రఫా: గాజా స్ట్రిప్‌లోని పాలస్తీనియన్లకు అందించే మానవతా సాయాన్ని యథా ప్రకారం కొనసాగించాలని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనీ గుటెరస్ సంబంధిత దేశాలను కోరారు. లేని పక్షంలో 20 లక్షల మందికి పైగా శరణార్థులకు అందాల్సిన సాయం, పునరావాస కార్యక్రమాల్లో భారీగా కోత పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో ఇప్పటికే తీవ్ర మానవీయ సంక్షోభం నెలకొందని అన్నారు.
గత ఏడాది అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు మెరుపుదాడికి దిగిన విషయం తెలిసిందే. పాలస్తీనా శరణార్థులకు సాయం, పునరావాసం కోసం పనిచేస్తున్న ఐరాస సిబ్బందిలో డజను మంది ఆ దాడిలో పాల్గొన్నట్లు ఆరోపణలు రావడంతో అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఇటలీ తదితర 8 దేశాలు సాయం నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.
పాలస్తీనా శరణార్థులకు అందుతున్న సాయంలో ఈ దేశాల వాటా దాదాపు 60 శాతం వరకు ఉంటుంది. సాయం ఆగిపోతే పాలస్తీనా శరణార్థులకు అవసరమైన కనీస ఆహార నిల్వలు సైతం మరికొద్ది రోజుల్లోనే అడుగంటే ప్రమాదముందని భావిస్తున్నారు. హమాస్‌కు తోడ్పాటు అందించినట్లుగా భావిస్తున్న 12 మంది ఉద్యోగుల్లో ఇప్పటి వరకు 9 మందిని బాధ్యతల నుంచి తొలగించారు. ఒకరు చనిపోగా మరో ఇద్దరిని గుర్తించే పనిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment