John F. Kennedy
-
ఎట్టకేలకు కెనెడీ ఫైల్స్ డీ క్లాసిఫై
వాషింగ్టన్: అప్పట్లో ప్రపంచమంతటా సంచలనం సృష్టించిన అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెనెడీ, ఆయన సోదరుడు, సెనేటర్ రాబర్ట్ ఎఫ్.కెనెడీ, పౌర హక్కుల నాయకుడు మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్ హత్యలకు సంబంధించి త్వరలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. వారి హత్యోదంతాలకు సంబంధించిన రహస్య ఫైళ్లన్నింటినీ బహిర్గతం చేయాల్సిందిగా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై ఆయన గురువారం సంతకం చేశారు. ‘‘ఈ హత్యల వెనక నిజానిజాలను అమెరికా ప్రజలు తెలుసుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఇందుకోసం వారు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. కనుక అన్ని విషయాలనూ బయట పెట్టబోతున్నాం’’ అని విలేకరులకు స్పష్టం చేశారు. సంబధిత ఫైళ్లను డీక్లాసిఫై చేయడానికి 15 రోజుల్లోగా ప్రణాళిక సిద్ధం చేయాల్సిందిగా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్‌ను ఆదేశించారు. అనంతరం 45 రోజుల్లోగా ఫైళ్లన్నింటినీ ప్రజల ముందు పెట్టాలని పేర్కొన్నారు. సంబంధిత ఉత్వర్వులపై సంతకం చేసిన పెన్నును రాబర్ట్ ఎఫ్.కెనెడీ కుమారుడు, కాబోయే ఆరోగ్య మంత్రి రాబర్ట్ ఎఫ్.కెనెడీ జూనియర్‌కు ఇవ్వాల్సిందిగా అధికారులకు ట్రంప్ సూచించారు. కెనెడీల హత్యపై అధికారిక కథనాలపై కెనెడీ జూనియర్ చాలాకాలంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆదేశాలు ఏమేరకు కార్య రూపం దాలుస్తాయన్నది అనుమానంగా మారింది. ..నేటికీ మిస్టరీయే 1963లో కెనెడీ డాలస్‌లో ఓపెన్ టాప్ కారులో వెళ్తుండగా లీ హార్వే ఓస్వాల్డ్ అనే మాజీ సైనికుడు కాల్చి చంపడం సంచలనంగా మారింది. ఐదేళ్ల అనంతరం స్థానంలో అధ్యక్ష ఎన్నికల బరిలో దిగిన ఆయన సోదరుడు రాబర్ట్ కూడా కాలిఫోరి్నయాలో హత్యకు గురయ్యారు. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతుపై ఆగ్రహంతో సిర్హాన్ అనే ఓ పాలస్తీనియన్ ఆయన్ను కాల్చి చంపాడు. అందుకు రెండు నెలల క్రితం లూథర్‌కింగ్‌ను కూడా టెనెసీలో జాతి విద్వేషానికి బలయ్యారు. జేమ్స్ ఎర్ల్ రే అనే జాత్యహంకారి ఆయన్ను కాల్చి చంపాడు. ఈ హత్యలకు సంబంధించి పలు డాక్యుమెంట్లు అడపాదడపా వెలుగు చూశాయి. కానీ వేలాది డాక్యుమెంట్లు గోప్యంగానే ఉండిపోయాయి. వాటి విచారణ ఫైళ్లన్నింటినీ బయట పెట్టాలంటూ 1992లో అమెరికా