పాలస్తీనా మిలిటెంట్లు హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గాజాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హమాస్ ఉగ్రవాదులను అంతు చూడడంతోపాటు వారి స్థావరాలను నేలమట్టం చేయడమే లక్ష్యంగా భూతల దాడులకు ఇజ్రాయెల్ సైన్యం సన్నద్ధమవుతోంది. సరిహద్దుల్లో 3 లక్షలకు పైగా సైనికులను, భారీ సంఖ్యలో యుద్ధ ట్యాంకులను మోహరించింది.
హమాస్, ఇజ్రాయెల్ భీకర పోరు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. యుద్ధ ప్రభావిత ప్రాంతమైన ఇజ్రాయెల్‌లో జో బైడెన్ బుధవారం పర్యటించనున్నారు. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వెల్లడించారు. గాజాకు మానవతా సాయంపై ప్రధాని నెతన్యాహుతో చర్చలు జరుపుతారని వెల్లడించారు. గాజాకు సాయం అందించేందుకు ఓ ప్రణాళికను రూపొదించేందుకు ఇజ్రాయెల్, అమెరికా మధ్య అంగీకారం కుదిరినట్లు ఆయన పేర్కొన్నారు.
అరబ్ దేశాల పర్యటన ముగించుకొని సోమవారం ఇజ్రాయెల్‌కు బ్లింకెన్ తిరిగి వచ్చారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతోపాటు అధికారులతో దాదాపు ఎనిమిది గంటలపాటు సమవేశామయ్యారు. తాజా పరిణామాలపై చర్చలు జరిపారు. అనంతరం బ్లింకెన్ మాట్లాడుతూ జో బైడెన్ పర్యటన విషయాన్ని వెల్లడించారు. హమాస్‌తోపాటు ఇతర ఉగ్రవాదుల నుంచి తమ ప్రజలను రక్షించుకోవడం, భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా నిరోధించే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని తెలిపారు.
ఇజ్రాయెల్‌లో పర్యటించే విషయాన్ని బైడెన్ స్వయంగా ఎక్స్(ట్విటర్)లో వెల్లడించారు. హమాస్ ఉగ్రవాదుల క్రూరమైన దాడిని ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్‌కు సంఘీభావం తెలిపేందుకు బుధవారం ఇజ్రాయెల్‌కు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత మనవతా సాయం అందించే విషయంపై జోర్దాన్‌కు వెళ్లనున్నట్లు చెప్పారు. అక్కడి నాయకులను కలిసి పాలస్తీనియన్ల స్వయం నిర్ణయాధికారం కోసం హమాస్ నిలబడదనే విషయాన్ని స్పష్టం చేయనున్నట్లు తెలిపారు.
On Wednesday, I'll travel to Israel to stand in solidarity in the face of Hamas's brutal terrorist attack.
— President Biden (@POTUS) October 17, 2023
I'll then travel to Jordan to address dire humanitarian needs, meet with leaders, and make clear that Hamas does not stand for Palestinians' right to self-determination.
తమ ప్రజలను రక్షించడానికి ఇజ్రాయెల్‌కు అవసరమైన విషయాలపై బైడెన్ వెళ్లి చర్చిస్తారని.. వాటిని తీర్చేందుకు తాము పనిచేస్తూనే ఉంటామని బ్లింకెన్ పేర్కొన్నారు. హమాస్ ఆధిపత్యంలోని గాజా భూభాగంపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. గాజా స్ట్రిప్‌కు విదేశీ సహాయాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేయడంపై యునైటెడ్ స్టేట్స్‌కు ఇజ్రాయెల్ హామీ ఇచ్చిందని తెలిపారు. గాజాలోని పౌరులకు మానవతా సహాయం అందించే విధంగా తన కార్యకలాపాలను నిర్వహించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం మంగళవారం పదకొండవ రోజుకు చేరుకుంది. ఈ పోరులో ఇప్పటిదాకా గాజాలో 2,750 మంది పాలస్తీనియన్లు మృతి చెందారని, 9,700 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా మరణించినట్లు తెలిసింది. అతిత్వరలోనే ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ సేనలు భూతల దాడులు ప్రారంభిస్తాయని ప్రచారం సాగుతోంది. ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు జారీ చేయడంతో ఉత్తర గాజా నుంచి జనం దక్షిణ గాజాకు వలసబాట పట్టారు. కాగా హమాస్ ఉగ్రవాదుల చెరలో 199 మంది ఇజ్రాయెల్ దేశ పౌరులు బందీలుగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment