tribals communities
-
పాక్‌లో తెగల వైరం.. 130 మంది మృత్యువాత
పెషావర్: పాకిస్తాన్‌లోని కల్లోలిత ఖైబర్ ప్రావిన్స్‌లో రెండు తెగల మధ్య కొనసాగుతున్న ఘర్షణల్లో కనీసం 130 మంది ప్రాణాలు కోల్పోయారు. కుర్రం జిల్లాలోని అలిజాయ్, బగాన్ తెగల మధ్య నవంబర్ 22వ తేదీన ఘర్షణలు మొదలయ్యాయి. అంతకుముందు రోజు, జిల్లాలోని పరాచినార్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్లపై దాడులు జరిపి 57 మంది చంపేయడంపై ఈ ఘర్షణలకు ఆజ్యం పోసింది. సున్నీ, షియా గ్రూపుల మధ్య ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ ఆ ప్రాంతంలో హింసాత్మక ఘటనలు, ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని పోలీసులు అంటున్నారు. ఆదివారం జరిగిన ఘర్షణల్లో మరో ఆరుగురు చనిపోగా, 8 మంది గాయపడ్డారు. దీంతో మరణాల సంఖ్య 130కి, క్షతగాత్రుల సంఖ్య 186కు చేరిందన్నారు. దీంతో, ప్రభుత్వం విద్యా సంస్థలను మూసివేసింది. మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులను ఆపేసింది. పెషావర్–పరాచినార్ రహదారిని, పాక్–అఫ్గాన్ సరిహద్దుల్లోని ఖర్లాచి పాయింట్ వద్ద రాకపోకలను నిలిపివేసింది. దీంతో, చమురు, నిత్యావసరాలు, మందులు దొరక్క సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు ఖైబర్ ప్రభుత్వ యంత్రాంగం అంటోంది. -
Mali mountain forest: వాళ్లు అడవిని సృష్టించారు
కోరాపుట్ (ఒడిశా): అది ఒడిశాలోని మారుమూల కోరాపూట్ జిల్లా. అందులో మరింత మారుమూలన ఉండే గిరిజన గ్రామం. పేరు ఆంచల. 1990ల నాటి సంగతి. వంట చెరుకు కోసమని, ఇతర అవసరాలకని ఊరి పక్కనున్న పవిత్ర ‘మాలీ పర్వతం’ మీది చెట్లను విచక్షణారహితంగా నరికేస్తూ పోయారు. ఫలితం...? చూస్తుండగానే పచ్చదనం జాడలనేవే లేకుండా గుట్ట పూర్తిగా బోసిపోయింది. జరిగిన నష్టాన్ని గుర్తించేలోపే మరుభూమిగా మారింది. దాని పై నుంచి వచ్చే అందమైన సెలయేటి ధార కూడా శాశ్వతంగా ఆగిపోయింది. దాంతో అడవి బిడ్డలైన ఆ గిరిజనులు తల్లడిల్లారు. ముందుగా మహిళలే కళ్లు తెరిచారు. చిట్టడవికి తిరిగి జీవం పోసి పవిత్ర పర్వతానికి పూర్వపు కళ తేవాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం 30 ఏళ్లు అకుంఠిత దీక్షతో శ్రమించారు. తమకు ప్రాణప్రదమైన అడవికి పునఃసృష్టి చేసి నారీ శక్తిని మరోసారి చాటారు. ఫలితంగా నేడు కొండమీది 250 ఎకరాల్లోనే గాక ఊరి చుట్టూ పచ్చదనం దట్టంగా పరుచుకుని కనువిందు చేస్తోంది. ఒక్కతాటిపై నిలిచి... అయితే ఈ బృహత్కార్యం చెప్పినంత సులువుగా ఏమీ జరగలేదు. ఇందుకోసం గ్రామస్తులంతా ఒక్కతాటిపై నిలిచి కష్టపడ్డారు. మొదట్లో మూణ్నాలుగు కుటుంబాలు ఒకేచోట వండుకోవడం మొదలు పెట్టారు. క్రమంగా వంట కోసం కట్టెలపై ఆధారపడటాన్ని వీలైనంతగా తగ్గించుకుంటూ వచ్చారు. సేంద్రియ సాగుకు మళ్లారు. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థల సాయం తీసుకున్నారు. అంతేగాక చెట్లను నరికే వారికి రూ.500 జరిమానా విధించారు. ముక్కు పిండి మరీ వసూలు చేయడమే గాక నలుగురిలో నిలబెట్టి నలుగు పెట్టడం వంటి చర్యలు తీసుకున్నారు. చెట్లు నరికేందుకు దొంగతనంగా ఎవరూ కొండపైకి వెళ్లకుండా ఒక కుటుంబాన్ని కాపలాగా పెట్టారు. వారికి జీతమిచ్చేందుకు డబ్బుల్లేకపోవడంతో ఊరంతా కలిసి వారికి 10 కిలోల రాగులిస్తూ వచ్చామని సుపర్ణ అనే గ్రామస్తురాలు గుర్తు చేసుకుంది. ఈ ఉద్యమం మొదలైన రోజుల్లోనే 15 ఏళ్ల వయసులో నవ వధువుగా తాను ఊళ్లో అడుగు పెట్టానని చెప్పుకొచ్చింది. ‘‘మా శ్రమ ఫలించి మేం నాటిన చెట్లు చిగురించడం మొదలు పెట్టినప్పటి మా సంతోషాన్ని మాటల్లో చెప్పలేం’’ అని చెబుతూ సవిత అనే మరో గ్రామస్తురాలు సంబరపడిపోయింది. కొసమెరుపు 30 ఏళ్ల కింద మూగబోయిన జలధార కూడా మహిళల మొక్కవోని ప్రయత్న ఫలితంగా మళ్లీ ప్రాణం పోసుకుంది. కొండ మీది నుంచి జలజలా పారుతూ ఒకప్పట్లా కనువిందు చేస్తోంది! (క్లిక్: లోయలు.. సొరంగాల్లోంచి ప్రయాణం.. సూపర్ లొకేషన్స్.. ఎక్కడంటే!) -
మూలాలన్నీ ఆదిమ సమాజంలోనే!
ప్రస్తుత ఆధునిక ప్రపంచం ఈ స్థితికి చేరడానికి కారణం తరతరాల పూర్వీకులు కూడబెట్టిన జ్ఞాన సంపదే. ఆ జ్ఞానం ఆధ్యాత్మికం కావచ్చు, భౌతికం కావచ్చు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నదీ, అనుభవిస్తున్నదీ మాత్రమే జ్ఞానం కాదు. ఇప్పటికీ లిపి లేని ఎందరో ఆదిమ జాతుల వారు జీవనం సాగిస్తున్నారు. వారిది మౌఖిక విజ్ఞానం. ప్రకృతితో మమేకమవ్వటం, దాని పరిరక్షణ, దానిని ఉపయోగించుకోవడంలో వారు అగ్రగణ్యులు. సోకాల్డ్ ఆధునిక సమాజాలవారు ఈ జ్ఞానాన్ని గ్రహించి మరింతగా పురోగమించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా విద్యాసంస్కృతి బహు ముఖంగా విస్తరిస్తోంది. ఈ విద్యా సంస్కృతీ వికాసానికి మూలమైన తాత్త్వికులు లిఖిత విద్యనే ప్రమాణంగా తీసుకోలేదు. భారతదేశంలో గిరిజనులు మౌఖిక జ్ఞాన సంపన్నులు. దేశీయ భాషల్లో జీవం ఉంటుంది. నేల, నిప్పు, నీరు, గాలి, ఆకాశం, చెట్టూ, పుట్టా అన్నింటి విలువలు వీరి జ్ఞానంలో ఒదిగి ఉన్నాయి. అయితే వారి నుండి మనం పూర్తి జ్ఞానాన్ని పొంద లేదు. ఆ విజ్ఞానం మన జీవితాన్ని సుసంపన్నం చేయాలంటే మౌఖిక జ్ఞాన సంపద లోతుల్లోకి మనం వెళ్ళాలి. ప్రపంచ విజ్ఞానమంతా ప్రకృతిలో దాగి ఉంది. వృక్ష, జంతు, భూగర్భ శాస్త్రముల వంటి వన్నీ విస్తృతి చెందాలంటే మానవ సమాజ జీవన వ్యవస్థల లోతుల్లోకి ఇంకా పరిశోధనలు వెళ్ళాలి. మనం మన కళ్ళముందు ఉన్నదాన్ని గ్రహించ లేక మన జీవన వ్యవస్థల్లో భాగంగా ఉన్న భాష మీద ఆధిపత్యం లేక ఉపరితల అంశాల మీదే దృష్టి పెడు తున్నాం. మనకు జ్ఞానం ఎలా కలుగుతుంది? సమస్త జ్ఞానం ఇంద్రి యానుభవం ద్వారానే సిద్ధిస్తుందా? ఈ తాత్త్విక, భౌతిక దృష్టి లోపించి ప్రయోజనవాద దృష్టి పెరిగింది. ఇది మానవులకు ఉప యుక్తం కాదు. మనిషి తప్పక వాస్త వాన్ని అంగీకరించే ధోరణి లోకి రావాలి. వాస్తవం ప్రకృతిలోనూ, ప్రాకృతిక జీవుల్లోనూ ఎక్కువ ఉంటుంది. తాత్త్విక దృక్పథం లేని వాళ్ళే భూమి పొరలను చీల్చి భూగర్భ ఖనిజాలను అమ్ముకుంటున్నారు. ప్రపంచం అంతా ఈ రోజు అస్తవ్యస్తం కావ డానికి ప్రపంచం మీద, దేశం మీదా అవగాహన లేని అవిద్యాపరుల భావనలే. మనిషి స్వార్థపరుడు కావడానికి కారణం జ్ఞాన శూన్యతే. ప్లేటో చెప్పినట్టు వృక్షత్వం భావన నుంచి చెట్టు మూలం తెలుస్తుంది. చెట్టు మూలం తెలియని వాడు దాని వేర్లు నరుకుతాడు. చెట్టు మూలం తెలియని వాడు చెట్టు పెంచడు. కాగా, చెట్టు మూలం తెలిసిన వాడు దాని ఆకులోని ఔషధ గుణాన్ని స్వీకరిస్తాడు. చెట్టుకి మానవ సమా జానికి ఉన్న అంత స్సంబంధం తెలియని వాడు జ్ఞాని కాదు. నిజమైన జ్ఞానం వస్తువుకు మనకు ఉండే అంతస్సంబంధం నుండే జనిస్తుంది. చాలామంది తన చుట్టూ ఉన్న పరిసరాల మీద అవగాహనను పెంచు కోలేదు. తాము చూడని, కనని, వినని అజ్ఞాత దైవాల మీద, తమకు అనుభవం కాని కులం మీద, తాము అనుభవించని సంపద మీదా ఆలోచనలతో జీవిస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు మూఢ విశ్వాసు లుగా మారతారు. జ్ఞానానికి వారు అవరోధులు. మౌఖిక జాతుల జీవన శాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారానే మనం భారతదేశాన్ని సుసంపన్నం చేయగలం. అనేక జాతులలో నిక్షిప్తమైయున్న జ్ఞానాన్నీ, విద్యనీ, సంస్కృతినీ మనం అర్థం చేసుకొనే క్రమం నుండే మన దేశాన్ని మనం కాపాడుకోగలం. ఆదివాసీలు నివసించే ప్రాంతాలలో ఎంతో విలువైన ఖనిజ సంపద వుంది. ఎన్నో వృక్ష జాతులున్నాయి. గిరిజనులు ఈ ప్రకృతి సంపద పట్ల ఎంతో అవగాహన కలిగి సంరక్షించుకుంటూ ఉంటారు. ఈనాడు భారతదేశం సంక్షోభంలో వుండటానికి కారణం గిరిజనుల జ్ఞాన సంపదను అర్థం చేసుకోలేకపోవడమే. గిరిజనులు రక్షిస్తున్న అటవీ సంపదను బట్టి వారి నీతినీ, నిజాయితీనీ, వ్యక్తిత్వాన్నీ, రక్షణ స్వభావాన్నీ మనం అర్థం చేసుకోవచ్చు. గిరిజనులే నిజమైన మాన వులు. వారు ప్రతి ఆకునూ ప్రేమిస్తారు. ప్రతి జంతువు స్వభావాన్నీ అధ్యయనం చేస్తారు. మాతృస్వామిక స్వభావం గలవారు. అందుకే శాస్త్రవేత్తలు లిఖిత భాషలోనే కాదు, అలిఖిత జాతులలో కూడా జ్ఞానం వుందని చెబుతున్నారు. అరిస్టాటిల్ ప్రకృతి గురించి చెప్తూ... శుద్ధద్రవ్యం మొదటగా నాలుగు మూల పదార్థాలు – మట్టి, నీరు, గాలి, అగ్నిగా మారుతుం దన్నాడు. ఇంతవరకు అరిస్టాటిల్‌కు పూర్వులైన గ్రీకులు కనిపెట్టినవే. కాని, అతడు అయిదవ మూల పదార్థం ఈథర్ కూడా ఉంటుందని ఊహించాడు. భారతీయ భౌతికవాదులు సాంఖ్యులు భూమి, నీరు గాలి, అగ్ని, శూన్యాలను కనిపెట్టారు. ఈ శూన్యంలో కూడా ఈథర్ అనే పదార్థం ఉంటుందని నేటి భౌతికవాదులు చెప్తున్నారు. అది కొంత స్థలాన్ని ఆక్రమిస్తుందని అంటున్నారు. అన్ని వస్తువులు పంచ భూతాల నుండే ఏర్పడతాయి. పదార్థ జ్ఞానాన్ని ఆదిమ వాసులు విస్తృతంగా అర్థం చేసుకొన్నారు. దేన్నైనా జీవితావసరం మేర మాత్రమే వాడుకుంటారు. కాని సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ స్వభావం వున్న వాళ్ళే వాటిని వ్యాపార దృక్పథంతో స్వార్థం కోసం ఉపయోగించు కొంటారు. భౌతిక తత్వశాస్త్రం మొత్తం ఆదిమ జాతుల నుండే వచ్చింది. సాంఖ్య దర్శన రూపకర్త కపిలుడు దళితుడే. దళితజాతులు ఆదిమ జాతులకి దగ్గరగా వుంటాయి. గిరిజనుల్లో చాలాకాలం ప్రజలకు లిపి తెలియదు కాని, వారికి మనకంటే జ్ఞాపకశక్తి ఎక్కువగా వుండేది. వారు పాతకాలపు అద్భుత గాథలను చెప్పేవారు. వారు పోయినా ఆ గాథలు మాత్రం పోలేదు. ఆనోటా ఆనోటా ఆ గాథలు మారుతూ వుంటాయి. వాటిలో కొత్త సంగతులు చేరుతుంటాయి. నీరు పారి పారి రాళ్ళు నునుపు దేరినట్టు ఆ గాథలు రాను రాను నయం గానూ, నాజూకు గానూ అవుతూ ఉంటాయి. పరాక్రమ వంతుడైన ఒకానొక కులపెద్ద కథ కాలక్రమాన నీటికీ, నిప్పుకూ, బాణానికీ, బళ్లేనికీ భయపడని వాడూ; సింహంలాగా అడవంతా పెత్తనం చెలాయించి డేగలాగ ఆకాశంలో ఎగిరిపోయేవాడూ అయిన ఏమాయా మానవుని వీరగాథ గానో మారుతుంది. గిరిజనులు, దళితులు ఇంకా ఇతర మౌఖిక ఉత్పత్తికారులు మన సంస్కృతీ వికాసానికి, తత్వానికీ మూల ప్రకృతులు. మన కేంద్ర– రాష్ట్ర ప్రభుత్వాలే కాక, మన విశ్వ విద్యాలయాలు, పరిశోధకులు, జ్ఞానులు, విద్యావంతులు మన మూల ప్రకృతులైన ఆదిమవాసులు, దళితులను అధ్యయనం చేయాలి. ఈ నేల పుత్రుల జీవన గాథలనూ, సాంస్కృతిక వికాసాన్నీ పునర్నిర్మించుకోవడానికి దళిత గిరిజన విశ్వ విద్యాలయాలను నిర్మించుకోవలసి వుంది. లిఖితేతర సమాజం వైపు నడపడమే నిజమైన శాస్త్ర దృష్టికి మూలం. ఆ వైపు నడుద్దాం. డా.కత్తి పద్మారావు, వ్యాసకర్త దళిత ఉద్యమ నాయకులు ‘ 9849741695 -
