ఉన్న ఊరు... కన్నతల్లి అంటారు. పుట్టి పెరిగిన ఊరుతో ప్రతివారికీ ప్రగాఢమైన అనుబంధం ఉంటుంది. ఉపాధి కోసమో, ఉన్నత చదువుల నిమిత్తమో, మెరుగైన అవకాశాల కోసమో అక్కడినుంచి కదలక తప్పని స్థితి ఏర్పడినప్పుడు ఎవరికైనా కలిగే భావోద్వేగాలు మాటలకందనివి. కానీ తరతరాలనుంచి కశ్మీర్ లోయలో ఉంటున్న పండిట్లది అంతకన్నా దుర్భరమైన స్థితి. పాతికేళ్లనాడు ఉగ్రవాదం విరుచుకుపడినప్పుడు వారు చిగురుటాకుల్లా వణికారు. దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దాడులు, హత్యలు, గృహదహనాలతో అట్టుడికిన ఆ భయంకర అధ్యాయం ఎందరినో వలసబాట పట్టించింది. ఆ సమయంలో దాదాపు నాలుగు లక్షలమంది పౌరులు జమ్మూ మొదలుకొని దేశంలోని చాలా ప్రాంతాలకు వలసపోయారు. వారిలో చాలామంది ఇప్పటికీ శరణార్థుల్లా బతుకులీడుస్తున్నారు. ఇలాంటి వారందరూ మళ్లీ స్వస్థలాలకు రావొచ్చని, తాము అందుకవసరమైన పథకాన్ని రూపొందిస్తామని ఎన్నికల సందర్భంలో బీజేపీ హామీ ఇచ్చినప్పుడు అందరూ హర్షించారు. వేర్పాటువాద హురియత్ వర్గాలు కూడా కశ్మీర్ పండిట్ల పునరాగమనం తమకు ఆమోదయోగ్యమని ప్రకటించాయి. కశ్మీర్‌లో ఏర్పడ్డ పీడీపీ-బీజేపీ కూటమి ప్రభుత్వం ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నదన్నప్పుడు దాదాపు అన్ని పార్టీలూ మెచ్చుకున్నాయి. తీరా మూడు రోజులనాడు ప్రధాని నరేంద్రమోదీని, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశాక జమ్మూ-కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ ప్రకటించిన పథకం అందరినీ ఆశ్చర్యపరిచింది. పండిట్లను సైతం విస్తుగొల్పింది. కశ్మీర్ పండిట్ల కోసం ప్రత్యేక నివాస ప్రాంతాలను ఏర్పాటు చేస్తామన్నదే సయీద్ ప్రకటన సారాంశం. ఇందు కోసం త్వరలోనే భూసేకరణ ప్రక్రియను ప్రారంభించబోతున్నట్టు కూడా ఆయన చెప్పారు.
రెండున్నర దశాబ్దాలుగా కశ్మీర్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. అప్పుడప్పుడు ప్రశాంత పరిస్థితులు ఏర్పడినట్టు కనబడినా వెనువెంటనే అశాంతిలో చిక్కుకోవడం అక్కడ సర్వసాధారణమైంది. ఇలాంటి ఉద్రిక్త వాతావరణం సమసిపోయి ప్రశాంతత ఏర్పడాలని, కనీస ప్రజాస్వామిక వాతావరణం ఉండాలని కశ్మీర్ పౌరులందరూ కోరుకుంటున్నారు. లోయనుంచి ప్రాణభయంతో వెళ్లిపోయిన కశ్మీర్ పండిట్లు తిరిగి వచ్చే పరిస్థితులు ఏర్పడితేనే నిజమైన అర్ధంలో ప్రశాంతత ఏర్పడినట్టవుతుంది. అందుకవసరమైన చర్యలు తీసుకోవడం మంచిదే. కశ్మీర్‌లోని మారుమూల గ్రామాల్లో సైతం ముస్లింలు, పండిట్లు తరతరాలుగా కలిసిమెలిసి ఉన్నారు. పర్వదినాల్లో అందరూ సమష్టిగా పాలుపంచుకున్నారు. అయిదారు వందల ఏళ్లక్రితం కశ్మీర్ ప్రాంతం అఫ్ఘాన్‌ల వశమైనప్పుడు ఆ ప్రాంతంలో ఇస్లాం ప్రవేశించింది. పండిట్లతోసహా వేర్వేరు కులాలవారంతా ఆ మతంలో చేరారు. ఇప్పటికీ చాలా మంది కశ్మీర్ నేతల పేర్లలో ఆ కుల మూలాలుంటాయి.
కశ్మీర్ పండిట్లు స్వస్థలానికి వెళ్లడమంటే మళ్లీ తమ ఊళ్లకు తాము వెళ్లగలగడం. అంతేతప్ప శ్రీనగర్ శివార్లలో వందెకరాలో, రెండొందల ఎకరాలో భూమిని సేకరించి అందులో అపార్టుమెంట్లు లేదా నివాసగృహాలు నిర్మించడం కాదు. అలా చేయడ ం వారిని అవమానించడంతో సమానమవుతుంది. కశ్మీర్ పండిట్లు తిరిగి రావడాన్ని పాకిస్థాన్ ప్రోద్బలమున్న ఉగ్రవాద శక్తులు మినహా మిగిలినవారంతా స్వాగతిస్తున్నారు. అలాంటపుడు పండిట్లను ఇప్పుడున్న సమాజంలో భాగస్వాములను చేసి సామరస్యపూర్వక వాతావరణం ఏర్పడటానికి దోహదం చేయాలి తప్ప సొంతగడ్డపైనే పరాయివారిగా, అంటరానివారిగా మార్చకూడదు. పండిట్లకు ప్రత్యేక జోన్‌ను ఏర్పాటుచేస్తే వారి భద్రత సులభమవుతుందన్న ఆలోచన కూడా సరికాదు. శ్రీనగర్‌వంటిచోట ఎంతో కట్టుదిట్టమైన భద్రత ఉండే కంటోన్మెంట్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు.
భిన్న వర్గాలమధ్య సుహృద్భావ సంబంధాలు, పరస్పర విశ్వాసం సమాజాన్ని భద్రంగా, సురక్షితంగా ఉంచుతాయి తప్ప తుపాకుల నీడలో అంతా క్షేమంగా ఉంటుందనుకుంటే పొరపాటు. అయితే, పండిట్లను మళ్లీ వారి వారి స్వస్థలాలకు చేర్చడంలో ఇబ్బందులు లేకపోలేదు. వారిలో చాలామంది తమ స్థిరాస్తులను అమ్ముకుని నిష్ర్కమించారు. ఆయా ప్రాంతాల్లో మళ్లీ వారి జీవికకు అవసరమైన పరిస్థితులు సృష్టించడం, ఆవాసం కల్పించడం సవాలే. కానీ ప్రభుత్వం తల్చుకుంటే అది అసాధ్యమేమీ కాదు. పండిట్లు వెనక్కొస్తే వారిని హృదయ పూర్వకంగా ఆహ్వానిస్తామని... వారి ఇళ్లు వారికి ఇవ్వడానికి సిద్ధమేనని గతంలోనే పలువురు కశ్మీర్ ముస్లింలు తెలిపారు.
కశ్మీర్ పండిట్లకు ప్రత్యేక జోన్ ప్రతిపాదన బయటికొచ్చాక వెల్లువెత్తిన నిరసనలను చూసి పీడీపీ నేతలు గొంతు సవరించుకున్నారు. తమ ఉద్దేశం అది కాదని మాటమార్చారు. కానీ భూసేకరణ జరిపి పండిట్లకు ప్రత్యేక నివాస ప్రాంతం ఏర్పర్చడమంటే ఏమిటో వారు వివరించలేకపోతున్నారు. బీజేపీ నేతలు ఈ ప్రతిపాదన గురించి మాట్లాడకపోయినా విశ్వహిందూ పరిషత్ వంటి పరివార్ సంస్థలు ప్రత్యేక జోన్ ఏర్పాటులో తప్పేముందని ప్రశ్నిస్తున్నాయి. పండిట్లను తిరిగి లోయకు రప్పిస్తే అక్కడ తమ ఓటు బ్యాంకు ఏర్పడుతుందన్న ఉబలాటం బీజేపీకి ఉన్నట్టు కనబడుతోంది. ముస్లిం ఓట్లను పీడీపీ... హిందూ ఓట్లను తామూ పంచుకుంటే తమ కూటమికి భవిష్యత్తులో ఢోకా ఉండదని ఆ పార్టీ అనుకుంటున్నది. కానీ తాత్కాలిక ప్రయోజనాలను నెరవేర్చే ఇలాంటి ఓటు బ్యాంకు రాజకీయాలు అనూహ్యమైన సామాజిక అస్థిరతలను సృష్టిస్తాయి. ఇన్నేళ్లుగా మారణకాండ సాగిస్తున్నా ఉగ్రవాదులకు సాధ్యపడని హిందూ-ముస్లిం విభేదాలు ఇలాంటి నిర్ణయాలవల్ల పుట్టి విస్తరిస్తాయి. కశ్మీర్ చరిత్ర, సంస్కృతి తెలిసున్నవారు... ప్రత్యేకించి ఆ గడ్డపై పండిట్ల సాధకబాధకాలు అవగాహన చేసుకున్నవారు ఇలాంటి దుస్సాహసానికి దిగరు.
పుట్టింట్లో ‘ప్రత్యేక’ పథకం
Published Sat, Apr 11 2015 1:53 AM | Last Updated on Sun, Sep 3 2017 12:07 AM
Advertisement
Advertisement