land acquisition process
-
RRR: భూసేకరణ వేగవంతం.. 14 మండలాల్లో వేలాది ఎకరాల...
సాక్షి, గజ్వేల్: నోటిఫికేషన్ అధికారికంగా విడుదల కావడంతో ట్రిపుల్ఆర్ భూసేకరణ ప్రక్రియ జోరందుకుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోడ్డు 110 కిలోమీటర్ల పొడవున విస్తరించే అవకాశమున్నందున.. దీని కోసం 14 మండలాల్లో 73కుపైగా గ్రామాల్లో వేలాది ఎకరాల్లో భూసేకరణ జరగనుంది. ఈక్రమంలో సర్వే పనులను ప్రారంభించారు. ►ఉమ్మడి నల్గొండ జిల్లా చౌటుప్పల్, చిట్యాల నుంచి భువనగిరి– గజ్వేల్ మీదుగా సంగారెడ్డి (కంది) వరకు 65వ నంబరు జాతీయ రహదారిని తాకుతూ 164కి.మీ మేర రహదారి విస్తరించనుంది. ►కంది–శంకర్పల్లి–చేవేళ్ల–షాద్‌నగర్–కడ్తాల్–యాచారం నుంచి (186 కిలోమీటర్లు) తిరిగి చౌటుప్పల్‌ను తాకనుందని ప్రాథమిక సమాచారం. ►ఈ లెక్కన మొత్తంగా 350 కిలోమీటర్ల పొడవునా రీజినల్ రింగు రోడ్డుగా మారనుంది. ఇందులో మొదటి విడతగా ఉత్తర భాగంలో చౌటుప్పుల్ నుంచి సంగారెడ్డి వరకు సుమారు 160 కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్న విషయం తెలిసిందే. ►కాగా ట్రిపుల్ఆర్ వెళ్లే గ్రామాల జాబితాతో కేంద్రం ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా.. ఉత్తర భాగంలో 20 మండలాలు, వీటి పరిధిలోని 111 గ్రామాలు ఉన్నాయి. ►ఇందులో భాగంగానే యాదాద్రి–భువనగిరి జిల్లాలో యాదాద్రి, భువనగిరి, తుర్కపల్లి, వలిగొండ, చౌటుప్పల్ మండలాల పరిధిలో 33 గ్రామాలు ఉన్నాయి. ►ప్రత్యేకించి ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని 14 మండలాల్లో గల 73కి పైగా గ్రామాల్లో భూసేకరణ జరగనుంది. ఉమ్మడి జిల్లా (సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్) పరిధిలో 110 కిలోమీటర్లపైనే విస్తరించనుంది. ►జగదేవ్‌పూర్–గజ్వేల్–తూప్రాన్–నర్సాపూర్–సంగారెడ్డి మీదుగా కంది వరకు ఈ రోడ్డు విస్తరించనుంది. గ్రామాలు, పట్టణాలు, పాత రోడ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భూసేకరణ పూర్తి చేసి పనులు చేపట్టనున్నారు. సర్వే పనులు షురూ.. ►భూసేకరణ జరుగనున్న ఉత్తర భాగంలోని చాలా గ్రామాల్లో ఇప్పటికే పలుమార్లు డిజిటల్ సర్వే చేపట్టారు. ప్రస్తుతం సర్వే నంబర్ల వారీగా ప్రత్యక్ష సర్వే చేపడుతున్నారు. ►ఈ క్రమంలోనే జగదేవ్‌పూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో సర్వే జరిపిన సందర్భంలో రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ►గ్రామంలోని 191 సర్వే నంబర్లో 250 ఎకరాల భూమిని ఎన్నో ఏళ్ల కిందట 150 మంది ఎస్సీలు, బీసీలకు అసైన్ చేశారు. అప్పటి నుంచి వీరంతా వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. ►ఐదేళ్ల క్రితం ఇవే భూముల్లో కంపెనీలు ఏర్పాటు చేస్తామని వీరికి ధరణి వచ్చిన తర్వాత కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వలేదు. ►ఈ క్రమంలోనే ఈ భూముల్లో 120 ఎకరాల మేర ట్రిపుల్ఆర్ నిర్మాణానికి సేకరిస్తుండగా.. తమకు ఎలాంటి సమాచారమివ్వకుండా, సర్వే చేపట్టారని ఆరోపిస్తూ సర్వేను అడ్డుకున్న సంగతి విదితమే. ►దీనిపై రెవెన్యూ అధికారులు స్పందించి, సదరు రైతులకు న్యాయం చేసేలా నష్ట పరిహారం కో సం ప్రతిపాదనలు తయారు చేయాల్సి ఉంది. ►ఇక్కడే కాకుండా ఇలాంటి సమస్యలు చాలా చోట్ల ఉన్నాయి. దీని కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగితేనే భూసేకరణకు అడ్డంకులు ఏర్పడవు. ►ఇకపోతే గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ట్రిపుల్ఆర్ కోసం మొత్తంగా 980 ఎకరాల భూసేకరణ చేపట్టడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. ►తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డి ప్రాంతాల్లోనూ భూసేకరణ ప్రక్రియ వేగవంతమవుతోంది. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో వే లాది ఎకరాల భూసేకరణ జరగనుండగా, రెవె న్యూ యంత్రాంగం పనిలో నిమగ్నమై ఉంది. వారి సమస్యను పరిష్కరిస్తాం మా డివిజన్ పరిధిలో ట్రిపుల్ఆర్ భూసేకరణకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేశాం. ఇప్పటికే సర్వే పనులు మొదలయ్యాయి. జగదేవ్‌పూర్ మండలం పీర్లపల్లి రైతులు తమకు న్యాయం చేయాలని సర్వేను అడ్డుకున్నారు. వారి సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపట్టాం. – విజయేందర్‌రెడ్డి, గజ్వేల్ ఆర్డీఓ -
రైతు వేదికకు.. స్థలం కొరత!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రైతులకు సత్వర, మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా ఏర్పాటు చేయదలచిన రైతు వేదికలకు గ్రహణం వీడటం లేదు. నెలలు గడుస్తున్నా భూ సేకరణ ప్రక్రియ కొలిక్కి రావడం లేదు. వేదిక నిర్మాణానికి కావాల్సిన స్థల లభ్యత గగనంగా మారింది. ముఖ్యంగా మహానగర శివారు ప్రాంత మండలాల పరిధిలో భూమి అందుబాటులో లేకపోవడం ప్రధాన సమస్యగా పరిణమించింది. జిల్లా వ్యవసాయ శాఖ పరిధిలో మొత్తం 83 క్లస్టర్లు ఉన్నాయి. ఒక్కో క్లస్టర్లో ఒక రైతు వేదికను ఏర్పాటు చేయాలని రెండు నెలల క్రితం ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన స్థలాన్ని సేకరించాల్సిన బాధ్యతలను రెవెన్యూ శాఖకు అప్పగించింది. ఒక్కో రైతు వేదిక నిర్మాణానికి 20 గుంటల (అర ఎకరం) భూమి అవసరం. ఇప్పటివరకు 50 చోట్ల స్థలాలను గుర్తించి.. ఈ జాబితాను వ్యవసాయ శాఖకు పంపించారు. మిగిలిన 33 చోట్ల స్థలం అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. క్లస్టర్ పరిధిలో రైతులందరికీ అనువైన ప్రాంతంలో స్థలం ఉంటే ఉపయోగకరంగా ఉంటుందన్నది ప్రభుత్వ భావన. అయితే అటువంటి ప్రాంతాల్లో జాగ దొరకడం లేదు. అంతేగాక హయత్‌నగర్, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం తదితర మండలాల్లో స్థల లభ్యత లేదు. దీంతో ఈ మండలాల్లో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందం గా తయారైంది. ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సమన్వయ లోపం.. వ్యవసాయ శాఖలో సమన్వయం లోపం కూడా నిధుల విడుదలకు కాస్త అడ్డంకిగా మారింది. స్థలాలు గుర్తించిన చోట రైతు వేదికల నిర్మాణానికి అవసరమైన నిధులు విడుదల చేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు.. వ్యవసాయశాఖ కమిషనరేట్‌కు ప్రతిపాదనలు పంపారు. అయితే వీటిని కమిషనరేట్ తిరస్కరించినట్లు తెలిసిందే. రెవెన్యూ శాఖ గుర్తించిన స్థలాలను వ్యవసాయశాఖకు అప్పగిస్తేనే నిధులు విడుదల చేస్తామని కమిషనరేట్ స్పష్టం చేసింది. తొలుతే ఈ విషయాన్ని వెల్లడించి ఉంటే.. ఈ పాటికి ఆయా చోట్ల రైతు వేదికల నిర్మాణం మొదలయ్యేది. గుర్తించిన స్థలాలను తమకు అప్పగించాలని రెవెన్యూశాఖకు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు లేఖలు పంపారు. త్వరలో స్థలాలను స్వాధీనం చేసుకోనున్నారు. వేదికలతో మేలు.. 20 గుంటల విస్తీర్ణంలో రైతు వేదికను ఏర్పాటు చేస్తారు. ఒక్కో దానికి నిర్మాణానికి రూ.12 నుంచి రూ.16 లక్షల వరకు ఖర్చు చేయనున్నారు. ఈ భవనంలో మినీ భూసార పరీక్ష కేంద్రాన్ని ఏర్పా టు చేస్తారు. అలాగే వ్యవసాయశాఖ విస్తరణాధికారికి (ఏఈఓ) ప్రత్యేక చాంబర్, రైతులు సమావేశాలు నిర్వహించడానికి వీలుగా మీటింగ్ హాల్, విశాలమైన పార్కింగ్ స్థలం, శిక్షణ తరగతులకు మరో హాల్ తదితర సౌకర్యాలు కల్పించాలన్నది లక్ష్యం. తద్వారా స్థానికంగానే తమకు అవసరమైన పనులను అన్నదాతలు చక్కబెట్టుకోవచ్చు. -
ఫార్మా రైతులతో కొనసాగిన చర్చలు
రైతులతో మరోసారి సమావేశమైన జేసీ కందుకూరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముచ్చర్ల ఫార్మాసిటీకి సంబంధించి భూసేకరణ ప్రక్రియ కొనసాగుతునే ఉంది. ముచ్చర్ల సర్వే నంబర్ 155లోని 630.11 ఎకరాల్లో 211.24 పట్టా, 176 ఎకరాల్లో అసైన్‌డదారులు, 242.17 ఎకరాల్లో కబ్జా ఉంది. శుక్రవారం అసైన్‌డదారులతో జేసీ రజత్‌కుమార్‌సైనీ, ఆర్డీఓ సుధాకర్‌రావు, తహసీల్దార్ సుశీల, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ రవి తదితరులు రెండో దఫా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. గత సమావేశంలో చెప్పిన విధంగా భూమి అభివృద్ధి చేసినందుకు మొత్తంగా ఎకరాకు రూ.10 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇతర ప్రాంతాల్లో భూములు కొనాలన్నా ధరలు పెరిగిపోయాయని ఎకరాకు రూ.15 లక్షలు ఇవ్వాలని కోరారు. ఇప్పటి వరకు అసైన్డ భూములకు రూ.8 లక్షల వరకు మాత్రమే ఇచ్చామని, ఇక్కడ భూమి అభివృద్ధి చేసినందుకు అదనంగా మరో రూ.2 లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని జేసీ వివరించారు. భూములు ఇవ్వడానికి సిద్ధమైతే ఆగస్టు వరకు పరిహారం చెక్కులు ఇస్తామని ఆలోచించుకొని రావాలని వారితో సమావేశాన్ని ముగించారు. రహదారి విస్తరణకు భూసేకరణ.. ఫార్మా రైతులతో సమావేశం ముగిసిన అనంతరం జేసీ రజత్‌కుమార్‌సైనీ ఆర్ అండ్ బీ ఎస్ఈ సంధ్యారాణి, ఆర్డీఓ, తహసీల్దార్ తదితరులతో కలిసి కందుకూరు-మీర్కాన్‌పేట రహదారి వెంట ఉన్న రైతులతో సమావేశమై చర్చలు జరిపారు. జేసీ మాట్లాడుతూ.. ఫార్మాసిటీ కోసం శ్రీశైలం రహదారి నుంచి నేరుగా మీర్కాన్‌పేట, యచారం వరకు ఉన్న రహదారిని విస్తరించనున్నట్లు తెలిపారు. మొదటి విడతగా శ్రీశైలం రహదారి నుంచి మీర్కాన్‌పేట వరకు రోడ్డును 150 అడుగుల మేర విస్తరించనున్నట్లు చెప్పారు. రైతులంతా భూములు ఇచ్చి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా రైతుల అభిప్రాయాలు తీసుకున్నారు. భూసేకరణ చట్టం ప్రకారం సబ్ రిజిస్టార్ ్ర ధరకు అదనంగా మూడు రెట్లు ఇవ్వాలని రైతులు కోరారు. చివరగా ఎకరాకు రూ.50 లక్షల చొప్పున ఇవ్వాలని లేకపోతే ఇవ్వమని తేల్చిచెప్పారు. అంత ధర ఇవ్వలేమని ఆలోచించుకోవాలని, మరోమారు సమావేశమవుదామని సమావేశాన్ని ముగించారు. ఏఏ రైతు భూమి ఎంత మేర తీసుకోవాల్సి వస్తుందో సర్వే చేసి సోమవారం వరకు ఇవ్వాలని ఈ సందర్భంగా అధికారుల్ని జేసీ ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బీ డీఈ అమృతరెడ్డి, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
‘భూ’గ్రహణం!
♦ ఫార్మాసిటీ భూసమీకరణలో ఎడతెగని జాప్యం ♦ 10,628 ఎకరాలు సేకరించాలని నిర్ణయం ♦ ఇప్పటికి ఖరారు చేసిన భూమి 13 శాతమే ♦ {పతిష్టాత్మక ప్రాజెక్టుకు భూగండం ♦ దూకుడు తగ్గించిన జిల్లా యంత్రాంగం ఔషధన గరికి ‘భూ’గ్రహణం పట్టుకుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫార్మాసిటీ భూసేకరణ ప్రక్రియ మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు 10,628 ఎకరాలను సమీకరించాలని సర్కారు నిర్ణయించింది. కానీ ఇప్పటివరకు 13శాతం భూములను మాత్రమే జిల్లా యంత్రాంగం సేకరించగలిగింది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ♦ ఔషధనగరికి నిర్దేశించింది: 10,628.36 ఎకరాలు ♦ గుర్తించిన ప్రభుత్వ భూమి : 7,050 ♦ టీఎస్ఐఐసీకి బ దలాయింపు: 1349.30 ♦ అప్పగింతకు సిద్ధంగా ఉన్నది : 1488.16 ♦ ఇప్పటికి సర్వే పూర్తయినది : 740.30 ♦ ముచ్చర్లలో 855, మీర్ఖాన్ పేటలో 494 ఎకరాలను టీఎస్ఐఐసీకి అప్పగించారు. ♦ పంజాగూడ, మీర్ ఖాన్పేటలో దాదాపు 1,100 ఎకరాలకు సంబంధించి భూ నిర్వాసితులతో సంప్రదింపులయ్యాయి. ♦ యాచారం మండలం కుర్మిద్ద రెవెన్యూ పరిధిలోని భూములను తీసుకునేందుకు అసైన్డ్‌దారులు, ఆక్రమణదారులతో చర్చల ప్రక్రియను కొలిక్కి తెచ్చారు. నష్టపరిహారాన్నీ ఖరారు చేశారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో దాదాపు 15వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీకి జాతీయ పెట్టుబడులు, ఉత్పాదనల మండలి (నిమ్జ్)హోదా కూడా కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ హోదాతో రాయితీలు, మౌలిక వసతుల కల్పనకు కేంద్రం గ్రాంటు రూపేణా విరివిగా నిధులు విడుదల చేసే అవకాశం ఉండడంతో భూసమీకరణను వేగిరం చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. అయితే, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. ప్రతిపాదిత విస్తీర్ణంలో కేవలం 13శాతం భూములను మాత్రమే జిల్లా యంత్రాంగం సేకరించింది. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు ఔషధ దిగ్గజ సంస్థలు ముందుకొస్తున్నాయి. అనేక ఫార్మా కంపెనీలు బారులు తీరుతున్నాయి. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఫార్మాసిటీని అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్ఐఐసీ కృతనిశ్చయంతో ఉంది. కాగా రెవెన్యూ యంత్రాంగం భూసేకరణపై మునుపటి కంటే స్పీడు తగ్గించింది. ఏడాది క్రితం దూకుడు ప్రదర్శించిన అధికారులు.. ఇప్పుడు షరా మామూలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇప్పటివరకు కేవలం 1,349.30 ఎకరాలను మాత్రమే సేకరించి.. టీఎస్ఐఐసీకి అప్పగించారు. కందుకూరు మండలం ముచ్చర్లలో 855 ఎకరాలు, మీర్ఖాన్ పేటలో 494.24 ఎకరాలను టీఎస్ఐఐసీకి బదలాయించారు. ఇక ఇదే మండలం పంజాగూడ, మీర్ ఖాన్పేటలో దాదాపు 1,100 ఎకరాలకు సంబంధించి భూ నిర్వాసితులతో సంప్రదింపులు పూర్తి చేశారు. యాచారం మండలం కుర్మిద్ద రెవెన్యూ పరిధిలోని భూములను తీసుకునేందుకు అసైన్డ్‌దారులు, ఆక్రమణదారులతో చర్చల ప్రక్రియను కొలిక్కి తెచ్చారు. నష్టపరిహారాన్ని కూడా ఖరారు చేశారు. తద్వారా 1,073 ఎకరాలను సేకరించేందుకు లైన్‌క్లియర్ చేశారు. అయితే, భూములు కోల్పోయేవారి జాబితా తయారీలో స్థానిక రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని కొందరు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ భూముల స్వాధీనం ఆలస్యమవుతోంది. ఇదే పరిస్థితి పంజాగూడ, మీర్‌ఖాన్‌పేటలోనూ ఎదురవుతోంది. ఇక తాడిపర్తి, నానక్‌నగర్, మేడిపల్లిలో ప్రభుత్వ భూములను జిల్లా యంత్రాంగం గుర్తించింది. కాగా, భూ సమీకరణ ఆలస్యం కావడానికి టీఎస్ఐఐసీ వ్యవ హరిస్తున్న తీరే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఫార్మాసిటీ స్థాపన, పరిహారం ఇచ్చేది టీఎస్ఐఐసీ కావడంతో ఆ సంస్థ ఇచ్చే ప్రతిపాదనలకు అనుగుణంగా మందుకు సాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, తద్వారా భూ సమీకరణలో జాప్యం జరుగుతుందని రెవెన్యూ అధికారులు అంటున్నారు. -
పుట్టింట్లో ‘ప్రత్యేక’ పథకం
ఉన్న ఊరు... కన్నతల్లి అంటారు. పుట్టి పెరిగిన ఊరుతో ప్రతివారికీ ప్రగాఢమైన అనుబంధం ఉంటుంది. ఉపాధి కోసమో, ఉన్నత చదువుల నిమిత్తమో, మెరుగైన అవకాశాల కోసమో అక్కడినుంచి కదలక తప్పని స్థితి ఏర్పడినప్పుడు ఎవరికైనా కలిగే భావోద్వేగాలు మాటలకందనివి. కానీ తరతరాలనుంచి కశ్మీర్ లోయలో ఉంటున్న పండిట్లది అంతకన్నా దుర్భరమైన స్థితి. పాతికేళ్లనాడు ఉగ్రవాదం విరుచుకుపడినప్పుడు వారు చిగురుటాకుల్లా వణికారు. దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దాడులు, హత్యలు, గృహదహనాలతో అట్టుడికిన ఆ భయంకర అధ్యాయం ఎందరినో వలసబాట పట్టించింది. ఆ సమయంలో దాదాపు నాలుగు లక్షలమంది పౌరులు జమ్మూ మొదలుకొని దేశంలోని చాలా ప్రాంతాలకు వలసపోయారు. వారిలో చాలామంది ఇప్పటికీ శరణార్థుల్లా బతుకులీడుస్తున్నారు. ఇలాంటి వారందరూ మళ్లీ స్వస్థలాలకు రావొచ్చని, తాము అందుకవసరమైన పథకాన్ని రూపొందిస్తామని ఎన్నికల సందర్భంలో బీజేపీ హామీ ఇచ్చినప్పుడు అందరూ హర్షించారు. వేర్పాటువాద హురియత్ వర్గాలు కూడా కశ్మీర్ పండిట్ల పునరాగమనం తమకు ఆమోదయోగ్యమని ప్రకటించాయి. కశ్మీర్లో ఏర్పడ్డ పీడీపీ-బీజేపీ కూటమి ప్రభుత్వం ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నదన్నప్పుడు దాదాపు అన్ని పార్టీలూ మెచ్చుకున్నాయి. తీరా మూడు రోజులనాడు ప్రధాని నరేంద్రమోదీని, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశాక జమ్మూ-కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ ప్రకటించిన పథకం అందరినీ ఆశ్చర్యపరిచింది. పండిట్లను సైతం విస్తుగొల్పింది. కశ్మీర్ పండిట్ల కోసం ప్రత్యేక నివాస ప్రాంతాలను ఏర్పాటు చేస్తామన్నదే సయీద్ ప్రకటన సారాంశం. ఇందు కోసం త్వరలోనే భూసేకరణ ప్రక్రియను ప్రారంభించబోతున్నట్టు కూడా ఆయన చెప్పారు. రెండున్నర దశాబ్దాలుగా కశ్మీర్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. అప్పుడప్పుడు ప్రశాంత పరిస్థితులు ఏర్పడినట్టు కనబడినా వెనువెంటనే అశాంతిలో చిక్కుకోవడం అక్కడ సర్వసాధారణమైంది. ఇలాంటి ఉద్రిక్త వాతావరణం సమసిపోయి ప్రశాంతత ఏర్పడాలని, కనీస ప్రజాస్వామిక వాతావరణం ఉండాలని కశ్మీర్ పౌరులందరూ కోరుకుంటున్నారు. లోయనుంచి ప్రాణభయంతో వెళ్లిపోయిన కశ్మీర్ పండిట్లు తిరిగి వచ్చే పరిస్థితులు ఏర్పడితేనే నిజమైన అర్ధంలో ప్రశాంతత ఏర్పడినట్టవుతుంది. అందుకవసరమైన చర్యలు తీసుకోవడం మంచిదే. కశ్మీర్‌లోని మారుమూల గ్రామాల్లో సైతం ముస్లింలు, పండిట్లు తరతరాలుగా కలిసిమెలిసి ఉన్నారు. పర్వదినాల్లో అందరూ సమష్టిగా పాలుపంచుకున్నారు. అయిదారు వందల ఏళ్లక్రితం కశ్మీర్ ప్రాంతం అఫ్ఘాన్ల వశమైనప్పుడు ఆ ప్రాంతంలో ఇస్లాం ప్రవేశించింది. పండిట్లతోసహా వేర్వేరు కులాలవారంతా ఆ మతంలో చేరారు. ఇప్పటికీ చాలా మంది కశ్మీర్ నేతల పేర్లలో ఆ కుల మూలాలుంటాయి. కశ్మీర్ పండిట్లు స్వస్థలానికి వెళ్లడమంటే మళ్లీ తమ ఊళ్లకు తాము వెళ్లగలగడం. అంతేతప్ప శ్రీనగర్ శివార్లలో వందెకరాలో, రెండొందల ఎకరాలో భూమిని సేకరించి అందులో అపార్టుమెంట్లు లేదా నివాసగృహాలు నిర్మించడం కాదు. అలా చేయడ ం వారిని అవమానించడంతో సమానమవుతుంది. కశ్మీర్ పండిట్లు తిరిగి రావడాన్ని పాకిస్థాన్ ప్రోద్బలమున్న ఉగ్రవాద శక్తులు మినహా మిగిలినవారంతా స్వాగతిస్తున్నారు. అలాంటపుడు పండిట్లను ఇప్పుడున్న సమాజంలో భాగస్వాములను చేసి సామరస్యపూర్వక వాతావరణం ఏర్పడటానికి దోహదం చేయాలి తప్ప సొంతగడ్డపైనే పరాయివారిగా, అంటరానివారిగా మార్చకూడదు. పండిట్లకు ప్రత్యేక జోన్‌ను ఏర్పాటుచేస్తే వారి భద్రత సులభమవుతుందన్న ఆలోచన కూడా సరికాదు. శ్రీనగర్వంటిచోట ఎంతో కట్టుదిట్టమైన భద్రత ఉండే కంటోన్మెంట్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. భిన్న వర్గాలమధ్య సుహృద్భావ సంబంధాలు, పరస్పర విశ్వాసం సమాజాన్ని భద్రంగా, సురక్షితంగా ఉంచుతాయి తప్ప తుపాకుల నీడలో అంతా క్షేమంగా ఉంటుందనుకుంటే పొరపాటు. అయితే, పండిట్లను మళ్లీ వారి వారి స్వస్థలాలకు చేర్చడంలో ఇబ్బందులు లేకపోలేదు. వారిలో చాలామంది తమ స్థిరాస్తులను అమ్ముకుని నిష్ర్కమించారు. ఆయా ప్రాంతాల్లో మళ్లీ వారి జీవికకు అవసరమైన పరిస్థితులు సృష్టించడం, ఆవాసం కల్పించడం సవాలే. కానీ ప్రభుత్వం తల్చుకుంటే అది అసాధ్యమేమీ కాదు. పండిట్లు వెనక్కొస్తే వారిని హృదయ పూర్వకంగా ఆహ్వానిస్తామని... వారి ఇళ్లు వారికి ఇవ్వడానికి సిద్ధమేనని గతంలోనే పలువురు కశ్మీర్ ముస్లింలు తెలిపారు. కశ్మీర్ పండిట్లకు ప్రత్యేక జోన్ ప్రతిపాదన బయటికొచ్చాక వెల్లువెత్తిన నిరసనలను చూసి పీడీపీ నేతలు గొంతు సవరించుకున్నారు. తమ ఉద్దేశం అది కాదని మాటమార్చారు. కానీ భూసేకరణ జరిపి పండిట్లకు ప్రత్యేక నివాస ప్రాంతం ఏర్పర్చడమంటే ఏమిటో వారు వివరించలేకపోతున్నారు. బీజేపీ నేతలు ఈ ప్రతిపాదన గురించి మాట్లాడకపోయినా విశ్వహిందూ పరిషత్ వంటి పరివార్ సంస్థలు ప్రత్యేక జోన్ ఏర్పాటులో తప్పేముందని ప్రశ్నిస్తున్నాయి. పండిట్లను తిరిగి లోయకు రప్పిస్తే అక్కడ తమ ఓటు బ్యాంకు ఏర్పడుతుందన్న ఉబలాటం బీజేపీకి ఉన్నట్టు కనబడుతోంది. ముస్లిం ఓట్లను పీడీపీ... హిందూ ఓట్లను తామూ పంచుకుంటే తమ కూటమికి భవిష్యత్తులో ఢోకా ఉండదని ఆ పార్టీ అనుకుంటున్నది. కానీ తాత్కాలిక ప్రయోజనాలను నెరవేర్చే ఇలాంటి ఓటు బ్యాంకు రాజకీయాలు అనూహ్యమైన సామాజిక అస్థిరతలను సృష్టిస్తాయి. ఇన్నేళ్లుగా మారణకాండ సాగిస్తున్నా ఉగ్రవాదులకు సాధ్యపడని హిందూ-ముస్లిం విభేదాలు ఇలాంటి నిర్ణయాలవల్ల పుట్టి విస్తరిస్తాయి. కశ్మీర్ చరిత్ర, సంస్కృతి తెలిసున్నవారు... ప్రత్యేకించి ఆ గడ్డపై పండిట్ల సాధకబాధకాలు అవగాహన చేసుకున్నవారు ఇలాంటి దుస్సాహసానికి దిగరు. -
‘ఫూలింగ్’ ప్రభుత్వంపై పోరు
ఎన్ఏపీఎం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్.. రైతుల్లో అవగాహన పెంపొందించాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: భూ సమీకరణ ప్రక్రియ యావత్తూ అపసవ్యంగా కొనసాగిస్తూ రైతుల్ని ‘ఫూలింగ్’ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ సర్కారుపై న్యాయపోరాటం చేస్తామని, రైతుల ప్రయోజనాల్ని పూర్తిగా పరిరక్షిస్తామని పలు రాష్ట్రాలకు చెందిన సామాజిక కార్యకర్తలు, పౌరహక్కుల నేతలు స్పష్టం చేశారు. పదివేల మంది సిబ్బందితో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ భూ సమీకరణ చేపట్టడంపై వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నూతన రాజధాని నిర్మాణానికి తాము ఎంత మాత్రం వ్యతిరేకం కాదని, ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలపైనే తమ పోరాటమని పేర్కొన్నారు. దేశంలో ఎందరో మేధావులు ఉండగా రాజధాని నిర్మాణంలో వారి సేవలు వినియోగించుకోకుండా సింగపూర్‌ను ఆశ్రయించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఫ్యాప్సీ భవనంలో ఏపీ గ్రీన్‌ఫీల్డ్ రాజధానిపై ‘నేషనల్ అలయెన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్’ (ఎన్ఏపీఎం) సంస్థ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సామాజిక కార్యకర్త భూపతిరాజు రామకృష్ణరాజు అధ్యక్షత వహించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చి సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయాలని సమావేశంలో పలువురు వక్తలు సూచించారు. ఇది ఒక్క తుళ్లూరు ప్రాంతానికి సంబంధించిన అంశంగా చూడకుండా 13 జిల్లాల్లోనూ ప్రచార, కళాజాతల ద్వారా సర్కారు అనుసరిస్తున్న విధానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. జూబ్లీహిల్స్ ఇంటి రేటు ఎంత పెరిగిందో చెప్పాలి ప్రస్తుతం తుళ్ళూరు ప్రాంతంలో ఎకరా రూ.2.5 కోట్లుందని, పదేళ్ళ తర్వాత రూ.10 కోట్లకు చేరుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడాన్ని ప్రస్తావిస్తూ.. భూముల రేట్లు అప్పుడు అంత పలుకుతాయని ప్రభుత్వం నుంచి రైతులు లిఖిత పూర్వకంగా అఫిడవిట్లు కోరాలన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు జూబ్లీహిల్స్‌లో తన ఇల్లు రేటు పదేళ్ళలో ఎంత పెరిగిందో రైతులకు చెప్పాలన్నారు. చంద్రబాబు ఆస్తుల ప్రకటన సమయంలో జూబ్లీహిల్స్‌లో తన స్థలం రేటు ప్రకటించినప్పుడు అంత అసహజమైన పెరుగుదల కనిపించకపోవడాన్ని పౌరహక్కుల నేతలు గుర్తు చేశారు. ప్రభుత్వం రూపొందించిన సీఆర్డీఏ చట్టాన్ని ప్రభుత్వమే అతిక్రమిస్తోందని రిటైర్డ్ ఐఏఎస్, ఉద్యమకారుడు ఎంజీ దేవసహాయం తెలిపారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణానికి సింగపూర్ దేశం మాస్టర్ ప్లాన్‌ను రూపొందించడం తెలుగు జాతిని అవమానించడమేనన్నారు. రాజధాని నిర్మాణానికి ఇంత విస్తీర్ణంలో భూములు తీసుకోవడం వెనుక ఉన్న ఆంతర్యం బయటపెట్టాలన్నారు. మరో మూసీగా కృష్ణా: విశ్రాంత న్యాయమూర్తి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో రైతుల సంక్షేమానికి వ్యతిరేకంగా రెండు పత్రికలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయని, వాస్తవాలు వెలుగులోకొచ్చే పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. నది పక్కనే రాజధాని నిర్మాణంతో కృష్ణా మరో మూసీలా మారనుందన్నారు. సింగపూర్ తరహాలో రాజధాని నిర్ణయమంటున్నారంటే అందులో సామాన్యులకు అవకాశం లేనట్టేనని మాజీ సీఈసీ జేఎం లింగ్డో చెప్పారు. 2013 లో ఆమోదం పొందిన చట్టం ద్వారా భూముల సేకరణ సాధ్యం కాదన్న ఉద్దేశంతోనే ఏపీ ప్రభుత్వం భూ సమీకరణకు దిగిందని విమర్శించారు. యుద్ధ ప్రాతిపదికన కోర్టులను ఆశ్రయించాలని మాజీ డీజీపీ సి.ఆంజనేయరెడ్డి అన్నారు. రిటైర్డ్ ఐఏఎస్‌లు కేబీ సక్సేనా, హర్షమందర్, తమిళనాడుకు చెందిన పౌరహక్కుల నేత సురేష్, ఆర్కిటెక్ట్ శేఖర్, పర్యావరణ వేత్త సాగర్ధారా, మాజీ ఐజీ, న్యాయవాది హనుమంతరెడ్డి, హైకోర్టు న్యాయవాది జగన్మోహన్రెడ్డిలు మాట్లాడారు. రాజధాని ప్రాంతానికి చెందిన శేషగిరిరావు, అనుమోలు గాంధీలు తమ అనుభవాలు వివరించారు. సమావేశానంతరం వక్తలు మీడియాతో మాట్లాడారు. భూ సమీకరణకు ఇష్టపడని రైతులకు మద్దతుగా త్వరలో పాదయాత్ర చేయడానికి నిర్ణయించినట్టు తెలిపారు. ఆయా గ్రామాల్లో పలుచోట్ల న్యాయ సలహా కేంద్రాల ఏర్పాటును ప్రతిపాదించారు. రాజధాని గ్రామాల రైతులతో ఒక కమిటీ, కౌలుదారులు, కూలీలతో మరొక కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వ అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానించారు. రైతుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో లక్ష బుక్లెట్ల పంపిణీ చేస్తామని వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి ప్రకటించారు. -
‘పోర్టు’కు చలనం
మచిలీపట్నం : జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన బందరు పోర్టు నిర్మాణ విషయంలో కాస్త చలనం వచ్చింది. విజయవాడలో ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బందరు పోర్టు అభివృద్ధికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. పోర్టు భూసేకరణకు సంబంధించిన వివరాలను తనకు నివేదిక రూపంలో అందజేయాలని ఆయన చెప్పారు. రెవెన్యూ అధికారులు నివేదిక తయారు చేస్తే త్వరలోనే ముఖ్యమంత్రి పోర్టు భూసేకరణపై అధికారులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. మచిలీపట్నం-విజయవాడ మధ్య నాలుగు లైన్ల రహదారి విస్తరణ పనులను కూడా ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారని అధికారులు చెబుతున్నారు. గతంలోనే నివేదిక రూ.5వేల కోట్లతో 5,324 ఎకరాల విస్తీర్ణంలో పోర్టు నిర్మాణం జరగాల్సి ఉంది. ఇందుకు అవసరమైన భూములను గతంలోనే గుర్తించారు. భూ సేకరణే కీలకంగా మారింది. పోర్టు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణకు అవసరమైన నిధులను తామే సమకూరుస్తామని నిర్మాణ కాంట్రాక్టు పొందిన నవయుగ సంస్థ గతంలోనే ప్రభుత్వానికి లేఖ రాసింది. భూసేకరణకు రూ.451.42 కోట్లు, పోర్టు నిర్మిస్తే 563 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంటుందని, ఇందుకు రూ.43.58 కోట్లు అవసరమవుతాయని 2011, జూలైలో కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. 2012, మే నెలలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పోర్టు కోసం 5,324 ఎకరాల భూమిని కేటాయిస్తూ జీవో నంబరు-11 జారీచేశారు. ఇందులో 524 ఎకరాలు పోర్టుకు సంబంధించిన భూమి ఉంది. ఆ భూమి ఇప్పటికే సేకరించారు. మిగిలిన 4,800 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ముఖ్యమంత్రి సూచనతో పోర్టుకు అవసరమైన భూ సేకరణ పై మరోమారు అధికారులు గతంలో ఇచ్చిన నివేదికనే కొద్దిపాటి మార్పులు చేసి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. స్వల్ప మార్పులు..! ఇప్పటి వరకు కరగ్రహారం వద్ద పోర్టు పనులు ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే కొద్దిపాటి మార్పులతో పోర్టు పనులు గిలకలదిండి వైపునకు మారే అవకాశం ఉందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. పోర్టు భూ సేకరణ జరగాలంటే కలెక్టర్ పర్యవేక్షణలో తొలుత భూ సేకరణకు డ్రాస్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. అనంతరం డ్రాఫ్ట్ డిక్లరేషన్ ఇవ్వాలి. పోర్టు అభివృద్ధికి భూసేకరణ చేయాలని ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తేనే ఈ ప్రక్రియ వేగవంతమవుతుందని అధికారులు చెబుతున్నారు. భూసేకరణ పూర్తయితే ఈ భూములను ప్రభుత్వం ఓడరేవుల శాఖకు అప్పగిస్తుంది. ఓడరేవుల శాఖ నుంచి తమకు ఈ భూములు అప్పగించిన వెంటనే పోర్టు పనులు ప్రారంభిస్తామని నవయుగ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భూ సేకరణకు సంబంధించి నివేదికను తయారు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. రోడ్డు పనులు ప్రాంభమయ్యేనా! మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు కలెక్టర్‌కు సూచిం చారు. మచిలీపట్నం-విజయవాడ మధ్య 65 కిలోమీటర్ల మేర ఈ జాతీయ రహదారిని రూ.750 కోట్లతో నాలుగు లైన్లుగా విస్తరించేందుకు ప్రభుత్వం 2012లోనే అనుమతులు ఇచ్చింది. ఈ పనులను మధుకాన్ సంస్థ దక్కించుకుంది. ఈ రోడ్డు పనులు ప్రారంభం కావాలంటే 81శాతం భూ సేకరణ జరగాల్సి ఉండగా ఈ ప్రక్రియ పూర్తయింది. మధుకాన్ సంస్థ ఈ పనులు ప్రారంభిం చకుండా జాప్యం చేసింది. బందరు పోర్టు, జాతీయ రహదారికి ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సిన అవసరం లేదు. ఈ రెండు పనులను దక్కించుకున్న సంస్థలే పెట్టుబడి పెడతాయి. పోర్టు పనులు ప్రారంభమైతే ఈ రహదారి నాలుగు లైన్లుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. -
దళితులకు మూడెకరాలు ఎక్కడిస్తరు?
దళితుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు కొత్త ప్రభుత్వం కృషిచేస్తుందని సీఎం స్పష్టం చేశారు. దళితు లకు మూడెకరాల భూమి పంపిణీ చేస్తామని ప్రకటించా రు. ఇందుకు కావల్సిన భూమి అందుబాటులో లేకపో వడంతో అధికారులు అయోమయం చెందుతున్నారు. - పంపిణీకి జిల్లాలో భూమి కరువు - సీఎం ప్రకటనతో దళితుల్లో ఆనందం - జిల్లా అధికారుల్లో ఆందోళన - ఆగస్టు 15వరకు సాధ్యమయ్యేనా? నిజామాబాద్ అర్బన్: కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం దళితులపై వరాల జల్లు కురిపిస్తోంది. ప్రతీ కుటుంబానికి మూడు ఎకరాల భూమిని పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం తో వారిలో ఆనందం వెల్లివిరుస్తోంది. కానీ..ప్రభుత్వ నిర్ణయంతో అధికారుల్లో అయోమయం నెలకొంది. లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి జి ల్లాలో భూమి అందుబాటులో లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఆగస్టు 15నుంచి దళితులకు భూపంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి జిల్లా అధికారులకు ఆదేశాలు కూడా అందాయి. దీంతో అధికారులు భూముల కోసం అన్వేషణ ప్రారంభిం చారు. ఎక్కడెక్కడ జిల్లాలో పంపిణీకి కావల్సిన భూము లు ఎక్కడెక్కడ ఉన్నాయో అధికారులు ఆరా తీస్తున్నారు. భూమి లేకపోవడంతోనే గతంలో ఇందిరమ్మ పథకం 6వ విడత భూపంపిణీ కార్యక్రమం జిల్లా లో నిర్వహించలేదు. ప్రస్తుత సర్కార్ దళితులకు భూపంపిణీపై పకడ్బందీ ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు భూముల ఆచూకీ తీస్తున్నారు. ఇప్పటికే సిబ్బందిని ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నట్లు తెలిసింది. దళితులకు మూ డెకరాల భూపంపిణీ ఎలాగైన ఇవ్వాల్సిందేనని సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పడం అధికారులకు చెమటలు పట్టిస్తోంది. ఆరో విడతకే కరువు జిల్లాలో ఇందిరమ్మ భూపంపిణీ కార్యక్రమంలో భా గంగా మొదటి విడత కార్యక్రమంలో 1,086 మంది ఎస్సీలకు 1343.25 ఎకరాల భూమిని కేటాయించా రు. రెండోవిడతలో వెయ్యిమంది ఎస్సీలకు 1028.03 ఎకరాలు, మూడోవిడతలో 690 ఎస్సీ లబ్ధిదారులకు 683.23 ఎకరాలు, నాలుగో విడతలో 1,235 లబ్ధిదారులకు 1379.06 ఎకరాలు, ఐదో విడతలో 361 మంది ఎస్సీ లబ్ధిదారులకు 420.29 ఎకరాల భూమి ని కేటాయించారు. ఈ ఐదు విడతల్లో ఎస్సీలు మిన హా మిగితా వర్గాలకు చెందిన 17,495మంది లబ్ధిదారులకు కలిపి 22,129.05 ఎకరాలను కేటాయించా రు. ఆరో విడతకు వచ్చేసరికి ప్రభుత్వ భూమి కొరత ఏర్పడింది. భూమి అందుబాటులో ఈ విడత చేపట్టనే లేదు. స్వాధీనం చేసుకోవాల్సిందేనా..! ప్రస్తుతం అర్హులందరికీ మూడు ఎకరాల భూపంపిణీ చేపట్టాలంటే చాలా కష్టమని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో జనాభా 25.50 లక్షలు ఉండగా.. అందులో 8.50లక్షల మంది దళితులు ఉన్నారు. వీరి లో అర్హులైన వారందరికి మూడున్నర ఎకరాల చొ ప్పున భూపంపిణీ చేపట్టాలంటే పెద్దమొత్తంలో అవసరం ఏర్పడుతుంది. ప్రభుత్వం భూమి అందుబాటులో లేకుంటే గతంలో పరిశ్రమలు, అభివృద్ధి పనులకు కేటాయించిన భూముల్లో పనులు ప్రారంభం కాకపోతే వాటిని స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలిసింది. జిల్లాలో నందిపేట మండలం లక్కంపల్లి గ్రామం వద్ద ఫుడ్‌పార్కుకు కేటాయించిన భూమి మాత్రమే ఉంది. మిగితా ఎక్కడా ఇలాంటి భూములు అందుబాటులో లేవు. ఉన్న భూములను కస్తూర్బా విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి కేటాయించారు. ఇవి కొన్ని నిర్మాణంలో ఉండగా, మరికొన్ని ప్రారంభానికి నోచుకోలేదు. ఇలాంటి భూములను కూడా అధికారులు పంపిణీ చేయడానికి పరిశీలించే అవకాశం ఉంది. ప్రభుత్వం అవసరమైతే ప్రైవేటు భూములను సేకరించి ఇస్తామని చెప్పడంతో ఆ దిశగానూ దృష్టిసారిస్తున్నారు. భూపంపిణీపై సర్కారు నుంచి మరింత స్పష్టమైన విధి విధానాలు అందగానే పూర్తిస్థాయిలో భూసేకరణ ప్రక్రియను ప్రారంభించేందుకు జిల్లా అధికారులు సమయాత్తమవుతున్నారు.