కాంగ్రెస్ చట్టం కూడా చేసింది. ఆ మేరకు కెనెడీ హత్యకు సంబంధించి చాలా డాక్యుమెంట్లను గత పదేళ్లలో ప్రభుత్వాలు బయటపెట్టినా లక్షలాది డాక్యుమెంట్లు ఇంకా గోప్యంగానే ఉండిపోయాయి. ట్రంప్ తన తొలి హయాంలోనే వాటన్నింటినీ బయట పెడతానని హామీ ఇచ్చినా సీఐఏ, ఎఫ్‌బీఐ ఒత్తిళ్ల కారణంగా మిన్నకుండిపోయారని చెబుతారు. ఓస్వాల్డ్ వ్యక్తిగత కక్షతోనే కెనెడీని పొట్టన పెట్టుకున్నట్టు విచారణ కమిషన్ తేలి్చనా అది నిజం కాదని అమెరికన్లలో అత్యధికులు నేటికీ చెబుతారు. హత్య వెనక కుట్ర కోణముందంటూ జోరుగా విశ్లేషణలు సాగాయి. ప్రభుత్వ ఏజెంట్లు, మాఫియా, తెర వెనక శక్తుల హస్తముందని ఏళ్ల తరబడి కథనాలు వెలువడ్డాయి. -
కెన్నెడీ హత్య.. మరిన్ని డాక్యుమెంట్లు బహిర్గతం
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెన్నెడీ హత్యకు సంబంధించి 13 వేల పై చిలుకు డాక్యుమెంట్లను వైట్‌హౌస్ తాజాగా బయట పెట్టింది. దీంతో ఆ ఉదంతానికి సంబంధించి 97 శాతానికి పైగా సమాచారం జనానికి ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చినట్టేనని ప్రకటించింది. అయితే మరో 515 డాక్యుమెంట్లను పూర్తిగా, 2,545 డాక్యుమెంట్లను పాక్షికంగా గోప్యంగానే ఉంచనుంది! వాటిని 2023 జూన్ దాకా విడుదల చేయబోమని ప్రకటించింది. హత్యకు సంబంధించిన అతి కీలకమైన విషయాలు వాటిలోనే ఉండొచ్చని భావిస్తున్నారు. హార్వే ఓస్వాల్డ్ అనే వ్యక్తి 1963 నవంబర్ 22న కెన్నెడీని డాలస్‌లో కాల్చి చంపడం తెలిసిందే. దీని వెనక పెద్ద కుట్ర ఉందంటారు. హార్వే కొన్నేళ్లపాటు సోవియట్ యూనియన్‌లో ఉండొచ్చిన వ్యక్తి కావడం పలు అనుమానాలకు తావిచ్చింది. అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ కెన్నెడీని చంపించి ఉంటుందని, రహస్యాన్ని శాశ్వతంగా సమాధి చేసేందుకు హార్వేను పోలీసులు కాల్చి చంపారని ఊహాగానాలున్నాయి. -
కెన్నెడీ హత్య ఎలా జరిగింది?
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ హత్య, క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడేల్ క్యాస్ట్రోతోపాటు ప్రపంచంలోని వివిధ దేశాల అధినేతలను అంతమొందించేందుకు సీఐఏ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) పన్నిన కుట్రకు సంబంధించినవి సహా మొత్తం 3వేల రహస్య పత్రాలను అమెరికా శుక్రవారం బహిర్గతం చేసింది. ఈ పత్రాల్లో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. కెన్నెడీ హత్య తర్వాత హంతకుడిని పట్టుకునేందుకు విచారణ సంస్థలు ఆధారాల కోసం వెతికిన తీరు, ప్రపంచవ్యాప్తంగా ఈ ఘటనపై వస్తున్న పుకార్లను తాజా వివరాలు వెల్లడించాయి. కెన్నెడీని ఓస్వాల్డ్ అనే అమెరికా నౌకాదళ సభ్యుడు హతమార్చాడని అప్పటి ఏజెన్సీలు పేర్కొన్నప్పటికీ దీని వెనక భారీ కుట్ర దాగి ఉందని ఇప్పటికీ అమెరికన్లు భావిస్తున్నారు. 2018, ఏప్రిల్ 26 లోపల కెన్నెడీ హత్యలోని మరిన్ని ఆసక్తికర అంశాలను విడుదల చేయనున్నట్లు వైట్ హౌజ్ పేర్కొంది. క్యాస్ట్రోను హతమార్చేందుకు సీఐఏ పాత్ర గురించి తాజా పత్రాల్లో వెల్లడైంది. క్యూబాను హస్తగతం చేసుకోవటం కోసం చేసిన కుట్రకోణాలు వెల్లడయ్యాయి. కెన్నెడీ హత్యకు సంబంధించిన వివరాలు ప్రజలకు తెలియాలన్న అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతోనే ఈ వివరాలు వెల్లడించినట్లు నేషనల్ ఆర్కైవ్స్ పేర్కొంది. క్యాస్ట్రోను చంపించేందుకు.. ‘ఫిడేల్ క్యాస్ట్రోను అంతమొందించాలని సీఐఏ ప్రయత్నించింది. అది కూడా చాలా తక్కువ ఖర్చుతోనే’ అని తాజా నివేదికలు పేర్కొన్నాయి. ‘క్యాస్ట్రో’ పేరుతో ఉన్న 1975 నాటి ఓ డాక్యుమెంట్లో.. క్యూబా పీఠం నుంచి క్యాస్ట్రోను తప్పించేలా అమెరికా ప్రభుత్వం 1960ల్లో చేసిన ప్రయత్నాలున్నాయి. ఆపరేషన్ బౌంటీ పేరుతో గ్యాంగ్స్టర్ల సాయంతో లేదా మిలటరీ ఆపరేషన్తోనైనా క్యూబాపై పట్టు సంపాదించాలని అమెరికా కుట్రపన్నినట్లు వెల్లడైంది. క్యాస్ట్రో ప్రభుత్వంలోని అధికారులు, ముఖ్యమైన నాయకులను హతమార్చేందుకు.. రెండు సెంట్ల (0.16 డాలర్లు) నుంచి మిలియన్ డాలర్ల వరకు ఒక్కొక్కరి కి ఒక్కో రేటును నిర్ణయించింది. ఈ వివరాలున్న కరప త్రాల్ని విమానం ద్వారా క్యూబా అంతటా వదిలిపెట్టాలని కూడా అమెరికా ప్రణాళికలు రూపొందించింది. తద్వారా క్యూబన్లే క్యాస్ట్రోను, అతని అనుచరులను చంపేందుకు ప్రోత్సహించాలని భావించింది. తమ పక్కలో బల్లెంలా ఉన్న క్యూబా అధ్యక్షుడి అడ్డు తప్పించేందుకు అమెరికా అత్యంత తక్కువ మొత్తాన్ని ఎరగా వేసింది. కెన్నెడీ హత్యకు ముందు.. క్యూబాలో కమ్యూనిజాన్ని అంతమొందించేందుకు ‘ఆపరేషన్ ముంగూస్’ ప్రణాళికలనూ 1962నాటి జాతీయ భద్రత మండలి దస్తావేజులు స్పష్టం చేశాయి. ‘సీఐఏ.. గ్యాంగ్‌స్టర్ సామ్ జియంకానా మధ్యవర్తిత్వంతో క్యాస్ట్రోను హతమార్చేందుకు ఓ షూటర్‌తో లక్షన్నర డాలర్లకు ఒప్పందం కుదుర్చుకుంది’ అని అధ్యక్షుడు కెన్నెడీ సోదరుడు, అప్పటి అటార్నీ జనరల్ రాబర్ట్ కెన్నడీ ఎఫ్‌బీఐకి వెల్లడించినట్లు ఈ నివేదిక పేర్కొంది. కెన్నెడీ హత్య వెనక జాన్ ఎఫ్ కెన్నెడీ హంతకుడు లీ హార్వీ ఓస్వాల్డ్ నుంచి హత్యకు కొద్దిరోజుల ముందు ఎఫ్‌బీఐకి బెదిరింపు సందేశం వచ్చినట్లు ఈ రికార్డుల ద్వారా వెల్లడైంది. ఓస్వాల్డ్కు విదేశీ (రష్యా, క్యూబా) ఇంటెలిజెన్స్ సంస్థలతో సంబంధాలున్నాయని ఎఫ్‌బీఐ పేర్కొన్నట్లుగా రిపోర్టుల్లో ఉంది. 1963 మార్చి నుంచి డిసెంబర్ వరకు సంపాదించిన జాబితా ప్రకారం ప్యుర్టోరికన్లు, గ్యాంగ్స్టర్లు, మానసిక ఆరోగ్యం సరిగా లేనివాళ్లు ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని ఎఫ్‌బీఐ భావించింది. కెన్నెడీ హత్యకు పదిరోజుల ముందు రాబర్ట్ సీ రాల్స్ అనే వ్యక్తి 100డాలర్ల బెట్టింగ్ పెట్టారని ఆయన్ను సీక్రెట్ సర్వీస్ విచారించిందని వెల్లడైంది. బార్లో ఓ వ్యక్తి కెన్నెడీ హత్య గురించి మాట్లాడుతుండగా విన్నానని.. అయితే చీకట్లో, మద్యం మత్తులో అతని ముఖం చూడలేదని రాల్స్ వెల్లడించారు. కెన్నెడీ హత్యకు కొద్ది ముందు.. జాన్ ఎఫ్ కెన్నెడీ హత్యకు కొద్ది సేపటిముందు ‘కేంబ్రిడ్జ్ న్యూస్’ అనే బ్రిటీష్ పత్రికకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వెళ్లిందని.. అమెరికాకు సంబంధించి పెద్ద వార్త రాబోతోందనే సందేశాన్నిచ్చిందని తాజా వివరాలు వెల్లడిస్తున్నాయి. 1969 నవంబర్ 26న ఎఫ్‌బీఐకి సీఐఏ రాసిన రాసిన లేఖలో ఈ వివరాలున్నాయి. ‘కేంబ్రిడ్జ్ న్యూస్ రిపోర్టర్ లండన్‌లోని అమెరికన్ ఎంబసీకి ఈ విషయాలని తెలపాలని చెప్పి ఫోన్ కట్ చేశాడు’ అని నివేదిక పేర్కొంది. బ్రిటన్ ఎమ్ఐ5 ఇంటెలిజెన్స్ సర్వీస్ వివరాల ప్రకారం హత్యకు 25 నిమిషాల ముందు ఈ కాల్ వచ్చినట్లు తెలిసింది. కాల్ అందుకున్న రిపోర్టర్ మంచివాడని.. ఎలాంటి నేర చరిత్ర లేదని ఎమ్ఐ5 ధ్రువీకరించింది. ట్రంప్ ఆదేశాలతోనే.. 1963, నవంబర్ 22న డాలస్‌లో జాన్ ఎఫ్ కెన్నెడీ హత్యకు సంబంధించిన 2,891 రికార్డులను విడుదల చేయాలన్న అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల నేపథ్యంలో నేషనల్ ఆర్కైవ్స్ వీటిని బహిర్గతం చేసింది. అయితే భద్రత ఏజెన్సీల విన్నపం మేరకు పలు పత్రాలను విడుదల చేయకుండా ఉండేందుకు ట్రంప్ అంగీకరించారు. ‘రక్షణ, భద్రత, ఇంటెలిజెన్స్ ఆపరేషన్లు, చట్ట బద్ధ సంస్థలకు నష్టం జరగకుండా కాపాడేందుకు, విదేశీ సంబంధాలను దృష్టిలో పెట్టుకుని పలు వివరాలు వెల్లడి చేయకుండా తాత్కాలిక నిషేధం విధించాం’ అని ట్రంప్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా చరిత్రలో కీలకమైన కెన్నెడీ హత్య గురించి ప్రజలకు అన్ని వివరాలు తెలియాలనే ఉద్దేశంతోనే వీటిని బహిర్గత పరిచామని ఆయన తెలిపారు. ‘ఏజెన్సీలు పారదర్శకంగా పనిచేయాలని.. ఆలస్యం చేయకుండా ఈ నివేదికల్లో స్వల్పమైన మార్పులు మాత్రమే చేయాలని అధ్యక్షుడు ఆదేశించారు’ అని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ సరా శాండర్స్ తెలిపారు. -
రెండు తీరాల కరచాలనం
భారత దేశ మౌలిక సదుపాయాల కల్పన వ్యవస్థ మార్గదర్శి, ప్రస్తుతం కేంద్రంలో ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను సమర్పించగానే సూత్రప్రాయంగా ఆమోదం తెలియచేశారు. ఈ హైవే నిర్మాణం గురించి తగిన ప్రతిపాదనలతో రావలసిందిగా ఆయన వెంటనే ఆ రెండు నౌకాశ్రయాల అధికారులను, రోడ్డు రవాణా అధికారులను ఆదేశించారు. ‘అమెరికా రహదారులు బాగున్నా యంటే అందుకు కారణం అది సంపన్న దేశం కావడం వల్లకాదు. రహ దారులు బాగుండడం వల్లనే అమె రికా సంపన్నదేశమైంది.’ జాన్ ఎఫ్. కెన్నెడీ (అమెరికా మాజీ అధ్యక్షుడు) ఏ దేశమైనా త్వరితగతిన పురో గతి సాధించాలంటే రోడ్లు, నౌకాశ్రయాలు, విద్యుదుత్పాక కేంద్రాలు వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసు కోవడమే ధ్యేయంగా చేసుకోవాలి. కానీ భారతదేశంలో స్వాతంత్య్రం వచ్చినది మొదలు ఇప్పటివరకు, భారీ జలా శయాలు, విద్యుదుత్పాదక కేంద్రాల మాదిరిగానే ఉపరితల రవాణా సైతం దారుణమైన నిర్లక్ష్యానికి గురైంది. దేశంలో సరైన రోడ్లు, జల రవాణా లేకపోవడం, నౌకాశ్రయాల మధ్య అనుసంధానం లోపించడం వలన అంతర్గతంగానే కాదు, విదేశాలకు కూడా వస్తువుల ఎగుమతికి మార్గమే కరవైంది. అలా దేశ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలో గత ఎన్డీఏ ప్రభుత్వం దేశాన్ని పాలించినపుడు ప్రజలు స్వర్ణ చతుర్భుజి పేరుతో జాతీయ రహదారి నెట్వర్క్ ఏర్పాటును చూశారు. అది ఢిల్లీ, ముంబై, కోల్కత్తా, చెన్నైల మధ్యనే కాకుండా, దేశంలోని ప్రధాన పారిశ్రామిక, వ్యవసాయ సాంస్కృతిక కేంద్రాలతో అనుసంధానం కల్పించింది. 5,846 కిలోమీటర్ల పొడవైన స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్ ఈ కింది జాతీయ రహదారుల(ఎన్‌హెచ్)ను నాలుగు లైన్ల భారీ రోడ్ల కింద తీర్చిదిద్దింది. అవి: ఎన్‌హెచ్-2 (ఢిల్లీ- కోల్కత్తా, 1453 కిలోమీటర్లు); ఎన్‌హెచ్ 8, ఎన్‌హెచ్ 79, ఎన్‌హెచ్ 79ఎ, ఎన్‌హెచ్-6, ఎన్‌హెచ్-60, ఎన్‌హెచ్-5 (కోల్కత్తా - చెన్నై, 1684 కిలోమీటర్లు). అదే సమయంలో, అంటే నాటి ఎన్డీఏ హయాంలోనే మహారాష్ట్రలో ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం కూడా జరిగింది. ఇది భారత్‌లో నిర్మించిన తొలి ఆరు లేన్ల కాంక్రీట్, హైస్పీడ్ రహదారి. 