humanitarian
-
తానెంతో జగమంత
ప్రతిమనిషి, సరిగా చెప్పాలంటే ప్రతి జీవి ప్రపంచం అంతా తన వంటిదనే అనుకుంటుంది. తన దృష్టికోణం లోనే చూస్తుంది. అందుకే అబద్ధాలాడేవారికి అందరూ అబద్ధాలు చెపుతారనే అభిప్రాయమే ఉంటుంది. ఎవరి మాటనీ ఒక పట్టాన నమ్మరు. తాను అబద్ధం చెప్పనప్పుడు ఎదుటివారు అబద్ధం చెపుతున్నారేమో అనే అనుమానం ఎందుకు వస్తుంది? పైగా తను చెప్పేది నిజం అని నమ్మమని ఒకటికి పదిసార్లు నొక్కి వక్కాణిస్తూ ఉంటారు. అవతలి వారు నమ్మరేమోననే సందేహం ఎందుకు వస్తుంది? తాను చెప్పే మాట మీద తనకే నమ్మకం లేదు కనుక. ఇతరులని మోసం చేసే గుణం ఉన్నవారు ఇతరులు తమని మోసం చేస్తారేమో నని భయపడుతూనే ఉంటారు. మోసం చేసే బుద్ధి తనకి లేక పోతే ఎదుటివారు తనని మోసం చేస్తారేమో ననే అనుమానం కూడా రాదు. పరాయి ఆడపిల్లలని చెడుదృష్టితో చూసేవారు తమ ఇంటి ఆడవారిని బయటకు పంపటానికి ఇష్టపడరు. దీనికి పెద్ద ఉదాహరణ రావణుడే. కనపడిన ప్రతి స్త్రీని కామదృష్టితో చూసి, చేజిక్కించుకోవా లనుకునే గుణం ఉన్నవాడు కనుకనే తన భార్యలని కట్టడిలో ఉంచాడు. మేలిముసుగు లేకుండా వారిని బయటికి రానిచ్చేవాడు కాదు. ఆ విషయాన్ని రావణ వధానంతరం యుద్ధభూమిలో పడి ఉన్న రావణుణ్ణి చూసి మండోదరి ‘‘మేలిముసుగు లేకుండా నీ భార్యల మైన మేము ఇక్కడికి వస్తే ఏమి అనటం లేదేమి?’’ అని ప్రశ్నించటంలో తెలుస్తుంది. అదే రావణుడు తన చెల్లెలు శూర్పణఖ విషయంలో అవేవీ పాటించ నక్కర లేదని చెప్పి స్వేచ్ఛగా వదిలేశాడు. రాక్షసవంశంలోనే పుట్టిన ప్రహ్లాదుణ్ణి ‘‘కన్నుదోయి కన్యకాంత లడ్డం బైన మాతృభావము చేసి మరలువాడు’’ అని పోతనామాత్యుల వారు వర్ణించారు. స్త్రీల పట్ల సద్భావం కలవాడు కనుక తన తల్లిని, ఇతర స్త్రీలని కూడా గౌరవభావంతో చూడటం తటస్థించింది. జంతువులన్నీ ఇతర జంతువులు, ముఖ్యంగా మనుషుల మీద దాడి చేయటానికి కారణం వాటికి ఉన్న అభద్రతా భావం. అవి ఎదుటి జంతువులని తినటమో, బాధించటమో చేస్తాయి కనుక ఎదుటి జంతువులు కూడా తమని బాధిస్తాయేమోనని ఎదురు దాడి చేస్తాయి. నాగుపాముని చూస్తే ఈ విషయం బాగా అర్థ మౌతుంది. మంచి జాతి సర్పం ఎదురు పడగానే మనిషి భయపడితే అది కూడా భయ పడుతుంది. దాని వంక ప్రేమగా, లేక భక్తితో చూస్తే అది కూడా అదే భావంతో చూసి తొలగిపోతుంది. అందుకే త్రాచుపాము కనపడగానే చేతులు జోడించి నమస్కారం చేసి కదలకుండా ఉండమని చెపుతారు. తేలుకి ఎదుటి ్ప్రాణి తనని బాధిస్తుందనే సందేహం ఉంటుంది కనుక ఏది అడ్డు తగిలితే దానిని కుట్టుకుంటూ పోతుంది. ఇటువంటి లక్షణాలే మనుషులలో కూడా కనిపిస్తాయి. అకారణంగా ఇతరులని బాధించేవారు, భయం వల్లనే బాధిస్తారు. పచ్చకామెర్ల రోగికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది కదా! అదేవిధంగా ‘‘ఆత్మవత్ సర్వభూతాని’’ అని భావించి ఎదుటివారి కష్టం తనది భావించి తదనుగుణంగా స్పందించేవారు, ఎవరికి మేలు కలిగినా తమకే కలిగి నంతగా సంతోషించేవారు ఉన్నారు. ఎవరికి ఆపద కలిగినా వీరి కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఎవరికి మంచి జరిగినా వీరు పండగ చేసుకుంటారు. అంటే, ఈ కోవకి చెందిన వారు జంతు ప్రవృత్తి నుండి కొంత ఎదిగినట్టు చెప్పవచ్చు. ఈ విధంగా ఉండి అందరు తన లాగానే ఉంటారు అనుకోవటం వల్ల లౌకికంగా నష్టపోయిన వారూ ఉన్నారు. కాని, మానవతా దృక్పథంలో వారు ఉన్నత స్థానానికి చేరుకున్నారని అర్థం. ప్రతిస్పందన కన్న సహ అనుభూతి ఉత్తమ స్థాయి. – ఎన్. అనంతలక్ష్మి -
మిస్ వరల్డ్ పోటీల్లో నీతా అంబానీకి హ్యుమానిటేరియన్ అవార్డు!
దాదాపు 28 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ 71వ మిస్ వరల్డ్ పోటీల్లో రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీని ప్రతిష్టాత్మక హ్యుమానిటేరియన్ అవార్డుతో సత్కరించారు. సామాజిక కార్యక్రమల పట్ల నీతాకు ఉన్న అచంచలమైన నిబద్ధత తోపాటు సమాజంపై సానుకూత ప్రభావం చూపేలా ఆమె చేసిన అవిశ్రాంత ప్రయత్నాలకు గానూ ఈ ప్రతిష్టాత్మక అవార్డుని అందుకుంది. నీతా చేసిన అశేష దాతృత్వ సేవలు, జాతీయ-అంతర్జాతీయ పరంగా ఆమెకు విశేషమైన కీర్తిని, గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్ సీఈవో జూలియా మోర్లీ చేతుల మీదుగా నీతా అంబానీ ఈ మిస్ వరల్డ్ ఫౌండేషన్ హ్యుమానిటేరియన్ అవార్డుని అందుకుంది. ఆమె ఒక గృహిణిగా, సక్సెఫుల్ బిజినెస్ విమెన్‌గా ఎన్నో విజయాలు సాధించింది. అలాగే దాతృత్వంలో కూడా ఆమెకి సాటి లేరెవ్వరూ అని నిరూపించింది. ఆమె నేటి యువతకు, భావితరాలను స్పూర్తిగా నిలిచింది. ఓ మహిళ ఇల్లాలిగా ఉంటూ ఎలాంటి విజయాలను అందుకోగలదు అనేందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. కాగా, మిస్ వరల్డ్–2024 పోటీల్లో కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ సుందర్ క్రిస్టినా పిజ్కోవా దక్కించుకున్నారు. రన్నరప్‌గా మిస్ లెబనాన్ యాస్మినా జెటౌన్ ఎంపికయ్యారు. ఇక భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన ముంబై వాసి ఫెమినా మిస్ ఇండియా సిని షెట్టి(22) అయిదో స్థానంతో సరిపెట్టుకున్నారు. (చదవండి: 'ఇల్లాలిగా, బిజినెస్ విమెన్‌గా సరిలేరామెకు;! దటీజ్ నీతా) -
Israel-Hamas war: గాజాకు సాయం పునరుద్ధరించండి
రఫా: గాజా స్ట్రిప్‌లోని పాలస్తీనియన్లకు అందించే మానవతా సాయాన్ని యథా ప్రకారం కొనసాగించాలని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనీ గుటెరస్ సంబంధిత దేశాలను కోరారు. లేని పక్షంలో 20 లక్షల మందికి పైగా శరణార్థులకు అందాల్సిన సాయం, పునరావాస కార్యక్రమాల్లో భారీగా కోత పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో ఇప్పటికే తీవ్ర మానవీయ సంక్షోభం నెలకొందని అన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు మెరుపుదాడికి దిగిన విషయం తెలిసిందే. పాలస్తీనా శరణార్థులకు సాయం, పునరావాసం కోసం పనిచేస్తున్న ఐరాస సిబ్బందిలో డజను మంది ఆ దాడిలో పాల్గొన్నట్లు ఆరోపణలు రావడంతో అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఇటలీ తదితర 8 దేశాలు సాయం నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. పాలస్తీనా శరణార్థులకు అందుతున్న సాయంలో ఈ దేశాల వాటా దాదాపు 60 శాతం వరకు ఉంటుంది. సాయం ఆగిపోతే పాలస్తీనా శరణార్థులకు అవసరమైన కనీస ఆహార నిల్వలు సైతం మరికొద్ది రోజుల్లోనే అడుగంటే ప్రమాదముందని భావిస్తున్నారు. హమాస్‌కు తోడ్పాటు అందించినట్లుగా భావిస్తున్న 12 మంది ఉద్యోగుల్లో ఇప్పటి వరకు 9 మందిని బాధ్యతల నుంచి తొలగించారు. ఒకరు చనిపోగా మరో ఇద్దరిని గుర్తించే పనిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. -
పాలస్తీనాకు భారత్ రెండోదఫా మానవతా సాయం
ఢిల్లీ: యుద్ధంతో అతలాకుతలం అవుతున్న పాలస్తీనాకు భారత్ రెండోసారి మానవతా సహాయాన్ని అందించింది. ఈజిప్టులోని ఎల్-అరిష్ ఎయిర్‌పోర్ట్‌కు 32 టన్నుల సాయంతో రెండో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సి17 విమానం బయలుదేరింది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి జైశంకర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. పాలస్తీనాకు కావాల్సిన అన్ని రకాల మానవతా సహయాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. భారతదేశం అక్టోబర్ 22న పాలస్తీనాకు వైద్య, విపత్తు సహాయాన్ని మొదటిసారి పంపించింది. గాజా స్ట్రిప్‌కు చేరుకోవడానికి చేరుకోవడానికి అల్-అరిష్ ఎయిర్‌పోర్టు అతి దగ్గరగా ఉంటుంది. ఇది రఫా బార్డర్ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో ప్రస్తుతం రఫా సరిహద్దు సమీపంలో పరిస్థితులు భీకరంగా తయారయ్యాయి. నిత్యం బాంబుల మోతతో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం అక్టోబర్ 7న ప్రారంభం అయింది. హమాస్ అంతమే ధ్యేయంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. రాకెట్ దాడుల అనంతరం భూతల యుద్ధం చేపట్టింది. హమాస్ మూకలను మట్టికరిపిస్తూ ఇప్పటికే ఉత్తర గాజాను ఆక్రమించింది. అటు దక్షిణ గాజాను కూడా ఖాలీ చేయాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు చేసింది. అటు అల్-షిఫా ఆస్పత్రిని రక్షణ కవచంగా హమాస్ మూకలు ఉపయోగించుకుంటున్నాయని ఆరోపిస్తూ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ సేనలు దాడులు చేస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ వైపు 1,200 మంది మరణించగా.. పాలస్తీనా వైపు 12,500 మంది మరణించారు. ఇందులో 5,000 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఇదీ చదవండి: దక్షిణ గాజాను వీడండి.. పాలస్తీనాకు ఇజ్రాయెల్ హెచ్చరికలు -
Israel-Hamas War: అదే గాజా.. అదే దీన గాథ!
దెయిర్ అల్ బలాహా/ఖాన్ యూనిస్ (గాజా): అదే కల్లోలం. అవే దారుణ దృశ్యాలు. అందరి కంటా నిస్సహాయంగా నీటి ధారలు. ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల ధాటికి గాజాలో మానవీయ సంక్షోభం తీవ్రతరమవుతోంది. ముఖ్యంగా ఆస్పత్రుల్లో ఎటు చూసినా మరణమృదంగం ప్రతిధ్వనిస్తోంది. గాజాలోని దాదాపు అన్ని ఆస్పత్రులనూ ఇజ్రాయెల్ సైన్యం చుట్టుముట్టి రోజుల తరబడి దిగ్బంధించడం తెలిసిందే. దాంతో కరెంటుతో పాటు కనీస సౌకర్యాలన్నీ దూరమై అవి నరకం చవిచూస్తున్నాయి. ఐసీయూలు, ఇంక్యుబేటర్లకు కూడా కరెంటు, ఆక్సిజన్ రోజులు దాటింది. వాటిల్లోని రోగులు, నవజాత శిశువులు నిస్సహాయంగా మృత్యువు కోసం ఎదురు చూస్తున్నారు! ఇప్పటిదాకా అరచేతులు అడ్డుపెట్టి అతి కష్టమ్మీద వారి ప్రాణాలు నిలుపుతూ వచ్చిన వైద్యులు కూడా క్రమంగా చేతులెత్తేస్తున్నారు. గాజాలో అతి పెద్దదైన అల్ షిఫాతో పాటు అన్ని ఆస్పత్రుల్లోనూ ఇదే దుస్థితి! షిఫా ఇంకెంతమాత్రమూ ఆస్పత్రిగా మిగల్లేదంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అదనోం గేబ్రెయేసస్ వాపోయారు. ‘‘ఈ దారుణంపై ప్రపంచం మౌనం వీడాల్సిన సమయమిది. కాల్పుల విరమణ తక్షణావసరం’’ అని పిలుపునిచ్చారు. చిన్నారులను కాపాడేందుకు... ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ నవజాత శిశువులను కాపాడుకునేందుకు అల్ షిఫా ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది శాయశక్తులా ప్రయత్నిస్తున్న తీరు కంటతడి పెట్టిస్తున్నాయి. ఆక్సిజన్ సరఫరా తదితరాలన్నీ నిలిచిపోవడంతో చిన్నారులను ఇంక్యుబేటర్ల నుంచి తీసుకెళ్లి సిల్వర్ ఫాయిల్ తదితరాల్లో చుట్టబెట్టిన మంచాలపై ఒక్కచోటే పడుకోబెడుతున్నారు. పక్కన వేడినీటిని ఉంచి శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంధన రగడ ఇంక్యుబేటర్లను నడిపి చిన్నారులను కాపాడేందుకు అల్ షిఫా ఆస్పత్రికి 300 లీటర్ల ఇంధనం అందజేస్తే హమాస్ ఉగ్రవాదులు అడ్డుకున్నారని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపించింది. కానీ అరగంటకు కూడా చాలని ఆ సాయంతో ఏం ప్రయోజనమని పాలస్తీనా ఆరోగ్య శాఖ మండిపడింది. ఇది క్రూర పరిహాసమంటూ దుయ్యబట్టింది. అల్ రంటిసి, అల్ నస్ర్ ఉత్తర గాజాలోని ఈ ఆస్పత్రుల నుంచి రోగులు తదితరులను హుటాహుటిన ఖాళీ చేయిస్తున్నారు. శుక్రవారానికే కొద్దిమంది రోగులు, వైద్య సిబ్బంది మినహా ఇవి దాదాపుగా ఖాళీ అయిపోయాయి. అయితే వాటిలో సాధారణ పౌరులు వందలాదిగా తలదాచుకుంటున్నారు. ఇజ్రాయెల్ సైన్యం వీటిని పూర్తిగా తమ అదుపులోకి తీసుకుని వారందరినీ అక్కడినుంచి పంపించేస్తోంది. అల్ స్వెయిదీ లోపల కొద్ది మంది రోగులు, వైద్య సిబ్బంది ఉన్నారు. 500 మందికి పైగా శరణార్థులు తలదాచుకుంటున్నారు. శనివారం నాటి రాకెట్ దాడి ఆస్పత్రిని దాదాపుగా నేలమట్టం చేసింది. ఆదివారం రాత్రికల్లా ఇజ్రాయెల్ సైనికులు ఆస్పత్రిలోకి ప్రవేశించారు. ఇంకా మిగిలిన ఉన్న వారందరినీ ఖాళీ చేయించి బుల్డోజర్లతో ఆస్పత్రిని నేలమట్టం చేయించారు. అల్ షిఫా 700 పడకలతో గాజాలోనే అతి పెద్ద ఆస్పత్రి. కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ సైన్యం పూర్తిస్థాయిలో చుట్టుముట్టింది. దాంతో వైద్య సేవలన్నీ నిలిచిపోయాయి. కరెంటు లేదు. ఇంధనం, ఆహార సరఫరాలు తదితరాలన్నీ నిండుకున్నాయి. ఇక్కడ తలదాచుకున్న శరణార్థుల్లో అత్యధికులు పారిపోయారు. ఇంకో 2,500 మందికి పైగా ఆస్పత్రిలో ఉన్నట్టు సమాచారం. కానీ 20 వేలకు పైగా అక్కడ చిక్కుబడ్డట్టు పాలస్తీనా ఆరోగ్య శాఖ చెబుతోంది. 600 మందికి పైగా రోగులు, 500 మంది దాకా వైద్యులు, సిబ్బంది ఉన్నారు. వందలాది శవాలు ఆస్పత్రి ప్రాంగణంలో పడున్నట్టు చెబుతున్నారు! ఆది, సోమవారాల్లోనే 35 మంది రోగులు, ఐదుగురు చిన్నారులు చనిపోయినట్టు పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 36 మంది చిన్నారులు ఏ క్షణమైనా తుది శ్వాస విడిచేలా ఉన్నట్టు వైద్య వర్గాలను ఉటంకిస్తూ పేర్కొంది. అల్ ఖుద్స్ గాజాలో రెండో అతి పెద్ద ఆస్పత్రి. 500 మందికి పైగా రోగులు, 15 వేలకు పైగా శరణార్థులున్నారు. వీరిలో అత్యధికులు మహిళలే. ఆదివారానికే ఆస్పత్రిలో సేవలన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. ఆహార నిల్వలన్నీ నిండుకున్నాయి. పరిసరాల్లోనే గాక ఆస్పత్రిపైకి కూడా భారీగా కాల్పులు జరుగుతున్నాయి. దాంతో ఇక్కడి ఐసీయూ వార్డు రోగులు ఒకట్రెండు రోజుల్లో నిస్సహాయంగా మృత్యువాత పడేలా ఉన్నారు! 6,000 మందికి పైగా శరణార్థులను ఇక్కణ్నుంచి దక్షిణాదికి పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అల్ అక్సా ఇక్కడ కూడా వందల సంఖ్యలో రోగులు, వైద్య సిబ్బంది, శరణార్థులున్నారు. రోగుల, ముఖ్యంగా 100 మందికి పైగా ఉన్న నవజాత శిశువుల సామూహిక మరణాలకు ఇంకెంతో సమయం పట్టదని సిబ్బంది చెబుతున్నారు. తూటాలు తరచూ ఆస్పత్రి లోనికి దూసుకొస్తున్నాయంటున్నారు. ఆస్పత్రిని సైన్యం చుట్టుముట్టింది. -
గాజా మానవతా సంధి తీర్మానానికి ఓటేయని భారత్
ఇజ్రాయెల్-హమాస్ వివాదంలో.. తక్షణ మానవతావాద సంధికి పిలుపునిచ్చిన తీర్మానంపై ఐక్యరాజ్య సమితిలో జరిగిన ఓటింగ్‌కు భారత్ గైర్హాజరయ్యింది. గాజాలో మానవతా దృక్పథంతో సంధి కుదర్చాలనే పలు ప్రతిపాదనలపై ఐరాస జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ జరిగింది. మొత్తం 193 సభ్యదేశాలున్న జనరల్ అసెంబ్లీలో ఓటింగ్‌లో మొత్తం 179 సభ్య దేశాలు పాల్గొన్నాయి. ఈ ప్రతిపాదనలకు అనుకూలంగా 120 దేశాలు ఓటు వేశాయి. 14 దేశాలు వ్యతిరేకించాయి. అయితే 45 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరు కాగా.. అందులో భారత్ కూడా ఉంది. ఐరాస జనరల్ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్ భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్, ఉక్రెయిన్, యూకే దూరంగా ఉన్నాయి. ‘‘పౌరుల రక్షణ, చట్టపరమైన & మానవతా బాధ్యతలను సమర్థించడం’’ పేరిట జోర్దాన్ ఈ తీర్మానం ప్రతిపాదించింది. బంగ్లాదేశ్, మాల్దీవ్స్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, రష్యా సహా 40 దేశాలు మద్దతు తీర్మానానికి ఇచ్చాయి. గాజా స్ట్రిప్‌లో నివసిస్తోన్న వారికి మానవత దృక్పథంతో సహాయం అందించడం, వారికోసం ప్రత్యేకంగా కారిడార్‌ను ఏర్పాటు చేయడం.. వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. అయితే.. ఈ అనూహ్య నిర్ణయానికి గల కారణాల్ని భారత్ వివరించింది. తీర్మానంలో ఎక్కడా హమాస్ గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంది. ఈ విషయంలో జోర్డాన్ తీరును తప్పు పట్టింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి స్పష్టమైన సందేశం పంపాల్సిన అవసరం ఉందని భారత్ తన నిర్ణయాన్ని వివరించింది. "ఈ అసెంబ్లీ చర్చలు ఉగ్రవాదం, హింసకు వ్యతిరేకంగా స్పష్టమైన సందేశాన్ని పంపుతాయని, దౌత్యం-చర్చల అవకాశాలను విస్తరింపజేస్తాయని మేము ఆశిస్తున్నాము" అని ఐక్యరాజ్యసమితిలో భారతదేశం యొక్క డిప్యూటీ శాశ్వత ప్రతినిధి యోజనా పటేల్ అన్నారు. ఓటింగ్‌కు దూరంగా ఉంటూనే కెనడా చేసిన సవరణలను భారత్ సమర్థించింది. ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడులు.. అనే వాక్యాన్ని ఈ ప్రతిపాదనల్లో చేర్చాలంటూ కెనడా సవరణలను సూచించగా.. భారత్ సమర్థించింది. ఈ సవరణలు చేయగలిగితే తాము ఓటింగ్‌లో పాల్గొంటామని యోజనా ముందుగానే తెలిపారు. కానీ, అది జరగలేదు. జోర్డాన్ రూపొందించిన తీర్మానంలో హమాస్ గురించి ప్రస్తావన లేకపోవడంపై అమెరికా సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. హమాస్, వారి చెరలో బందీలు.. అనే పదాలను జోర్డాన్ రూపొందించిన డ్రాఫ్ట్‌లో చేర్చాలనేది కెనడా డిమాండ్. కెనడా ప్రతిపాదించిన ఈ సవరణలను ఇందులో చేర్చడానికి ఓటింగ్ సైతం నిర్వహించింది ఐరాస. దీనికి అనుకూలంగా భారత్ సహా 87 దేశాలు ఓటు వేశాయి. అయితే.. మూడింట రెండొంతుల మెజారిటీ లేకపోవడంతో ఇది ఆమోదం పొందలేకపోయింది. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాల్లో మెరుపు దాడులకు దిగింది హమాస్. సరిహద్దులను దాటుకుని ఇజ్రాయెల్ భూభాగంపైకి చొచ్చుకుని వచ్చి.. పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంది. దీంతో సైన్యంతో ఎదురుదాడికి దిగిన ఇజ్రాయెల్.. ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్ చేపట్టింది. గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. వైమానిక దాడులతో నిప్పులు కురిపిస్తోంది. ఫలితంగా.. గాజా ఛిద్రమైపోయింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. ఇజ్రాయెల్- హమాస్ పరస్పర దాడుల్లో ఇప్పటికి 6,700 మందికి పైగా మరణించారు. అదే స్థాయిలో వేలాదిమంది గాయపడ్డారు. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. దాడులు తీవ్రతరమౌతోన్న కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. -
ఈజిప్ట్ గ్రీన్‌సిగ్నల్ .. గాజాకి అందనున్న మానవతా సాయం
గాజా ప్రాంతమంతా ఇజ్రాయెల్ దాడులతో ధ్వంసమైంది. వందల మంది ప్రాణాలు కోల్పోగా.. ఆవాసాలు కోల్పోయి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న వాళ్లు లక్షల్లోనే ఉన్నారు. ఆకలితో అలమటిస్తూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మానవతా సాయం అందించేందుకు ఈజిప్ట్ అంగీకరించింది. ఇజ్రాయెల్‌కి తాజా పర్యటనలో గాజాకి రూ. 832 కోట్ల సాయం ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. అయితే, ఈ సాయం గాజాలోకి ప్రవేశించాలంటే గాజా-ఈజిప్ట్ సరిహద్దులోని రఫా క్రాసింగ్ దాటాల్సి ఉంటుంది. ఇప్పటికే మానవతా సాయం కింద సామగ్రితో కూడిన వందలాది ట్రక్కులు రఫా సరిహద్దు వద్ద బారులుతీరి ఉన్నాయి. కానీ, భద్రతా కారణాలను చూపిస్తూ ఈజిప్ట్ ఈ మార్గాన్ని మూసివేసింది. గాజా ప్రజలు తమ దేశంలోకి ప్రవేశించి స్థిరపడే అవకాశముందని, అలాగే ఉగ్రవాదులు తమ దేశంలోకి చొరబడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో బైడెన్.. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసి Abdel Fattah El Sisi తో చర్చించి రఫా బార్డర్ క్రాసింగ్ తెరిపించేందుకు ఒప్పించారు. అయితే గాజాకు సాయం చేయడానికి మార్గం సుగమమైనప్పటికీ.. అది పరిమితంగానే ఉంటుందని ఈజిప్ట్ చెబుతోంది. పైగా హమాస్ దాడుల్లో రోడ్లు దెబ్బ తినడంతో.. వాటి పునరుద్ధరణకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అదే సమయంలో మరిన్ని దాడులు జరగవచ్చనే ఆందోళనను వ్యక్తం చేసింది. దీంతో శుక్రవారం నుంచి సాయం అందించేందుకు అనుమతిస్తామని ఈజిప్ట్ తెలిపింది. ఇదే విషయంపై జో బైడెన్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఈజిప్ట్ అధ్యక్షుడితో మాట్లాడాను. రఫా బార్డర్ తెరిచి మానవతా సాయం కింద ఇచ్చే సామగ్రితో కూడిన దాదాపు 20 ట్రక్కులను గాజాలోకి పంపించడానికి ఒప్పుకొన్నారు’’అని తెలిపారు. మరోవైపు అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్ ప్రకటన ప్రకారం.. ‘‘గాజాకు మానవతా సాయం చేయడం కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసితో చర్చలు జరిపారు. ఐక్యరాజ్యసమితి అభ్యర్థన మేరకు ఇరు దేశాలు గాజాకు సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. అమెరికా, ఈజిప్ట్ దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతానికి ఇరుదేశాల అధినేతలు కట్టుబడి ఉన్నారు’’ అని పేర్కొంది. క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి -
మణికేరళం
ఎక్కడి కేరళ? ఎక్కడి మణిపుర్? అయితే మానవత్వానికి భౌగోళిక సరిహద్దులతో పనిలేదు అని నిరూపించే విషయం ఇది. కేరళ కోచిలోని ఆర్సీపీ రెస్టారెంట్లో మణిపుర్‌కు చెందిన సుస్మిత పనిచేస్తుంది. సర్వీస్ స్టాఫ్‌లో ఒకరైన సుస్మిత ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది. మూడుసార్లు ‘బెస్ట్ ఎంప్లాయీ’గా అవార్డ్ కూడా అందుకుంది. అలాంటిది... ఓ రోజున సుస్మిత డల్‌గా ఉండడం చూసి ‘ఏమైంది?’ అని అడిగాడు జనరల్ మేనేజర్. తన రాష్ట్రం మణిపుర్లో జరుగుతున్న అల్లర్లు, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తల్లి, సోదరి గురించి ప్రస్తావిస్తూ ‘వారికేమైనా అవుతుందేమో’ అంటూ భయపడింది. విషయం తెలిసిన చెఫ్ పిళ్లై, అతని టీమ్ మణిపుర్ నుంచి ఆమె తల్లి, సోదరిలను రప్పించి కోచిలో బస ఏర్పాటు చేశారు. సుస్మిత తల్లి ఇబెంచదేవి, సోదరి సర్ఫిదేవిలకు ‘ఆర్సీపీ కోచి కిచెన్’లో ఉపాధి కల్పించారు. ఈ స్టోరీ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయింది. -
పాకిస్తాన్‌కి అమెరికా రూ. 200 కోట్ల మానవతా సాయం
ఇస్లామాబాద్: గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వరదలు సంభవించి పాకిస్తాన్ అల్లకల్లోలంగా మారిపోయింది. గతంలో ఎన్నడూ లేనంతగా పాకిస్తాన్లో ప్రకృతి విలయం సృష్టించింది. దీంతో వేలాదిమంది చనిపోయారు, లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం ప్రపంచ దేశాలను సాయం చేయాల్సిందిగా పిలుపునిచ్చింది. ఈ మేరకు అమెరికా పాకిస్తాన్‌కి సుమారు రూ. 200 కోట్ల మానవతా సాయాన్ని ప్రకటించింది. యునైటెడ్ స్టేట్స్ యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నెషనల్ డెవలప్మెంట్ ద్వారా పాకిస్తాన్‌లోని వరద బాధితుల కోసం అందిస్తున్నట్లు వెల్లడించింది. ఇది వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను ఆదుకోవడానికి, ప్రాణాలను రక్షించేందుకు ఈ మానవతా సాయాన్ని అందిస్తున్నట్లు ఇస్లామాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది (చదవండి: అఫ్గాన్ పైలెట్లకు శిక్షణ ఇస్తున్న యూఎస్...ఐ డోంట్ కేర్ అంటున్న రష్యా) -
జనం కోసం అమ్మ ఒడి డబ్బు ఖర్చు
వెదురుకుప్పం: తల్లిదండ్రుల కమిటీ మాజీ చైర్మన్ తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ప్రజోపకరమైన పనులు చేస్తోన్న ఆ సామాజిక కార్యకర్త ఈ సారి జగనన్న అమ్మ ఒడి డబ్బులతో శ్మశానానికి రోడ్డు వేసేందుకు సంకల్పించాడు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని బలిమొండివెంగనపల్లె గ్రామానికి చెందిన కొత్తపల్లె జాకబ్ కుమార్తె వర్షిత స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో 5 పూర్తి చేసింది. ఇదే పాఠశాలకు జాకబ్ చైర్మన్‌గా వ్యవహరించారు. వర్షితకు జగనన్న అమ్మ ఒడి పథకం కింద రూ.13 వేలు తల్లి సుకన్య ఖాతాలో జమ అయ్యింది. బలిజమొండివెంగనపల్లె దళితవాడ నుంచి శ్మశాన వాటికకు వెళ్లేందుకు దారి సక్రమంగా లేకపోవడాన్ని గుర్తించిన జాకబ్ తన భార్యకు వచ్చిన అమ్మ ఒడి సొమ్ముతో మంగళవారం జేసీబీ సాయంతో రహదారిని మరమ్మతు చేయించాడు. జాకబ్ మాట్లాడుతూ..చెప్పిన మాటకు కట్టుబడి పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. -
నాన్‌స్టాప్‌గా ప్రయాణించిన హెలికాప్టర్‌గా రికార్డు
న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన చినూక్ హెలికాప్టర్ నాన్‌స్టాప్‌గా ప్రయాణించి రికార్డు సృష్టించింది. ఈ హెలికాప్టర్ సోమవారం చండీగఢ్ నుంచి అస్సాంలోని జోర్హాట్ వరకు ఏడున్నర గంటలపాటు 1910 కి.మీ ప్రయాణించి సుదీర్ఘమైన నాన్ స్టాప్ హెలికాప్టర్ సోర్టీగా రికార్డు సృష్టించిందని రక్షణ అధికారులు తెలిపారు. చినూక్ హెలికాప్టర్ సామర్థ్యం తోపాటు వైమానికదళం కార్యాచరణ, ప్రణాళిక అమలుతోనే ఈ రికార్డు సాధ్యమైందని రక్షణ ప్రతినిధి పేర్కొన్నారు. ఇది యుద్ధరంగంలో బహువిధాలుగా సేవలందించనుందని తెలిపారు. ఈ హెలికాప్టర్ దళాలను, ఫిరంగులు, యుద్ధ సామాగ్రి, ఇంధనాన్ని రవాణ చేయడానికి ఉపయోగపడుతుందని వెల్లడించారు. మానవతా విపత్తు సహాయ కార్యకలాపాల్లో ముఖ్య భూమిక పోషించనుందని తెలిపారు. శరణార్థులను పెద్దఎత్తున తరలించడం వంటి మిషన్లలో కూడా ఉపయోగపడునుందని చెప్పారు. భారత వైమానిక దళం అవసరమైన మేరకు హెలికాప్టర్‌ను సముచితంగా మోహరించేందుకు వీలు కల్పిస్తుందని రక్షణ అధికారి తెలిపారు. అంతేకాదు దాని వేగవంతమైన మొబిలిటీ అవసరమైన విధంగా వినియోగించుకునే సౌలభ్యం కూడా ఉందని పేర్కొన్నారు. అయితే భారత్ 22 అపాచీ హెలికాప్టర్లు, 15 చినూక్స్ ఛాపర్లను అమెరికా నుండి కొనుగోలు చేసేందుకు 2015లో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. An @IAF_MCC Chinook undertook the longest non-stop helicopter sortie in India, flying from Chandigarh to Jorhat (Assam). The 1910 kms route was completed in 7 hrs 30 min and made possible by the capabilities of Chinook along with operational planning and execution by @IAF_MCC. pic.twitter.com/n2aSZ3tRp4 — PRO Defence Palam (@DefencePROPalam) April 11, 2022 (చదవండి: గాలిలో ప్రాణాలు) -
ఉక్రెయిన్‌కు భారీ సాయం... పెద్ద మనసు చాటుకున్న బిలియనీర్!
Japan Billionaire in a letter addressed to Ukraines President: జపనీస్ బిలియనీర్ ఇ-కామర్స్ దిగ్గజం రకుటెన్ వ్యవస్థాపకుడు హిరోషి మిక్కి మికిటాని ఉక్రెయిన్ ప్రభుత్వానికి రూ. 65 కోట్లు విరాళంగా అందిస్తానని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీకి రాసిన లేఖలో తెలిపారు. అంతేకాదు ఉక్రెయిన్‌లో హింసకు గురైన వ్యక్తులకు సహాయం చేయడానికి, మానవతా కార్యకలాపాల నిమిత్తం ఈ విరాళం అందజేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తన ఆలోచనలు అన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడి, ప్రజలు చుట్టూనే తిరుగుతున్నాయని కూడా లేఖలో రాశారు. "శాంతియుత ప్రజాస్వామ్య ఉక్రెయిన్ను అన్యాయమైన శక్తితో తొక్కడం ప్రజాస్వామ్యానికి సవాలు అని నేను నమ్ముతాను. రష్యా, ఉక్రెయిన్ ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోగలవని, ఉక్రెయిన్ ప్రజలు వీలైనంత త్వరగా శాంతిని పొందాలని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను" అని లేఖలో పేర్కొన్నారు. తాను 2019లో ఉక్రెయిన్ రాజధాని కైవ్‌ను సందర్శించి జెలెన్స్కీని కలిశానని కూడా మికిటాని చెప్పారు. రష్యా దండయాత్ర ప్రధాన ప్రజాస్వామ్య దేశాల నుంచి విస్తృత ఆర్థిక ఆంక్షలను ప్రేరేపించేలా చేసింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులు, సంస్థలు ఉక్రెయిన్‌కు సహాయం చేయడానికి విరాళాలను అభ్యర్థించాయి కూడా. జపాన్ ప్రభుత్వం మాస్కోపై ఆస్తులను స్తంభింపజేయడమే కాక రష్యన్ మిలిటరీకి సంబంధించిన సంస్థలకు సెమీకండక్టర్స్ వంటి కీలక ఎగుమతులను నిషేధించడంతో సహా పలు ఆంక్షలను ప్రకటించింది. (చదవండి: ఉక్రెయిన్ అధ్యక్షుడి నాటి డ్యాన్సింగ్ వీడియో!) -
అఫ్గాన్‌కు తక్షణ మానవతా సాయం
న్యూఢిల్లీ: అఫ్గాన్ ప్రజలకు తక్షణ మానవతాసాయం అందించాలని భారత్, ఐదు సెంట్రల్ ఆసియా దేశాలు నిర్ణయించాయి. అదేసమయంలో, అఫ్గాన్ గడ్డ ఉగ్రవాదులకు శిక్షణ, సాయం, ఆశ్రయాలకు అడ్డాగా మారనివ్వరా దని ఆదివారం న్యూఢిల్లీలోని జరిగిన మూడో భారత్–సెంట్రల్ ఆసియా సదస్సు పేర్కొంది. సదస్సులో భారత్ విదేశాంగ మంత్రి జై శంకర్‌తోపాటు కజఖ్‌స్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, తుర్కెమినిస్తాన్, ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మం త్రులు పాల్గొన్నారు. అఫ్గాన్‌లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించి, అక్కడి ప్రజలకు తక్షణ సాయం అందజేయడం కొనసాగించాలని తీర్మానించారు. ప్రాంతీయ అనుసంధానతకు చేపట్టే ప్రాజెక్టులు పారదర్శకతతో, విస్తృత భాగస్వామ్యం, స్థానిక ప్రాధాన్యతలు, ఆర్థి కస్థిరత్వం ప్రాతిపదికగా ఆయా దేశాల సార్వభౌమత్వానికి భంగం కలుగని రీతిలో ఉం డాలని అనంతరం వారు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. సెంట్రల్ ఆసియా దేశాలతో సంబంధాలను మరింత విస్తృతం చేసుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని మంత్రి జై శంకర్ చెప్పారు. -
తాలిబన్లకు చైనా మరింత మద్దతు, కీలక హామీ
కాబూల్: అఫ్గానిస్తాన్‌ను వశం చేసుకున్న తాలిబన్ల పట్ల మొదటినుంచీ సానుకూలంగా ఉన్న చైనా మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అఫ్గాన్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని తెరిచి ఉంచుతామని చైనా హామీ ఇచ్చిందని తాలిబన్లు తాజాగా ప్రకటించారు. అలాగే సంక్షోభంతో నష్టపోయిన అఫ్గాన్‌కు అందించే మానవతా సహాయాన్ని పెంచుతామని చైనా హామీ ఇచ్చినట్లు తాలిబాన్ ప్రతినిధి శుక్రవారం తెలిపారు. అయితే దీనిపై చైనా నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మేరకు దోహాలో తాలిబన్ల ప్రతినిది అబ్దుల్ సలాం హనాఫీ, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా డిప్యూటీ విదేశాంగ మంత్రి వు జియాంగావోతో ఫోన్ ద్వారా సంభాషించినట్టు సుహైల్ షాహీన్ ట్వీట్ చేశారు. కాబూల్‌లో తమ రాయబార కార్యాలయాన్ని నిర్వహించడం తోపాటు, గతంతో పోలిస్తే సంబంధాలు మరింత బలపడతాయని వు జియాంగావో తెలిపారన్నారు. అలాగే కోవిడ్-19 చికిత్సకు సంబంధించి తన సాయాన్ని పెంచనుందని అబ్దుల్ సలాం వెల్లడించారు. కాగా అఫ్గాన్‌లో 20 సంవత్సరాల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చిన తాలిబన్లతో తొలిసారిగా మద్దతు ప్రకటించింది చైనా మాత్రమే. ఆ తరువాత పాకిస్తాన్, రష్యా కూడా తాలిబన్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి. భద్రత క్షీణించడంతో తమ పౌరులను తరలిస్తున్నప్పటికీ కాబూల్‌లోని చైనా రాయబార కార్యాలయం పనిచేస్తోంది. ప్రస్తుత భద్రతా ఆందోళన దృష్ట్యా తక్షణమే కాకపోయినా, విస్తారమైన రాగి, లిథియం గనులపై చైనా కంపెనీలు కూడా దృష్టి పెట్టనున్నాని నిపుణులు చెబుతున్నారు. అలాగే తాలిబన్లు చైనాను పెట్టుబడి, ఆర్థిక మద్దతుకు కీలకమైన వనరుగా పరిగణించవచ్చని భావిస్తున్నారు. అఫ్గాన్‌లో శాంతి స్థాపన సయోధ్యతోపాటు, ఆ దేశ పునఃనిర్మాణంలో ఇప్పటికే చైనా ప్రకటించిన సహకారాన్ని స్వాగతించిన తాలిబన్లు అఫ్గాన్ అభివృద్దిలో చైనాదే కీలక పాత్ర అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 1/3 Abdul Salam Hanafi, Deputy Director, PO held a phone conversation with Wu Jianghao, Deputy Foreign Minister of the People’s Republic of China. Both sides discussed the ongoing situation of the country and future relations. The Chinese Deputy Foreign Minister said that — Suhail Shaheen. محمد سهیل شاهین (@suhailshaheen1) September 2, 2021 -
World Humanitarian Day: మానవత్వం కావాలి
‘మనుషులు అడ్డం పడి ఉంటే ఆమె బతికేదేమో’ అని పోలీసు అధికారులు అన్నారు. విజయవాడలో రమ్యపై కత్తిపోట్లు పడుతున్నప్పుడు మానవత్వం నిజంగా తెల్లముఖం వేసింది. ‘మనకెందులే’ అనేది నేటి మానవత్వమా? ‘ఎన్నని పట్టించుకుంటాం’ అనేది మానవత్వమా? ‘మనం బాగుంటే చాలు’ అనేది మానవత్వమా? ‘పొరుగువాడికి సాయపడవోయ్’ అన్నారు పెద్దలు. స్పందనాగుణం ఉన్న మనిషినే మానవుడంటారు. మనిషి స్థాయిలో ఉండిపోదామా... మానవులవుదామా... మనిషి బండబారితే ఆ సంఘం రాతిమయం అవదా? ఇది అందరికీ తెలిసిన పాత కథే. ఒక యోగ్యుడు నదిలో స్నానం చేస్తున్నాడు. ఉధృతి ఎక్కువగా ఉంది. నదిలో ఒక తేలు కొట్టుకొని వస్తూ ఉంది. యోగ్యుడు ఆ తేలును చూశాడు. దానిని అలాగే వదిలేస్తే అది చచ్చిపోతుంది. వొడ్డున పడేయాలని దోసిట్లోకి తీసుకున్నాడు. తేలు కుట్టింది. వదిలేశాడు. నీళ్లల్లో పడింది. మళ్లీ దోసిట్లోకి తీసుకున్నాడు. మళ్లీ కుట్టింది. నొప్పికి పడేశాడు. మళ్లీ తీసుకున్నాడు. మళ్లీ కుట్టింది. ఒడ్డున ఉన్న స్నేహితుడు ‘ఎందుకయ్యా... అది కుడుతూ ఉన్నా కాపాడాలని పాకులాడుతున్నావ్’ అంటాడు. దానికా యోగ్యుని జవాబు ‘అది తేలు. కుట్టడం దాని ధర్మం. నేను మనిషిని. కాపాడటం నా ధర్మం’ ఈ కథను నేటి మనిషికి మళ్లీ గుర్తు చేయాల్సి వస్తోంది. తల్లిదండ్రులు, పిల్లలు కూడా ఒకరికొకరు చెప్పుకోవాల్సి వస్తోంది. స్పందనా గుణం పాదుకొనాల్సింది ఇంట్లోనే కదా. ఆపై బడిలో అదొక మహోన్నత విలువగా నూరిపోయాలి. బాధలో ఉన్న పౌరుణ్ణి చూసి రాజ్యమే వదిలేశాడు బుద్ధుడు మనిషి గురించి ఆలోచన చేయాలని. బాధలో ఉన్న తోటి మనిషి కోసం వీరుడయ్యాడు స్పార్టకస్. బాధలో ఉన్న మనిషి కోసం జీవితాన్నే అర్పించింది మదర్ థెరిసా. కష్టం పంచుకోకపోతే మనిషి ఏం పంచుకుంటాడు. స్పందించకపోతే మనిషి మనిషిగా ఎలా ఉంటాడు. పురాణాల్లోనూ చరిత్రలోనూ మానవ స్పందన ‘సాయం’గానో లేదంటే ‘దానం’గానో ప్రస్తావనకు వచ్చింది. కర్ణుడు దగ్గరకు వచ్చినవాళ్లు ఒట్టి చేతులతో పోరు. కష్టంలో ఉన్న రాముడికి సాయం చేయబట్టే కదా వానర సేన ప్రతినిధి ఆంజనేయుడు నేడు పూజలందుకుంటున్నాడు. మనిషి కూడా దేవుణ్ణి కొలిచేది ఆపదలో ఉంటే ఆదుకొంటాడు. ఆపద్బాంధవుడే దేవుడు. ఆ పని వద్దా? కాని మనిషి తాను అందుకోలేని విలువను మనుగడలో ఉంచడానికి ఇష్టపడదు. నలుగురికి సాయం చేయాలనుకోవడం, నలుగురి కోసం పని చేయాలనుకోవడం, నలుగురి కోసం సొంత సొమ్మును ధారాదత్తం చేయాలనుకోవడం ‘బతకడం చేత కాని పని’గా, ‘అనుసరించడానికి వీల్లేని జీవితం’ గా ప్రచారం చేశాడు. ఉన్నతమైన సంఘసేవ అనే మాటను తిట్టు కింద మార్చాలనే వరకూ వెళ్లాడు. కాని సాటి మనిషికి సేవ, సాయం చేసే పనికి ఎన్నడూ మురికి అంటదు. ఆ పని గొప్పది. అందుకే అది మురికిని దాటి ఎప్పటికప్పుడు గొప్ప మనుషుల ద్వారా వెలుగుతూనే ఉంటుంది. మారాల్సిన యువతరం ‘బాగా చదువుకో. పెళ్లి చేసుకో. డబ్బు సంపాదించి సుఖపడు’ ఇదే ఇవాళ ఎక్కువగా యువతరానికి తల్లిదండ్రులు, సమాజం బోధిస్తున్నది. అట్టి వానికే విలువ. కాని రోడ్డున పడి తిరుగుతున్న పిచ్చివాళ్లను చేర దీయడమో, దీనులకు వైద్య సాయం అందేలా చూడటమో, నిరుపేదలకు వారికి అందాల్సిన పథకాలు అందేలా చూడటమో, బాధితులకు వారి హక్కులు దక్కేలా చేయడమో, విష వలయాలలో చిక్కుకున్న స్త్రీల కోసం పని చేయడమో... ఇవన్నీ ఇంకెవరో చేయాలి... మన పిల్లలు మాత్రం కాదు అనే వైఖరి ఇప్పటి సమాజానిది. బాగా చదువుకుని, స్థిరపడటం ఎవరూ వద్దనరు. కాని స్థిరపడ్డాక ఒక మానవ కర్తవ్యం ఉంటుంది. దానిని పాటించాలని ఎందుకు చెప్పరు? ఇవాళ లక్ష రూపాయలకు మించి జీతం తెచ్చుకుంటున్న ఉద్యోగులు ఎందరో ఉంటారు. వారిలో ఎందరు ఒక పేద విద్యార్థి చదువుకు సాయం చేస్తున్నారు? ఒక పేద రోగికి సాయం చేస్తున్నారు? గమనించుకోవాలి. ధార్మిక సాయం చేయడానికి ముందుకు వచ్చేవారు మానవ సాయం చేయడానికి రావడం లేదు. కాని ధర్మం కూడా మానవసేవే మాధవ సేవ అని కదా చెప్పింది. మనకెందుకు అందామా? రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుంది. మనకెందుకు... అని వెళ్లిపోవాలి. ఎవరో ఎవరినో పొడుస్తుంటారు. మనకెందుకు అని చోద్యం చూడాలి. పక్కింట్లో ఒక భర్త భార్యను దారుణంగా కొడుతుంటాడు. మనం మన డోర్ మూసుకోవాలి. ఎదురింట్లో చిన్న వయసు ఉన్న పనమ్మాయిని హింసిస్తుంటారు. మనం గట్టిగా కళ్లు మూసుకోవాలి. ఇదా మనం నేర్చుకోవాల్సింది. పిల్లలకు నేర్పాల్సింది. పూర్వం సత్రాలు కట్టిన మహానుభావులు, స్కూళ్లు కట్టిన దాతలు, ఆస్పత్రులకు ఆస్తులు ఇచ్చిన సహృదయలు... వీరందరి వల్ల కదా సమాజాలు ముందుకు పోయింది. సాయం, స్పందన ఉంటేనే సమాజం. లేకుంటే రాళ్ల కుప్ప. రోడ్డు దాటించడం కూడా... సినిమాల్లో హీరో అంధుల్ని రోడ్డు దాటించడమే పెద్ద గొప్పగా, వీధి బాలలకు ఐస్ కొనివ్వడమే మానవత్వంగా చూపించే స్థాయికి మానవత్వం పడిపోయింది. యుద్ధస్థలాలకు, భూకంపం ఏర్పడిన చోటుకు, వరదల సమయంలో, కరువు కాటకాలకు పరిగెత్తుకుపోవడం కదా అసలైన గొప్ప. ఆ సమయంలో స్పందించినవాడే అసలైన మనిషి. కాని అలాగని అలాంటి వారు లేరని కాదు. కరోనా కాలంలో బాధితులకు వందల, వేల మంది సాయం అందించడానికి ముందుకు వచ్చారు. వలస జీవులు రోడ్డున నడుస్తుంటే వారి కోసం ఆహార పొట్లాలు, నీళ్లు అందుకుని పరిగెత్తిన వారు ఉన్నారు. కొన్ని ప్రమాదాల్లో అద్భుతంగా స్పందించిన మనుషులు ఎందరో. కాని ఈ శాతం సరిపోదు. ప్రపంచ దేశాల ప్రజలంతా కలిసి ఒక్క మానవజాతి కాగలగాలి. సరిహద్దులకు, జాతులకు, దేశాలకు సంబంధం లేకుండా ఒకరి కష్టానికి ఒకరు బదులు పలకడమే లక్ష్యంగా ఎదగగలగాలి. ఇవాళ అఫ్ఘానిస్తాన్ మాకెవరూ లేరు అని రోదించే స్థితిలో ఈ ప్రపంచం ఉందంటే మానవత్వ సూచిలో అందరూ ఏ స్థానంలో ఉన్నట్టు..? సాయం అందుతుంది... సాయానికి సాటి మనిషి ఉన్నాడు అన్న భరోసా కన్నా గొప్పది లేదు. సాయం చేయాలనే తలంపు నాకు ఉంది... చేస్తాను అనుకోవడానికి మించిన ఆత్మ సంస్కారమూ మరొకటి లేదు. ఆ సంస్కారం కోసం నిబద్ధులు కావడమే నేటి ‘ప్రపంచ మానవత్వ దినోత్సవం’ సందర్భంగా అందరూ చేయవలసిన పని. -
మార్పునకు అడుగు ఇప్పడే పడాలి...!
మానవతా సేవారంగంలో అవసరమైన మార్పులతో పాటు, కీలక సంస్కరణలకు సమయం ఆసన్నమైంది. ఈ అంశంపైనే ప్రపంచవ్యాప్తంగా 81 దేశాలకు చెందిన 1,111 మంది మహిళలు గళమెత్తారు. అంతర్జాతీయస్థాయిలో సంక్షోభ పరిస్థితులు ఏర్పడిన ప్రాంతాల్లో నిర్వహిస్తున్న మానవతా సేవా కార్యక్రమాల్లో తీసుకురావాల్సిన మార్పులు నొక్కిచెప్పారు. ఈ రంగంలో తక్షణమే సంస్కరణలను చేపట్టాలంటూ ఐరాస, ఇతర అంతర్జాతీయ సేవాసంస్థలు, దాతలకు ఓ బహిరంగలేఖ రాశారు. ప్రపంచవ్యాప్తంగా సేవా, సహాయ కార్యక్రమాల్లో భాగ స్వాములైన ఈ మహిళలు ఈ రంగంలో తాము ఎదుర్కుంటున్న లైంగిక వేధింపుల అంశాన్ని ప్రాధాన్యత గల అంశంగా గుర్తించాలని డిమాండ్చేస్తున్నారు. సేవాసంస్థల్లో మహిళలపై జరుగుతున్న దుశ్చర్యలను వెలుగులోకి తీసుకొస్తున్న వారికి (ప్రజా వేగులకు) వెన్నుదన్నుగా నిలవాలని కోరుతున్నారు. ఈ రంగంలో వాస్తవంగా ఏమి జరుగుతున్నదనేది తమ ద్వారానే బయటకు వస్తున్నందున తమ గొంతులు తప్పక వినేందుకు ఈ లేఖ రాసినట్టు స్పష్టంచేశారు. సంస్థలపై విశ్వాసం సన్నగిల్లకుండా చూడాలి... వివిధ దేశాల్లో సేవారంగంలో పనిచేస్తున్న మహిళలు సైతం పీడన, లైంగిక వేధింపులు ఎదుర్కుంటున్న నేపథ్యంలో ఈ రంగంపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రోది గొల్పాల్సిన అవసరాన్ని ఈ మహిళలు పేర్కొన్నారు. అంకితభావం, చిత్తశుద్దితో ఎంతో మంది చేసిన మంచిపనులు, సేవకు చేటు తెచ్చేలా, మహిళలపై లైంగిక వేధింపులతో చెడ్డపేరు తెస్తు్తన్న వారిని బహిరంగంగా నిలదీయాల్సి ఉంది. ఇలాంటి వ్యక్తుల వ్యవహారశైలి కారణంగా ఈ రంగం ప్రతిష్ట మసకబారడంతో పాటు సేవలపై ప్రజల నమ్మకం సన్నగిల్లుతోంది. మాటల కంటే చేతలకు పనిచెప్పాలి. ఆరోపణలకు మౌనంగా నిలిచే ఇప్పటి సంస్కృతి పట్లే మా ఆందోళన. లైంగిక వేధింపు సమస్యపై మీడియా దృష్టి పక్కకు మళ్లగానే మహిళలపై బెదిరింపులు, దుర్భాషలు మళ్లీ మొదలవుతాయి. ఈ రంగంలో పటిష్టమైన నాయకత్వం, తప్పుడు పద్ధతులకు పాల్పడే వారిపై తీసుకునే చర్యల పట్ల నిబద్ధత నేటి అవసరం. లైంగిక వేధింపుల ఆరోపణలు బయటపడగానే ఆ వ్యక్తులు ఎంత పెద్ద పదవుల్లో ఉన్నా వారిని వెంటనే పక్కన పెట్టకపోతే ఇతర మహిళలు, అమ్మాయిలు అదే ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇటువంటి సమస్యలపై అత్యున్నతస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు కదలాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. # రిఫార్మ్ ఎయిడ్ # ఎయిడ్ టూ... ప్రపంచవ్యాప్తంగా వెలుగు చూసిన ‘మీ టూ’, ‘టైమ్ ఈజ్ అప్’ ఉద్యమాల స్ఫూర్తితో మానవతా సేవారంగంలో ‘రిఫార్మ్ ఎయిడ్ ఎయిడ్ టూ’...నినాదాలను వారు ముందుకు తీసుకొచ్చారు. సినీ, తదితర రంగాల్లో మహిళలు ఎదుర్కుంటున్న లైంగిక వేధింపులు ఈ ఉద్యమాల ద్వారా బయటకు వచ్చినా ఇంకా వెలుగు చూడాని ఉదంతాలు చాలా ఎక్కువని పేర్కొన్నారు. సేవారంగంలో పక్షపాత వైఖరితో కూడుకున్న పితృస్వామ్యభావజాలంలో ప్రాథమికంగా మూడు సంస్కరణలు తీసుకురావాలని సూచించారు. పురుషుల వే«ధింపులకు గురైన మహిళలు చేసే ఫిర్యాదులను విశ్వసించి సంస్థాపరంగా వెంటనే చర్యలు చేపట్టాలి. ఈ దిశలో చేసే ఆరోపణలకు ప్రాధాన్యతనిచ్చి వెంటనే విచారణ జరపాలి. సేవాసంస్థల్లోని అనైతిక కార్యకలాపాలు, అక్రమాలు వెలుగులోకి తెచ్చే వారికి రక్షణ కల్పించడంతో పాటు వారు చెప్పేది శ్రద్ధగా వినాలి. నూతన విధానాలు రూపొందించి, ఉల్లంఘనకు పాల్పడే వారిపై చర్యలకు చిత్తశుద్ధితో వ్యవహరించాలి అని ఈ లేఖలో పేర్కొన్నారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
తెల్లరేగడిలో మొలకెత్తిన నల్ల పిడుగు
‘ఏదో ఒక రోజు నా నలుగురు పిల్లలూ.. వారి వర్ణాన్ని బట్టి కాకుండా, వారి వ్యక్తిత్వాన్ని బట్టి గుర్తించే దేశంలో నివసిస్తారని నాకో కల ఉంది’ రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ (జూనియర్) చరిత్రాత్మక మహోపన్యాసం‘ నాకో కల ఉంది(ఐ హేవ్ ఎ డ్రీమ్)’ (ఆగస్టు 28, 1963)లోని వాక్యమిది. ఈ ప్రసంగం అమెరికా నల్లజాతి చరిత్రను మలుపుతిప్పింది. అమెరికా ఈ రోజు అగ్రరాజ్యం అయి ఉండవచ్చు. కానీ దాని చరిత్ర అంత ఘనమైనది కాదు. 20 శతాబ్దం మధ్యవరకూ కూడా అక్కడ తీవ్ర వ ర్ణ వివక్ష ఉండేది. బస్సులో సీట్లు, స్కూల్లో బెంచ్‌లు ఆఖరికి హోటల్లో కాఫీ గ్లాసులు కూడా నల్లవారికి వేరుగా ఉండేవి. ఇలాంటి వివక్షతలకు వ్యతిరేకంగా ఉద్యమించిన వారు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. మార్టిన్ 1929 జనవరి 15న అట్లాంటాలోని క్రైస్తవ చర్చి బోధకుడి కుటుంబంలో జన్మించారు. తండ్రి పేరు కూడా అదే కావడంతో మార్టిన్ జూనియర్ అయ్యారు. మార్టిన్ బాల్యంలోనే వర్ణవివక్షకు గురయ్యారు. తెల్లవారితో ఆడుకోకూడదని, తగిన మార్కులున్నా కోరుకున్న విద్యాలయంలో చేరేందుకు అర్హత లేకుండా చట్టం చేశారని అర్థం చేసుకున్నారు. ఇక బస్సులో కూడా నల్లవారికి వేరే సీట్లు. తెల్లవారి సీట్లు ఖాళీగా ఉంటే కూర్చోవచ్చు. కానీ వారు రాగానే లేచి ఆ సీటు ఇవ్వాలి. అలా ఇవ్వనందుకు బస్సులో నుంచి మార్టిన్‌ను గెంటివేశారు. సరిగ్గా దక్షిణాఫ్రికాలో మహాత్మాగాంధీకి జరిగిన అవమానం లాంటిదే. అప్పటి నుంచి మహాత్మాగాంధీ గురించి చదివారు. మహాత్ముని అహింసా మార్గమే సరైన దారని నిర్ణయించుకున్నారు. చర్చిలో బోధకుడిగా పనిచేస్తూనే తన వాగ్ధాటితో నీగ్రోలకు నాయకుడయ్యారు. తను పిలుపునిస్తే నల్లజాతి మొత్తం కదలి వచ్చే స్థాయికి ఎదిగారు. బస్సులో వర్ణవివక్షతకు వ్యతిరేకంగా బస్సులను బహిష్కరింపజేసి చివరకు ఆ వివక్షత తప్పు అని సుప్రీంకోర్టు చేతే తీర్పు ఇప్పించగలిగారు. మార్టిన్ అసలు పేరు మైఖేల్. తండ్రి బాప్టిస్ట్ మినిస్టర్. మినిస్టర్ అంటే మంత్రి కాదు. మత బోధకుడు. తల్లి ఉపాధ్యాయిని. వివాహం మార్టిన్ 1955లో డాక్టరేట్ సంపాదించడానికి ముందు, బోస్టన్‌లో పీహెచ్డీ చేస్తున్నప్పుడు పరిచయమైన కొరెట్టా స్కాట్‌ను 1953లో వివాహం చేసుకున్నారు. 1954లో మాంట్‌గోమరీ(అలబామా)లోని డెక్స్టర్ అవెన్యూ బాప్టిస్టు చర్చికి పాస్టర్‌గా నియమితులయ్యారు. ఈ సమయంలోనే బస్సులలో వివక్షతకు నిరసనగా ఆఫ్రికన్ అమెరికన్లు బస్సులను బహిష్కరించే ఉద్యమానికి నాయకత్వం వహించడంతో మార్టిన్ పేరు తొలిసారి అమెరికాలో మారుమోగింది. ఐ హేవ్ ఎ డ్రీమ్ 1963లో జాతి వివక్షతకు వ్యతిరేకంగా మార్టిన్ నాయకత్వంలో బర్మింగ్ హామ్, అలబామాలలో చెలరేగిన ఉద్యమాన్ని తెల్లవారు అతి పాశవికంగా బాంబులతో అణచివేశారు. నిరసనలకు వ్యతిరేకంగా జారి అయిన ఆదేశాలను ఖాతరు చేయకపోవడంతో ఆయనను బర్మింగ్‌హామ్ జైల్లో వేశారు. జైలు నుంచి విడుదలయ్యాక ‘చిల్డ్రన్ క్రూసేడ్’ మొదలైంది. మార్టిన్ ప్రోద్బలంతో వేలాది మంది విద్యార్థులు బర్మింగ్‌హామ్ అంతటా కవాతు చేస్తూ నిరసన గళం విప్పారు. దీంతో పోలీసులు విద్యార్థులపై లాఠీలను ఝళిపించారు. ఈ దృశ్యాలను టీవీలలో చూసి ఆగ్రహం చెందిన అమెరికన్లు మార్టిన్‌కు మద్దతు తెలిపారు. ఈ విజయం ఇచ్చిన తీర్పుతోనే మార్టిన్ ‘ఐ హేవ్ ఎ డ్రీమ్’ ప్రసంగాన్ని ఇవ్వగలిగారు. తలొగ్గిన ప్రభుత్వం మార్టిన్ లూథర్ కింగ్ ఉద్యమానికి తలవంచి 1964లో ఫెడరల్ ప్రభుత్వం ‘సివిల్ రైట్స్’ చట్టాన్ని తీసుకువచ్చింది. అలాగే 1965లో అమెరికా ప్రభుత్వం ‘ఓటింగ్ రైట్స్’ చట్టాన్ని కూడా తెచ్చింది. సమాన హక్కుల కోసం చేసిన కృషికి గుర్తింపుగా 1964లో 34వ ఏట మార్టిన్ లూథర్ కింగ్ నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. 1967 డిసెంబర్లో మార్టిన్ ‘ పూర్ పీపుల్ క్యాంపెయిన్’ ప్రారంభించారు. పారిశుధ్య కార్మికులకు మద్దతుగా మార్చింగ్‌కు ఏర్పాట్లు చేయడం కోసం 1968 ఏప్రిల్ నెలలో టెన్నెస్సీ రాష్ట్రంలోని మెంఫీస్ చేరుకున్నారు. మరునాడు తను బస చేసిన హోటల్ బాల్కనీలో ఉండగా ఆయనపై దాడి జరిగింది. తుపాకీ గుళ్లకు మార్టిన్ నేలకు ఒరిగారు. -
తారలు దిగివచ్చిన వేళ...
(సాక్షి వెబ్ ప్రత్యేకం) వాళ్లంతా ఆకాశంలో ఉండే తారల కంటే ఏమాత్రం తక్కువ కారు. తమ అభిమానుల గుండెల్లో గూడు కట్టుకుని ఉంటారు. కోట్లల్లో సంపాదన.. పెద్ద పెద్ద పడవల్లాంటి కార్లలోనే తిరగడం.. ఐదు నక్షత్రాల జీవితం. ఇదీ సినీ తారల పరిస్థితి. కానీ.. అలాంటి తారలు ఆకాశం నుంచి కిందకు దిగి వస్తున్నారు. తమను ఎంతగానో అభిమానించే సామాన్యుల కోసం తామే నేరుగా నడిచి వెళ్తున్నారు. ఆపదలో ఉన్నవాళ్లను తాము స్వయంగా ఆదుకోలేకపోయినా.. తమను చూడటమే వాళ్లకు కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని తెలుసుకుని, తీరిక చేసుకుని మరీ వెళ్తున్నారు. తమను ఎంతగానో అభిమానించి.. ఇంతవాళ్లను చేసిన వాళ్ల కోసం ఎంతోకొంత చేయాలన్న ఉద్దేశంతో మంచి పనులు మొదలు పెడుతున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన శ్రీనిధి అనే చిన్నారి కేన్సర్ వ్యాధితో బాధపడుతోంది. ఆమె ఇక బతకడం కూడా కష్టమని వైద్యులు చెప్పేశారు. ఆమెకు హీరో ఎన్టీఆర్ అంటే వల్లమాలిన అభిమానం. అతడు నటించిన 'యమదొంగ' సినిమా చాలా చాలా నచ్చింది. ఆమె అనారోగ్యం విషయం తెలిసిన ఎన్టీఆర్.. స్వయంగా ఆస్పత్రికి వెళ్లాడు. పెద్ద టెడ్డీ బేర్ ఆమెకు బహుమతిగా ఇచ్చాడు. బోలెడన్ని చాక్లెట్లను గిఫ్టు బాక్సులో ప్యాక్ చేయించి ఇచ్చి, ఆమె పక్కనే కూర్చుని మాట్లాడాడు. ఆ చిన్నారి శ్రీనిధికి ఎక్కడలేని ఆనందం. కొన్నాళ్ల క్రితం ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీజ అనే అమ్మాయి కూడా తీవ్ర అనారోగ్యంతో బాధపడింది. ఆమెకు పవన్ కల్యాణ్ అంటే ఎనలేని ఇష్టం. విషయం తెలిసిన పవర్ స్టార్.. తానే స్వయంగా ఖమ్మం ఆస్పత్రికి వెళ్లారు. కానీ ఆ సమయానికి ఆమె మాట్లాడే పరిస్థితిలో లేదు. కొన్నాళ్ల తర్వాత కోలుకున్న ఆమెను ఆమె తండ్రి పవన్ వద్దకు తీసుకొచ్చారు. అప్పుడు ఆమె కళ్లలో ఎనలేని సంతోషం. హీరోయిన్ సమంత మహిళలు, అమ్మాయిల కోసం 'ప్రత్యూష ఫౌండేషన్' పేరుతో ఓ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని పెద్ద పెద్ద ఆస్పత్రులు అన్నింటితోను ఈ ఫౌండేషన్ ఒప్పందాలు కుదుర్చుకుంది. అక్కడ చికిత్స చేయించుకోడానికి వచ్చి, ఆర్థిక పరిస్థితి అనుకూలించని నిరుపేదలు ఎవరైనా ఉంటే.. ఆ సమాచారాన్ని సదరు ఆస్పత్రి వర్గాలు ప్రత్యూష ఫౌండేషన్‌కు పంపుతాయి. అవకాశం మేరకు వాళ్లకు ఫౌండేషన్ నుంచి సాయం అందుతుంది. ఇందుకోసం తాను వివిధ సినిమాల్లో ధరించిన దుస్తులు, నగలతో పాటు సహ నటులు ధరించిన దుస్తులను కూడా సమంత ఆన్లైన్లో వేలానికి పెడుతోంది. గబ్బర్‌సింగ్ సినిమాలో పవన్ కల్యాణ్ వేసుకున్న పోలీసు యూనిఫాం, దూకుడు సినిమాలో మహేష్‌బాబు ఓ పాటలో ధరించిన ఎర్ర పువ్వుల చొక్కా లాంటివి ఈ వేలంలో ఉన్నాయి. వాటి ద్వారా వచ్చిన సొమ్మును కూడా ఆమె ఇలా చికిత్సల కోసం వెచ్చిస్తోంది. అభిమానులు టికెట్లు కొన్న డబ్బులతో సకల సౌకర్యాలు అనుభవించే తారలు.. ఆ అభిమానుల కోసం తాము కిందకు దిగివచ్చి స్వయంగా వెళ్లి పలకరించడంతో పాటు వీలైనంత మేర ఆర్థిక సాయం కూడా అందించడం ప్రశంసనీయం. -పి.ఆర్.ఆర్. కామేశ్వరరావు -
రక్తదానం మానవత్వానికి దర్పణం
*అడిషనల్ ఎస్పీ మల్లారెడ్డి మహబూబ్‌నగర్ క ల్చరల్ : రక్తదానం చేయడం మానవత్వానికి దర్పణమని, ఆపదల్లో ఉన్నవారి ప్రాణాలను కాపాడుతుందని జిల్లా పోలీస్ అడిషనల్ ఎస్పీ మల్లారెడ్డి అన్నారు. విశ్వహిందూ పరిషత్ స్వర్ణ జయంతి ఉత్సవాల్లో భాగంగా వీహెచ్‌పీ జిల్లా శాఖ, భజరంగ్‌దళ్‌ల ఆధ్వర్యంలో ఆది వారం స్థానిక రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో మెగా రక్తదా న శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆ యన శిబిరంలో పాల్గొన్న వారికి అభినందించారు. రక్తదానానికి ఇతర రకాల దాన,ధర్మాలు సరితూగవని, రాజుల కా లంలో యుద్ధాల్లో పాల్గొనే వారికి రక్తాన్ని వీర తిలకంగా దిద్ది కదన కార్యోన్ముఖుల్సి చేసే వారని గుర్తు చేశారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ రాజారాం మాట్లాడుతూ జిల్లాలో జాతీయ రహదారి ఉన్నందున తరుచుగా రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, అందుకే రక్తం ఆవశ్యకత ఏర్పడుతున్నదన్నారు. ప్రతి మూడు నెలలకోసా రి మానవ శరీరంలోని రక్త కణాలు మృతి చెందుతాయని, వాటిని వృథా చేయకుండా 18 ఏళ్ళు పైబడిన యువకులు, విద్యార్థులు రక్తాన్ని దానం చేసే అలవాటు చేసుకోవాలని సూచించారు. యువకులు మద్యపానం తదితర దురలవాట్లకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించడానికి ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు మద్ది యాదగిరి రెడ్డి, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ మద్ది అనంతరెడ్డి, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌ల నాయకులు డి.బుచ్చారెడ్డి, పటోళ్ల లక్ష్మారెడ్డి, సంగ విశ్వనాథ, కొత్త హన్మంతు, అద్దని నరేంద్ర, నలిగేశి లక్ష్మీనారాయణ,విఘ్నేష్, డి.లక్ష్మీనారాయణ, సురేశ్, కుపేందర్, మయూర,బుడ్డ శ్రీను పాల్గొన్నారు. -
ఆదర్శ సమాజం నిర్మించాలి..
నాందేవ్‌వాడ,న్యూస్‌లైన్ :సమాజంలో రోజు రోజుకు తగ్గిపోతున్న మానవతా విలువలను పెంపొందించేందుకు, ఆదర్శ సమాజంగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులు కృషి చేయాలని తెలంగాణ యూనివర్శిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లింబా ద్రి కోరారు. సోమవారం రాజీవ్‌గాంధీ ఆడిటోరియం లో ఎస్ఎస్ఆర్ కళాశాలలో విద్యార్థులు ఏర్పాటు చేసిన ‘ సహాయ స్వచ్ఛంద సంస్థ’ కార్యక్రమంలో భా గంగా మదర్‌థెరిసా జయంతి నిర్వహించారు. ఈ సం దర్భంగా పలువురు పేద, అనాథ పిల్లలకు వివిధ వస్తువులు, దుస్తులను ఉచితంగా అందజేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన తెయూ రిజిస్ట్రార్ లింబాద్రి మాట్లాడుతూ పేద, అనాథ పిల్లలను ఆదుకునేందుకు కళాశాల విద్యార్థులు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సేవ, సహాయ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మదర్‌థెరిసా ఆశయాలకు అనుగుణం గా నడుచుకోవాలన్నారు. సమాజం అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడాని కి ప్రతి విద్యార్థి ముందడుగు వేయాలని అన్నారు. ఇతర విద్యార్థులను కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొ నే విధంగా చేయాలన్నారు. అనంతరం ఆర్ఐఓ విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముందుకు రావడం చాలా బాగుందన్నారు. సమాజంలో విద్యార్థులు సేవా కార్యక్రమాలు చేపడితే ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. ప్రతి రోజు విద్యార్థులు దుబారా ఖర్చుపెడతారని, వాటిలో నుంచి ఒక్కరూపాయి సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయమన్నారు. ఒక్క రూపాయే కదా అని అనుకోవద్దని, వెయ్యిమంది విద్యార్థులు కలిస్తే కొన్ని వేల రూపాయలు అవుతాయని, అవి ఇలాంటి సేవా కార్యక్రమాలకు ఎంతో తోడ్పడుతాయన్నారు. అనంతరం డిచ్పల్లికి చెందిన అనాథ పిల్లలు అవినాష్, విజయ్లక దుస్తులు, నిజామాబాద్ మండలం సిర్పూర్ గ్రామానికి చెందిన నర్సయ్యకు కృత్రిమకాలు, నందిపేట మండలానికి చెందిన నిఖితకు దుస్తులు, గాయత్రికి ఫిజియోథెరఫి కిట్, నిఖిత్‌కు నెక్బెల్టులు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ సాంబశివరావు, కేర్ డిగ్రీ కళాశాల డెరైక్టర్ నరాల సుధాకర్, రెడ్‌క్రాస్ కార్యదర్శి రామకృష్ణాబుద్దిస్ట్, లక్ష్మణగౌడ్, విద్యార్థులు పాల్గొన్నారు.