Martin Luther King
-
ఎట్టకేలకు కెనెడీ ఫైల్స్ డీ క్లాసిఫై
వాషింగ్టన్: అప్పట్లో ప్రపంచమంతటా సంచలనం సృష్టించిన అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెనెడీ, ఆయన సోదరుడు, సెనేటర్ రాబర్ట్ ఎఫ్.కెనెడీ, పౌర హక్కుల నాయకుడు మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్ హత్యలకు సంబంధించి త్వరలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. వారి హత్యోదంతాలకు సంబంధించిన రహస్య ఫైళ్లన్నింటినీ బహిర్గతం చేయాల్సిందిగా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై ఆయన గురువారం సంతకం చేశారు. ‘‘ఈ హత్యల వెనక నిజానిజాలను అమెరికా ప్రజలు తెలుసుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఇందుకోసం వారు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. కనుక అన్ని విషయాలనూ బయట పెట్టబోతున్నాం’’ అని విలేకరులకు స్పష్టం చేశారు. సంబధిత ఫైళ్లను డీక్లాసిఫై చేయడానికి 15 రోజుల్లోగా ప్రణాళిక సిద్ధం చేయాల్సిందిగా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్‌ను ఆదేశించారు. అనంతరం 45 రోజుల్లోగా ఫైళ్లన్నింటినీ ప్రజల ముందు పెట్టాలని పేర్కొన్నారు. సంబంధిత ఉత్వర్వులపై సంతకం చేసిన పెన్నును రాబర్ట్ ఎఫ్.కెనెడీ కుమారుడు, కాబోయే ఆరోగ్య మంత్రి రాబర్ట్ ఎఫ్.కెనెడీ జూనియర్‌కు ఇవ్వాల్సిందిగా అధికారులకు ట్రంప్ సూచించారు. కెనెడీల హత్యపై అధికారిక కథనాలపై కెనెడీ జూనియర్ చాలాకాలంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆదేశాలు ఏమేరకు కార్య రూపం దాలుస్తాయన్నది అనుమానంగా మారింది. ..నేటికీ మిస్టరీయే 1963లో కెనెడీ డాలస్‌లో ఓపెన్ టాప్ కారులో వెళ్తుండగా లీ హార్వే ఓస్వాల్డ్ అనే మాజీ సైనికుడు కాల్చి చంపడం సంచలనంగా మారింది. ఐదేళ్ల అనంతరం స్థానంలో అధ్యక్ష ఎన్నికల బరిలో దిగిన ఆయన సోదరుడు రాబర్ట్ కూడా కాలిఫోరి్నయాలో హత్యకు గురయ్యారు. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతుపై ఆగ్రహంతో సిర్హాన్ అనే ఓ పాలస్తీనియన్ ఆయన్ను కాల్చి చంపాడు. అందుకు రెండు నెలల క్రితం లూథర్‌కింగ్‌ను కూడా టెనెసీలో జాతి విద్వేషానికి బలయ్యారు. జేమ్స్ ఎర్ల్ రే అనే జాత్యహంకారి ఆయన్ను కాల్చి చంపాడు. ఈ హత్యలకు సంబంధించి పలు డాక్యుమెంట్లు అడపాదడపా వెలుగు చూశాయి. కానీ వేలాది డాక్యుమెంట్లు గోప్యంగానే ఉండిపోయాయి. వాటి విచారణ ఫైళ్లన్నింటినీ బయట పెట్టాలంటూ 1992లో అమెరికా కాంగ్రెస్ చట్టం కూడా చేసింది. ఆ మేరకు కెనెడీ హత్యకు సంబంధించి చాలా డాక్యుమెంట్లను గత పదేళ్లలో ప్రభుత్వాలు బయటపెట్టినా లక్షలాది డాక్యుమెంట్లు ఇంకా గోప్యంగానే ఉండిపోయాయి. ట్రంప్ తన తొలి హయాంలోనే వాటన్నింటినీ బయట పెడతానని హామీ ఇచ్చినా సీఐఏ, ఎఫ్‌బీఐ ఒత్తిళ్ల కారణంగా మిన్నకుండిపోయారని చెబుతారు. ఓస్వాల్డ్ వ్యక్తిగత కక్షతోనే కెనెడీని పొట్టన పెట్టుకున్నట్టు విచారణ కమిషన్ తేలి్చనా అది నిజం కాదని అమెరికన్లలో అత్యధికులు నేటికీ చెబుతారు. హత్య వెనక కుట్ర కోణముందంటూ జోరుగా విశ్లేషణలు సాగాయి. ప్రభుత్వ ఏజెంట్లు, మాఫియా, తెర వెనక శక్తుల హస్తముందని ఏళ్ల తరబడి కథనాలు వెలువడ్డాయి. -
చెప్పిన టైమ్ కంటే ముందే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హిట్ సినిమా
థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కాకపోతే స్టార్స్ ఎవరూ లేకపోవడంతో ఎందుకో ప్రేక్షకులకు పెద్దగా రీచ్ కాలేదు. దీంతో ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించారు. అయితే చెప్పిన టైమ్ కంటే ముందే ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందుకు రిలీజైంది? సినిమా సంగతేంటి? 2020లో తమిళంలో రిలీజై, హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా 'మండేలా'. దాదాపు మూడేళ్ల తర్వాత దీన్ని తెలుగులో 'మార్టిన్ లూథర్ కింగ్' పేరుతో రీమేక్ చేశారు. సంపూర్ణేశ్ బాబు ప్రధాన పాత్రలో నటించాడు. అక్టోబరు 27న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది గానీ కలెక్షన్స్ రాబట్టంలో కాస్త వెనకబడిపోయింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న 25 సినిమాలు) ఓటీటీలో స్ట్రీమింగ్ దీంతో 'మార్టిన్ లూథర్ కింగ్' మూవీ డిజిటల్ హక్కులు దక్కించుకున్న సోనీ లివ్ సంస్థ.. నవంబరు 29న ఓటీటీలో రిలీజ్ చేస్తామని ప్రకటించింది. మరి ఏమైందో ఏమో గానీ ఓ రోజు ముందే ఓటీటీలోకి తీసుకొచ్చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం అందుబాటులో ఉంది. కథేంటి? పడమరపాడు అనే ఊరు. ప్రెసిడెంట్‌కి ఇద్దరు కొడుకులు. పెద్ద భార్య కొడుకు జగ్గు(వీకే నరేశ్), చిన్న భార్య కొడుకు లోకి(వెంకట్ మహా) ఎప్పుడూ గొడవపడుతూనే ఉంటారు. పలు సమస్యలతో బాధపడుతున్న ఈ ఊరికి ఓ పెద్ద ఫ్యాక్టరీ వస్తుంది. కోట్లల్లో కమీషన్ వస్తుందని తెలిసి.. జగ్గు, లోకి ఇద్దరూ ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ పడతారు. ఉత్తరం వాళ్లు, దక్షిణం వాళ్లు సమానంగా ఉండడంతో.. ఒక్క ఓటు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్లే ప్రెసిడెంట్ అయ్యే అవకాశముంటుంది. ఆ ఒక్క ఓటే స్మైల్ అలియాస్ మార్టిన్ లూథర్ కింగ్(సంపూర్ణేష్ బాబు)ది. ఇతడి ఓటు కీలకం కావడంతో జగ్గు, లోకి.. కింగ్‌కి కావాల్సినవన్నీ ఇస్తారు. మరి తన ఓటుని అడ్డుపెట్టుకొని కింగ్ ఎలాంటి కోరికలు తీర్చుకున్నాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన సమస్యలు ఏంటి? చివరకు తన ఓటు హక్కుతో ఊరి సమస్యలను ఎలా తీర్చాడు అనేదే మిగతా కథ. (ఇదీ చదవండి: లవర్ని పరిచయం చేసిన 'జబర్దస్త్' నరేశ్.. కాకపోతే!) -
ఓటీటీల్లోకి ఆ రెండు హిట్ మూవీస్.. ఒక్కరోజు గ్యాప్‌లో రిలీజ్!
ఈ రెండు చిన్న సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ప్రేక్షకులకు నచ్చాయి. కానీ థియేటర్లలో సరిగా ఆడకపోవడంతో కలెక్షన్స్ రాలేదు, జనాలకు పెద్దగా రీచ్ కాలేదు. దీంతో అందరూ వీటి గురించి మర్చిపోయారు. తాజాగా ఈ మూవీస్ ఓటీటీ రిలీజ్ తేదీలకు అధికారికంగా ప్రకటించారు. దీంతో మూవీ లవర్స్ అలెర్ట్ అయిపోయారు. ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఎమోషనల్ 'చిన్నా' సిద్ధార్థ్ పేరు చెప్పగానే లవర్ బాయ్ పాత్రలే గుర్తొస్తాయి. అప్పుడెప్పుడో 'బొమ్మరిల్లు', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత సరైన సినిమాలు చేయక.. తెలుగు ఆడియెన్స్‌కి బాగా దూరమైపోయాడు. మధ్యలో కొన్ని రొట్టకొట్టుడు మూవీస్ తీశాడు గానీ హిట్ కొట్టలేకపోయాడు. అలాంటిది స్టైల్ మార్చి.. ఎమోషనల్‌గా సాగే 'చిన్నా' సినిమా చేశారు. దీన్ని స్వయంగా నిర్మించాడు కూడా. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు) తమిళంలో సూపర్‌హిట్ టాక్‌తో పాటు మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా.. తెలుగులో గత నెలలో రాంగ్ టైంలో థియేటర్లలో రిలీజైంది. దీంతో ప్రేక్షకులకు సరిగా రీచ్ కాలేకపోయింది. అలానే ఓటీటీలో నవంబరు 17న వస్తుందని అన్నారు. కానీ అది అబద్ధమని తేలింది. ఇప్పుడు అధికారికంగా నవంబరు 28 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. సో వచ్చాక దీనిపై ఓ లుక్కేసేయండి. సంపూ డిఫరెంట్ సినిమా లాక్డౌన్ టైంలో తమిళంలో సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన 'మండేలా' చిత్రాన్ని తెలుగులో సంపూర్ణేశ్ బాబు హీరోగా 'మార్టిన్ లూథర్ కింగ్' పేరుతో తీశారు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా బాగుందన్నారు గానీ థియేటర్‌కి వెళ్లి పెద్దగా చూడలేదు. ఇప్పుడు సోనీ లివ్ ఓటీటీలో నవంబరు 29 నుంచి స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. సో ఇక్కడ ఆదరణ లభించొచ్చు. సో వచ్చేవారం వీకెండ్ కి ప్లాన్స్ ఏం లేకపోతే ఈ రెండు చిత్రాలు చూసేయొచ్చు. (ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి ఆ తెలుగు సినిమా!) -
నెల రోజుల్లోపే ఓటీటీకి సంపూర్ణేశ్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సంపూర్ణేష్ బాబు, వీకే నరేష్, శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’. మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. పొలిటికల్ సెటైరికల్ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రం అక్టోబర్ 27న థియేటర్లలో రిలీజైంది. అయితే బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ఈ మూవీ నెల రోజులు కాకముందే ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన మార్టిన్ లూథర్ కింగ్ త్వరలోనే ఓటీటీలో అలరించనుంది. నవంబర్ 17న లేదా 24న ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే ఓటీటీ రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది. కాగా.. ఈ మూవీ సోనీ లివ్‌లో రిలీజ్ కానున్నట్లు సమాచారం. కాగా.. తమిళంలో విజయవంతమైన మండేలా మూవీకి రీమేక్‌గా మార్టిన్ లూథర్ కింగ్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో డైరెక్టర్ వెంకటేష్ మహా కీలక పాత్ర పోషించారు. అసలు కథేంటంటే.. 'మార్టిన్ లూథర్ కింగ్' ఒక స్థానిక చెప్పులు కుట్టే వ్యక్తి యొక్క కథ. అతను నివసించే గ్రామంలో ఎన్నికలు వస్తాయి. ఇద్దరు ప్రత్యర్థులు ఎలాగైనా గెలవాలని పోటీ పడతారు. అయితే ఆ ఎన్నికలలో అతని ఓటు, గెలుపుని నిర్ణయించే ఓటు కావడంతో ఒక్క రాత్రిలో అతని జీవితం మలుపు తిరుగుతుంది. -
నరేష్ గారితో నటించాలంటే ఏదోలా ఉంది: వెంకటేష్ మహా
-
ఓటు విలువ చెప్పే సినిమా..అందరూ తప్పక చూడండి
-
Martin Luther King Movie Review:‘మార్టిన్ లూథర్ కింగ్’ మూవీ రివ్యూ
టైటిల్:మార్టిన్ లూథర్ కింగ్ నటీనటులు:సంపూర్ణేష్ బాబు, వీకే నరేష్, వెంకటేష్ మహా, శరణ్య ప్రదీప్ తదితరులు నిర్మాతలు: ఎస్. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర క్రియేటివ్ ప్రొడ్యూసర్: వెంకటేష్ మహా దర్శకత్వం:పూజ కొల్లూరు స్క్రీన్ ప్లే, డైలాగ్స్: వెంకటేష్ మహా సంగీతం:స్మరణ్ సాయి సినిమాటోగ్రఫీ:దీపక్ యరగెరా విడుదల తేది: అక్టోబర్ 27, 2023 ‘మార్టిన్ లూథర్ కింగ్’ కథేంటంటే.. గ్రామీణ నేపథ్యంలో సాగే పొలిటికల్ డ్రామా చిత్రమిది. పడమరపాడు అనే గ్రామంలో ఉత్తరం వైపు ఒక కులం వాళ్లు.. దక్షిణం వైపు ఇంకో కులం వాళ్లు ఉంటారు. ఇరు కులాలకు అస్సలు పడదు. ఎప్పుడూ గొడవలు పడుతుంటారు. దీంతో ఆ ఊరి ప్రెసిడెంట్ రెండు కూలాల నుంచి ఒక్కొక్కరిని పెళ్లి చేసుకొని..ఉత్తరం, దక్షిణం వాళ్లకు సమ ప్రాధాన్యత ఇస్తుంటాడు. కానీ పెద్ద భార్య కొడుకు జగ్గు(వీకే నరేశ్), చిన్న భార్య కొడుకు లోకి(వెంకట్ మహా) మాత్రం ఎప్పుడూ గొడవపడుతుంటారు. వారిద్దరి గొడవల కారణంగా ఊరి ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. ఊర్లో మరుగుదొండ్లు ఉండవు..రోడ్లు సరిగా ఉండదు. ఇలా పలు సమస్యలతో బాధపడుతున్న ఆ ఊరికి ఓ పెద్ద ఫ్యాక్టరీ వస్తుంది. కోట్లల్లో కమీషన్ వస్తుందని తెలిసి.. జగ్గు, లోకి ఇద్దరూ ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ పడతారు. ఉత్తరం వాళ్లు, దక్షిణం వాళ్లు సమానంగా ఉండడంతో..ఒక్క ఓటు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్లే ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఒక్క ఓటే స్మైల్ అలియాస్ మార్టిన్ లూథర్ కింగ్(సంపూర్ణేష్ బాబు). అతనొక అనాథ. ఊర్లో ఉన్న ఓ పెద్ద చెట్టుకింద చెప్పులు కుట్టుకుంటూ జీవనం కొనసాగిస్తాడు. అతనికి తోడుగా మరో అనాథ బాటా ఉంటాడు. వీరిద్దరికి ఎలాంటి గుర్తింపు కార్డులు ఉండవు.ఆ ఊరికి కొత్తగా వచ్చిన పోస్టాఫీస్ ఉద్యోగిణి వసంత(శరణ్య) స్మైల్ పెరుని మార్టిన్ లూథర్ కింగ్‌గా మార్చి ఓటర్ కార్డుతో పాటు పోస్టాఫీస్‌లో ఖాతాని తెరిపిస్తుంది. అతని ఓటే కీలకం కావడంతో.. ఒకవైపు జగ్గు, మరోవైపు లోకి.. కింగ్‌కి కావాల్సినవన్నీ ఇస్తారు. మరి తన ఓటుని అడ్డుపెట్టుకొని కింగ్ ఎలాంటి కోరికలు తీర్చుకున్నాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన సమస్యలు ఏంటి? చివరకు తన ఓటు హక్కుతో ఊరి సమస్యలను ఎలా తీర్చాడు అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఓటు ప్రాధాన్యతని తెలియజేస్తూ గతంలో అనేక సినిమాలు వచ్చాయి. మార్టిన్ లూథర్ కింగ్ కూడా అలాంటి చిత్రమే. గ్రామాల్లో జరిగే అసలైన రాజకీయాలను తెరపై ఆవిష్కరించడం ఈ చిత్రం స్పెషాలిటీ. ప్రజాస్వామ్యం పవర్ ఏంటి? ఓటు హక్కు విలువ ఏంటి? అనేది ఈ సినిమా ద్వారా చూపించే ప్రయత్నం చేశారు దర్శకురాలు పూజా కొల్లూరు. వాస్తవానికి ఈ చిత్రం రెండేళ్ల క్రితం తమిళంలో విడుదలై ఘన విజయం సాధించిన ‘మండేలా’కి తెలుగు రీమేక్. తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు దగ్గరగా కథలో చిన్న చిన్న మార్పులు చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా మొత్తం పొలిటికల్ సెటైరికల్‌గానే సాగుతుంది. పడమరపాడు గ్రామంలో మరుగుదొడ్డి ప్రారంభోత్సవం సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఆ ఒక్క సీన్‌తోనే జగ్గు, లోకి పాత్రల స్వభావంతో పాటు కథకు కీలకమైన స్మైల్ పాత్రని కూడా పరిచయం చేసి నేరుగా అసలు కథలోకి తీసుకెళ్లారు దర్శకురాలు. పోస్టాఫీస్ ఉద్యోగి వసంత పాత్రతో కథను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. స్మైల్‌కి మార్టిన్ లూథర్ కింగ్ అనే పేరు పెట్టే క్రమంలో సాగే సన్నివేశాలు.. గ్రామాల్లో ఆధార్, ఓటర్ కార్డు లేని వారి దుస్థితిని చూపిస్తాయి. రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం కులాల పేర్లతో ప్రజలను ఎలా విడదీస్తారనేది చూపించారు. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తికి పెంచుతుంది. అయితే ద్వితియార్థం మాత్రం మొత్తం సీరియస్ సైడ్ తీసుకుంటుంది. ‘మండేలా’ లో వర్కౌట్ అయిన ఎమోషనల్ ఈ చిత్రంలో వర్కౌట్ కాలేదు. కామెడీ సీన్స్ కూడా ఆశించిన స్థాయిలో పేలలేదు. ముఖ్యంగా నరేశ్ పాత్ర కొన్ని చోట్ల చేసే కామెడీ కథకి అతికించినట్లుగా అనిపిస్తుంది. అలాగే కింగ్ ఓటు కోసం జగ్గు, లోకి ఇద్దరు పడే తంటాలు సాగదీతగా అనిపిస్తాయి. క్లైమాక్స్ ఊహించినట్టే రొటీన్‌గా ఉంటుంది. స్క్రిప్టుని మరింత బలంగా రాసుకొని, ఎమోషన్స్‌పై ఇంకాస్త దృష్టి పెడితే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. ఇప్పటివరకు సంపూర్షేష్ బాబు అంటే మనకు కామెడీ హీరోగానే తెలుసు. అతను చేసిన స్పూఫ్ కామెడీని బాగా ఎంజాయ్ చేశాం. కానీ అతనిలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’. టైటిల్ పాత్రలో సంపూ ఒదిగిపోయాడు. తనదైన అమాయకపు ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్‌లో కూడా చక్కగా నటించాడు. తెరపై కొత్త సంపూని చూస్తాం. ఈ సినిమా సంపూకి ఓ కొత్త ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. ఇక ప్రెసెడెంట్ పదవి పోటీదారులు జగ్గుగా వీకే నరేష్.. లోకిగా వెంకట్ మహా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక సంపూ పాత్రకి అసిస్టెంట్ బాటా పాత్రను పోషించిన చిన్నోడి నటన బాగుంది.పోస్టాఫీసు ఉద్యోగి వసంత పాత్రకి శరణ్య న్యాయం చేసింది. ఊరి ప్రెసిడెంట్, లోకి, జగ్గుల తండ్రి పాత్రను పోషించిన రాఘవన్ కూడా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. స్మరణ్ సాయి నేపథ్య సంగీతం బాగుంది. పాటలు కథలో భాగంగానే వస్తూ.. సినిమాలను ఎలివేట్ చేసేలా ఉంటాయి. దీపక్ యరగెరా సినిమాటోగ్రఫీ బాగుంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన పూజ కొల్లూరు.. ఎడిటర్‌గానూ వ్యవహరించడం విశేషం. కానీ ఎడిటర్‌గా తన కత్తెరకు మాత్రం సరిగా పని చెప్పలేకపోయింది. సినిమాలో చాలా చోట్ల సాగదీత సన్నివేశాలు కనిపిస్తాయి. వాటిని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
రూమర్స్‌పై స్పందించిన సంపూర్ణేశ్ బాబు
సంపూర్ణేష్‌బాబు.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. హాస్యనటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా బిగ్‌బాస్‌లో కూడా అడుగుపెట్టి బుల్లితెర ద్వారా ప్రతి ఇంటికి పరిచయం అయ్యాడు. తాజాగా సంపూర్ణేష్‌బాబు కీలక పాత్రలో 'మార్టిన్ లూథర్ కింగ్' అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. త్వరలో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాతో సంపూర్ణేష్‌బాబు రానున్నారు. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో ఆయన బిజీగా ఉండగా ఇప్పటి వరకు తనపై వస్తున్న రూమర్స్‌కు ఆయన స్పందించాడు. 'ఇండస్ట్రీలో కొందరు మిమ్మల్ని తొక్కేయడం వల్లే మీరు పెద్దగా సినిమాలు చేయడం లేదనే టాక్ వినిపిస్తోంది. నిజమేనా?’ అని హోస్ట్ ప్రశ్నించగా అలాంటిదేం లేదని సంపూర్ణేశ్ బాబు తెలిపాడు. తాను అందరితోనూ మంచిగానే ఉంటానని నాకు అలాంటి ఇబ్బందులు ఏమీ ఎదురుకాలేదన్నాడు. తనకు అనారోగ్యం వల్ల సినిమాలు చేయడం లేదనే వార్తలు కూడా వచ్చాయి. అందులో కూడా నిజం లేదని ఆయన పేర్కొన్నారు. తాను నటించిన మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని, ‘మార్టిన్ లూథర్ కింగ్’ రిలీజ్ తర్వాత నెలల వ్యవధిలోనే అవి ప్రేక్షకుల ముందుకొస్తాయని తెలిపారు. తమిళంలో ఘన విజయం సాధించిన 'మండేలా' చిత్రానికి 'మార్టిన్ లూథర్ కింగ్' రీమేక్. పొలిటికల్ సెటైరికల్ మూవీగా రూపొందిన ఈ సినిమాలో 'కేరాఫ్ కంచరపాలెం' దర్శకుడు వెంకటేశ్ మహా, నరేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. తమిళంలో యోగిబాబు తన నటనతో మండేలా సినిమాను నిలబెట్టాడు. తనదైన కామెడీతో పాటు, ఎమోషనల్ సీన్స్‌లోనూ చక్కగా నటించాడు. మరి తెలుగులో సంపూర్ణేష్‌బాబు ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి. అక్టోబర్ 27న ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. -
నరేశ్ అంటే ఎవరు అన్నారు
సంపూర్ణేష్ బాబు హీరోగా వీకే నరేష్, శరణ్య ప్రదీప్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’. వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పిస్తున్న ఈ చిత్రంలో దర్శకుడు వెంకటేశ్ మహా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అదించడంతో పాటు క్రియేటివ్ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. పూజా కొల్లూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించిన వీకే నరేశ్ మాట్లాడుతూ– ‘‘వినోదం, సందేశం... ఈ రెండు అంశాలు మిళితమై ఉన్న సినిమాలు తక్కువగా వస్తుంటాయి. ‘మార్టిన్ లూథర్ కింగ్’లో ఈ రెండూ ఉన్నాయి. ఓ గ్రామంలోని రాజకీయ వర్గానికి నాయకుడిగా నటించాను. తమిళ ‘మండేలా’ సినిమాకు ‘మార్టిన్..’ చిత్రం స్ఫూర్తి మాత్రమే. పూర్తి స్థాయి రీమేక్ కాదు. ఈ సినిమా సంపూర్ణేష్‌కు సెకండ్ ఇన్నింగ్స్‌లా ఉంటుంది. 30 మంది నటీనటులు ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘కొంతకాలం రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నాను. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేస్తున్నాను. జీవితంలో ఎత్తుపల్లాలు చూశాను. రాజకీయాల నుంచి ఇండస్ట్రీకి తిరిగొచ్చిన ప్పుడు నరేశ్ అంటే ఎవరు? అని కొందరు అన్నారు. ఎస్వీ రంగారావుగారిని స్ఫూర్తిగా తీసుకుని విభిన్నమైన పాత్రలు చేస్తున్నాను. ఈ తరం దర్శకులు నాకోసం పాత్రలు రాయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు. -
'మార్టిన్ లూథర్ కింగ్'గా రాబోతున్న సంపూర్ణేష్ బాబు.. రిలీజ్ డేట్ ఫిక్స్
సంపూర్ణేష్ బాబు, వి.కె. నరేష్, శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’. మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. వినోదమే ప్రధానంగా రూపొందిన ఈ రాజకీయ వ్యంగ్య చిత్రం టీజర్ గాంధీ జయంతి రోజున విడుదలై అద్భుతమైన స్పందన లభించింది. తెలుగు సినిమాలలో ఇదో కొత్త అనుభూతిని అందిస్తుందని. అలాగే ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు నటుడిగా ఆకర్షణీయమైన ఓ కొత్త పాత్రలో అలరించనున్నారని చిత్ర యూనిట్ పేర్కొంది. అక్టోబర్ 27న ఈ ఈ చిత్రం విడుదల కాబోతుందని మేకర్స్ ప్రకటించారు. 'మార్టిన్ లూథర్ కింగ్' ఒక స్థానిక చెప్పులు కుట్టే వ్యక్తి యొక్క కథ. అతను నివసించే గ్రామంలో ఎన్నికలు వస్తాయి. ఇద్దరు ప్రత్యర్థులు ఎలాగైనా గెలవాలని పోటీ పడతారు. అయితే ఆ ఎన్నికలలో అతని ఓటు, గెలుపుని నిర్ణయించే ఓటు కావడంతో ఒక్క రాత్రిలో అతని జీవితం మలుపు తిరుగుతుంది. -
గురుదేవ్ రవిశంకర్‌కు 'గాంధీ పీస్ పిల్గ్రిమ్' అవార్డు
అట్లాంటా: ప్రపంచవ్యాప్తంగా తన సందేశాల ద్వారా శాంతి స్థాపనకు కృషి చేస్తున్న భారతీయ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ గురుదేవ్ రవిశంకర్ నవంబరు 10న అట్లాంటాలో 'గాంధీ పీస్ పిల్గ్రిమ్' అవార్డును అందుకున్నారు. మానవాళికి విశిష్ట సేవ చేస్తున్నందుకుగానూ గాంధీ ఫౌండేషన్ ఆఫ్ యూఎస్ఏ ఆయనకు ఈ అవార్డును మార్టిన్ లూధర్ కింగ్ కేంద్రంలోని మహాత్మా గాంధి విగ్రహం ముందు ప్రధానం చేసింది. డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మేనల్లుడు ఐసాక్ ఫెర్రిస్, భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ స్వాతి కులకర్ణి, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, కమ్యునిటి సమక్షంలో గాంధీ ఫౌండేషన్ అద్యక్షులు సుభాష్ రాజదాన్, కార్యవర్గ సభ్యులు ఆంటోనీ తలియాత్, రవి పోణంగిల నుంచి శ్రీశ్రీ రవిశంకర్ ఈ అవార్డును అందుకున్నారు. గతంలో దలైలామా, అమెరికా అద్యక్షులు జిమ్మికార్టరు, కరొట్టా స్కాట్ కింగ్, దాదా వాస్వాని గాంధీ పీస్ పిల్గ్రిమ్ అవార్డును అందుకున్నారు. అవార్డ్ ప్రధానంతరం, రవిశంకర్ మహాత్మ గాంధీ విగ్రహం నుంచి మార్టిన్ లూధర్ కింగ్, కొరట్ట స్కాట్ కింగ్ సమాధుల వరకు శాంతి యాత్రను సాగించటాన్ని విశేషంగా చెప్పవచ్చు. చదవండి: యూకే,యూరోప్‌లో అంగరంగ వైభవంగా తితిదే శ్రీనివాస కళ్యాణోత్సవాలు -
మూడో సోమవారం
మాధవ్ శింగరాజు జనవరి నెలలోని మూడో సోమవారం అంటే అమెరికన్లలో చాలామందికి ఇష్టం ఉండదు! ‘ద మోస్ట్ డిప్రెసింగ్ డే ఆఫ్ ద ఇయర్’గా వాళ్లు ఫీలౌతారు. అప్పటికి క్రిస్మస్, న్యూ ఇయర్ అయిపోయి ఉంటాయి. ఆ రెండు రోజుల కోసం చేసిన అప్పులేవైనా ఉంటే అవి మిగిలి ఉంటాయి. కొత్త సంవత్సరపు తీర్మానాలు ఈ రెండు వారాల్లో బ్రేక్ అయి ఉంటాయి. అవన్నీ అలా ఉంచండి.. క్రిస్మస్‌లా, న్యూ ఇయర్‌లా.. ఎదురుచూడ్డానికి దగ్గర్లో ఇంకే పండుగలూ ఉండవు. అందుకని జనవరి మూడో సోమవారాన్ని ‘బ్లూ మండే’ అంటాడు క్లిఫ్ ఆర్నల్ అనే సైకాలజిస్టు. అంటే దిగుళ్ల సోమవారం అని. మనుషుల్లో స్ట్రెస్ లెవల్స్ పెరగడం మొదలయ్యే రోజట అది. ‘ఇ ఈక్వల్స్ టు ఎంసీ స్క్వేర్’ లాంటి లెక్కలేవో ఆయనకు ఉన్నాయి. ఆ లెక్కల్ని పక్కన పెడితే, అమెరికాలో ఇవాళ నేషనల్ హాలిడే! నేషనల్ హాలిడే ఎందుకంటే ఇవాళ అక్కడ ‘మార్టిన్ లూథర్ కింగ్ డే’. అమెరికాలో నల్లజాతి హక్కుల కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ని గుర్తు చేయడం కోసం (గుర్తు చేయడానికి, గుర్తు చేసుకోడానికి తేడా ఉంది) యేటా ప్రతి మూడో సోమవారం ‘మార్టిన్ లూథర్ కింగ్ డే’ని జరుపుతోంది అమెరికా. (జరపడానికి, జరుపుకోడానికి తేడా ఉంది). ఈ ఏడాది మార్టిన్ డే, మార్టిన్ బర్త్‌డే రెండూ ఒకేరోజు వచ్చాయి. జనవరి 15 మార్టిన్ బర్త్‌డే. మరి మార్టిన్ బర్త్‌డే నే, మార్టిన్ డే గా ప్రకటించవచ్చు కదా! ప్రకటించవచ్చు కానీ, ఎందుకనో అప్పటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ జనవరిలో వచ్చే మూడో సోమవారాన్ని ‘మార్టిన్ లూథర్ డే’ పేరిట జాతీయ సెలవు దినంగా ప్రకటించారు. 1983లో ఆయన ఆ హాలిడే బిల్లు మీద సంతకం చేస్తే, 1986 జనవరి మూడో సోమవారం తొలిసారిగా అమెరికాలో హాలిడే అమల్లోకి వచ్చింది. అయితే అమెరికాలోని మెజారిటీ రాష్ట్రాలు ‘మార్టిన్ లూథర్ డే’ ని గుర్తించలేదు! కొన్ని రాష్ట్రాలైతే, లూథర్ డే అని కాకుండా, ఇంకేదైనా పేరు పెడితేనే గుర్తిస్తాం అని పట్టుపట్టి కూర్చున్నాయి! 2000 నాటికి గానీ అమెరికా సంయుక్త రాష్ట్రాలన్నీ కలసి ‘మార్టిన్ లూథర్ డే’ని నేషనల్ హాలిడేగా అంగీకరించలేకపోయాయి. బిల్లు మీద సంతకం పెట్టడానికి ముందు రొనాల్డ్ రీగన్ మనసు కూడా అందుకు అంగీకరించలేదు! మనసొప్పక, నల్లవాళ్లను నొప్పించలేక సంతకం పెట్టేశారు. ‘ది మోస్ట్ డిప్రెసింగ్ డే ఆఫ్ ది ఇయర్‌గా’ జనవరిలో వచ్చే మూడో సోమవారాన్ని బలపరచడానికి ‘మార్టిన్ డే’ని కూడా ఒక కారణంగా చూపే తెల్ల అమెరికన్లు కూడా అక్కడ లేకపోలేదు. కనీస హక్కుల్ని సైతం పొందలేక.. డేస్, ఇయర్స్ మాత్రమే కాదు.. పుట్టినప్పట్నుంచీ డిప్రెసింగ్ లైఫ్‌నే గడుపుతున్న నల్లజాతి అమెరికన్ పౌరుల హక్కుల కోసం పోరాడిన ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ని అమెరికన్ జాతీయులు ఈ మాత్రంగానైనా అంగీకరించడానికి చాలా సమయమే పట్టింది. ‘‘ఓ రోజు వస్తుంది. ఆ రోజు అమెరికాలో నల్లవారందరికీ స్వేచ్ఛ, తెల్లవారందరితో సమానత్వం అనే నా కల నిజమౌతుంది’’ అన్నారు మార్టిన్.. ‘ఐ హ్యావ్ ఎ డ్రీమ్’ అనే ప్రసంగంలో. మొన్న శుక్రవారం నాడు వైట్‌హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్.. ‘మార్టిన్ డే’ ఉద్ఘోషణ (ప్రొక్లమేషన్) మీద లాంఛనంగా సంతకం పెట్టిన రెండు రోజులకే, ఆఫ్రికా దేశాల పౌరులను ఉద్దేశించి ‘షిట్హోల్స్’ అనడం చూస్తుంటే, మార్టిన్ కల పూర్తిగా నిజం ఫలించిందా అన్న సందేహం కలుగుతుంది. మనసులో చీకటిని పెట్టుకుని ఎన్ని దీపాలను వెలిగిస్తే మాత్రం ఏమిటి? మనిషి మీద గౌరవం లేకుండా ఎన్ని ‘డే’లు జరిపితే మాత్రం ఏముంది? -
విప్లవ సింహం.
-
తెల్లరేగడిలో మొలకెత్తిన నల్ల పిడుగు
‘ఏదో ఒక రోజు నా నలుగురు పిల్లలూ.. వారి వర్ణాన్ని బట్టి కాకుండా, వారి వ్యక్తిత్వాన్ని బట్టి గుర్తించే దేశంలో నివసిస్తారని నాకో కల ఉంది’ రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ (జూనియర్) చరిత్రాత్మక మహోపన్యాసం‘ నాకో కల ఉంది(ఐ హేవ్ ఎ డ్రీమ్)’ (ఆగస్టు 28, 1963)లోని వాక్యమిది. ఈ ప్రసంగం అమెరికా నల్లజాతి చరిత్రను మలుపుతిప్పింది. అమెరికా ఈ రోజు అగ్రరాజ్యం అయి ఉండవచ్చు. కానీ దాని చరిత్ర అంత ఘనమైనది కాదు. 20 శతాబ్దం మధ్యవరకూ కూడా అక్కడ తీవ్ర వ ర్ణ వివక్ష ఉండేది. బస్సులో సీట్లు, స్కూల్లో బెంచ్‌లు ఆఖరికి హోటల్లో కాఫీ గ్లాసులు కూడా నల్లవారికి వేరుగా ఉండేవి. ఇలాంటి వివక్షతలకు వ్యతిరేకంగా ఉద్యమించిన వారు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. మార్టిన్ 1929 జనవరి 15న అట్లాంటాలోని క్రైస్తవ చర్చి బోధకుడి కుటుంబంలో జన్మించారు. తండ్రి పేరు కూడా అదే కావడంతో మార్టిన్ జూనియర్ అయ్యారు. మార్టిన్ బాల్యంలోనే వర్ణవివక్షకు గురయ్యారు. తెల్లవారితో ఆడుకోకూడదని, తగిన మార్కులున్నా కోరుకున్న విద్యాలయంలో చేరేందుకు అర్హత లేకుండా చట్టం చేశారని అర్థం చేసుకున్నారు. ఇక బస్సులో కూడా నల్లవారికి వేరే సీట్లు. తెల్లవారి సీట్లు ఖాళీగా ఉంటే కూర్చోవచ్చు. కానీ వారు రాగానే లేచి ఆ సీటు ఇవ్వాలి. అలా ఇవ్వనందుకు బస్సులో నుంచి మార్టిన్‌ను గెంటివేశారు. సరిగ్గా దక్షిణాఫ్రికాలో మహాత్మాగాంధీకి జరిగిన అవమానం లాంటిదే. అప్పటి నుంచి మహాత్మాగాంధీ గురించి చదివారు. మహాత్ముని అహింసా మార్గమే సరైన దారని నిర్ణయించుకున్నారు. చర్చిలో బోధకుడిగా పనిచేస్తూనే తన వాగ్ధాటితో నీగ్రోలకు నాయకుడయ్యారు. తను పిలుపునిస్తే నల్లజాతి మొత్తం కదలి వచ్చే స్థాయికి ఎదిగారు. బస్సులో వర్ణవివక్షతకు వ్యతిరేకంగా బస్సులను బహిష్కరింపజేసి చివరకు ఆ వివక్షత తప్పు అని సుప్రీంకోర్టు చేతే తీర్పు ఇప్పించగలిగారు. మార్టిన్ అసలు పేరు మైఖేల్. తండ్రి బాప్టిస్ట్ మినిస్టర్. మినిస్టర్ అంటే మంత్రి కాదు. మత బోధకుడు. తల్లి ఉపాధ్యాయిని. వివాహం మార్టిన్ 1955లో డాక్టరేట్ సంపాదించడానికి ముందు, బోస్టన్‌లో పీహెచ్డీ చేస్తున్నప్పుడు పరిచయమైన కొరెట్టా స్కాట్‌ను 1953లో వివాహం చేసుకున్నారు. 1954లో మాంట్‌గోమరీ(అలబామా)లోని డెక్స్టర్ అవెన్యూ బాప్టిస్టు చర్చికి పాస్టర్‌గా నియమితులయ్యారు. ఈ సమయంలోనే బస్సులలో వివక్షతకు నిరసనగా ఆఫ్రికన్ అమెరికన్లు బస్సులను బహిష్కరించే ఉద్యమానికి నాయకత్వం వహించడంతో మార్టిన్ పేరు తొలిసారి అమెరికాలో మారుమోగింది. ఐ హేవ్ ఎ డ్రీమ్ 1963లో జాతి వివక్షతకు వ్యతిరేకంగా మార్టిన్ నాయకత్వంలో బర్మింగ్ హామ్, అలబామాలలో చెలరేగిన ఉద్యమాన్ని తెల్లవారు అతి పాశవికంగా బాంబులతో అణచివేశారు. నిరసనలకు వ్యతిరేకంగా జారి అయిన ఆదేశాలను ఖాతరు చేయకపోవడంతో ఆయనను బర్మింగ్‌హామ్ జైల్లో వేశారు. జైలు నుంచి విడుదలయ్యాక ‘చిల్డ్రన్ క్రూసేడ్’ మొదలైంది. మార్టిన్ ప్రోద్బలంతో వేలాది మంది విద్యార్థులు బర్మింగ్‌హామ్ అంతటా కవాతు చేస్తూ నిరసన గళం విప్పారు. దీంతో పోలీసులు విద్యార్థులపై లాఠీలను ఝళిపించారు. ఈ దృశ్యాలను టీవీలలో చూసి ఆగ్రహం చెందిన అమెరికన్లు మార్టిన్‌కు మద్దతు తెలిపారు. ఈ విజయం ఇచ్చిన తీర్పుతోనే మార్టిన్ ‘ఐ హేవ్ ఎ డ్రీమ్’ ప్రసంగాన్ని ఇవ్వగలిగారు. తలొగ్గిన ప్రభుత్వం మార్టిన్ లూథర్ కింగ్ ఉద్యమానికి తలవంచి 1964లో ఫెడరల్ ప్రభుత్వం ‘సివిల్ రైట్స్’ చట్టాన్ని తీసుకువచ్చింది. అలాగే 1965లో అమెరికా ప్రభుత్వం ‘ఓటింగ్ రైట్స్’ చట్టాన్ని కూడా తెచ్చింది. సమాన హక్కుల కోసం చేసిన కృషికి గుర్తింపుగా 1964లో 34వ ఏట మార్టిన్ లూథర్ కింగ్ నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. 1967 డిసెంబర్లో మార్టిన్ ‘ పూర్ పీపుల్ క్యాంపెయిన్’ ప్రారంభించారు. పారిశుధ్య కార్మికులకు మద్దతుగా మార్చింగ్‌కు ఏర్పాట్లు చేయడం కోసం 1968 ఏప్రిల్ నెలలో టెన్నెస్సీ రాష్ట్రంలోని మెంఫీస్ చేరుకున్నారు. మరునాడు తను బస చేసిన హోటల్ బాల్కనీలో ఉండగా ఆయనపై దాడి జరిగింది. తుపాకీ గుళ్లకు మార్టిన్ నేలకు ఒరిగారు. -
'మన మార్టిన్ లూథర్ కింగ్ అంబేడ్కర్'
న్యూఢిల్లీ: ప్రజలందరూ విద్యావంతులు కావాలని బీఆర్ అంబేడ్కర్ కోరుకున్నారన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం బీఆర్ అంబేడ్కర్ జాతీయ స్మారక భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బాబాసాహెబ్ కలలను సాకారం చేసే అదృష్టం తనకు కలగడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయన మరణించిన 60 ఏళ్ల తరువాత మెమోరియల్ ఏర్పాటు కావడం పట్ల మోదీ విచారం వ్యక్త చేశారు. దళితులు, గిరిజనులు, అట్టడుగు వర్గాల హక్కు అయిన రిజర్వేషన్లను ఎవరూ కొల్లగొట్టలేరని పేర్కొన్నారు. అది వారి హక్కు అని మోదీ స్పష్టం చేశారు. అంబేడ్కర్ ను అమెరికా నల్లజాతి పోరాట యోధుడు, పౌరహక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ తో పోల్చారు. వారిద్దరూ ప్రతి అమానవీయ ఘటనల పట్ల గొంతెత్తిన మహాపురుషులని కొనియాడారు. అంబేడ్కర్ విశ్వమానవుడని, భారత్‌కు మాత్రమే పరిమితం చేసి మాట్లాడడం భావ్యం కాదన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆయా వర్గాలకు రిజర్వేషన్లు ఉండవనే అపోహలు చెలరేగాయని.. కానీ తమ ప్రభుత్వ హయాంలోని దేశంలో ఎక్కడా అలా జరగలేదన్నారు. అణగారిన వర్గాల బలమైన గొంతుక అంబేడ్కర్ అని పేర్కొన్నారు. అంబేడ్కర్ ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉంటే.. ఈ రోజు తాము చేపట్టిన కార్యక్రమాలను 60 ఏళ్ల క్రితమే ఆయన చేపట్టి ఉండేవారన్నారు. సుమారు 18,000 గ్రామాల్లో విద్యుత్ అందించడం ద్వారా అంబేద్కర్ కలలను సాకారం కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. మహిళలకు సమాన హక్కులు కల్పించకపోతే తాను మంత్రివర్గంలో కొనసాగనని అంబేడ్కర్ చెప్పారని మోదీ గుర్తు చేశారు. ప్రస్తుతం పార్లమెంటులో జల మార్గాలకు సంబంధించిన బిల్లు ఉందని, అయితే భారత్‌కు ఉన్న శక్తివంతమైన సముద్ర మార్గాల గురించి తొలిసారిగా ప్రస్తావించింది అంబేద్కరేనని తెలిపారు. అంబేడ్కర్ ఫిలాసఫీలో భాగమైన రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అగ్రిఉత్పత్తుల మార్కెట్ రేట్లు గురించి నవీకరించబడిన సమాచారాన్ని రైతులు పొందడానికి వీలుగా ఏప్రిల్ 14న కొత్త టెక్నాలజీని ప్రారంభించనున్నట్టు మోదీ వెల్లడించారు. -
ఆ నేడు ఆగస్ట్ 28, 1963
నాకో కల ఉంది! పదాలు వాక్యాలవుతాయి. వాక్యాలు ఉపన్యాసాలవుతాయి. ఉపన్యాసాలు ఉద్యమాలవుతాయి. అమెరికన్ పౌర హక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ ఉపన్యాసం ఈ కోవకే చెందుతుంది. మాటలకే కింగ్ అయిన మార్టిన్ లూథర్ ఉపన్యాసమిచ్చాడంటే... ఉద్యమానికి ఊతం ఇవ్వడమే! వేలాదిమంది ప్రజలను ఉద్దేశించి మార్టిన్ వాషింగ్టన్ డి.సిలో ఇచ్చిన ‘ఐ హావ్ ఏ డ్రీమ్’ ఉపన్యాసం అందరినీ ఉర్రూతలూగించింది. టాప్ అమెరికన్ స్పీచ్‌లలో ఒకటిగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ ఉపన్యాసంలో పద పదమున ‘మనుషులందరూ సమానమే’ అనే నినాదం వినిపిస్తుంది. జాత్యహంకారాన్ని ఉప్పుపాతరవేసే ఈ ఉపన్యాసం ఉద్యమాలకు కొత్త శక్తిని ఇచ్చింది. ఇప్పటికీ ఇస్తూనే ఉంది. -
తెల్లరేగడిలో మొలకెత్తిన నల్ల పిడుగు
సంక్షిప్తంగా... నేడు మార్టిన్ లూథర్ కింగ్ వర్ధంతి ‘‘ఐ హావ్ ఎ డ్రీమ్’’ అన్నాడు మార్టిన్ లూథర్ కింగ్. వాషింగ్టన్‌లోని లింకన్ మెమోరియల్‌లో గుమికూడిన రెండు లక్షల మంది ఆ మాట విన్నారు. ప్రతిస్పందనగా పెద్ద హోరు! ఏమిటి ఆయన కల? ‘‘ఓ రోజు వస్తుంది. ఆ రోజు అమెరికాలో నల్లవారందరికీ స్వేచ్ఛ, తెల్లవారందరితో సమానత్వం అనే నా కల నిజమౌతుంది’’ అన్నాడు మార్టిన్. 1963 ఆగస్టు 28 నాటి ప్రసంగం అంది. నెల తిరక్కుండానే ఆ కల నిజమవడానికి తనింకా చాలా కష్టపడాలని అతడికి తెలిసివచ్చింది. బర్మింగ్‌హామ్ చర్చిలో జరిగిన వర్ణవివక్ష పేలుళ్లలో నలుగురు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. తర్వాతి ఏడాది మార్టిన్ లూథర్ కింగ్‌కి నోబెల్ శాంతి బహుమతి. అదే ఏడాది నల్లవారి పౌరహక్కుల చట్టం అమల్లోకి వచ్చింది. ఆ తర్వాతి ఏడాది ఓటు వేసే హక్కు కూడా! అలా అమెరికన్ ఆఫ్రికన్‌లందరికీ స్వేచ్ఛ, సమానత్వం - రెండూ సాధ్యమయ్యాయి. మార్టిన్ స్వప్నం ఫలించింది. మార్టిన్ లూథర్ కింగ్ 1929 జనవరి 15న అట్లాంటాలో జన్మించారు. 1968 ఏప్రిల్ 4న మెంఫిస్‌లో హత్యకు గురయ్యారు. మధ్యలో ఆయన బతికి ఉన్న 39 ఏళ్ల కాలం నల్లజాతి అమెరికన్లకు ఇప్పటికీ ఒక కల లానే అనిపిస్తుంటుంది! మార్టిన్ అసలు మేరు మైఖేల్. తర్వాత మార్టిన్ అయ్యాడు. తండ్రి (మార్టిన్ లూథర్ కింగ్ సీనియర్) బాప్టిస్టు మినిస్టర్. మినిస్టర్ అంటే మంత్రి కాదు. మతబోధకుడు. తల్లి ఆల్బెర్టా విలియమ్స్ కింగ్. పాఠశాల ఉపాధ్యాయిని. మార్టిన్ 1955లో డాక్టరేట్ సంపాదించడానికి ముందు, బోస్టన్‌లో పీహెచ్డీ చేస్తున్నప్పుడు పరిచయం అయిన కొరెట్టా స్కాట్‌ను 1953లో ఆయన వివాహం చేసుకున్నారు. 1954లో మాంట్‌గోమరీ (అలబామా) లోని డెక్స్టర్ అవెన్యూ బాప్టిస్టు చర్చికి పాస్టరుగా నియమితులయ్యారు. ఆ ఏడాదే అలబామాలో సంచలనాత్మకమైన అరెస్టు ఒకటి జరిగింది. మార్టిన్ సహచరురాలైన పౌరహక్కుల ఉద్యమ నాయకురాలు రోసా పార్క్స్ తను ప్రయాణిస్తున్న బస్సులో ఒక తెల్లవాడికి తను లేచి సీటు ఇవ్వడానికి నిరాకరించినందుకు అరెస్ట్ అయ్యారు! పార్క్స్ అరెస్టును నిరసిస్తూ మాంట్‌గోమరీలో బస్సులను ఆఫ్రికన్ అమెరికన్లు బహిష్కరించే ఉద్యమానికి మార్టిన్ నాయకత్వం వహించడంతో తొలిసారిగా అమెరికాలో ఆయన పేరు మారుమోగింది! 1963లో బర్మింగ్‌హామ్, అలబామాలలో జాతి వివక్షకు వ్యతిరేకంగా మార్టిన్ నాయకత్వంలో చెలరేగిన ఉద్యమాన్ని తెల్లవాళ్లు అత్యంత పాశవికంగా బాంబులతో అణచివేశారు. నల్లవారి ఇళ్ల మీద, కార్యకర్తల మీద తరచు బాంబు దాడులు జరుగుతుండడంతో బర్మింగ్‌హామ్ ‘బాంబింగ్హామ్’గా పేరుమోసింది! నిరసనలకు వ్యతిరేకంగా జారీ అయిన ఆదేశాలను ఖాతరు చేయకపోవడంతో మార్టిన్‌ను బర్మింగ్‌హామ్ జైల్లో వేశారు. జైలు నుంచి మార్టిన్ విడుదల అయ్యాక ‘చిల్డ్రన్స్ క్రూసేడ్’ మొదలైంది. వేలాది మంది పాఠశాల విద్యార్థులు మార్టిన్ దన్నుతో బర్మింగ్‌హామ్ అంతటా కవాతు చేస్తూ నిరసన గళం విప్పారు. వారిపై పోలీసులు విరుచుకు పడ్డారు. లాఠీలను ఝుళిపించడం, పోలీసు కుక్కల్ని ఉసిగొల్పడం, జ్వాలలను ఎగజిమ్మే పైపులను విద్యార్థులపైకి గురిపెట్టడం వంటి దృశ్యాలన్నిటినీ టీవీలలో చూసి అమెరికా ప్రజలు ఆగ్రహోదగ్రులయ్యారు. మార్టిన్‌కు మద్దతు ప్రకటించారు. ఈ విజయం ఇచ్చిన స్ఫూర్తితోనే మార్టిన్ ‘ఐ హావ్ ఎ డ్రీమ్’ ప్రసంగాన్ని ఇవ్వగలిగారు. 1967 డిసెంబరులో మార్టిన్ ‘పూర్ పీపుల్స్ కాంపెయిన్’ ప్రారంభించారు. సమ్మె చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మద్దతుగా మార్చింగ్‌కు ఏర్పాట్లు చేయడం కోసం 1968 ఏప్రిల్ 3 వ తేదీన టెన్నెస్సీ రాష్ట్రంలోని మెంఫిస్ చేరుకున్నారు మార్టిన్. మర్నాడు తను బస చేసిన హోటల్ బాల్కనీలో ఉన్నప్పుడు ఆయనపై దాడి జరిగింది. తుపాకీ గుళ్లకు మార్టిన్ నేలకు ఒరిగారు. అంత్యక్రియల సమయంలో మార్టిన్ స్నేహితుడు బెంజమిన్ మేస్ మాట్లాడుతూ, ‘‘మార్టిన్ లూథర్ కింగ్ సమైక్య అమెరికా అన్న భావనను నమ్మాడు. అన్ని రకాల వివక్ష గోడలు కూలిపోవాలని కలగన్నాడు’’ అని నివాళులు అర్పించారు. -
అమెరికాను వెంటాడుతున్న ‘కల’
ఆయన కల నెరవేరడానికి ఇంకా చాలా కాలం పడుతుంది. నల్లజాతి జీవనంలో గుణాత్మకంగా ఎన్నో మార్పులు వచ్చా యి. అయితే వచ్చిన ఈ పరివర్తన శ్వేతజాతీయులవల్ల మాత్రం కాదు. నల్లజాతి పోరాట పటిమే ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఆ పోరాట స్ఫూర్తిని నల్ల జాతీయులకు ఇచ్చినవాడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ‘ఏదో ఒక రోజున నా నలుగురు పిల్లలు వారి వర్ణాన్ని బట్టి కాకుండా, వ్యక్తిత్వాలను బట్టి గుర్తించే దేశంలో నివసిస్తారని నాకో కల ఉంది...’ రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ (జూనియర్) చరిత్రాత్మక మహోపన్యాసం ‘నాకో కల ఉంది’లో (ఆగస్టు 28, 1963) వాక్యమిది. లూథర్‌కింగ్ (జనవరి 15, 1929-ఏప్రిల్ 4, 1968) స్వప్నం అమెరికాను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. అమెరికా నల్లజాతి చరిత్రను మలుపుతిప్పిన ఈ మహోపన్యాసం 50వ వార్షికోత్సవం సంద ర్భంగా జరిగిన ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఈ నెల 28న వాషింగ్టన్‌లోని అబ్రహాం లింకన్ స్మారక కట్టడం వద్ద చేరిన వారంతా తలవక తప్పని ఒక ఘటన సరిగ్గా అదే సమయంలో జరిగింది. అధ్యక్షుడు బరాక్ ఒబామా, మాజీ అధ్యక్షులు జిమ్మీ కార్టర్, బిల్ క్లింటన్ తదిత రులు ఈ సభలో మాట్లాడారు. లూథర్ ఉపన్యసించిన లింకన్ స్మారక కట్టడం సోపానాల మీద నుంచే ఒబామా కొన్ని వాస్తవాలు అంగీ కరించారు. ఆ తాజా ఘటన అమెరికాను తొలి నల్లజాతీయుడు పాలిస్తున్న వర్తమాన కాలంలో చోటుచేసుకోవడం గమనార్హం. అట్లాంటాలో ఫ్రైడ్ చికెన్‌కు ఎంతో పేరు పొందిన పాస్కల్స్ మోటర్ హోటల్లో మార్టి న్ తన ఉద్యమ సహచరులతో సమావేశాలు జరిపేవాడు. అది ఆనాటి సంగతి. ఈ నాటి సంగతి నాటి వివక్షకు సజీవ సాక్ష్యంగా నిలి చింది. మైకేల్ బ్రౌన్ కుటుంబ సభ్యులు, మి త్రులు పాతికమంది దక్షిణ కరోలినాలోని ఉత్తర చార్లెస్టన్లో ఉన్న ‘వైల్డ్ వింగ్స్ కేఫ్’కు విందు చేద్దామని వెళ్లారు. నిర్వాహకులు అనుమతించలేదు. ఈ హోటల్ కూడా చికెన్‌కు ప్రసిద్ధి. నల్లవారు ఎక్కువగా ఉండే ఈ ప్రాం తంలోని ఈ రెస్టారెంట్లో శ్వేతజాతి మహిళ ఒకరు, తాను లోపల ఉండగా నల్లజాతీయు లు ప్రవేశించడానికి వీల్లేదని చెప్పడంతో ఇది జరిగింది. అమెరికాలో జాతి వివక్షకు రెక్కలు ఇంకా తెగిపోలేదని ‘వైల్డ్ వింగ్స్ కేఫ్’ తాజా గా రుజువు చేసింది. జాతులపరంగా అమెరికాలో ద్వితీయ స్థానం నల్లజాతి అమెరికన్లదే. పశ్చిమ, మధ్య ఆఫ్రికాల నుంచి బానిసలుగా వీరిని తెచ్చుకున్నారన్నది సత్యం. 16వ శతాబ్దం నుంచి వీరు అమెరికా చరిత్రలో అంతర్భాగమైనప్పటికీ అదంతా అవమాన భారంతో నిండినదే. 20వ శతాబ్దం మధ్య వరకు అమానుషమైన దుస్థితిలో బతికారు. ఓటుహక్కు, చదువు, సమన్యాయం మొదటి నుంచి వారికి దక్కలేదు. అబ్రహాం లింకన్ హయాంలో జరిగిన ఉత్తర దక్షిణ అమెరికాల మధ్య పోరాటం, నల్లజాతీయులు అణచివేత మీద చేసిన తిరుగుబాటు. అప్పుడే బానిసత్వం పోయింది. కానీ వివక్ష కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అహింసాయుతంగా జరిగిన పౌరహక్కుల ఉద్యమం (1955-1968)తో నల్లజాతీయుల జీవితంలో మార్పులు వచ్చాయి. ఈ ఉద్యమానికి కేంద్ర బిందువే మార్టిన్ లూథర్ కింగ్. అమెరికా రాజ్యాంగం నల్లజాతికి కల్పించిన సమన్యాయం, ఆర్థిక సమానత్వం వంటి హక్కుల సాధనకు ఆయన ఉద్యమించాడు. ఆయన ప్రసంగంలో నల్లజాతీయులు నేటికీ ఉషస్సులను దర్శిస్తారు. జాతివివక్ష లేకుండా అమెరికా బాలబాలికలంతా చెట్టపట్టాలేసుకుని, కలిసిమెలిసి జీవించాలని లూథర్‌కింగ్ ఆశయం. ఈ భావా న్నే కవితాత్మకంగా, ఉద్విగ్నంగా తన ప్రసంగంలో నిక్షిప్తం చేశాడు. 1940 వరకు నల్లవారికి తెల్లజాతీయుల విద్యాలయాలలో ప్రవేశం లేదు. 60 శాతం స్త్రీలు శ్వేతజాతీయుల ఇళ్లలో పనిమనుషులే. 1965 దాకా ఓటు హక్కు దక్కలేదు. 2000 నాటికి నల్లజాతీయులు విద్యలో పురోగమించారు. ఆర్థికస్థితి మాత్రం మెరుగుపడింది. 2010కి 45 శాతం నల్లజాతీయులు సొంత ఇళ్లు కలిగి ఉన్నారు. మొత్తం అమెరికన్లలో 67 శాతం సొంత ఇళ్లు ఉన్నవారు కనిపిస్తారు. ఇప్పుడు 85 శాతం మెట్రోపాలిటన్లలో నల్లవారికీ తెల్లవారికీ వేర్వేరు నివాస ప్రాంతాలు కనిపించవు. మార్టిన్ చూసిన అమెరికాలో తెల్ల, నల్లజాతీయుల మధ్య ప్రేమలూ పెళ్లిళ్లూ చట్టవిరుద్ధం. కానీ ఇప్పుడు 15 శాతం పెళ్లిళ్లు వీరి మధ్య జరుగుతున్నాయి. కానీ నిరుద్యోగం తెల్లవారిలో కంటె, నల్లజాతీయులలోనే ఎక్కువ. భత్యాలలో వ్యత్యాసాలు కూడా ఉన్నాయి. దాని ఫలితమే ఇటీవలి మాంద్యం నల్లజాతిని బాగా కుంగదీసింది. అమెరికాలో నల్ల, తెల్ల జాతీయుల మధ్య ఆర్థిక సమానత్వం సాధిం చడం తన ముందున్న అతి పెద్ద లక్ష్యమని ఒబామా చాలా నిజాయితీగా అంగీకరించారు. ఒబామా అధ్యక్షుడు కావడం మార్టిన్ కల నెరవేరుతోందని చెప్పడానికి తార్కాణమని నల్లజాతీయుడు మిల్టన్ రాస్ (72) అభిప్రాయపడుతున్నాడు. ఇది అర్థసత్యమని అమెరికా శ్వేతజాతి వైఖరి తెలిసిన ఎవరైనా చెబుతారు. మార్టిన్ కల నెరవేరడానికి ఇంకా చాలా కాలం పడుతుంది. నల్లజాతి జీవనం లో గుణాత్మకంగా ఎన్నో మార్పులు వచ్చా యి. అయితే వచ్చిన ఈ పరివర్తన శ్వేతజాతీయులవల్ల మాత్రం కాదు. నల్లజాతి పోరా ట పటిమే ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిం ది. ఆ పోరాట స్ఫూర్తిని నల్ల జాతీయులకు ఇచ్చినవాడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. - డా॥గోపరాజు నారాయణరావు