‘పోర్టు’కు చలనం
మచిలీపట్నం : జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన బందరు పోర్టు నిర్మాణ విషయంలో కాస్త చలనం వచ్చింది. విజయవాడలో ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బందరు పోర్టు అభివృద్ధికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. పోర్టు భూసేకరణకు సంబంధించిన వివరాలను తనకు నివేదిక రూపంలో అందజేయాలని ఆయన చెప్పారు. రెవెన్యూ అధికారులు నివేదిక తయారు చేస్తే త్వరలోనే ముఖ్యమంత్రి పోర్టు భూసేకరణపై అధికారులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. మచిలీపట్నం-విజయవాడ మధ్య నాలుగు లైన్ల రహదారి విస్తరణ పనులను కూడా ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారని అధికారులు చెబుతున్నారు.
గతంలోనే నివేదిక
రూ.5వేల కోట్లతో 5,324 ఎకరాల విస్తీర్ణంలో పోర్టు నిర్మాణం జరగాల్సి ఉంది. ఇందుకు అవసరమైన భూములను గతంలోనే గుర్తించారు. భూ సేకరణే కీలకంగా మారింది. పోర్టు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణకు అవసరమైన నిధులను తామే సమకూరుస్తామని నిర్మాణ కాంట్రాక్టు పొందిన నవయుగ సంస్థ గతంలోనే ప్రభుత్వానికి లేఖ రాసింది. భూసేకరణకు రూ.451.42 కోట్లు, పోర్టు నిర్మిస్తే 563 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంటుందని, ఇందుకు రూ.43.58 కోట్లు అవసరమవుతాయని 2011, జూలైలో కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపారు.
2012, మే నెలలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పోర్టు కోసం 5,324 ఎకరాల భూమిని కేటాయిస్తూ జీవో నంబరు-11 జారీచేశారు. ఇందులో 524 ఎకరాలు పోర్టుకు సంబంధించిన భూమి ఉంది. ఆ భూమి ఇప్పటికే సేకరించారు. మిగిలిన 4,800 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ముఖ్యమంత్రి సూచనతో పోర్టుకు అవసరమైన భూ సేకరణ పై మరోమారు అధికారులు గతంలో ఇచ్చిన నివేదికనే కొద్దిపాటి మార్పులు చేసి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
స్వల్ప మార్పులు..!
ఇప్పటి వరకు కరగ్రహారం వద్ద పోర్టు పనులు ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే కొద్దిపాటి మార్పులతో పోర్టు పనులు గిలకలదిండి వైపునకు మారే అవకాశం ఉందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. పోర్టు భూ సేకరణ జరగాలంటే కలెక్టర్ పర్యవేక్షణలో తొలుత భూ సేకరణకు డ్రాస్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. అనంతరం డ్రాఫ్ట్ డిక్లరేషన్ ఇవ్వాలి. పోర్టు అభివృద్ధికి భూసేకరణ చేయాలని ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తేనే ఈ ప్రక్రియ వేగవంతమవుతుందని అధికారులు చెబుతున్నారు. భూసేకరణ పూర్తయితే ఈ భూములను ప్రభుత్వం ఓడరేవుల శాఖకు అప్పగిస్తుంది. ఓడరేవుల శాఖ నుంచి తమకు ఈ భూములు అప్పగించిన వెంటనే పోర్టు పనులు ప్రారంభిస్తామని నవయుగ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భూ సేకరణకు సంబంధించి నివేదికను తయారు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
రోడ్డు పనులు ప్రాంభమయ్యేనా!
మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు కలెక్టర్‌కు సూచిం చారు. మచిలీపట్నం-విజయవాడ మధ్య 65 కిలోమీటర్ల మేర ఈ జాతీయ రహదారిని రూ.750 కోట్లతో నాలుగు లైన్లుగా విస్తరించేందుకు ప్రభుత్వం 2012లోనే అనుమతులు ఇచ్చింది. ఈ పనులను మధుకాన్ సంస్థ దక్కించుకుంది. ఈ రోడ్డు పనులు ప్రారంభం కావాలంటే 81శాతం భూ సేకరణ జరగాల్సి ఉండగా ఈ ప్రక్రియ పూర్తయింది. మధుకాన్ సంస్థ ఈ పనులు ప్రారంభిం చకుండా జాప్యం చేసింది. బందరు పోర్టు, జాతీయ రహదారికి ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సిన అవసరం లేదు. ఈ రెండు పనులను దక్కించుకున్న సంస్థలే పెట్టుబడి పెడతాయి. పోర్టు పనులు ప్రారంభమైతే ఈ రహదారి నాలుగు లైన్లుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.