93 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి భారత ఆర్థిక రాజధాని ముంబైనీ; పారిశ్రామిక, విద్యాకేంద్రమైన పుణే నగరాన్నీ కలుపుతోంది. 2002 నుంచి సేవలు అందిస్తున్న ఈ ఎక్స్‌ప్రెస్ హైవే; వేగవం తమైన, సురక్షితమైన ఆటోమొబైల్ రవాణా విషయంలో కొత్త ప్రమాణాలను పరిచయం చేసింది. స్వర్ణ చతుర్భుజి ఆలోచన వెనుక కీలకంగా ఉన్న ప్రస్తుత ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీయే, ముంబై - పుణే ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం సమయంలో మహారాష్ట్ర రవాణ శాఖ మంత్రిగా పనిచేశారు. తూర్పు-పశ్చిమ నౌకాశ్రయాల కారిడార్ తూర్పు, పశ్చిమ దిశలలోని సముద్ర నౌకాశ్రయాలను అను సంధానించాలని నా ఆలోచన. అందువల్ల ఎలాంటి విభేదాలు చూపకుండా భారత ద్వీపకల్పం గుండా నాలుగు లేన్ల, సాధ్య మైతే ఆరు లేన్ల జాతీయ రహదారిని నిర్మించవచ్చు. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను గురించి గడచిన ఆరు మాసాలలో నిపుణుల కమిటీ అధ్యయనం చేసి, ఇది ఆచరణ సాధ్యమైన ప్రాజెక్టేనని నివేదిక ఇచ్చింది. పశ్చిమ కోస్తా తీరంలోని ముం బై నౌకాశ్రయం, తూర్పు తీరంలోని గోపాల్పూర్ నౌకాశ్రయం అక్షాంశ రేఖ మీద 19 డిగ్రీల వద్దనే ఉన్నాయి. గోపాల్పూర్ పరిసరాలలోని బాహుద వ ద్ద 12వ ప్రణాళికా కాలంలో ఒక గ్రీన్‌ఫీల్డ్ (ఏ నిర్మాణాలు కూల్చకుండా తొలి ప్రయత్నంగా కట్టేది) ప్రధాన నౌకాశ్రయం రూపుదిద్దుకోబోతోంది. ఆ రెం డు నౌకాశ్రయాలను కలుపుతూ 19 డిగ్రీల అక్షాంశ రేఖ మీద నిర్మించ తలపెట్టినదే భారత ద్వీపకల్పం గుండా సాగే ఆ రహదారి. ఉత్తర - దక్షిణ కారిడార్ (శ్రీనగర్ నుంచి కన్యాకు మారి)లో భాగంగా ఉండే ఈ రహదారికి దాదాపు 150-200 కిలోమీటర్ల దూరంలో ఇటు అటు నాగపూర్, హైదరాబాద్ ఉంటాయి. ఈ రోడ్డు ప్రాజెక్టులో విస్తరించబోయే జాతీయ రహదారులు ఇవి: 1. ఎన్‌హెచ్ 222- ముంబై నుంచి నిర్మల్ (తెలంగాణలో ఎన్‌హెచ్ -7 నిజామాబాద్ దగ్గర). 2. ఆర్మూ ర్ నుంచి (ఎన్‌హెచ్ -7 మీద) ఛత్తీస్‌గడ్‌లోని జగదల్పూర్ వరకు సాగే ఎన్‌హెచ్-16. 3. ఒడిశాలోని కోరాపుట్ కూడా ఎన్‌హెచ్ -43 ద్వారా ఈ రహదారితో అనుసంధానమవు తుంది. 4. కోరాపుట్ - దిగాపహాండి మధ్య దూరం కూడా ఎన్‌హెచ్ 326 నిర్మాణం తరువాత ఇటీవలి కాలంలో తగ్గింది. 5. ఎన్‌హెచ్-217 ఒడిశాలోని గోపాల్పూర్- బరంపురాలను కలుపుతుంది. ఒడిశాలో ఇక జాతీయ రహదారిగా ప్రకటించ వలసినది కేవలం 55 కిలోమీటర్లు. బరంపురం-దిగాపహాండి మధ్య ఈ భాగం ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే- ముంబై నుంచి గోపాల్పూర్ వరకు జాతీయ రహదారి-222 (610 కి.మీ.), జాతీయ రహదారి-16 (460 కి.మీ.), జాతీయ రహదారి-43 (97 కి.మీ.), జాతీయ రహదారి-326 (288 కి.మీ.), రాష్ట్ర రహదారి-17 (55 కి.మీ), జాతీయ రహదారి -217 (15 కి.మీ.)లతో కలసి, అక్షాంశం 19 డిగ్రీల మీద 1525 కి.మీ.తో తూర్పు-పశ్చిమ రహదారి ఆవిర్భవిస్తుంది. ఈ రహదారి దేశంలో ఖనిజ సంపద అపారంగా ఉన్న ప్రాంతాల గుండా వెళుతుంది. అలాగే ఈ రెండు నౌకాశ్ర యాల మధ్యలో అభివృద్ధి చెందకుండా ఉండిపోయిన గిరిజన ప్రాంతాలకు వెళ్లడానికి ఉపకరిస్తుంది. అందివచ్చే లాభాలు ఈ నాలుగు లేన్ల రహదారిని నిర్మించడం వల్ల దేశానికి ఎన్నో లాభాలు సమకూరతాయి. * ఈ రహదారి ఛత్తీస్గడ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలలోని దట్టమైన గిరిజన ఆవాసాల గుండా సాగుతుంది. దీని వల్ల అభివృద్ధికి నోచుకోకుండా ఉండిపోయిన గిరిజను లకు ఎంతో లబ్ధి చేకూరుతుంది. గిరిజన ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు దక్కడం లేదంటూ నక్సల్స్ చేస్తున్న ఆరోపణకు సమాధానమవుతుంది. దీనితో నక్సల్ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. * నిజానికి దేశంలో ఉన్న ఖనిజ వనరులలో 40 శాతం ఈ గిరిజన ప్రాంతాలలోనే ఉన్నాయి. ఛత్తీస్గడ్, తెలంగాణ, మహారాష్ట్రలలోని బొగ్గు నిల్వల వల్ల, ఛత్తీస్గడ్లోనే ఉన్న ఇనుప ఖనిజం (బైలదిల్ల), ఒడిశా (పాచ్పటిమల్లి, కోరాపుట్ జిల్లాలు)లోని బాక్సైట్ నిల్వల కారణంగా ఈ ప్రాంతాలు దేశంలోనే సంపద్వంతమైనవిగా పేరుపొం దాయి. తూర్పు తీరంలోని లేదా పశ్చిమ తీరంలోని నౌకాశ్రయంతో ఈ ప్రాంతాలను అనుసంధానిస్తే, ఈ వనరులను ఉపయోగించుకుంటున్న వస్తూత్పత్తి సంస్థలు తమ కార్యకలాపాలను పెంచుతాయి. దీనితో స్థానికులకు ఉద్యోగావకాశాలు విస్తృతమవుతాయి. తరు వాత వీరి సహకారంతో విదేశీ ఎగుమతులకు కూడా వీలు కలుగుతుంది. * ఓఎన్జీసీ, రిలయెన్స్ సంస్థలు ఈ మధ్యనే మలేసి యాలో నాలుగు చమురు క్షేత్రాలను తీసుకున్నాయి. వీటి నుంచి ఉత్పత్తి అయ్యే సహజవాయువు, ఎరువులను తూర్పు తీరంలోని నౌకాశ్రయానికి చేర్చడానికి ఈ జాతీ య రహదారులు ఉపకరిస్తాయి. దీనితో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కూడా