గాజా ప్రాంతమంతా ఇజ్రాయెల్ దాడులతో ధ్వంసమైంది. వందల మంది ప్రాణాలు కోల్పోగా.. ఆవాసాలు కోల్పోయి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న వాళ్లు లక్షల్లోనే ఉన్నారు. ఆకలితో అలమటిస్తూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మానవతా సాయం అందించేందుకు ఈజిప్ట్ అంగీకరించింది.
ఇజ్రాయెల్‌కి తాజా పర్యటనలో గాజాకి రూ. 832 కోట్ల సాయం ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. అయితే, ఈ సాయం గాజాలోకి ప్రవేశించాలంటే గాజా-ఈజిప్ట్ సరిహద్దులోని రఫా క్రాసింగ్ దాటాల్సి ఉంటుంది. ఇప్పటికే మానవతా సాయం కింద సామగ్రితో కూడిన వందలాది ట్రక్కులు రఫా సరిహద్దు వద్ద బారులుతీరి ఉన్నాయి. కానీ, భద్రతా కారణాలను చూపిస్తూ ఈజిప్ట్ ఈ మార్గాన్ని మూసివేసింది.
గాజా ప్రజలు తమ దేశంలోకి ప్రవేశించి స్థిరపడే అవకాశముందని, అలాగే ఉగ్రవాదులు తమ దేశంలోకి చొరబడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో బైడెన్.. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసి Abdel Fattah El Sisi తో చర్చించి రఫా బార్డర్ క్రాసింగ్ తెరిపించేందుకు ఒప్పించారు. అయితే గాజాకు సాయం చేయడానికి మార్గం సుగమమైనప్పటికీ.. అది పరిమితంగానే ఉంటుందని ఈజిప్ట్ చెబుతోంది. పైగా హమాస్ దాడుల్లో రోడ్లు దెబ్బ తినడంతో.. వాటి పునరుద్ధరణకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అదే సమయంలో మరిన్ని దాడులు జరగవచ్చనే ఆందోళనను వ్యక్తం చేసింది. దీంతో శుక్రవారం నుంచి సాయం అందించేందుకు అనుమతిస్తామని ఈజిప్ట్ తెలిపింది.
ఇదే విషయంపై జో బైడెన్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఈజిప్ట్ అధ్యక్షుడితో మాట్లాడాను. రఫా బార్డర్ తెరిచి మానవతా సాయం కింద ఇచ్చే సామగ్రితో కూడిన దాదాపు 20 ట్రక్కులను గాజాలోకి పంపించడానికి ఒప్పుకొన్నారు’’అని తెలిపారు. మరోవైపు అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్ ప్రకటన ప్రకారం.. ‘‘గాజాకు మానవతా సాయం చేయడం కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసితో చర్చలు జరిపారు. ఐక్యరాజ్యసమితి అభ్యర్థన మేరకు ఇరు దేశాలు గాజాకు సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. అమెరికా, ఈజిప్ట్ దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతానికి ఇరుదేశాల అధినేతలు కట్టుబడి ఉన్నారు’’ అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment