పెషావర్: పాకిస్తాన్‌లోని కల్లోలిత ఖైబర్ ప్రావిన్స్‌లో రెండు తెగల మధ్య కొనసాగుతున్న ఘర్షణల్లో కనీసం 130 మంది ప్రాణాలు కోల్పోయారు. కుర్రం జిల్లాలోని అలిజాయ్, బగాన్ తెగల మధ్య నవంబర్ 22వ తేదీన ఘర్షణలు మొదలయ్యాయి. అంతకుముందు రోజు, జిల్లాలోని పరాచినార్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్లపై దాడులు జరిపి 57 మంది చంపేయడంపై ఈ ఘర్షణలకు ఆజ్యం పోసింది. సున్నీ, షియా గ్రూపుల మధ్య ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ ఆ ప్రాంతంలో హింసాత్మక ఘటనలు, ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని పోలీసులు అంటున్నారు.
ఆదివారం జరిగిన ఘర్షణల్లో మరో ఆరుగురు చనిపోగా, 8 మంది గాయపడ్డారు. దీంతో మరణాల సంఖ్య 130కి, క్షతగాత్రుల సంఖ్య 186కు చేరిందన్నారు. దీంతో, ప్రభుత్వం విద్యా సంస్థలను మూసివేసింది. మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులను ఆపేసింది. పెషావర్–పరాచినార్ రహదారిని, పాక్–అఫ్గాన్ సరిహద్దుల్లోని ఖర్లాచి పాయింట్ వద్ద రాకపోకలను నిలిపివేసింది. దీంతో, చమురు, నిత్యావసరాలు, మందులు దొరక్క సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు ఖైబర్ ప్రభుత్వ యంత్రాంగం అంటోంది.
Comments
Please login to add a commentAdd a comment