వృద్ధి చెందుతాయి. * నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్ ‘తూర్పు వైపు దృష్టి’ (లుక్ ఈస్ట్) విధానాన్ని చేపట్టింది. దీనితో భారత్‌కు తూర్పు దిశగా ఉన్న దేశాలతో ద్వైపాక్షిక సం బంధాలకు ప్రాముఖ్యం ఇస్తున్నారు. అంటే తూర్పు తీర నౌకాశ్రయం ద్వారా ఆ ప్రాంతాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి సరైన సమయంలో ఈ ప్రయత్నం ఆరంభమైనట్టు చెప్పాలి. ప్రాజెక్టుతో తెలంగాణ డ్రైపోర్ట్పై స్పష్టత ఈ విధంగా తూర్పు- పశ్చిమ నౌకాశ్రయ కారిడార్ల రహ దారి దేశంలో వెనుకబడిన నాలుగు రాష్ట్రాలు - ఛత్తీస్గడ్, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్రల ఆర్థికాభివృద్ధిలో కీలకమవు తుంది. ద్వీపక ల్పం గుండా సముద్రంతో ఉపరితల రవాణాకు అనుసంధానం చేయడం వల్ల వస్తూత్పత్తి, రవాణా, ఎగు మతి, దిగుమతి వ్యవస్థల అభివృద్ధితో పాటు ఉద్యోగా వకాశాలు కూడా ఇతోధికంగా పెరుగుతాయి. భారత దేశ మౌలిక సదుపాయాల కల్పన వ్యవస్థ మార్గదర్శి, ప్రస్తుతం కేంద్రంలో ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను సమర్పించగానే సూత్రప్రాయంగా ఆమోదం తెలియచేశారు. ఈ హైవే నిర్మాణం గురించి తగిన ప్రతిపాదనలతో రావలసిందిగా ఆయన వెంటనే ఆ రెండు నౌకాశ్రయాల అధికారులను, రోడ్డు రవాణా అధికారులను ఆదేశించారు. ఆ నౌకాశ్రయాల అనుసంధానంతో తెలంగాణలో డ్రైపోర్ట్ (నౌకా శ్రయాలకు సరుకులను రవాణా చేసేందుకు ఉపయోగపడే కేంద్రం) ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు ఊపు వస్తుందని కూడా గడ్కరీ చెప్పారు. కాగా ఈ ప్రాజెక్టులో భాగంగా నాలుగు లైన్ల లేదా ఆరులైన్ల రహదారిని నిర్మించ డానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని అంశాలపై దృష్టి సారించాలి. ఇందుకోసం దిగాపహాండీ నుంచి బరంపురం వెళ్లే (వయా కనిషి, లాథి)55 కి.మీ. మార్గాన్ని జాతీయ రహదారిగా ప్రక టించాలి. అలాగే భూపాలపట్నం నుంచి నిమేద్ మార్గాన్నీ (తెలంగాణ- ఛత్తీస్గడ్ మార్గంలో), ఒడిశాలోని బోరిగుమ్మ నుంచి మొదలై దశ్వంత్పూర్-లకింపూర్-కంతె పేట- రాయగడల వరకు ఉన్న 50 కిమీ. మార్గాన్నీ కూడా జాతీయ రహ దారులుగా రూపొందించవలసి ఉంటుంది. తెలంగాణలోని ప్రాణహిత మీద వంతెనను నిర్మిస్తే ఈ ప్రాంతాలకు దూరా భారాలు బాగా తగ్గుతాయి. (వ్యాసకర్త కేంద్ర జలవనరుల, నదుల అభివృద్ధి, గంగా ప్రణాళికలో భారత ప్రభుత్వ సలహాదారు) e-mail:ramvedire@gmail.com శ్రీరామ్ వెదిరె