‘భూ’గ్రహణం!
♦ ఫార్మాసిటీ భూసమీకరణలో ఎడతెగని జాప్యం
♦ 10,628 ఎకరాలు సేకరించాలని నిర్ణయం
♦ ఇప్పటికి ఖరారు చేసిన భూమి 13 శాతమే
♦ {పతిష్టాత్మక ప్రాజెక్టుకు భూగండం
♦ దూకుడు తగ్గించిన జిల్లా యంత్రాంగం
ఔషధన గరికి ‘భూ’గ్రహణం పట్టుకుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫార్మాసిటీ భూసేకరణ ప్రక్రియ మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు 10,628 ఎకరాలను సమీకరించాలని సర్కారు నిర్ణయించింది. కానీ ఇప్పటివరకు 13శాతం భూములను మాత్రమే జిల్లా యంత్రాంగం సేకరించగలిగింది.
- సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి
♦ ఔషధనగరికి నిర్దేశించింది: 10,628.36 ఎకరాలు
♦ గుర్తించిన ప్రభుత్వ భూమి : 7,050
♦ టీఎస్‌ఐఐసీకి బ దలాయింపు: 1349.30
♦ అప్పగింతకు సిద్ధంగా ఉన్నది : 1488.16
♦ ఇప్పటికి సర్వే పూర్తయినది : 740.30
♦ ముచ్చర్లలో 855, మీర్‌ఖాన్ పేటలో 494 ఎకరాలను టీఎస్‌ఐఐసీకి అప్పగించారు.
♦ పంజాగూడ, మీర్ ఖాన్‌పేటలో దాదాపు 1,100 ఎకరాలకు సంబంధించి భూ నిర్వాసితులతో సంప్రదింపులయ్యాయి.
♦ యాచారం మండలం కుర్మిద్ద రెవెన్యూ పరిధిలోని భూములను తీసుకునేందుకు అసైన్డ్‌దారులు, ఆక్రమణదారులతో చర్చల ప్రక్రియను కొలిక్కి తెచ్చారు. నష్టపరిహారాన్నీ ఖరారు చేశారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో దాదాపు 15వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీకి జాతీయ పెట్టుబడులు, ఉత్పాదనల మండలి (నిమ్జ్)హోదా కూడా కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ హోదాతో రాయితీలు, మౌలిక వసతుల కల్పనకు కేంద్రం గ్రాంటు రూపేణా విరివిగా నిధులు విడుదల చేసే అవకాశం ఉండడంతో భూసమీకరణను వేగిరం చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. అయితే, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. ప్రతిపాదిత విస్తీర్ణంలో కేవలం 13శాతం భూములను మాత్రమే జిల్లా యంత్రాంగం సేకరించింది. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు ఔషధ దిగ్గజ సంస్థలు ముందుకొస్తున్నాయి.
అనేక ఫార్మా కంపెనీలు బారులు తీరుతున్నాయి. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఫార్మాసిటీని అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్‌ఐఐసీ కృతనిశ్చయంతో ఉంది. కాగా రెవెన్యూ యంత్రాంగం భూసేకరణపై మునుపటి కంటే స్పీడు తగ్గించింది. ఏడాది క్రితం దూకుడు ప్రదర్శించిన అధికారులు.. ఇప్పుడు షరా మామూలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇప్పటివరకు కేవలం 1,349.30 ఎకరాలను మాత్రమే సేకరించి.. టీఎస్‌ఐఐసీకి అప్పగించారు. కందుకూరు మండలం ముచ్చర్లలో 855 ఎకరాలు, మీర్‌ఖాన్ పేటలో 494.24 ఎకరాలను టీఎస్‌ఐఐసీకి బదలాయించారు. ఇక ఇదే మండలం పంజాగూడ, మీర్ ఖాన్‌పేటలో దాదాపు 1,100 ఎకరాలకు సంబంధించి భూ నిర్వాసితులతో సంప్రదింపులు పూర్తి చేశారు.
యాచారం మండలం కుర్మిద్ద రెవెన్యూ పరిధిలోని భూములను తీసుకునేందుకు అసైన్డ్‌దారులు, ఆక్రమణదారులతో చర్చల ప్రక్రియను కొలిక్కి తెచ్చారు. నష్టపరిహారాన్ని కూడా ఖరారు చేశారు. తద్వారా 1,073 ఎకరాలను సేకరించేందుకు లైన్‌క్లియర్ చేశారు. అయితే, భూములు కోల్పోయేవారి జాబితా తయారీలో స్థానిక రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని కొందరు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ భూముల స్వాధీనం ఆలస్యమవుతోంది.
ఇదే పరిస్థితి పంజాగూడ, మీర్‌ఖాన్‌పేటలోనూ ఎదురవుతోంది. ఇక తాడిపర్తి, నానక్‌నగర్, మేడిపల్లిలో ప్రభుత్వ భూములను జిల్లా యంత్రాంగం గుర్తించింది. కాగా, భూ సమీకరణ ఆలస్యం కావడానికి టీఎస్‌ఐఐసీ వ్యవ హరిస్తున్న తీరే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఫార్మాసిటీ స్థాపన, పరిహారం ఇచ్చేది టీఎస్‌ఐఐసీ కావడంతో ఆ సంస్థ ఇచ్చే ప్రతిపాదనలకు అనుగుణంగా మందుకు సాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, తద్వారా భూ సమీకరణలో జాప్యం జరుగుతుందని రెవెన్యూ అధికారులు అంటున్నారు.