గిరిజనులకు దేశవ్యాప్తంగా సమాన హోదా
సాక్షి, హైదరాబాద్: గిరిజనులకు దేశవ్యాప్తంగా సమాన హోదా దక్కాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో గిరిజనులు ఎస్టీలుగా, బీసీలుగా, ఓసీలుగా ఉంటున్నారని.. అలా కాకుండా వారందరికీ సమాన హోదా దక్కే దిశగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన సేవాలాల్ బంజారా భవన్, కుమురంభీం ఆదివాసీ భవన్లను సీఎం శనివారం ప్రారంభించి మాట్లాడారు. ‘‘తెలంగాణ ఏర్పాటుకు ముందు అత్యంత ఖరీదైన ప్రాంతాలైన జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో ఎస్టీలకు గజంజాగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు గిరిజనులు, ఆదివాసీలు తలెత్తుకునేలా ఆధునిక హంగులతో రెండు భవనాలను నిర్మించాం. ఈ రెండు భవనాలు దేశంలోని గిరిజన సమాజానికి స్పూర్తిగా నిలవాలి. ఇక్కడ పెళ్లుళ్లు, పేరంటాలు వంటివి కాకుండా గిరిజనులను ఉన్నతీకరించే ఆలోచనలకు కేంద్రంగా కార్యక్రమాలు నిర్వహించాలి’’ అని కేసీఆర్ సూచించారు. ఆదివాసీ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా కుమురం భీం విగ్రహానికి నివాళులర్పిస్తున్న సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పోడు భూముల సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. పోడు సమస్యల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశామని, అవన్నీ సమర్థంగా పనిచేసేలా గిరిజన ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని సూచించారు. గిరిజన భవన్, ఆదివాసీ భవన్లను చక్కటి సమావేశాలు నిర్వహించుకునేందుకు వినియోగించుకోవాలన్నారు. ‘ఏ తండాలో ఏ సమస్యలున్నాయి? వాటిని ఎలా రూపుమాపాలి? ఏ విధంగా ప్రభుత్వ సేవలు అందిపుచ్చుకోవాలి? అనే కోణంలో సదస్సుల నిర్వహణకు ఈ భవనాలు వేదిక కావాలి. ఏ బంజారా బిడ్డకు అవస్థ వచ్చినా వెళ్లి రక్షణగా నిలవాలి. అప్పుడే ఈ భవనాలకు సార్థకత లభిస్తుంది’ అని కేసీఆర్ పేర్కొన్నారు. గిరిజన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. కాగా సీఎం కార్యక్రమ సమయంలో.. ఎస్టీ రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం 12 శాతానికి పెంచాలంటూ బంజారా, ఆదివాసీ భవన్ల వద్ద కొందరు ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదీ చదవండి: మతోన్మాద శక్తులు వస్తున్నాయి.. జాగ్రత్త! -
అడవి చెప్పిన కథ.. అర్చనలకు ఫలితంగా అక్షర జ్ఞానం
అనగనగనగా ఓ అడవి. ఆ అడవిలో కొన్ని అరుదైన కోవెలలు. ఆ మందిరాల్లో మంత్రాలు లేకుండా పూజలు. ఆ అర్చనలకు ఫలితంగా అక్షర జ్ఞానం. తమ ఉనికికి ఊపిరి పోసేందుకు, వేల ఏళ్ల నాటి భాషను బతికించుకునేందుకు, అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఆదివాసీలు నట్టడవిలో వెలగించిన చైతన్య దివిటీలు ఈ దేవాలయాలు. సకల దేవతల సమాహారంగా అక్షరాలు కొలువై ఉన్న ఈ ఆలయాలను చూడాలంటే జనాలను దాటి వనంలోకి వెళ్లాలి. సిక్కోలు మన్యంలోని భామిని మండలాన్ని పలకరించాలి. అక్కడ అడవి చెప్పే స్ఫూర్తి కథను వినాలి. భామిని: భామిని మండలంలోని మనుమకొండ, పాలవలసలో రెండు ఆలయాలు విభిన్నంగా ఉంటాయి. ముక్కోటి దేవతల్లో ఒక్కరిని కూడా అక్కడ ప్రతిష్టించలేదు. అష్టోత్తరాలేమీ రాయలేదు. ప్రత్యేక ప్రార్థనలంటూ ఏమీ లేవు. అక్కడ కనిపించేవి కేవలం అక్షరాలు. అవును.. అచ్చంగా అక్షరాలే. సవర లిపిని ఆలయాల్లో ప్రతిష్టించి వాటిని పూజలు చేసే గొప్ప సంప్రదాయం ఈ రెండు గ్రామాల్లో కనిపిస్తోంది. ఆదివాసీలు చిత్రాల్లో దైవ రూపాలను గుర్తించి పూ జించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. అందుకే తమ అమ్మ భాషను లిపి రూపంలో ఆరాధిస్తున్నా రు. ఈ ఆలయాల ఆలోచన వె నుక ఓ ఉద్యమమే దాగి ఉంది. ఆ ఉద్య మం పేరు మతార్బనోమ్. మత్ అంటే దృష్టి, తార్ అంటే వెలుగు, బనోమ్ అంటే విస్తరించడం కలిపి.. మన దృష్టి వెలుగులో భాషను విస్తరించడం అని అర్థం. అక్షర జ్ఞానం కోసం.. సవర భాష చాలా పురాతనమైనది. కానీ లిపి లేకపోవడంతో సరైన గుర్తింపునకు నోచుకోలేదు. ఆ లిపిని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఓ ఉద్యమమే జ రిగింది. అందులో భాగమే ఈ అక్షర బ్రహ్మ ఆల యాలు. ఎప్పుడో 1936లో సవర పండిత్ మంగ య్య గొమాంగో ఈ లిపికి అక్షయ తృతీయ నాడు రూపం ఇచ్చారు. పుష్కర కాలం కష్టపడి తయారు చేసిన ఈ లిపి గిరిజనుల ఇళ్లకు చేరాలంటే ఏం చే యాలని ఆలోచించగా.. తట్టిన మహత్తర ఆలోచనే అక్షర బ్రహ్మ దేవాలయాలు. గిరిజన గ్రామాల్లో ఆలయాలు నిర్మించి అందులో అక్షరాలను ప్రతిష్టించి వాటి ద్వారా గిరిజనులను చైతన్యవంతులు చేయడానికి ప్రయత్నించారు. దాని ఫలితంగా లిపి ఇంటింటికీ చేరింది. అంతే కాదు ఆదివాసీల్లో గల మద్యం, వివిధ రకాల మాంస భక్షణ వంటి దురాచారాల నుంచి దూరం చేసేందుకు కూడా ఈ మందిరాలు వేదికలుగా ఉపయోగపడుతున్నాయి. విగ్రహాలు ఇవే.. సవర పండిత్ మంగయ్య గొమాంగో 24 అక్షరాలను రూపొందించి వాటిని చిత్రాల రూపంలో మలిచి ఆలయాల్లో ప్రతిష్టించారు. ఈ 24 అక్షరాలలో 16 హల్లులు, 8 అచ్చులు ఉంటాయి. అప్పట్లో అక్షర బ్ర హ్మ ఉద్యమం సరిహద్దులు దాటి అడవి గుండా వ్యాపించింది. ఆ సందర్భంలోనే భామిని మండలం మనుమకొండ, పాలవలసలోనూ అక్షరబ్రహ్మ ఆల యాలు ఏర్పాటయ్యాయి. సతివాడ సమీపంలో బొడమ్మమెట్టపై కొత్తగా అక్షరబ్రహ్మ ఆలయం ఇటీవల ఏర్పాటైంది. సీతంపేట మండలం నౌగడ, ముత్యాలు, శంభాంలలోనూ, విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మిపురం మండలం కన్నాయిగూడ, లక్కగూడలోనూ తర్వాత అక్షరబ్రహ్మ అలయాలు వెలిశా యి. జామిగూడ, సతివాడ, నౌగడ తదితర గ్రామా ల్లో అక్షర బ్రహ్మ యువ నిర్మాణ సేవా కేంద్రాలు పేరున ప్రచార మందిరాలు వెలిశాయి. జాతీయ స్థాయిలో.. ఇటీవల మనుమకొండలో జరిగిన అక్షరబ్రహ్మ యువ నిర్మాణ సేవా సంఘం జాతీయ స్థాయి సదస్సులో ఐదు రాష్ట్రాల ప్రతినిధులు, మతార్బనోమ్ ప్రచారకులు సవరభాషను జాతీయ భాషగా తీర్చిదిద్దడానికి తీర్మానించారు. ఈశాన్య రాష్ట్రాల్లో సరవభాషా ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి నిర్ణయించారు. ఒడిశా నుంచి మాజీ ముఖ్యమంత్రి గిరిధర గొమాంగో, మాజీ ఎమ్మెల్యే రామూర్తి గొమాంగో, సవర భాషను ఆవిష్కరించిన మంగయ్య కుమారు డు, సవర లిపి ప్రచార జాతీయ అధ్యక్షుడు డిగాన్సిమ్ గొమాంగో, అసోం నుంచి వచ్చిన పాగోని బోయా, గాబ్రియల్ బోయా, లోక్మి బోయాలు చర్చించారు. సవర భాష ప్రాచుర్యానికి చెందిన పుస్తకాల స్టాల్స్, సవర లిపి కరపత్రాలు, మేగజైన్లు, పోస్టర్లు ప్రదర్శించాలని నిర్ణయించారు. ప్రతి ఆదివాసీ ఇంట.. మా భాషకు లిపిని అందించిన సవర పండిత్ మంగయ్య గొమాంగో మాకు ఆరాధ్య దైవం. అక్షర బ్ర హ్మ ప్రచార కార్యక్రమాన్ని ప్రతి ఆదివాసీ ఇంటికీ చేర్చుతున్నాం. అక్షర బ్రహ్మ ఆలయాలు నిర్మించలేని చోట అక్షర బ్రహ్మ ఆశ్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రత్యేక పూజలతో సవర లిపి ప్రాముఖ్యతను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. – సవర కరువయ్య, జిల్లా కోఆర్డినేటర్, అక్షర బ్రహ్మ ప్రచారకుల సంఘం, సతివాడ సవర భాషలో బోధిస్తాం.. సవర భాషలోని పదాలు, వాడుక వస్తువులను సవర లిపిలో వివరిస్తున్నాం. గిరిజన గ్రామాల్లో సమావేశాలు పెట్టి ఇతర భాషలతో పాటు సవర భాష అక్షరాలతో పదాలు, అర్థాలు బోధిస్తున్నాం. సవర భాషకు గుర్తింపు తీసుకురావడానికి రాత్రింబవళ్లు కొండలపై తిరుగుతూ ప్రచారం చేస్తున్నాం. – పత్తిక సాయన్న, ప్రచారకుడు, అక్షరబ్రహ్మ యువసేవా సంఘం, మనుమకొండ -
పూసలతల్లికి స్థిరజీవితమొద్దా?
సమాజాన్ని సౌందర్యాత్మకంగా తీర్చిదిద్దుతున్న జీవితాలు మాత్రం విషాదంగా ఉన్నాయి. తరతరాలుగా అలంకృత వస్తువులను విక్రయిస్తున్న పూసల తల్లుల బతుకు చిత్రం మారటమే నూతన రాష్ట్రంలో జరగాల్సింది. గంపలో పెట్టుకున్న వస్తువులు వారి వ్యాపారం. ‘గంప’ తరతరాలుగా వాళ్లకు తిండిబెట్టే జీవనాధారం. ‘గంప’ నెత్తిన పెట్టుకుని ఊరూరా తిరుగుతూ సరుకులను అమ్ముకుంటూ వచ్చిన నాలుగురాళ్లతో తరతరాలుగా కుటుంబాలను గడుపుతున్న వాళ్లు పూసల కులస్తులు. ఆడవాళ్ల అలంకార సాధనమైన చేతులకు గాజులు వేస్తూ ఆ తల్లులు ఇప్పటికీ గంపను నెత్తిన మోస్తూ సంచారం చేస్తూ కుటుం బాలను సాకుతున్నారు. మాతృస్వామిక వ్యవస్థను కొనసాగిస్తూ కుటుంబాలను పోషిస్తూ ఇప్పటికీ మిగిలి వున్న ఏకైక కులం పూసలకులం. సంచారంచేస్తూ ఊరూరా తిరుగుతున్న ఆ తల్లులు ఇంటిని దిద్దే ఇల్లాళ్లే కాదు, ఇంటిని నడిపించే ఆర్థిక రథసారథులు. తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమంలో ఈ పూసల తల్లులు సామూహికంగా వందల సంఖ్యలో గంపలను నెత్తిన పెట్టుకుని ర్యాలీలు చేశారు. తెలంగాణలో ఈ కుల స్తులు 70 వేలకు పైచిలుకు ఉంటారు. ఈ కులస్తుల ఆకాంక్షలకు అనుగుణంగానే తొలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పూసల కులస్తుల బాధలు తీర్చేందుకు ఆలోచనలు సారించారు. ఎంబీసీలు, సంచారజాతుల వారితో అనేకసార్లు సమావేశమై పూసల కులస్తులను సొంతకాళ్లపై నిలబెట్టే కసరత్తు మొదలు పెట్టారు. పూసల తల్లులు ఆడవారి అలంకృత సామానులు విక్రయిస్తారు. ఒక రకంగా వందల ఏళ్లుగా సంచారం చేస్తూ ఆడవారికి మరింత అందానిచ్చే నడుస్తున్న బ్యూటీపార్లర్లు పూసలవాళ్లు. గాజుల అమ్మకమే వీరి ప్రధానవృత్తి. గంపలో గాజులతో పాటు తాళాలు, అలంకృత సామాన్లు కూడా విక్రయిస్తారు. సమాజాన్ని సౌందర్యాత్మకంగా తీర్చిదిద్దుతున్న ఈ పూసల కులస్తుల జీవితాలు మాత్రం విషాదంగా ఉన్నాయి. చేతి నిండా గాజులు వేసి ఇంటిల్లిపాదిని ఆనందంలో ముంచే ఆ పూసల తల్లి మాత్రం సంచారంచేస్తూ చిట్లిన గాజులుగా జీవిస్తున్నారు. తరతరాలుగా అలం కృత వస్తువులను విక్రయిస్తున్న పూసల తల్లుల బతుకు చిత్రం మారటమే జరగాల్సింది. ఊరూరా తిరిగి గాజులు అమ్మకానికి పెట్టుబడి కోసం వీళ్లు వడ్డీవ్యాపారస్తులను ఆశ్రయిస్తారు. వీళ్ల సంపాదన మొత్తం తిరిగి వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. కేసీఆర్ ఈ విషయానికి విరుగుళ్లు కనిపెట్టారు. బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా లబ్ధిదారులకు ప్రభుత్వం సహాయం చేసే విధంగా ప«థక రచన చేశారు. ఒక లక్షరూపాయల రుణమిస్తే అందులో 20 శాతం మాత్రమే లబ్ధిదారులు కట్టాలి. మిగతా రుణమంతా ప్రభుత్వమే సాయం చేస్తుంది. ఒకవేళ ఆ 20శాతం కూడా కట్టలేని స్థితి ఉన్నవాళ్లకు మాత్రం బ్యాంకులు సాయం చేస్తాయి. వాళ్లు వ్యాపారం చేసుకుంటూ ఆ 20 శాతం రుణమాఫీ చేసుకోవాల్సి ఉంటుంది. గంప నెత్తిన పెట్టుకుని పొద్దు పొడవకముందే దళిత, బీసీ వాడలకు పోయి వాళ్లను నిద్రలేపి సబ్బులు, పౌడర్లు, గాజులు, దినుసులు, పొగాకు, తాళాలు, జ్వరం వస్తే ఇచ్చే మందుగోలీలు విక్రయిస్తారు. దళిత, బీసీ వాడలకు ముందే ఎందుకు వెళతారంటే వాళ్లు పొద్దున్నే వ్యవసాయపనులకు, కూలీ పనులకు వెళతారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పేదలకు మొదట సబ్బు, పౌడర్లను పరిచయం చేసింది పూసల తల్లులే. వీళ్లు బుట్టలు, గంపలు నెత్తిన పెట్టుకుని రోజులపాటు సంచారం చేస్తూ తిరుగుతారు. అంగళ్లు, జాతరలు జరిగినప్పుడు నెలల తరబడి సంచారం చేయటం వల్లనే వీరి పిల్లలు చదువులో వెనుకబడ్డారు. సిరాజుల్ హుస్సేన్ రాసిన డొమోనియన్లో కులాలు, తెగలు, వాల్యుంలో పూసల కులస్తుల పుట్టు పూర్వోత్తరాలు రాశారు. వీళ్లు ‘‘చెంచు’’ తెగకు చెందినవారు. పూసలవాళ్లు అడవులను వదిలారు. గ్రామాలలోకి వచ్చారు. కానీ ఆదిమ ఆచారాలను మాత్రం విడువలేదు. వీళ్లునివసించే ప్రదేశాలను గూడెం, మిట్ట అంటారు. ఊరిపెద్దను మిట్టగాడు అని పిలుస్తారు. ఇతని ఆజ్ఞలను అమలు చేసేవారిని ‘‘కొండిగాడు’’ అంటారని సిరాజుల్ హుస్సేన్ రాశారు. వీళ్లకు మరుగుభాష కూడా ఉంది. ఈ మరుగు భాష తెలిసిన వారిని పరదేశి గాండ్లు అంటారు. వీళ్ల కులం వాళ్లు కలుసుకున్నప్పుడు ‘‘అడిమేన్ దాసోహం’’ అని ప్రత్యేక భాషలో నమస్కారం అని చెప్పుకుంటారు. వీళ్లు గ్రామాల్లో తిరిగి స్వేచ్ఛగా వస్తువులను అమ్ముకోవటానికి నిజాం రహదారి పత్రాలు ఇచ్చేవారు. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా బాగా వెనుకబడివున్న వీరి కులంలో చదువుకున్న వారి సంఖ్య తక్కువగా ఉన్నది. సివిల్ సర్వీస్, గ్రూప్ వన్ ఉద్యోగులు ఈ కులం నుంచి కనిపించరు. ఈ పూసల వారి జీవన విధానాన్ని తెలి యజేస్తూ గతంలో ‘‘మేము మనుషులమే’’, ‘‘మైనర్‌బాబు’’ వంటి సినిమాలు తీశారు.రాష్ట్ర ప్రభుత్వం పూసల కులస్తులకు చేసే సహాయ పథకానికి ‘పూసలతల్లి’’ పథకంగా పెట్టాలని సీఎం కేసీఆర్‌ని కోరుతూ బీసీ కమిషన్‌కు విన్నవిం చారు. పూసల కులాలకు ఆ కులంలో మహిళలే ప్రధాన జీవన ఆధారం కాబట్టి వారికి అందించే ఆర్థిక సహాయం పథకం పేరు ‘‘పూసలతల్లి’’ అని పెట్టాలని వీరు కోరుకుంటున్నారు. జూలూరు గౌరీశంకర్ వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు మొబైల్ : 94401 69896 -
'మన మార్టిన్ లూథర్ కింగ్ అంబేడ్కర్'
న్యూఢిల్లీ: ప్రజలందరూ విద్యావంతులు కావాలని బీఆర్ అంబేడ్కర్ కోరుకున్నారన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం బీఆర్ అంబేడ్కర్ జాతీయ స్మారక భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బాబాసాహెబ్ కలలను సాకారం చేసే అదృష్టం తనకు కలగడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయన మరణించిన 60 ఏళ్ల తరువాత మెమోరియల్ ఏర్పాటు కావడం పట్ల మోదీ విచారం వ్యక్త చేశారు. దళితులు, గిరిజనులు, అట్టడుగు వర్గాల హక్కు అయిన రిజర్వేషన్లను ఎవరూ కొల్లగొట్టలేరని పేర్కొన్నారు. అది వారి హక్కు అని మోదీ స్పష్టం చేశారు. అంబేడ్కర్ ను అమెరికా నల్లజాతి పోరాట యోధుడు, పౌరహక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ తో పోల్చారు. వారిద్దరూ ప్రతి అమానవీయ ఘటనల పట్ల గొంతెత్తిన మహాపురుషులని కొనియాడారు. అంబేడ్కర్ విశ్వమానవుడని, భారత్‌కు మాత్రమే పరిమితం చేసి మాట్లాడడం భావ్యం కాదన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆయా వర్గాలకు రిజర్వేషన్లు ఉండవనే అపోహలు చెలరేగాయని.. కానీ తమ ప్రభుత్వ హయాంలోని దేశంలో ఎక్కడా అలా జరగలేదన్నారు. అణగారిన వర్గాల బలమైన గొంతుక అంబేడ్కర్ అని పేర్కొన్నారు. అంబేడ్కర్ ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉంటే.. ఈ రోజు తాము చేపట్టిన కార్యక్రమాలను 60 ఏళ్ల క్రితమే ఆయన చేపట్టి ఉండేవారన్నారు. సుమారు 18,000 గ్రామాల్లో విద్యుత్ అందించడం ద్వారా అంబేద్కర్ కలలను సాకారం కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. మహిళలకు సమాన హక్కులు కల్పించకపోతే తాను మంత్రివర్గంలో కొనసాగనని అంబేడ్కర్ చెప్పారని మోదీ గుర్తు చేశారు. ప్రస్తుతం పార్లమెంటులో జల మార్గాలకు సంబంధించిన బిల్లు ఉందని, అయితే భారత్‌కు ఉన్న శక్తివంతమైన సముద్ర మార్గాల గురించి తొలిసారిగా ప్రస్తావించింది అంబేద్కరేనని తెలిపారు. అంబేడ్కర్ ఫిలాసఫీలో భాగమైన రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అగ్రిఉత్పత్తుల మార్కెట్ రేట్లు గురించి నవీకరించబడిన సమాచారాన్ని రైతులు పొందడానికి వీలుగా ఏప్రిల్ 14న కొత్త టెక్నాలజీని ప్రారంభించనున్నట్టు మోదీ వెల్లడించారు.