మానవతా సేవారంగంలో అవసరమైన మార్పులతో పాటు, కీలక సంస్కరణలకు సమయం ఆసన్నమైంది. ఈ అంశంపైనే ప్రపంచవ్యాప్తంగా 81 దేశాలకు చెందిన 1,111 మంది మహిళలు గళమెత్తారు. అంతర్జాతీయస్థాయిలో సంక్షోభ పరిస్థితులు ఏర్పడిన ప్రాంతాల్లో నిర్వహిస్తున్న మానవతా సేవా కార్యక్రమాల్లో తీసుకురావాల్సిన మార్పులు నొక్కిచెప్పారు. ఈ రంగంలో తక్షణమే సంస్కరణలను చేపట్టాలంటూ ఐరాస, ఇతర అంతర్జాతీయ సేవాసంస్థలు, దాతలకు ఓ బహిరంగలేఖ రాశారు.
ప్రపంచవ్యాప్తంగా సేవా, సహాయ కార్యక్రమాల్లో భాగ స్వాములైన ఈ మహిళలు ఈ రంగంలో తాము ఎదుర్కుంటున్న లైంగిక వేధింపుల అంశాన్ని ప్రాధాన్యత గల అంశంగా గుర్తించాలని డిమాండ్‌చేస్తున్నారు. సేవాసంస్థల్లో మహిళలపై జరుగుతున్న దుశ్చర్యలను వెలుగులోకి తీసుకొస్తున్న వారికి (ప్రజా వేగులకు) వెన్నుదన్నుగా నిలవాలని కోరుతున్నారు. ఈ రంగంలో వాస్తవంగా ఏమి జరుగుతున్నదనేది తమ ద్వారానే బయటకు వస్తున్నందున తమ గొంతులు తప్పక వినేందుకు ఈ లేఖ రాసినట్టు స్పష్టంచేశారు.
సంస్థలపై విశ్వాసం సన్నగిల్లకుండా చూడాలి...
వివిధ దేశాల్లో సేవారంగంలో పనిచేస్తున్న మహిళలు సైతం పీడన, లైంగిక వేధింపులు ఎదుర్కుంటున్న నేపథ్యంలో ఈ రంగంపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రోది గొల్పాల్సిన అవసరాన్ని ఈ మహిళలు పేర్కొన్నారు. అంకితభావం, చిత్తశుద్దితో ఎంతో మంది చేసిన మంచిపనులు, సేవకు చేటు తెచ్చేలా, మహిళలపై లైంగిక వేధింపులతో చెడ్డపేరు తెస్తు్తన్న వారిని బహిరంగంగా నిలదీయాల్సి ఉంది. ఇలాంటి వ్యక్తుల వ్యవహారశైలి కారణంగా ఈ రంగం ప్రతిష్ట మసకబారడంతో పాటు సేవలపై ప్రజల నమ్మకం సన్నగిల్లుతోంది.
మాటల కంటే చేతలకు పనిచెప్పాలి. ఆరోపణలకు మౌనంగా నిలిచే ఇప్పటి సంస్కృతి పట్లే మా ఆందోళన. లైంగిక వేధింపు సమస్యపై మీడియా దృష్టి పక్కకు మళ్లగానే మహిళలపై బెదిరింపులు, దుర్భాషలు మళ్లీ మొదలవుతాయి. ఈ రంగంలో పటిష్టమైన నాయకత్వం, తప్పుడు పద్ధతులకు పాల్పడే వారిపై తీసుకునే చర్యల పట్ల నిబద్ధత నేటి అవసరం. లైంగిక వేధింపుల ఆరోపణలు బయటపడగానే ఆ వ్యక్తులు ఎంత పెద్ద పదవుల్లో ఉన్నా వారిని వెంటనే పక్కన పెట్టకపోతే ఇతర మహిళలు, అమ్మాయిలు అదే ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇటువంటి సమస్యలపై అత్యున్నతస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు కదలాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు.
# రిఫార్మ్ ఎయిడ్ # ఎయిడ్ టూ...
ప్రపంచవ్యాప్తంగా వెలుగు చూసిన ‘మీ టూ’, ‘టైమ్ ఈజ్ అప్’ ఉద్యమాల స్ఫూర్తితో మానవతా సేవారంగంలో ‘రిఫార్మ్ ఎయిడ్ ఎయిడ్ టూ’...నినాదాలను వారు ముందుకు తీసుకొచ్చారు. సినీ, తదితర రంగాల్లో మహిళలు ఎదుర్కుంటున్న లైంగిక వేధింపులు ఈ ఉద్యమాల ద్వారా బయటకు వచ్చినా ఇంకా వెలుగు చూడాని ఉదంతాలు చాలా ఎక్కువని పేర్కొన్నారు. సేవారంగంలో పక్షపాత వైఖరితో కూడుకున్న పితృస్వామ్యభావజాలంలో ప్రాథమికంగా మూడు సంస్కరణలు తీసుకురావాలని సూచించారు.
పురుషుల వే«ధింపులకు గురైన మహిళలు చేసే ఫిర్యాదులను విశ్వసించి సంస్థాపరంగా వెంటనే చర్యలు చేపట్టాలి. ఈ దిశలో చేసే ఆరోపణలకు ప్రాధాన్యతనిచ్చి వెంటనే విచారణ జరపాలి. సేవాసంస్థల్లోని అనైతిక కార్యకలాపాలు, అక్రమాలు వెలుగులోకి తెచ్చే వారికి రక్షణ కల్పించడంతో పాటు వారు చెప్పేది శ్రద్ధగా వినాలి. నూతన విధానాలు రూపొందించి, ఉల్లంఘనకు పాల్పడే వారిపై చర్యలకు చిత్తశుద్ధితో వ్యవహరించాలి అని ఈ లేఖలో పేర్కొన్నారు.
–సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment