ఇండియాలో మాదిరిగానే అమెరికాలో కూడా దైనందిన జీవితంలోని అనేర రంగాల్లో తాము వివక్ష ఎదర్కుంటున్నామని అన్ని జాతుల్లోనూ అత్యధిక ప్రజానీకం వాపోతోంది. అగ్రరాజ్యానికి చెందిన ప్రఖ్యాత నేషనల్ పబ్లిక్ రేడియో (ఎన్పీఆర్), రాబర్ట్‌వుడ్ జాన్సన్ ఫౌండేషన్, హార్వర్డ్ యూనివర్సిటీ టీహెచ్ చాన్ స్కూలాఫ్ పబ్లిక్ హెల్త్ సంయుక్తంగా జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. దేశంలో 70 శాతం జనాభాతోపాటు దాదాపు అన్ని రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్న తెల్లజాతివారు (వైట్స్) సైతం తమపై వివక్ష ఉందని చెప్పారు. శ్వేతజాతీయుల్లో 55 శాతం ‘అమెరికాలో తెల్లజాతివారికి కూడా వివక్ష ఎదురౌతోంది’ అని తెలిపారు.
ఉద్యోగం చేసే ప్రదేశం నుంచి ఆస్పత్రి వరకూ తాము ఫలానా జాతివారమనే కారణంగా ఎదర్కుంటున్న అన్యాయం, వివక్షపై జనం అనుభవాలపై ఈ సర్వేలో అనేక ప్రశ్నలడిగారు. శ్వేతజాతీయులు, నల్లజాతివారు, లాటినోలు(స్పానిష్ భాష మాట్లాడే హిస్పానిక్‌లు), ఆసియన్ అమెరికన్లు, స్థానిక అమెరికన్లు(రెడ్ ఇండియన్లు), ఎల్జీబీటీక్యూలుగా గుర్తింపు పొందిన వారిని ఈ సర్వేలో ప్రశ్నించారు. కిందటి జనవరి 26 నుంచి ఏప్రిల్ 9 వరకూ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో 3,453 మంది తమ అనుభవాలు వెల్లడించారు. మొదట ఆఫ్రికన్ అమెరికన్ల(నల్లజాతివారు) అనుభవాలపై మంగళవారం ఈ సర్వే ఫలితాలు ప్రకటించారు.
అమెరికా వచ్చినప్పటి నుంచీ నల్లవారికి వివక్షే!
తమ జాతివారు ఆఫ్రికాఖండం నుంచి అమెరికాలో అడుగుపెట్టినప్పటి నుంచీ తరతరాలుగా అత్యధికస్థాయిలో సమాజంలో జాతి వివక్ష ఎదుర్కొన్నామని 802 మంది చెప్పారు. పోలీసులతో వ్యవహారాలు, ఉద్యోగం కోసం దరఖాస్తు, ప్రమోషన్‌కు అభ్యర్థన, అపార్ట్‌మెంట్లలో అద్దెకు దిగడం, ఇళ్ల కొనుగోలు, వైద్యశాలలో డాక్టర్‌ను చూడడం వంటి నిజ జీవితంలోని ప్రధాన సందర్భాల్లో తాము తీవ్ర అన్యాయానికి గురవుతున్నామని వారు వాపోయారు. పోలీసులు తమపై వివక్ష చూపారని 57 శాతం నల్లజాతి పురుషులు తెలిపారు. అద్దె ఇళ్లు సంపాదించడం, గృహాల కొనుగోలులో తమకు సమానావకాశాలు లేవని 54 శాతం నల్లజాతి పురుషులు చెప్పారు. ఓటేసే విషయంలో, రాజకీయాల్లో పాల్గొనే సందర్భాల్లో కూడా వివక్ష ఉందని 19 శాతం ఆఫ్రికన్ అమెరికన్లే అభిప్రాయపడ్డారు.
డాక్టర్‌ను కలవడానికి లేదా ఆస్పత్రికి వెళ్లినప్పుడు తాము వ్యక్తిగతంగా జాత వివక్ష చవిచూశామని ఈ సర్వేలో పాల్గొన్న నల్లజాతీయుల్లో మూడో వంతు(32శాతం) చెప్పగా, తమను సరిగ్గా చూడరనీ, సవ్యమైన చికిత్స అందదనే భయంతో దవాఖానేకే తాము పోవడంలేదని 22 శాతం మంది తెలిపారు. తాము నల్లజాతివారమనే కారణంగా తమను, తమ కుటుంబసభ్యులను పోలీసులు అన్యాయంగా ఆపి, దౌర్జన్యం చేయడం సర్వసాధారణమని 60 శాతం మంది ఈ సర్వేలో తెలిపారు. ఒకే రకమైన సందర్భంలో తెల్లజాతివారిపై చేయిచేసుకోని పోలీసులు ఆఫ్రికన్ అమెరికన్లపై మాత్రం బలప్రయోగం చేసే అవకాశాలెక్కువని 61 శాతం అభిప్రాయపడ్డారు.
నల్లజాతివారు ఎక్కువమంది ఉండే ప్రాంతాల్లోనే వివక్ష ఎక్కువ!
శ్వేతజాతీయుల మధ్య స్పల్ప సంఖ్యలో బతికే నల్లజాతివారు తక్కువ వివక్షకు గురవుతుండగా, ‘బ్లాక్’ మెజారిటీ ప్రాంతాల్లో వారు ఎక్కువ అన్యాయాన్ని, అణచివేతను రుచిచూస్తున్నారు. దేశంలో 64 శాతం నల్లవారు ఇతర జాతులు అత్యధిక సంఖ్యలో ఉండే ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అంటే వారికి వివక్ష తక్కువే. నల్లజాతివారు మెజారిటీగా ఉన్న వాడల్లో వారికి అవసరమైన సందర్భాల్లో సైతం వివక్ష తప్పదనే భయంతో పోలీసులను పిలవడం లేదని 31 శాతం మంది చెప్పారు. నల్లజాతివారు అత్యధిక సంఖ్యలో నివసించే ప్రాంతాల్లో విద్యా బోధనలో నాణ్యత తక్కువని ఈ సర్వే చేసినవారికి 45 శాతం చెప్పారు. సమాజంలో జాతి వివక్ష వల్ల రోజూ అమెరికాలో 200 మందికి పైగా నల్లజాతివారు వృద్ధాప్యానికి ముందే మరణిస్తున్నారని వైద్యసేవల్లో జాతుల మధ్య అసమానతలపై అధ్యయనం చేసిన హార్వర్డ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ డేవిడ్ విలియమ్స్ చెప్పారు. ఈ సర్వే ఫలితంగా తాము సమస్యల పరిష్కారానికి ఎక్కడెక్కడ చర్యలు తీసుకోవాలో తెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)
Comments
Please login to add a commentAdd a comment