బాబుగారి దుబారా రూ. 600 కోట్లు
♦ ప్రత్యేక విమానాలు తప్ప మామూలు విమానమెక్కని సీఎం
♦ జిల్లాల్లో పర్యటనలకు ఆర్భాటపు ఏర్పాట్లు
♦ విజయవాడలో సమీక్షల కోసం అధికారులకు అదనపు ఖర్చులు
♦ కార్యాలయాల సోకులకు అదనంగా ఖర్చులు
♦ అవసరం లేకపోయినా కన్సల్టెంట్లకు వందల కోట్లు
♦ అమరావతి శంకుస్థాపన కోసం వృథా వ్యయం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తరువాత మరో నాలుగు రోజుల్లో రెండో కొత్త సంవత్సరం వస్తోంది. గడచిన ఏడాది పాలనలో చంద్రబాబు చేసిన వృథా ఖర్చులను గమనిస్తే దిమ్మతిరగడం ఖాయం. ఒక పక్క నిధుల్లేవంటూ మరో పక్క ప్రత్యేక విమానాలకు, కార్యాలయాల సోకులకు, ప్రచార ఆర్భాటాలకు ముఖ్యమంత్రి దాదాపు రూ.600 కోట్ల రూపాయలు వెచ్చించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని నిర్మాణానికి విరాళాలు అడుగుతూ మరో పక్క వృథాగా నిధులను వ్యయం చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో గడచిన ఏడాది కాలంలో ముఖ్యమంత్రి చేసిన వృథా ఖర్చులను రేఖామాత్రంగా పరిశీలిద్దాం..
ప్రత్యేక విమానంలోనే ప్రయాణం
ప్రత్యేక విమానాల్లో ప్రయాణించడంలో చంద్రబాబు రికార్డు సృష్టించారు. దేశంలోని ఏ ముఖ్యమంత్రి కూడా ప్రతి పర్యటనకు ప్రత్యేక విమానాల్లో తిరిగిన దాఖలాలు లేవు. చంద్రబాబు నాయుడు మాత్రం హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లాలన్నా..లేదా జిల్లాల నుంచి హైదరాబాద్‌కు రావాలన్నా..లేదా ఢిల్లీ వెళ్లాలన్నా, సింగపూర్ వెళ్లి రావాలన్నా ప్రత్యేక విమానంలోనే ప్రయాణిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఆయన 63 సార్లు ప్రత్యేక విమానంలో ప్రయాణించారు. అందుకోసం ఫిబ్రవరి వరకు ఆర్థికశాఖ రూ. 15 కోట్లను చెల్లించింది. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ప్రత్యేక విమానం, హెలికాప్టర్ వ్యయం మరో రూ. 15 కోట్లు అవుతుందని అధికారులు లెక్క కట్టారు. కృష్ణపట్నం పోర్టుకు చెందిన వారి ప్రత్యేక విమానం, హెలికాప్టర్ ముఖ్యమంత్రి వెంటే ఉంటాయి. ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన వ్యయం కూడా తడిసిమోపెడవుతోంది. జిల్లాల పర్యటన ఏర్పాట్ల కోసం ఆర్థిక శాఖ ప్రత్యేకంగా రూ. 15 కోట్లను ఇటీవల విడుదల చేసింది.
సమీక్షలు.. అధికారుల పర్యటనలు
వృథా సమీక్షలు నిర్వహించడంలో కూడా ముఖ్యమంత్రి రికార్డు సృష్టించారు. జిల్లా కలెక్టర్ల సమావేశం అయినా లేదా ఇతర అధికారులతో సమావేశమైనా ఉదయం 10 గంటలకు ప్రారంభమై అర్థరాత్రి వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో శాంతిభద్రతలపై రాత్రి ఒంటి గంట వరకు సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి సమీక్షలంటే అధికార యంత్రాంగం భయపడే పరిస్థితి నెలకొంది. చెప్పిందే చెబుతూ సమీక్షల మధ్య ఎలాంటి పురోగతీ లేకుండా సమావేశాల పేరుతో కాలం వెళ్లబుచ్చుతున్నారనే అభిప్రాయానికి అధికార యంత్రాంగం వచ్చేసింది. హైదరాబాద్‌లో కాదని ఈ ఏడాది మంత్రివర్గ సమావేశాలతో పాటు, ఇక అధికారిక సమీక్షలన్నీ విజయవాడలో నిర్వహిస్తుండటంతో అధికారుల ప్రయాణ ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. హైదరాబాద్-విజయవాడలకు అధికారులంతా నిత్యం విమానాల్లో ప్రయాణిస్తున్నారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం టీఏ, డీఏలకు రూ.90 కోట్లను వ్యయం చేసింది.
కార్యాలయాల సోకులకు రూ.103 కోట్లా..?
హైదరాబాద్‌లోని సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయాల సోకుల కోసం, ఫర్నిచర్ కోసం ఏకంగా రూ.45 కోట్లను వెచ్చించారు. ఇంకో పక్క విజయవాడలోని ఇరిగేషన్ అతిధి గృహంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ సోకులు, ఏర్పాట్ల కోసం ఏకంగా రూ.42 కోట్లను వెచ్చించారు. కొత్త భవనం నిర్మించినా ఇంత ఖర్చుకాదు. అదనపు సోకుల కోసం ఇన్ని కోట్లు ఖర్చు చేయడంపై ఉద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కార్యాలయం కోసం లేక్‌వ్యూ అతిధి గృహానికి రూ.10 కోట్లను వ్యయం చేశారు. మదీనగూడ ఫాం హౌస్, జూబ్లీహిల్స్‌లోని అద్దె ఇళ్లకు ఏర్పాట్లు చేయడానికి రూ. 5.87 కోట్లను వ్యయం చేశారు.
కన్సల్టెంట్లకు రూ. 200 కోట్లు...
ప్రభుత్వ అధికారులు చేయాల్సిన పనులను విదేశాలకు చెందిన కన్సల్టెంట్లకు అప్పగించి కోట్ల రూపాయలు చెల్లించడంపైన కూడా పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నూతన రాజధాని ప్రాంతంలో అవసరమైన డాక్యుమెంట్ల రూపకల్పన కోసం విదేశీ కన్సల్టెంట్లకు ఏకంగా రూ.150 కోట్లు వ్యయం చేస్తున్నారు. వీరుగాక ఏడు మిషన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం అందుకు కన్సల్టెన్సీలకు చెల్లించేందుకు 2015-16 బడ్జెట్‌లో ఏకంగా రూ.50 కోట్లు కేటాయించింది. కన్సల్టెంట్లు స్వయంగా చేసేదేమీ ఉండదని, తాము ఇచ్చిన సమాచారం ఆధారంగా అందంగా నివేదికలు తయారు చేస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగులు పేర్కొంటున్నారు. విజన్ 2029 డాక్యుమెంట్ తయారీ బాధ్యతను మెసర్స్ ఎర్నెస్ట్ యంగ్ కన్సల్టెన్సీకి అప్పగిస్తూ రూ. 12.62 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సంస్థకు రూ. 1.12 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా చెల్లించారు.
మచ్చగా మిగిలిన పుష్కర ప్రచారం
గోదావరి పుష్కరాల పేరుతో రూ.1,500 కోట్లకు పైగా వ్యయం చేశారు. ఇందులో ఏకంగా రూ.1,000 కోట్లకు పైగా నిధులను పనులు చేయకుండానే పచ్చ నేతలు కాజేశారన్న విమర్శలున్నాయి. పుష్కరాల ప్రచారం కోసమే ఏకంగా రూ. 15.20 కోట్లను ఖర్చు చేశారు. పుష్కరాలలో ముఖ్యమంత్రి ప్రచార కండూతి కారణంగా తొక్కిసలాట జరిగి 30 మంది మృతి చెందారు.
అమరావతి శంకుస్థాపనకు రూ. 100 కోట్లు
నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని హంగూ ఆర్భాటాలతో నిర్వహించడంతో తాత్కాలిక ఏర్పాట్లకు రూ.100 కోట్లకు పైగా వ్యయం చేశారు. ప్రముఖుల కోసం ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాలను ఏర్పాటు చేయడంతో పాటు, ప్రత్యేకంగా హెలిపాడ్‌లు నిర్మించిన విషయం తెలిసిందే. నీరు-చెట్టు ప్రచారం కోసం ఏకంగా రూ. 5 కోట్లు కేటాయించారు. స్మార్ట్ వార్డులు, స్మార్ట్ గ్రామాల పేరుతో మౌలిక సదుపాయాల కల్పనకు విరాళాలు ఇవ్వడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చిన ప్రభుత్వం ప్రచారం కోసం జిల్లాకు రూ.కోటి చొప్పున రూ.13 కోట్లను వ్యయం చేసింది. సీఎం జిల్లాల్లో అంతర్గత పర్యటనల కోసం ప్రత్యేకించి రూ.5.50 కోట్ల తో అత్యాధునిక సౌకర్యాలు గల ప్రత్యేక బస్సును కొనుగోలు చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మీరు ఖరీదైన బస్సుల కోసం దుబారా ఖర్చుచేస్తారా అని దేవరపల్లికి చెందిన పొగాకు రైతు సుబ్బారావు తన సూసైడ్ నోట్‌లో సీఎంను ప్రశ్నించిన సంగతి తెల్సిందే.