'మన మార్టిన్ లూథర్ కింగ్ అంబేడ్కర్'
న్యూఢిల్లీ: ప్రజలందరూ విద్యావంతులు కావాలని బీఆర్ అంబేడ్కర్ కోరుకున్నారన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం బీఆర్ అంబేడ్కర్ జాతీయ స్మారక భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బాబాసాహెబ్ కలలను సాకారం చేసే అదృష్టం తనకు కలగడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయన మరణించిన 60 ఏళ్ల తరువాత మెమోరియల్ ఏర్పాటు కావడం పట్ల మోదీ విచారం వ్యక్త చేశారు.
దళితులు, గిరిజనులు, అట్టడుగు వర్గాల హక్కు అయిన రిజర్వేషన్లను ఎవరూ కొల్లగొట్టలేరని పేర్కొన్నారు. అది వారి హక్కు అని మోదీ స్పష్టం చేశారు. అంబేడ్కర్ ను అమెరికా నల్లజాతి పోరాట యోధుడు, పౌరహక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ తో పోల్చారు. వారిద్దరూ ప్రతి అమానవీయ ఘటనల పట్ల గొంతెత్తిన మహాపురుషులని కొనియాడారు. అంబేడ్కర్ విశ్వమానవుడని, భారత్‌కు మాత్రమే పరిమితం చేసి మాట్లాడడం భావ్యం కాదన్నారు.
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆయా వర్గాలకు రిజర్వేషన్లు ఉండవనే అపోహలు చెలరేగాయని.. కానీ తమ ప్రభుత్వ హయాంలోని దేశంలో ఎక్కడా అలా జరగలేదన్నారు. అణగారిన వర్గాల బలమైన గొంతుక అంబేడ్కర్ అని పేర్కొన్నారు. అంబేడ్కర్ ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉంటే.. ఈ రోజు తాము చేపట్టిన కార్యక్రమాలను 60 ఏళ్ల క్రితమే ఆయన చేపట్టి ఉండేవారన్నారు. సుమారు 18,000 గ్రామాల్లో విద్యుత్ అందించడం ద్వారా అంబేద్కర్ కలలను సాకారం కోసం ప్రయత్నిస్తున్నామన్నారు.
మహిళలకు సమాన హక్కులు కల్పించకపోతే తాను మంత్రివర్గంలో కొనసాగనని అంబేడ్కర్ చెప్పారని మోదీ గుర్తు చేశారు. ప్రస్తుతం పార్లమెంటులో జల మార్గాలకు సంబంధించిన బిల్లు ఉందని, అయితే భారత్‌కు ఉన్న శక్తివంతమైన సముద్ర మార్గాల గురించి తొలిసారిగా ప్రస్తావించింది అంబేద్కరేనని తెలిపారు. అంబేడ్కర్ ఫిలాసఫీలో భాగమైన రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అగ్రిఉత్పత్తుల మార్కెట్ రేట్లు గురించి నవీకరించబడిన సమాచారాన్ని రైతులు పొందడానికి వీలుగా ఏప్రిల్ 14న కొత్త టెక్నాలజీని ప్రారంభించనున్నట్టు మోదీ వెల్లడించారు.