తెల్లరేగడిలో మొలకెత్తిన నల్ల పిడుగు
‘ఏదో ఒక రోజు నా నలుగురు పిల్లలూ.. వారి వర్ణాన్ని బట్టి కాకుండా, వారి వ్యక్తిత్వాన్ని బట్టి గుర్తించే దేశంలో నివసిస్తారని నాకో కల ఉంది’ రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ (జూనియర్) చరిత్రాత్మక మహోపన్యాసం‘ నాకో కల ఉంది(ఐ హేవ్ ఎ డ్రీమ్)’ (ఆగస్టు 28, 1963)లోని వాక్యమిది. ఈ ప్రసంగం అమెరికా నల్లజాతి చరిత్రను మలుపుతిప్పింది. అమెరికా ఈ రోజు అగ్రరాజ్యం అయి ఉండవచ్చు. కానీ దాని చరిత్ర అంత ఘనమైనది కాదు. 20 శతాబ్దం మధ్యవరకూ కూడా అక్కడ తీవ్ర వ ర్ణ వివక్ష ఉండేది. బస్సులో సీట్లు, స్కూల్లో బెంచ్‌లు ఆఖరికి హోటల్లో కాఫీ గ్లాసులు కూడా నల్లవారికి వేరుగా ఉండేవి. ఇలాంటి వివక్షతలకు వ్యతిరేకంగా ఉద్యమించిన వారు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్.
మార్టిన్ 1929 జనవరి 15న అట్లాంటాలోని క్రైస్తవ చర్చి బోధకుడి కుటుంబంలో జన్మించారు. తండ్రి పేరు కూడా అదే కావడంతో మార్టిన్ జూనియర్ అయ్యారు. మార్టిన్ బాల్యంలోనే వర్ణవివక్షకు గురయ్యారు. తెల్లవారితో ఆడుకోకూడదని, తగిన మార్కులున్నా కోరుకున్న విద్యాలయంలో చేరేందుకు అర్హత లేకుండా చట్టం చేశారని అర్థం చేసుకున్నారు. ఇక బస్సులో కూడా నల్లవారికి వేరే సీట్లు. తెల్లవారి సీట్లు ఖాళీగా ఉంటే కూర్చోవచ్చు. కానీ వారు రాగానే లేచి ఆ సీటు ఇవ్వాలి. అలా ఇవ్వనందుకు బస్సులో నుంచి మార్టిన్‌ను గెంటివేశారు. సరిగ్గా దక్షిణాఫ్రికాలో మహాత్మాగాంధీకి జరిగిన అవమానం లాంటిదే. అప్పటి నుంచి మహాత్మాగాంధీ గురించి చదివారు. మహాత్ముని అహింసా మార్గమే సరైన దారని నిర్ణయించుకున్నారు. చర్చిలో బోధకుడిగా పనిచేస్తూనే తన వాగ్ధాటితో నీగ్రోలకు నాయకుడయ్యారు. తను పిలుపునిస్తే నల్లజాతి మొత్తం కదలి వచ్చే స్థాయికి ఎదిగారు. బస్సులో వర్ణవివక్షతకు వ్యతిరేకంగా బస్సులను బహిష్కరింపజేసి చివరకు ఆ వివక్షత తప్పు అని సుప్రీంకోర్టు చేతే తీర్పు ఇప్పించగలిగారు. మార్టిన్ అసలు పేరు మైఖేల్. తండ్రి బాప్టిస్ట్ మినిస్టర్. మినిస్టర్ అంటే మంత్రి కాదు. మత బోధకుడు. తల్లి ఉపాధ్యాయిని.
వివాహం
మార్టిన్ 1955లో డాక్టరేట్ సంపాదించడానికి ముందు, బోస్టన్‌లో పీహెచ్‌డీ చేస్తున్నప్పుడు పరిచయమైన కొరెట్టా స్కాట్‌ను 1953లో వివాహం చేసుకున్నారు. 1954లో మాంట్‌గోమరీ(అలబామా)లోని డెక్స్‌టర్ అవెన్యూ బాప్టిస్టు చర్చికి పాస్టర్‌గా నియమితులయ్యారు. ఈ సమయంలోనే బస్సులలో వివక్షతకు నిరసనగా ఆఫ్రికన్ అమెరికన్లు బస్సులను బహిష్కరించే ఉద్యమానికి నాయకత్వం వహించడంతో మార్టిన్ పేరు తొలిసారి అమెరికాలో మారుమోగింది.
ఐ హేవ్ ఎ డ్రీమ్
1963లో జాతి వివక్షతకు వ్యతిరేకంగా మార్టిన్ నాయకత్వంలో బర్మింగ్ హామ్, అలబామాలలో చెలరేగిన ఉద్యమాన్ని తెల్లవారు అతి పాశవికంగా బాంబులతో అణచివేశారు. నిరసనలకు వ్యతిరేకంగా జారి అయిన ఆదేశాలను ఖాతరు చేయకపోవడంతో ఆయనను బర్మింగ్‌హామ్ జైల్లో వేశారు. జైలు నుంచి విడుదలయ్యాక ‘చిల్డ్రన్ క్రూసేడ్’ మొదలైంది. మార్టిన్ ప్రోద్బలంతో వేలాది మంది విద్యార్థులు బర్మింగ్‌హామ్ అంతటా కవాతు చేస్తూ నిరసన గళం విప్పారు. దీంతో పోలీసులు విద్యార్థులపై లాఠీలను ఝళిపించారు. ఈ దృశ్యాలను టీవీలలో చూసి ఆగ్రహం చెందిన అమెరికన్లు మార్టిన్‌కు మద్దతు తెలిపారు. ఈ విజయం ఇచ్చిన తీర్పుతోనే మార్టిన్ ‘ఐ హేవ్ ఎ డ్రీమ్’ ప్రసంగాన్ని ఇవ్వగలిగారు.
తలొగ్గిన ప్రభుత్వం
మార్టిన్ లూథర్ కింగ్ ఉద్యమానికి తలవంచి 1964లో ఫెడరల్ ప్రభుత్వం ‘సివిల్ రైట్స్’ చట్టాన్ని తీసుకువచ్చింది. అలాగే 1965లో అమెరికా ప్రభుత్వం ‘ఓటింగ్ రైట్స్’ చట్టాన్ని కూడా తెచ్చింది. సమాన హక్కుల కోసం చేసిన కృషికి గుర్తింపుగా 1964లో 34వ ఏట మార్టిన్ లూథర్ కింగ్ నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు.
1967 డిసెంబర్‌లో మార్టిన్ ‘ పూర్ పీపుల్ క్యాంపెయిన్’ ప్రారంభించారు. పారిశుధ్య కార్మికులకు మద్దతుగా మార్చింగ్‌కు ఏర్పాట్లు చేయడం కోసం 1968 ఏప్రిల్ నెలలో టెన్నెస్సీ రాష్ట్రంలోని మెంఫీస్ చేరుకున్నారు. మరునాడు తను బస చేసిన హోటల్ బాల్కనీలో ఉండగా ఆయనపై దాడి జరిగింది. తుపాకీ గుళ్లకు మార్టిన్ నేలకు ఒరిగారు.