ఫార్మా రైతులతో కొనసాగిన చర్చలు | Continued discussions with Pharma farmers | Sakshi
Sakshi News home page

ఫార్మా రైతులతో కొనసాగిన చర్చలు

Published Sat, Jul 16 2016 3:02 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

Continued discussions with  Pharma farmers

రైతులతో మరోసారి సమావేశమైన జేసీ
కందుకూరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముచ్చర్ల ఫార్మాసిటీకి సంబంధించి భూసేకరణ ప్రక్రియ కొనసాగుతునే ఉంది. ముచ్చర్ల సర్వే నంబర్ 155లోని 630.11 ఎకరాల్లో 211.24 పట్టా, 176 ఎకరాల్లో అసైన్‌‌డదారులు, 242.17 ఎకరాల్లో కబ్జా ఉంది. శుక్రవారం అసైన్‌‌డదారులతో జేసీ రజత్‌కుమార్‌సైనీ, ఆర్డీఓ సుధాకర్‌రావు, తహసీల్దార్ సుశీల, టీఎస్‌ఐఐసీ జోనల్ మేనేజర్ రవి తదితరులు రెండో దఫా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. గత సమావేశంలో చెప్పిన విధంగా భూమి అభివృద్ధి చేసినందుకు మొత్తంగా ఎకరాకు రూ.10 లక్షలు ఇస్తామని చెప్పారు.

ఇతర ప్రాంతాల్లో భూములు కొనాలన్నా ధరలు పెరిగిపోయాయని ఎకరాకు రూ.15 లక్షలు ఇవ్వాలని కోరారు. ఇప్పటి వరకు అసైన్‌‌డ భూములకు రూ.8 లక్షల వరకు మాత్రమే ఇచ్చామని, ఇక్కడ భూమి అభివృద్ధి చేసినందుకు అదనంగా మరో రూ.2 లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని జేసీ వివరించారు. భూములు ఇవ్వడానికి సిద్ధమైతే ఆగస్టు వరకు పరిహారం చెక్కులు ఇస్తామని ఆలోచించుకొని రావాలని వారితో సమావేశాన్ని ముగించారు.  

 రహదారి విస్తరణకు భూసేకరణ..
ఫార్మా రైతులతో సమావేశం ముగిసిన అనంతరం జేసీ రజత్‌కుమార్‌సైనీ ఆర్ అండ్ బీ ఎస్‌ఈ సంధ్యారాణి, ఆర్డీఓ, తహసీల్దార్ తదితరులతో కలిసి కందుకూరు-మీర్కాన్‌పేట  రహదారి వెంట ఉన్న రైతులతో సమావేశమై చర్చలు జరిపారు. జేసీ మాట్లాడుతూ.. ఫార్మాసిటీ కోసం శ్రీశైలం రహదారి నుంచి నేరుగా మీర్కాన్‌పేట, యచారం వరకు ఉన్న రహదారిని విస్తరించనున్నట్లు తెలిపారు. మొదటి విడతగా శ్రీశైలం రహదారి నుంచి మీర్కాన్‌పేట వరకు రోడ్డును 150 అడుగుల మేర విస్తరించనున్నట్లు చెప్పారు. రైతులంతా భూములు ఇచ్చి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా రైతుల అభిప్రాయాలు తీసుకున్నారు.

భూసేకరణ చట్టం ప్రకారం సబ్ రిజిస్టార్ ్ర ధరకు అదనంగా మూడు రెట్లు ఇవ్వాలని రైతులు కోరారు. చివరగా ఎకరాకు రూ.50 లక్షల చొప్పున ఇవ్వాలని లేకపోతే ఇవ్వమని తేల్చిచెప్పారు. అంత ధర ఇవ్వలేమని ఆలోచించుకోవాలని, మరోమారు సమావేశమవుదామని సమావేశాన్ని ముగించారు. ఏఏ రైతు భూమి ఎంత మేర తీసుకోవాల్సి వస్తుందో సర్వే చేసి సోమవారం వరకు ఇవ్వాలని ఈ సందర్భంగా అధికారుల్ని జేసీ ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బీ డీఈ అమృతరెడ్డి, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement