతోపాటు బాలీవుడ్‌లోనూ సంచలనం రేపిన ఎన్సీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య కేసులో మరో కీలకవిషయం వెలుగుచూసింది మాజీ మంత్రి అయిన సిద్ధిఖీని హత్య చేసే ముందు గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌సోదరుడు అన్మోల్‌ బిష్ణోయ్‌తో షూటర్లు సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యకు గల ఉద్దేశం తెలియనప్పటీకి నిందితులు స్నాప్‌చాట్‌ ద్వారా నిందితులు తరచూ అన్మోల్‌తో సంభాషణలు జరిపినట్లు గుర్తించామని తెలిపారు.

కెనడా, అమెరికాలకు చెందిన నిందితులతో అన్మోల్‌కు పరిచయం ఉందని, నిందితుడి నుంచి నాలుగు మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు స్నాప్‌చాట్ ద్వారా ఒకరితో ఒకరు టచ్‌లో ఉండేవారని, మెసెజ్‌ వచ్చిన తర్వాత వారు దానిని వెంటనే తొలగించేవారని పేర్కొన్నారు.. అదేవిధంగా అరెస్టు చేసిన నిందితుల స్నాప్‌చాట్‌ను నిశితంగా పరిశీలించగా.. షూటర్లు, ప్రవీణ్ లోంకర్ నేరుగా అన్మోల్ బిష్ణోయ్‌తో టచ్‌లో ఉన్నట్లు తేలిందని ముంబై పోలీసులు తెలిపారు.

స్నాప్‌చాట్‌లో 24 గంటల్లోపు చాట్‌ మాయమయ్యే ఆప్షన్‌ను ఉపయోగించి నిందితులు సంప్రదింపులు జరుపుకునేవారని, దానిద్వారానే అన్మోల్‌ వారికి సిద్దిఖీ, అతడి కుమారుడి ఫొటోలు పంపాడని నిందితులు పేర్కొన్నట్లు వెల్లడించారు. అయితే 24 గంటల తర్వాత మెసేజ్‌లు డిలీట్‌ అవ్వడం వల్ల వారి సంభాషణలను సేకరించలేకపోయినట్లు పేర్కొన్నారు. 

ఇప్పటివరకు ఈ కేసులో 10 మంది నిందితులను అరెస్టు చేశామని, మరో నిందితుడు శివకుమార్‌ గౌతమ్ పరారీలో ఉన్నాడని తెలిపారు. సిద్దిఖీని హత్య చేసేందుకు కాంట్రాక్ట్‌ తీసుకున్న షూటర్లు దాడికి ముందు అటవీ ప్రాంతంలో చెట్లను లక్ష్యంగా చేసుకొని షూటింగ్‌ ప్రాక్టీస్‌ చేసినట్లు పేర్కొన్నారన్నారు. దీనిపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.

కాగా దసరా సందర్భంగా బాబా సిద్ధిక్‌ ముంబైలోని బాంద్రాలో తన కుమారుడు జీషన్‌ సిద్ధిక్‌ కార్యాలయం వెలుపల బాణాసంచా పేలుస్తుండగా దుండగులు  ఆరు రౌండ్లు కాల్పులు జరిపిచంపిన విషయం తెలిసిందే.వెంటనే ఆయన్ని లీలావతి ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మృతి చెందారు. అనంతరం సిద్దిఖీని చంపింది తామే అని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ ప్రకటించింది. బాలీవుడ్‌ నటుడు సల్మాన్ ఖాన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే ఆయనను హత్య చేసినట్లు పేర్కొంది. దావూద్ ఇబ్రహీం వంటి అండర్‌వరల్డ్ వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement