(సాక్షి వెబ్ ప్రత్యేకం)
వాళ్లంతా ఆకాశంలో ఉండే తారల కంటే ఏమాత్రం తక్కువ కారు. తమ అభిమానుల గుండెల్లో గూడు కట్టుకుని ఉంటారు. కోట్లల్లో సంపాదన.. పెద్ద పెద్ద పడవల్లాంటి కార్లలోనే తిరగడం.. ఐదు నక్షత్రాల జీవితం. ఇదీ సినీ తారల పరిస్థితి. కానీ.. అలాంటి తారలు ఆకాశం నుంచి కిందకు దిగి వస్తున్నారు. తమను ఎంతగానో అభిమానించే సామాన్యుల కోసం తామే నేరుగా నడిచి వెళ్తున్నారు. ఆపదలో ఉన్నవాళ్లను తాము స్వయంగా ఆదుకోలేకపోయినా.. తమను చూడటమే వాళ్లకు కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని తెలుసుకుని, తీరిక చేసుకుని మరీ వెళ్తున్నారు. తమను ఎంతగానో అభిమానించి.. ఇంతవాళ్లను చేసిన వాళ్ల కోసం ఎంతోకొంత చేయాలన్న ఉద్దేశంతో మంచి పనులు మొదలు పెడుతున్నారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన శ్రీనిధి అనే చిన్నారి కేన్సర్ వ్యాధితో బాధపడుతోంది. ఆమె ఇక బతకడం కూడా కష్టమని వైద్యులు చెప్పేశారు. ఆమెకు హీరో ఎన్టీఆర్ అంటే వల్లమాలిన అభిమానం. అతడు నటించిన 'యమదొంగ' సినిమా చాలా చాలా నచ్చింది. ఆమె అనారోగ్యం విషయం తెలిసిన ఎన్టీఆర్.. స్వయంగా ఆస్పత్రికి వెళ్లాడు. పెద్ద టెడ్డీ బేర్ ఆమెకు బహుమతిగా ఇచ్చాడు. బోలెడన్ని చాక్లెట్లను గిఫ్టు బాక్సులో ప్యాక్ చేయించి ఇచ్చి, ఆమె పక్కనే కూర్చుని మాట్లాడాడు. ఆ చిన్నారి శ్రీనిధికి ఎక్కడలేని ఆనందం.
కొన్నాళ్ల క్రితం ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీజ అనే అమ్మాయి కూడా తీవ్ర అనారోగ్యంతో బాధపడింది. ఆమెకు పవన్ కల్యాణ్ అంటే ఎనలేని ఇష్టం. విషయం తెలిసిన పవర్ స్టార్.. తానే స్వయంగా ఖమ్మం ఆస్పత్రికి వెళ్లారు. కానీ ఆ సమయానికి ఆమె మాట్లాడే పరిస్థితిలో లేదు. కొన్నాళ్ల తర్వాత కోలుకున్న ఆమెను ఆమె తండ్రి పవన్ వద్దకు తీసుకొచ్చారు. అప్పుడు ఆమె కళ్లలో ఎనలేని సంతోషం.
హీరోయిన్ సమంత మహిళలు, అమ్మాయిల కోసం 'ప్రత్యూష ఫౌండేషన్' పేరుతో ఓ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని పెద్ద పెద్ద ఆస్పత్రులు అన్నింటితోను ఈ ఫౌండేషన్ ఒప్పందాలు కుదుర్చుకుంది. అక్కడ చికిత్స చేయించుకోడానికి వచ్చి, ఆర్థిక పరిస్థితి అనుకూలించని నిరుపేదలు ఎవరైనా ఉంటే.. ఆ సమాచారాన్ని సదరు ఆస్పత్రి వర్గాలు ప్రత్యూష ఫౌండేషన్కు పంపుతాయి. అవకాశం మేరకు వాళ్లకు ఫౌండేషన్ నుంచి సాయం అందుతుంది. ఇందుకోసం తాను వివిధ సినిమాల్లో ధరించిన దుస్తులు, నగలతో పాటు సహ నటులు ధరించిన దుస్తులను కూడా సమంత ఆన్లైన్లో వేలానికి పెడుతోంది. గబ్బర్సింగ్ సినిమాలో పవన్ కల్యాణ్ వేసుకున్న పోలీసు యూనిఫాం, దూకుడు సినిమాలో మహేష్బాబు ఓ పాటలో ధరించిన ఎర్ర పువ్వుల చొక్కా లాంటివి ఈ వేలంలో ఉన్నాయి. వాటి ద్వారా వచ్చిన సొమ్మును కూడా ఆమె ఇలా చికిత్సల కోసం వెచ్చిస్తోంది.
అభిమానులు టికెట్లు కొన్న డబ్బులతో సకల సౌకర్యాలు అనుభవించే తారలు.. ఆ అభిమానుల కోసం తాము కిందకు దిగివచ్చి స్వయంగా వెళ్లి పలకరించడంతో పాటు వీలైనంత మేర ఆర్థిక సాయం కూడా అందించడం ప్రశంసనీయం.
-పి.ఆర్.ఆర్. కామేశ్వరరావు
తారలు దిగివచ్చిన వేళ...
Published Wed, May 13 2015 2:44 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
Advertisement
Advertisement