పీఆర్సీ బకాయిలు రూ.5 వేల కోట్లు
ఆర్థిక మంత్రి యనమల పేషీకి చేరిన ఫైలు
సీఎం చైనా పర్యటన తరువాత జరిగే కేబినెట్ భేటీలో ఎజెండా
హైదరాబాద్: ఉద్యోగుల 10వ వేతన సవరణ (పీఆర్సీ) బకాయిల కింద రూ. 5 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ లెక్క తేల్చింది. పీఆర్సీని గత ఏడాది జూన్ నుంచి అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ ఏడాది మార్చి వరకు పది నెలలకు సంబంధించిన ఈ బకాయిల మొత్తాన్ని ఏ విధంగా చెల్లించాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చైనా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ఇలా ఉండగా ఏప్రిల్ నుంచి పెరిగిన వేతనాలను మే నెలలో ఇచ్చే జీతాలతో కలిపి చెల్లించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే పీఆర్సీ అమలుకు సంబంధించిన ఫైలును ఆర్థిక శాఖ రూపొందించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు పరిశీలన తర్వాత ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కార్యాలయానికి చేరింది. జిల్లాల పర్యటనలో ఉన్న యనమల ఈ నెల 10వ తేదీన హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన ఆమోదానంతరం ఫైలు ముఖ్యమంత్రి ఆమోదానికి వెళ్తుంది. అయితే ఈ నెల 12 చైనా వెళుతున్న చంద్రబాబు 18వ తేదీన తిరిగి హైదరాబాద్ రానున్నారు. అప్పుడు ఆయన ఫైలుపై ఆమోదముద్ర వేస్తే ఆ తర్వాత జరిగే కేబినెట్ సమావేశం అజెండాలో పీఆర్సీ అమలు అంశాన్ని పొందుపరచనున్నారు.
ఉద్యోగులకు 3.14 శాతం డీఏ!
ఇలా ఉండగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి నుంచి కరువు భత్యం 6 శాతం పెరిగిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జనవరి నుంచి వేతనాలపై 3.14 శాతం మేరకు కరువు భత్యం పెరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ప్రభుత్వ ఖజానాపై నెలకు రూ.18 కోట్ల నుంచి రూ.21 కోట్ల అదనపు భారం పడుతుందని వివరించాయి.