సమావేశంలో మాట్లాడుతున్న రాహుల్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మౌలిక సదుపాయాల కింద ప్రతి కుటుంబానికి ఏటా రూ.72వేలు సాయమందేలా ఎన్‌వైఏవై కింద కార్యాచరణ రూపొందిస్తామని రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లిలో మధ్యాహ్న విడిది శిబిరంలో రాహుల్ గాంధీ.. పౌరహక్కుల నేతలు, సామాజిక కార్యకర్తలతో ఆదివారం భేటీ అయ్యారు.
దేశ చరిత్ర, పునర్నిర్మాణం, రాజ్యాంగ పరిరక్షణ, నిరుద్యోగం, కార్మికులు, యువత తదితర అంశాలపై చర్చించారు. అనంతరం రాహుల్ మాట్లాడుతూ.. బీజేపీ విధానాలతో దేశం అన్ని రంగాల్లో తిరోగమిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే సామాన్యులకు రాజ్యాంగ హక్కులు అందుతాయన్నారు. రాహుల్‌ను కలిసినవారిలో ప్రొఫెసర్ శాంతా సిన్హా, మహిళా జేఏసీ నాయకురాలు సజయ, గీతా రామస్వామి, జశ్విన్, మృదుల దేశాయి, రమా మేల్కొటే, ఉస్మానియా రిటైర్డ్ ప్రొఫెసర్ లిసి జోసఫ్, సుశీ, సభా, బీఆర్ వర్గీస్, శరత్ విమల, మీరా సంఘమిత్ర, దిడ్డి ప్రవీణ్ కుమార్, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, మాజీ ఐఏఎస్ రమేష్‌బాబు తదితరులు ఉన్నారు.
ఇది రాజకీయ యాత్ర కాదు: కన్హయ్య కుమార్
దేశంలో పేదలు పేదలుగానే ఉంటున్నారని.. సంపన్నులు ఇంకా సంపన్నులుగా మారుతున్నారని భారత్ జోడో యాత్రీ కన్హయ్యకుమార్ అన్నారు. జోడో యాత్ర మధ్యా హ్నభోజన శిబిరంలో ఏఐసీసీ కార్యదర్శి జైరాం రమేష్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఉన్నత చదువులు చదివిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభించక ఆందోళనలో ఉన్నారన్నారు. ఇది రాజకీయ యాత్ర కాదని, యాత్రలో కాంగ్రెస్ కార్యకర్తలు లేరని.. కులమతాలకతీతంగా అందరూ పాల్గొంటున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment