ఢిల్లీ: యుద్ధంతో అతలాకుతలం అవుతున్న పాలస్తీనాకు భారత్ రెండోసారి మానవతా సహాయాన్ని అందించింది. ఈజిప్టులోని ఎల్-అరిష్ ఎయిర్‌పోర్ట్‌కు 32 టన్నుల సాయంతో రెండో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సి17 విమానం బయలుదేరింది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి జైశంకర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. పాలస్తీనాకు కావాల్సిన అన్ని రకాల మానవతా సహయాన్ని అందిస్తామని స్పష్టం చేశారు.
భారతదేశం అక్టోబర్ 22న పాలస్తీనాకు వైద్య, విపత్తు సహాయాన్ని మొదటిసారి పంపించింది. గాజా స్ట్రిప్‌కు చేరుకోవడానికి చేరుకోవడానికి అల్-అరిష్ ఎయిర్‌పోర్టు అతి దగ్గరగా ఉంటుంది. ఇది రఫా బార్డర్ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో ప్రస్తుతం రఫా సరిహద్దు సమీపంలో పరిస్థితులు భీకరంగా తయారయ్యాయి. నిత్యం బాంబుల మోతతో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం అక్టోబర్ 7న ప్రారంభం అయింది. హమాస్ అంతమే ధ్యేయంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. రాకెట్ దాడుల అనంతరం భూతల యుద్ధం చేపట్టింది. హమాస్ మూకలను మట్టికరిపిస్తూ ఇప్పటికే ఉత్తర గాజాను ఆక్రమించింది. అటు దక్షిణ గాజాను కూడా ఖాలీ చేయాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు చేసింది. అటు అల్-షిఫా ఆస్పత్రిని రక్షణ కవచంగా హమాస్ మూకలు ఉపయోగించుకుంటున్నాయని ఆరోపిస్తూ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ సేనలు దాడులు చేస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ వైపు 1,200 మంది మరణించగా.. పాలస్తీనా వైపు 12,500 మంది మరణించారు. ఇందులో 5,000 మంది చిన్నారులు కూడా ఉన్నారు.
ఇదీ చదవండి: దక్షిణ గాజాను వీడండి.. పాలస్తీనాకు ఇజ్రాయెల్ హెచ్చరికలు
Comments
Please login to add a commentAdd a comment