అవి ఉద్యమ భానుల వధ్య శిలలా? | virasam VaravaraRao article on hcu | Sakshi
Sakshi News home page

అవి ఉద్యమ భానుల వధ్య శిలలా?

Published Wed, Apr 13 2016 1:37 AM | Last Updated on Sun, Sep 3 2017 9:47 PM

అవి ఉద్యమ భానుల వధ్య శిలలా?

అవి ఉద్యమ భానుల వధ్య శిలలా?

సందర్భం
నూతన నిర్మాణంలోని ఇటు కల కలల్లో/గునపాల కొసలు దింపడం/ ఇప్పుడు ‘వాడి’ యుద్ధ విధానం/ ప్రతిఘటిం చకపోతే ఇది రాసిన నేనూ/ చదివిన నువ్వూ మిగలం.   -ఉదయభాను

ఉన్నత విద్యాలయాల్లో భావ సంఘర్షణలు కొత్తకాదు. ముఖ్యంగా తెలుగు సమాజంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలం నుంచి, తిరిగి శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటం, జగిత్యాల జైత్రయాత్ర కాలాల నుంచి అగ్రవర్గ, వర్ణ భూస్వామ్య వర్గాల పిల్లలు ఏబీవీపీ భావజాలానికి; దళిత, బడుగు, వర్గాల, కులాల పిల్లల రాడికల్ భావజాలానికి ప్రభావితులై భావ సంఘ ర్షణలు భౌతిక దాడులకు దారితీసిన రోజులు 1972 ఏప్రిల్ 14న జార్జ్‌రెడ్డి హత్యతో ఉస్మానియా విశ్వవిద్యా లయంలో మొదలై వరంగల్ ఆర్‌ఈసీ, కేఎంసీలకు విస్తరించిన క్రమంలో విద్యార్థి సంస్థల ఎన్నికల రద్దుకు దారితీయడం తెలిసిందే.

అయితే ఇప్పుడు మద్రాస్ ఐఐటీలో పెరియార్- అంబేడ్కర్ స్టడీ సర్కిల్‌ను నిషేధించమని కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ లేఖ రాసిన నాటి నుంచి, పూణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌కు టీవీలో ధర్మరాజు వేషధారి చౌహాన్‌ను డెరైక్టర్‌గా నియమించిన నాటి నుంచి, హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో వేముల రోహిత్ చక్రవర్తి, ప్రశాంత్ మొదలైన ఐదుగురు దళిత విద్యార్థుల సాంఘిక బహిష్కరణ దాకా, జేఎన్‌యూలో విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య లాల్, డీఎస్‌యూ నాయకులు ఉమర్ ఖలీద్ అనిర్బన్, వాళ్ల సహచరులపై కేసులు, అరెస్టులు సమాజంలోనే భౌతిక దాడులకు దారితీసి ఈ దేశాన్ని ఒక ‘పోస్టాఫీసు లేని మరు భూమి’గా మార్చేస్తున్నాయి.

డెభ్బైలు, ఎనభైలకు.. మోదిత్వ 2014-16కు తేడా ఏమిటంటే అప్పుడు విప్లవ భావాలకు-విప్లవ వ్యతిరేక భావాలకు ఘర్షణ. ఇప్పుడు హిందుత్వ కాషాయ జెండా నీడలో సామ్రాజ్యవాద-భూస్వామ్య దళారీలకు దళిత, ఆదివాని, ముస్లిం మైనారిటీలు మొదలు మొత్తం ప్రగతిశీల, విప్లవ భావజాలాలతో ఘర్షణ.

ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయంలో దళిత విద్యార్థులు సాంఘిక బహిష్క రణకు గురవుతారు. వెలివాడలో బ్రాహ్మణాగ్రహారానికి దూరంగా ఆకాశం కప్పుగా అలమటిస్తారు. ఆక్రోశి స్తారు. ఉద్యమిస్తారు. రోహిత్ వేముల ఆత్మహత్యతో జాతి చైతన్యాన్ని రగిలిస్తాడు. ఉద్యమం పరిస్థితులను చక్కదిద్దితే వైస్ చాన్స్‌లర్ తిరిగి వచ్చి దౌర్జన్యాన్ని, హింసాకాండను రెచ్చగొట్టి క్యాంపస్‌ను ఒక కాన్‌సెం ట్రేషన్ క్యాంపుగా మారుస్తాడు. ఈ సందర్భంలో యూనివర్సిటీ అధికారులు, పోలీసులు కలసి తయారు చేసిన అభియోగపత్రంలో 47 మంది ముద్దాయిలపై కేసు పెట్టారు. అందులో 26 మందిని అరెస్టు చేసి వారం రోజులు చర్లపల్లి జైల్లో పెట్టారు. వీసీ అప్పారావు తిరిగి వచ్చి తన లాడ్జిలో దౌర్జన్యాన్ని రచించుకుని అది సాకుగా మూడు వేలమంది పైచిలుకు విద్యార్థులకు ఆహారం, నీళ్లు, కరెంటు లేకుండా చేశాడు. మెస్‌లు మూసివేశాడు. కరెంటు కట్ చేయించాడు. యూని వర్సిటీ గేట్లు మూసివేని  ఒక ఓపెన్ ఎయిర్ జైలుగా మార్చేశాడు.

విద్యార్థులు, ఆచార్యులు అరెస్టయిన వాళ్లు పోను, ఎందరని నీళ్లు, ఆహారం లేకుండా నకనకలాడుతారు. కనుక రెండవరోజు క్యాంపస్‌లో ఎండలో చెట్ల కింద పక్షుల వలె రాళ్లు ఏరుకుని పొయ్యి, కర్రలు ఏరుకుని నిప్పు, గిన్నెలు పోగుచేసి వంట చేయాలని పూను కున్నారు. అక్కడ మొదలవుతుంది మారణకాండ-అది ఉదయభాను మాటల్లో విన్నాం. ఉదయభాను పాల మూరు జిల్లా షాద్‌నగర్‌లో  విశ్రాంత ఉపాధ్యాయుల సంతానమైన మాదిగ విద్యార్థి. తెలుగులో ఎం.ఫిల్. పూర్తిచేసి పి.హెచ్.డి. చేస్తున్నాడు. ఏడేళ్లుగా ప్రజాస్వా మిక ప్రత్యేక తెలంగాణ విద్యార్థి ఉద్యమానికి నాయ కుడు. వక్త, కవి, నాటక ప్రయోక్త. రెండు కవితా సంకల నాలు- జంగ్ ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కవిత్వం, ముఖ్యంగా- గ్రీన్‌హంట్ ఆపరేషన్ పేరిట ప్రజలమీద యుద్ధాన్ని ప్రతిఘటిస్తూ ‘పిల్లనగ్రోవి తుపాన్’ కవితా సంకలనం ద్వారా సుప్రసిద్ధుడైనవాడు.

హైదరాబాద్ యూనివర్సిటీ రోహిత్ వేముల అమ రత్వం తర్వాత ఏర్పడిన విద్యార్థి జాక్‌కు సహజంగానే నాయకత్వంలో ఉన్నాడు. అతడు రోహిత్, డాక్టర్ సి కాశీం వలె ‘నిషిద్ధ మానవుడు’. అతనికి చావు రుచి చూపించారు. తననెందుకు అంత చిత్రహింసలకు గురిచేసి చావు సరిహద్దుల దాకా తీసుకువెళ్లి వదిలిపోయారో, దానికి కారణాలను వాస్తవ గత వర్తమానాల మీద ఆధారపడి అతడు ఊహించాడు. విచిత్రమేమిటంటే- ఆయనని నలభై ఏడుగురు ముద్దాయిలలో చూపలేదు. ఇంత చిత్రహింసలు పెట్టిమళ్లీ  క్యాంపస్‌లో విసిరేసి పోయారు గాని ఆసుపత్రిలో చేర్చి మెడికో లీగల్ కేసు వేయలేదు. విసిరేసి పోయేప్పుడు ఒక ఎస్‌ఐ వచ్చి హెచ్చరించినట్లు ఉదయభానును వాళ్లు చంపదలుచుకున్నారు.

మాది హిందూ మతం, హిందూజాతి కాదు, మమ్మల్ని వెలివాడల్లో అస్పృశ్యులుగా చూస్తూ మా ఆత్మగౌరవాన్ని గాయపరుస్తున్నారన్న దళితులను జాతి వ్యతిరేకులుగా, దేశద్రోహులుగా చిత్రించి రాజద్రోహ నేరం మోపుతున్న ప్రభుత్వాలను... దళిత ఆదివానీ  ముస్లిం మైనారిటీ, జాతుల స్వయం నిర్ణయ హక్కుల పోరాట ప్రజల పక్షాన చైతన్యవంతులుగా, ప్రజా స్వామిక వాదులుగా ధిక్కరిస్తున్నందుకే ఇవ్వాళ ఉన్నత విద్యాలయాల్లో ఈ సామాజిక వర్గాల నుంచి వస్తున్న వాళ్లపై దాడులు జరుగుతున్నాయి. అరెస్టులు జరుగుతున్నాయి. బహిష్కరణలు జరుగుతున్నాయి.

రోహిత్ ఆత్మహత్య తర్వాత ఇవ్వాళ ఈ వధ్యశిలపై ఉదయభాను నిలబడ్డాడు. ఆనాడు రోహిత్ నెలరోజుల ముందే వైస్ చాన్స్‌లర్‌కు లేఖ రాశాడు. ఆ కుట్రదారుడు అది బయటపెట్టక అతన్ని ఆత్మహత్యకు ప్రేరేపించాడు. ఆ హంతకుడు ఇపుడు విద్యార్థులపై అధ్యాపకులపై పోలీసులను, సాల్వాజుడుంను విశృంఖలంగా వదిలేసి క్యాంపస్‌ను ఒక కాన్‌సెంట్రేషన్ క్యాంప్‌గా మార్చాడు. అందుకు ఉదయభానుపై హత్యాప్రయత్నం ఒక సంకేతం మాత్రమే. ఉదయభానును కాపాడుకోవడం, వ్యక్తిని కాపాడుకోవడం కాదు.. ఉద్యమ భానులను వధ్యశిలకు బలికాకుండా కాపాడుకోవడమే అవుతుంది.
 

 వరవరరావు, విరసం సంస్థాపక సభ్యులు
 varavararao@yahoo.com
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement